ప్రతి ఒక్కరు చదవవలసిన శ్రీ రాజమౌళీ గారి వ్యాసాలు - 1
నేటి యువత ఎన్నో ఉన్నత చదువులు చదువుతున్నా.. టెక్నాలజీని ఎంతో వేగంగా ఒడిసి పట్టుకుంటున్నా.. కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత కొలువులు కైవసం చేసుకుంటున్నా.. ఎన్నో ఉపకరణాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమవుతున్నా.. ఒంటరితనం, ఒత్తిడి పట్టిపీడిస్తోంది. మానవ సంబంధాల్లో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్న నవతరం వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కార మార్గంగా- అతిథులు ఇంటికి రావడం, వారితో గడపడం వల్ల ఒంట రితనం, మానసిక ఒత్తిడి తగ్గి, జీవన గమనం ఒక సమన్వయ స్థితిని పొందగలుగుతుందన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో.. హింసను, ద్వేషాన్ని.. భయాలు, బాధలు, బలహీనతల్ని అధిగమించి ఆశావహ దృక్పథంతో నేటి యువత ఒక బలమైన జాతిగా ఎదగాలంటే.. అందరూ కలవాలి.. పరస్పరం సంభాషించుకో కోవాలి.. ఆహ్వానించుకోవాలి.. ఆతిథ్యమిచ్చుకోవాలి.. ఆదరించుకోవాలి.. ఆనందించాలి.. అతిథి దేవోభవ!! అంటున్న కలెక్టర్ ఎ.వి.రాజమౌళి వ్యాసం..ఆయన పేరు జోస్ ముజికా. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశాధ్యక్షుడు. దేశాధ్యక్షుడంటే రాజసౌధాల్లో నివసిస్తాడని, బెంజికార్ల అంబారీతో ప్రయాణం చేస్తుంటాడని భ్రమ పడతాం. కానీ, ఆయన రాజభవనాలలో నివసించరు.. తనకున్న పొలంలోనే ఒక చిన్న నివాసం (పూరిగుడిసె లాంటిది) లో జీవనం. ఆ పొలంలోనూ కొంత నిరుపేదలకు పంచి, తన అవసరాలకు సరిపడినంత మాత్రమే ఉంచుకున్నారు. పొలాన్ని దున్ని.. ధాన్యం, కూరగాయలు, పండ్లు పండిస్తారు. అతని బట్టలు అతనే ఉతుక్కుంటారు. జీతం నెలకు 12,500 డాలర్లు. దాంట్లో 10 శాతాన్ని తన ఖర్చులకు ఉంచుకొని, మిగిలిన 90 శాతాన్ని పేదలకు పంచేస్తారు. తనను ఎవరైనా పొగడబోతే తన జీతంలో 10 శాతం కంటే తక్కువ ఆదాయంతో జీవించే ఎందరో నిరుపేద ఉరుగ్వే ప్రజలను చూసి తాను సిగ్గు పడుతుంటానని నమ్రతతో నొచ్చుకుంటారు.
భార్య కూడా ప్రజాప్రతినిధేగానీ ఆమె కూడా భర్త అడుగు జాడల్లోనే జీవిస్తున్నారు. ఒక పాతకారు, స్కూటర్ అతని చరాస్తులు. ప్రపంచంలోనే అతి నిరుపేద దేశాధ్యక్షుడిగా వార్తల్లో నిలిచిన ఆయన తనను నిరుపేద అంటే అంగీకరించరు. ఎవరైతే జీవించేందుకు ఎక్కువ సదుపాయాలు, సౌకర్యాలు కావాలనుకుంటారో వారే అతి నిరుపేదలని ఆయన అభిప్రాయం. విప్లవమంటే హింస, ప్రతిహింస కాదు.. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే అసలైన విప్లవం. ఇంటికొచ్చిన వారికి, ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టకుండా అనవసరంగా మితిమీరి ఖర్చుచేసే నాగరిక సమాజమే ప్రపంచానికి, పర్యావరణానికి పెద్ద సవాలు అంటారాయన. భోజన సమయానికి ఆయన్ను కలవడానికి ఎవరొచ్చినా వారిని అతిథిలా ఆహ్వానిస్తారు. తన పొలంలో పండించిన వాటితో చేసిన, తాను తింటున్న ఆహారాన్ని వారికీ వడ్డించి, వారి ఆనందాన్ని చూసి పరమానంద భరితుడవుతారు. ఆయన పెట్టిన ఆహారం కంటే ఆయన వడ్డించే తీరు, నిర్మల మనస్తత్వం, నిష్కపటపు మాటలు, నిశ్చల ముఖ కవళికలు.. ఆయన వడ్డించే సాధారణ కాయగూరల ఆహారానికి అద్భుత స్వాదాన్నిచ్చి ఆస్వాదయోగ్యంగా మార్చి అమితానందాన్ని కలుగజేస్తాయని సందర్శకుడొకరు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘ఆతిథ్యంలో ఆనందాన్ని మిగిల్చేది ఆహార పదార్థాల వైవిధ్యం కాదనీ, ఆతిథ్యమిచ్చే వారి అవ్యక్తీకృత ఆహార్యం, ఆత్మీయత, అనిర్వచనీయ ఆర్తి, అతి సహజంగా కనిపించే అభిమానం’’ అంటూ అతను చెప్పిన మాటలు.. అతిథి ఆకలి తీర్చేందుకు ఉపక్రమించే ప్రతి ఒక్కరికీ ఆచరణీయాలే! ఈ సందర్భంలో మహా భారతంలోని... భుక్తిం పృచ్ఛసి రాజేంద్ర ఆదరం కిం న పృచ్ఛాసి భోజనం గత జీర్ణంచ ఆదరస్త్వ జరామరః‘‘భోజన విషయమే అడుగుతున్నావు కానీ ఆదరణ మాట అడగవేమి దుర్యోధనా! భోజనము జీర్ణమైన పిమ్మట ఏమీ కనపడదు కానీ ఆదరణ అయితే శాశ్వతంగా గుర్తుండేదే కదా! ఆదరణ లేనిచోట భోజన ప్రసక్తి ఏల’’ అని రాయబార సందర్భంలో శ్రీకృష్ణుడన్న మాటలు స్మరణీయం. ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే ఆత్మ సంతృప్తి అనే శాశ్వత సంపదను మరచి, ఎదుటివారి భౌతిక సంపదలపై దృష్టిసారించి ఈర్ష్యాసూయలతో ఇబ్బందిపెడుతూ, పడుతూ ఉండేవారు దుర్యోధనుడిలా అతిథుల ఆదరణపై కాక అహంకార, ఆడంబర ప్రదర్శనతో అసహనంతో కూడిన అలజడికిలోనై ఆతిథ్యానందాన్ని సంపూర్ణంగా పొందలేకపోతారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అన్నట్లు అతిథులు వచ్చినప్పుడు ఎంతో ఆశావాదంతో కూడిన ఆనందం కలగాలి. వారు నిష్ర్కమించేటప్పుడు వారిదీ, మనదీ ఇద్దరి మానసిక స్థితిలోనూ అనిర్వచనీయమైన ఆనందభరిత అవ్యక్తానుభూతి కలగాలి. వారి మధ్య ఆత్మీయత ఉంటే వారి వారి కలిమికానీ లేమికానీ ఇద్దరినీ బాధించవు. అలా కాకుండా యాంత్రికంగా ఆతిథ్య తంతు పూర్తి కానిస్తే వడ్డించిన ఆహారంలో రుచి లేమితోపాటు, తిన్నవారికి ఆకలి తీరకపోవడమో.. అజీర్ణమో సంభవిస్తుంది. హృదయ పూర్వకమైన ప్రేమానురాగాలతో పెట్టని ఆహారం వెగటుదనం కలిగిస్తుంది. అతిథికి వడ్డించే ఆహారంతో పాటు అది తయారు చేసి, వడ్డించే వారి సత్వ, రజో, తమో గుణాలు ఆహారాన్ని ఆరగించే వారిపై అమిత ప్రభావం చూపుతాయి. వడ్డించే వంటకాల విలువల కంటే, వారి విలువల ప్రభావం ఆహారపు ఆనందపు సూచీ (Happiness Index) పై అధికంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం కూడా! వంట గదిని పవిత్ర ప్రదేశమన్నదందుకే! అయిదు నక్షత్రాల హోటళ్లలో వడ్డించే యాంత్రిక విందు కంటే అమ్మ చిన్నప్పుడు చేసిపెట్టిన పచ్చడి అమృత తుల్యంగా ఆనందింప చేయడానికి కారణమదే. ఆహారం వండి, వడ్డించే వారు ఆప్తులయితే ఆ అమృతత్వం తినే వారిలో పెరిగి, వారి ఆయురారోగ్య ఆనందాభివృద్ధికి హేతువులవుతారని, తద్వారా తిన్నవారి రోగ నిరోధక శక్తి పెరిగి,వ్యాధుల బారిన పడకుండా ఉంటారని మన రుషులు ఎప్పుడో చెప్పారు. మహా భారతంలో పాండవుల రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు దుర్యోధుని ఆతిథ్యాన్ని కాదని, విధురుని ఆతిథ్యం స్వీకరించారు. ఆ సందర్భంలో విధురుడు అరటిపండు పారవేసి, తొక్క ఇవ్వగా శ్రీకృష్ణుడు తిన్నట్లు ఒక కథ. రాముడు.. శబరి ఆతిథ్యంలో తాదాత్మ్యం పొందడానికి కూడా కారణమిదే! అందుకే.. గృహోగతం క్షుద్రమపి యధార్హం పూజయేత్ సదా తదీయ కుశల ప్రశ్నైః శక్త్యాదానైః జలాదిభిః‘‘తన ఇంటికొచ్చిన వ్యక్తి ఎలాంటి వారైనా తనకున్న దానిలో, తగిన రీతిగా ఆదరించాలి. కుశల ప్రశ్నాదులచే సంభావించి శక్త్యానుసారం జలం, అన్న పానాదులిచ్చి సంతోషపెట్టాలి’’. మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యాన్ని అధిష్ఠించాడు. యుద్ధం వల్ల సంభవించిన అశాంతిని, అలజడిని పోగొట్టి ఉత్సాహవర్ధనం కోసం అశ్వమేధ యాగం చేశాడు ధర్మరాజు. యాగానంతరం బ్రహ్మాండమైన సంతర్పణ చేసి ఆర్తులకు, పేదలకు దానధర్మాలు, సంతర్పణలు గావించాడు. ఎంత గొప్ప సంతర్పణ జరిగింది? ఇంత ఘనంగా ఎవరు చేయగలరు? అతిథి అభ్యాగతులను ఇంతకంటే గొప్పగా ఎవరు సంతృప్తి పర్చగలరని ధర్మరాజు స్వగతంలో అనుకొంటుండగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఒక ముంగిస నేలపై అన్నం మెతుకులు పడ్డచోట దొర్లుతూ, తన శరీరాన్ని పరీక్షించుకుంటోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాని శరీరం సగభాగం బంగారంగా ఉంది. ధర్మరాజు కుతూహలంతో దాన్నే చూడసాగాడు. ముంగిస మాత్రం అసహనంగా తిరుగుతూ, అన్నం పడిన చోట దొర్లుతూనే ఉంది. ఇలా అసహనంతో అటూఇటూ తిరుగుతున్న ముంగిస దగ్గరకు ధర్మరాజు వచ్చి.. ‘‘ఎందుకంత అసహనంతో ఉన్నావు? నీకేం కావాలి?’’ అని ప్రశ్నించగా ముంగిస తన కథను వివరించింది... ‘‘ఒకానొక సమయంలో రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని తీవ్ర క్షామం పీడించింది. మనుషులతోపాటు అన్య జంతు జీవాలకు కూడా తినటానికి తిండి లేదు. కనీసం ప్రాణం నిలుపుకోవడానికైనా ఆహారం లేదు. నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికెళ్లాను. ఆ ఇంటి వారంతా ఎన్నో రోజులు పస్తులున్న తర్వాత కాసిన్ని గింజలు దొరికితే వాటిని వండుకుని తినటానికి సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణుడు.. అతని భార్య, కొడుకు, కోడలు నలుగురికీ నాలుగు భాగాలుగా చేసి, తినబోతున్న సమయంలో చాలా ఆకలిగా ఉంది.. అన్నం పెడతారా? అంటూ ఒక అతిథి వచ్చాడు. అన్నం తిని వారాలైంది.. ప్రాణాలు పోతున్నాయంటూ అభ్యర్థించాడు.. నాస్తి క్షుధా సమం దుఃఖం నాస్తి రోగ క్షుధా సమః నాస్త్యాహార సమం సౌఖ్యం నాస్తి క్షుదా సమోరిపుః‘‘ఆకలి వంటి దుఃఖం లేదు. ఆకలి వంటి రోగం లేదు. ఆకలి వంటి శత్రువు లేడు. తిండికి సమమైన సౌఖ్యం లేదు’’. కుటుంబ సభ్యులెవరూ మరోమారు ఆలోచించక ఎవరి వాటాను వారు అతిథికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ, యజమాని ధర్మం ప్రకారం మొదట తన వాటాను అతిథికి సమర్పించాడు. అది ఆరగించి అయ్యా ఆకలి తీరలేదు ఇంకాస్త పెడతారా అని అడిగాడు. ఆ యజమాని భార్య, కొడుకు, కోడలు ఇలా అందరి వాటాలూ నిస్సంకోచంగా అతిథికి సమర్పించారు. ఆయన తృప్తిగా భోంచేసి, ఇంటివారిని ఆశీర్వదించి వెళ్లాడు. నేనూ (ముంగిస) ఆకలితో అలమటిస్తూ ఆయన వదిలేసిన ఎంగిలి మెతుకులు తినడానికి తాకిన వెంటనే నా శరీరం అర్ధ భాగం బంగారమైపోయింది. అప్పటి నుంచి నాకు కనపడ్డ, వినపడ్డ ప్రతి సంతర్పణకూ హాజరవుతూనే ఉన్నాను. ఏ మహాత్ముడైనా ఆతిథ్యమిచ్చిన చోట మిగిలిన శరీర అర్ధభాగం కూడా బంగారు వర్ణంగా మారదా అని ఎదురుచూస్తున్నాను. నీవు అశ్వమేధ యాగం చేసి, కనీవినీ ఎరుగని రీతిలో సంతర్పణ, దానాలూ చేస్తున్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను. కానీ, ఇక్కడ కూడా అర్ధ శరీరం బంగారు వర్ణంలోకి మారలేదు. ఆ బ్రాహ్మణోత్తముడి ఆతిథ్యం ముందు నీ ఆతిథ్యం వెలవెలబోయింది’’ అని ముంగిస తన కథను వివరించింది. అప్పుడు ధర్మరాజుకి అర్థమైంది.. తాను తనకున్న సంపదలో కొంత దానం చేస్తూ, అతిథులకు సంతర్పణ చేస్తూ తనంత గొప్పగా ఎవరూ చేసుండరని భావిస్తుంటే.. రోజులు తరబడి పస్తులుండి కష్టపడి తెచ్చుకున్న ఆహారంతో తమ ప్రాణాలు నిలబెట్టుకోకుండా అతిథికి వడ్డించిన ఆ నిరుపేద బ్రాహ్మణుడి కుటుంబం ఎంత ఉన్నతమైందో.. ముంగిస మాటల వెనుక పరమార్థం ఏమిటో! ఈ కథ వింటుంటే రామదాసు చరిత్రలోని.. అతిథి వచ్చి ఆకలన్న అన్నమిడినదే చాలు క్రతువు సేయ వలయుననెడి కాంక్షలేటికే అనే మాటలు గుర్తుకొస్తాయి. అంతా వింటున్న కృష్ణుడు ముంగిసతో ఇలా అన్నాడు. ‘‘నీ శరీరాన్ని సగం బంగారంగా మార్చింది ఆహారం కాదు. తాము చనిపోతామని తెలిసి కూడా తమ ఆహారాన్ని ముక్కూమొహం తెలియని అతిథికి ఆనందంగా సమర్పించిన ఆ కుటుంబ సభ్యుల నిస్వార్థ నిరహంకార ఆత్మబలం, ఆత్మ సంతృప్తి వల్ల నీ శరీరం బంగారమైంది’’. ధర్మజా! ఇంత గొప్ప సంతర్పణ చేసిన తర్వాత, ఆ పేద బ్రాహ్మణుడి కుటుంబ సభ్యులకు కలిగిన నిరహంకార ఆత్మసంతృప్తి నీకూ, నీ తమ్ముళ్లకు కలిగిందా? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ధర్మరాజుకి తనలో ప్రవేశించిన ఆత్మ ప్రశంసాతత్వానికి కారణం బోధపడింది. పరిష్కారం అవగతమైంది. తన వద్ద ఉన్న ఆహారాన్నంతా క్షుధార్తులకు ఇచ్చి, మంచినీటితో క్షుధాగ్నిని సంతృప్తి పర్చుకోవాలనుకున్న రంతిదేవుడు.. మరికొంతమంది క్షుధార్తులు తనకంటే ఎక్కువగా అలమటిస్తున్నారని తెలిసి.. అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వ చ్చిన వారి యాపదల్ గ్నన్నన మాన్పి వారికి సుఖంబులు సేయుట కన్న నొండుమేలున్నదెఅంటూ తోటి ప్రాణులకు కష్టమొస్తే, అది తనకొచ్చినట్లేనని వారికష్టాన్ని తీర్చడం కంటే మరో గొప్ప కార్యం లేదని తన వద్ద ఉన్న మంచినీటిని కూడా ఆ అతిథులకు అర్పించాడు. అతిథులను ఆదరించడంలో వారి ఆకలిని తన ఆకలిగా భావించాలని అర్థమయ్యేలా ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలిచాడు. ‘‘నీ దగ్గరికి ఎవరొచ్చినా, వారెంతటి తక్కువ స్థితిలో ఉన్నవారైనా సరే.. ఉన్నత స్థితిలోని వారితో ఎంత మర్యాదగా, ఆదరంగా ప్రవర్తిస్తావో పేదవారితోనూ అలాగే ప్రవర్తించు. ఏ దేవతలు.. ఎప్పుడు ఏ రూపంలో నీ వద్దకొస్తారో నీకేం తెలుసు’’ అంటుంది బైబిల్. అతిథిగా ఇంటికొచ్చిన వారిని ఆర్థిక, సామాజిక, రాజకీయ విజ్ఞాన స్థితిగతులను విచారించకుండా తాను వారి స్థానంలో నిలబడి, తనను ఇతరులు ఎలా ఆదరించాలనుకుంటాడో అలాగే ఇతరులను ఆదరించాలి. చివరకు శత్రువు వచ్చినా సరే సాదరంగా గౌరవించాలంటుంది మహాభారతం. నీడనిచ్చే చెట్టు తనను నరకటానికి వచ్చిన వాడికి కూడా నీడనిస్తుంది గదా అంటుంది భారతం. వచ్చిన వారి వల్ల మనకేంటి లాభం? అన్ని విధాలా మనతో సరితూగుతారా? ఇంతకుముందు మనం వారి వద్దకెళ్లినపుడు మనల్ని ఎలా ఆదరించారు? వంటి రకరకాల ఆలోచనలతో సతమతమవకుండా ప్రేమతో, ఆప్యాయతతో మనం మంచినీళ్లు ఇచ్చినా చాలు. వచ్చిన వారిని మన పడికట్టు రాళ్లతో పరీక్షించడం ప్రారంభిస్తే స్వచ్ఛంగా అభిమానించలేం. ‘‘ప్రతి వ్యక్తి తనకు తాను ఒక జీనియస్సే. ఒక చేపను దానికి చెట్టు ఎక్కగలిగే నేర్పుందా? లేదా? అని పరీక్షించడం ప్రారంభిస్తే అది జీవితాంతం తాను ఎందుకూ పనికిరాననే భావనలో బతుకుతుంది. అలాగే పక్షిని ఈదగలిగే సామర్థ్యం ఆధారంగా పరీక్షిస్తే.. మనం సృష్టిలోని రమణీయతను, కమనీయతను సహజంగా ఆస్వాదించలేం’’ అంటారు ఐన్ స్టీన్. కొంచెమైనా పంచుకోవడం, ప్రేమతో నిండిన స్పర్శ, ఆత్మీయమైన చిరునవ్వు, దయతో నిండిన చూపు, సాటివారి కోసం స్పందించే గుణం ఇవన్నీ భగవంతుడి రూపాలే. చూడగలిగే వారికీ, చూపగలిగే వారికీ, అతిథిగా వెళ్లేవారికీ, అతిథులను ఆహ్వానించే వారికీ, అతిథులుగా ఈ భూమ్మీదకు వచ్చిన వారందరికీ! అయితే, ఈ గుణాలన్నీ అప్పటికప్పుడు అప్రయత్నంగా, అచేతనంగా అందరికీ అలవడవు. వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో కొన్ని తరాల పాటు వెలకట్టలేని ఆస్తులుగా తర్వాతి తరాలకు అందజేస్తూ పోతే చిన్నప్పటి నుంచి అలవోకగా అలవడతాయి. భాగవతంలో దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ భార్య కోరిక మేరకు కృష్ణుని కరుణ కోసం వచ్చిన బాల్యమిత్రుడు సుదాముడిని కుశల ప్రశ్నలు వేసి, తన ఆసనంపై కూర్చోబెట్టి అతణ్ని సేదతీర్చి బాల్యంనాటి విద్యార్జన విశేషాలను, గురువు సాందీపుని అపార వాత్సల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. తన కోసం ఆ పేద బ్రాహ్మణుడు తెచ్చిన అటుకులను ఆత్రంగా ఆస్వాదిస్తూ చెప్పకుండానే అతని ఆకలిని, కష్టాలను తీర్చిన శ్రీకృష్ణుని అతిథి సత్కార తత్పరత, ఔదార్యం ఆతిథ్యమిచ్చే వారందరికీ ఆదర్శప్రాయం. అందుకే పంచతంత్రంలో ఇలా చెప్పారు.. అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్ఛాతి.‘‘ఏ గృహస్థుని ఇంటి నుంచి అతిథిైయెున వాడు ఆకలితో వెనుదిరిగి పోవునో అట్టివాడు ఆ గృహస్థు చేసిన మంచి కర్మల ఫలితాన్ని కొనిపోతూ తాను కావించిన దుష్కర్మల ఫలాన్ని ఆ గృహస్థునికిచ్చి పోవుచున్నాడు’’. ఇంటికొచ్చిన అతిథులను ఆదరిస్తే నవతేజం ప్రాప్తిస్తుంది. అతిథి సేవ చేయని వానికి అకాల ఆపదలు ఆవరిస్తాయని విధురుడు దృతరాష్ట్రునితో అంటాడు. అతిథి అభ్యాగత సేవా పాఠాలు:కొన్ని విషయాలు పాఠశాలల్లో బోధిస్తారు. చాలా విషయాలు కుటుంబమనే పాఠశాలల్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. తోటివారిని ఎలా ఆదరించాలి? ఎదుటివారు బాధ పెట్టేట్లు ప్రవర్తించినా మనమెలా సంయమనం పాటించా లి? మనకు ఆదరంగా అతిథ్యమివ్వని అతిథి వచ్చినప్పుడు మనం దాన్ని మరచిపోయి ఎలా హుందాగా వారిని ఆహ్వానించాలి? ఇంటికొచ్చిన వారు కష్టంలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉండి ఎవరింటికైనా వెళ్లినప్పుడు, కష్టాల్లో ఉన్నవారిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?ఎలా మాట్లాడకూడదు? సాంత్వన ఎలా చేకూర్చాలి? వంటి విషయాలను అతిథి అభ్యాగత సేవ ద్వారానే నేర్వ గలుగుతాం. అతిథులతో సంభాషించేప్పుడు పాటించాల్సిన కనీస నియమాలు.. ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం, వారికి అవగాహన ఉన్న అంశాలపై అర్థమయ్యే భాషలో మాట్లాడటం,వారు తమ సమస్యను చెబితే సావధానంగా వినడం, వారు అడిగితే దానికి మనవద్ద ఉన్న/తెలిసిన పరిష్కారాన్ని సూచించడం, మన సమస్యలు ఏకరువు పెట్టకుండా ఉండటం. మన అలవాట్లు, నియమాలు, సిద్ధాంతాలు, విధానాలు, అభిరుచులు వంటి విషయాలపై అడిగితేనే క్లుప్తంగా, ఆత్మీయంగా, నిరాడంబరం గా, వారిని కించపరచకుండా, వారు ఎలాంటి అభద్రతాభావానికి గురికాకుండా, చిన్నబుచ్చుకోకుండా మాట్లాడాలి. మన ఆతిథ్యం స్వీకరించి, మనతో మాట్లాడిన వారికి సేదతీరినట్లుండేలా ప్రవర్తించడం ముఖ్యం. ఎవరైనా చివరకు మనం ఏ మాట్లాడాం, వారికి ఏం చేశామనే దానికంటే మన సాన్నిధ్యంలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు అనేదాన్నే (తీపి/చేదు) గుర్తుగా ఉంచుకుంటారు. ఎందుకంటే జీవితంలో ఎవరినైనా వారి దృక్పథం, పరిస్థితుల కనుగుణంగా ఆలోచిస్తేనే అర్థం చేసుకోగలం. మహా నిర్వాణ తంత్రంలో ఇలా చెబుతారు.. స్వీయం యశః పౌరుషం చ గుప్తయే కథితం చయత్ కృతం యదుపకారాయ ధర్మజ్ఞోన ప్రకాశయేత్‘‘మొదటిది తన ప్రఖ్యాతిని,శక్తియుక్తుల్ని గురించి ఇతరుల ముందు ప్రగల్భాలు పలకకూడదు. రెండోది తాను ఇతరులకు చేసిన ఉపకారాలను ప్రకటించకూడదు. మూడోది రహస్యంగా తనకు తెలిసిన విషయాలను ఇతరులకు చేరవేయకూడదు’’. ఈ మూడు గుణాలను అతిథి సత్కారాలు చేసే సమయంలోనూ తప్పనిసరిగా పాటించాలి. అతని కుల శీల విద్యా స్థితులడగక యెంత వికృత దేహుండైనన్ మతి విష్ణునిగా తలచుచు నతి ముదమున సేవ సేయునది నిజ శక్తిన్...అంటాడు మారన తన మార్కండేయ పురాణంలో. అంటే అతిథి కులం, గుణం, విద్య, ఉద్యోగం వంటి విషయాలపై దృష్టిసారించక అతణ్ని విష్ణుమూర్తి అవతారంగా తలచి, సంతోషంతో మనకున్నంతలో సేవ చేయాలి. ఆతిథ్యం.. దైవానికి సేవ:చక్కబాటు, సర్దుబాటు, దిద్దుబాటు- ఈ మూడూ కలిసి ఉండటమే ఒక కళ. మనం ఎవరిపట్లయినా, వారు పరిచితులైనా, అపరిచితులైనా అతిథి మర్యాదలు చేస్తున్నామంటే అది అతిథులకే కాక, మనకూ తాదాత్మ్యాన్ని కలిగించాలి. ఆతిథ్యం ఇవ్వడాన్ని ఒక బాధ్యతగానో, కర్తవ్యంగానో లేదంటే మెప్పుకోసమో కాకుండా ఈ ప్రపంచంలోకి అతిథులుగా మనల్ని తీసుకొచ్చిన దైవానికి ప్రేమతో, కృతజ్ఞతా భావంతో చేసే సేవగా ఉండాలి. చిరునవ్వుతో హృదయ పూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించే కుటుంబ సభ్యులే ఆ గృహానికి అలంకరణాలుగానీ ప్రాణం లేని ప్రధాన ద్వారాలు, అబ్బురపరిచే ఆధునిక ఆసనాలు, అచేతనంగా ఉండే అలంకరణ గోడ చిత్రాలు, ఖర్చును ప్రతిబింబించే ఖరీదైన ఉపకరణాలు కాదుకదా! మన ఆదరణ చూసి, వచ్చిన వారు హర్షించాలేగానీ, మన ఆవరణ చూసి ఈర్ష్యించకూడదు. మనం కూడా వారి ముందు మన అంతరంగాన్ని ఆవిష్కరించాలిగానీ, అంతస్తుల్ని కాదు! జీవితంలో ప్రేమను కోరుకునే వారు ప్రేమించాలి. ప్రేమించాలంటే సహనం కావాలి. సహనం పెరగాలంటే వ్యామోహం, ఈర్ష్య, గర్వం, క్రోధం, తప్పులెన్నుగుణం తగ్గాలి. అప్పుడు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రాకపోకలు, ఆతిథ్యాలు, ఆత్మీయతానురాగాలు పెరిగి అనుభవాలు పంచుకొంటూ పరస్పర సహకారంతో పురోగతి వైపు పయనిస్తాం. సమస్య ఏమిటంటే.. టాల్‌స్టాయ్ మాటల్లో చెప్పాలంటే.. ప్రతివారూ ప్రపంచాన్ని మారుద్దామనుకుంటారేగానీ వారిలో రావాల్సిన మార్పు గురించి ఆలోచించరు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వినాశనాన్ని చూసి కలత చెందిన ఐన్‌స్టీన్‌ను ఒక పాత్రికేయుడు ఇలా అడిగాడు. హింస, ద్వేషం మానవ ప్రవృత్తిలో సహజ భాగమా? దాని పర్యవసానమే ఇంత వినాశనానికి దారితీసిందా? దీన్నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అని. దానికి సమాధానంగా ఐన్‌స్టీన్.. ‘‘హింస, ద్వేషం మానవ ప్రవృత్తిలో సహజ భాగం కాకుండా ఉండాలంటే సమాజం నుంచి, మానవ నైజం నుంచి వాటి మోతాదును తగ్గిస్తూ పోవాలి. పరిణామక్రమంలో హింసాద్వేషాలు సమాజంలో తగ్గి, వాటి ప్రకటనా సామర్థ్యం తర్వాతి తరాల్లో తగ్గుతుంది. మానవ ప్రవృత్తి హింస, ద్వేషం వైపు మళ్లకుండా కళ్లెం వేసి, నియంత్రించడానికి సమాజంలో కుటుంబం, పాఠశాల వంటి వ్యవస్థలు (Institutions) తమ దైనందిన కార్యకలాపాల్లో కరుణ, మైత్రి, ప్రేమ లాంటి ఉన్నత భావాలతో హింస, ద్వేషం వంటి ఉన్మాద భావాలను అణగదొక్కాలి. మానవులు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఆహ్వానించుకోగలిగే, ఆమోదించుకోగలిగే సందర్భాలు పెరగాలి. తమకున్న (ధన, జ్ఞాన, గుణ) సంపదను ఆహ్లాదంగా తోటి వారితో పంచుకోవడానికి అవకాశాలను అభివృద్ధి చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైంది సాటి మానవులకు ఆతిథ్యమివ్వడం. ఆతిథ్యమిచ్చే సందర్భంలో అతిథి కోసం కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో కలసి పనిచేయడం. సహృదయంతో ప్రవర్తిస్తూ, ప్రేమతో అతిథి అవసరాలు తీర్చడం.. తద్వారా అతిథిలో ఆ కుటుంబ సభ్యులపై ప్రేమానురాగాలు పెరగడం, ఆ ప్రేమను అద్భుతమైన అనుభూతిగా గుర్తుంచుకొని వారందరూ దాన్ని వీలైన చోటల్లా పంచడం ఇలా ప్రేమ, మైత్రి, కరుణ లాంటి ఉన్నత గుణాలు పరమాణు విస్ఫోటనం కంటే శక్తిమంతంగా మారి ప్రపంచాన్ని శాంతి మేఘాలతో కప్పేసే లక్ష్యం సాకారమవుతుందన్నారు. ఇంకా ఐన్‌స్టీన్ తన స్వీయ అనుభవాన్ని వివరిస్తూ.. ‘‘నేనొకసారి ఒకరికి అతిథిగా వెళ్లాను. ఆయన నాకు తేనీటి విందు ఇచ్చాక, లోపలికి వెళ్లి పాత్రలను కడుగుతున్నాడు. నేనూ లోపలికెళ్లి సాయం చేసేందుకు సిద్ధపడగా అతను వారించాడు. అయినా ఒక కప్పును తీసుకొని, దానిపైన సబ్బుతో శుభ్రం చేయడం ప్రారంభించాను. దాన్నిచూసి ఆయన చిరునవ్వుతో.. మొదట లోపలివైపు శుభ్రంచేసి, తర్వాత బయటవైపు శుభ్రం చేయండి. లోపలి శుభ్రత బయటి శుభ్రతకు ఆరంభం, అవసరం అనివార్యం అని చెప్పాడు. అతిథిగా వెళ్లి ఆయన దగ్గర నేర్చుకున్న పాఠం నా వ్యక్తిగత, సామాజిక జీవన దృక్పథాన్ని పునర్నిర్వచించిందని ఆయన ఆనందంగా చెప్పారు. ద్వేషమైనా, అనురాగమైనా దీపం లాంటివి. కాల్చగలవు.. కాంతిని నింపగలవు. అందుకే A merry heart does good like a medicine but a broken spirit dries the bones. ఆనందమైన హృదయం ఉపశమనం కలిగించే మందులా పనిచేస్తుంది. అదే ఛిద్రమైన అంతరంగం ఎముకలను కూడా ఇగిర్చివేస్తుందని చెబుతుంది బైబిల్. ఆతిథ్యానికి ఆదరం.. సార్థక సంభాషణ:విశ్రాంతి అంటే పడుకొని నిద్రపోవడమో, సముద్రాల దగ్గరకో, కొండలపైకో వెళ్లడం మాత్రమే కాదు! నచ్చిన వారితో, అతిథిగా వచ్చిన వారితో హృదయపూర్వకంగా మాట్లాడటం కూడా. నాణ్యమైన సంభాషణతో గడిపిన విశ్రాంతి సమయం ఆత్మకు సాంత్వన చేకూర్చి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే సంభాషించేటప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలను పాటిస్తే సంభాషణా సార్థకత పెరుగుతుంది. ఎదుటివారు చెప్పింది వినడం, విన్నదానిలో మనకు అవసరమైంది గ్రహించడం, నచ్చకుంటే విభేదించకుండా మౌనంగా ఉండటం, రెండో వ్యక్తి గురించి చెడుగా మూడో వ్యక్తి దగ్గర మాట్లాడకుండటం, ఏ మాటనైనా శాంతంగా చెప్పడం, సందర్భోచితంగా మనస్ఫూర్తిగా అభినందించగలగడం, ఎదుటివారి సమయాన్ని గౌరవించడం, ఆడంబరం, అహంకారం తొంగి చూడకుండా వినయంతో భాషించడం, అలాగే సంభాషణలో హాస్య చతురోక్తి ప్రయోగించాలనుకున్నపుడు అక్కడున్న స్త్రీలు సిగ్గుపడేలా ఉండకూడదు, ఏ హృదయమూ బాధపడకూడదు. పవిత్రమైన వాటిని అపహాస్యం చేయకూడదు. హాస్యం కోసం అసభ్యతను ఎంచుకోరాదు. మన మాటలు ఎదుటివారి బలహీనతలను గేలిచేసేలా, పిల్లలు బాధపడి కన్నీళ్లు పెట్టుకునేలా ఉండకూడదు. సంభాషణలో కొందరిని నవ్వించడానికి ఏ ఒక్కరిని బాధ పెట్టినా అది వర్జితమే. అతిథి పట్ల అమర్యాదే! వ్యక్తిస్వామ్యం పెరుగుతున్న ప్రస్తుత ఆధునిక విజ్ఞాన యుగంలో కుటుంబాల మధ్య రాకపోకలు, అతిథి మర్యాదలు, అపరిచితులతో కనీస మర్యాదతో మాట్లాడటం, కుటుంబంలోనూ సభ్యులు పరస్పరం ప్రేమతో సంభాషించుకోవటం తగ్గుముఖం పట్టింది. పిల్లలు టీవీ ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో తమకు కావాల్సిన జ్ఞానమంతా లభిస్తుందని భావిస్తూ యాంత్రిక నాగరికతా ప్రవాహంలో మునిగిపోతూ తోటి మనుషుల కంటే యాంత్రిక ఉపకరణాలపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో తల్లిదండ్రులతో, బంధువులతో, మిత్రులతో, అతిథులతో పిల్లలు గడుపుతున్న సమయం 55 శాతం తగ్గిందని, దీని ప్రభావం పిల్లల పరిపూర్ణ మానసిక శారీరక వికాసంపై ప్రతికూలతను చూపుతోందని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది. దీని ఫలితంగా పిల్లల్లో దుందుడుకు వ్యక్తిత్వం, ఊబకాయం, మానసిక అసమతౌల్యత, అసహనం పెరిగిపోతున్నాయని.. ఇది పరోక్షంగా సామాజిక అశాంతికి దారితీస్తోందని హెచ్చరించింది. పిల్లల భావ వ్యక్తీకరణకు మార్గాలు, అవకాశాలు కుటుంబంలో సన్నగిల్లుతుండటంతో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటూ వాటి మంచి చెడులను నిర్ణయించుకొనే అనుభవం లేక మాదక ద్రవ్యాలు, ఇతర కృత్రిమ శారీరక, మానసిక ఉత్ప్రేరకాలకు అలవాటు పడుతున్నారని పేర్కొనటం ఆందోళనకరం. ఇప్పటి పిల్లలకు గుర్రాన్ని ఎనిమిది భాషల్లో ఏమని పిలుస్తారో తెలుసుకునేందుకు వీలవుతుందనిగానీ, గుర్రపు స్వారీ చేయడానికి అభిరుచి, అవకాశం రెండూ కలగడం లేదని ఒక బాలల మానసిక శాస్త్రవేత్త అభిప్రాయపడటంలో ఆశ్చర్యమేముంది? సోమరితనానికి, విశ్రాంతికి; సమాచారానికి, జ్ఞానానికి తేడా తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈతరం పసి హృదయాలకు స్థైర్యాన్ని, స్ఫూర్తిని ఇవ్వాలంటే ఆ దిశగా సార్థక ప్రయత్నాలు సాగించాలంటే కింది పంక్తుల్ని గుర్తుంచుకోవాలి... ఏక ఏవన భుంజీయాత్ యదీచ్ఛేత్ శుభమాత్మనః ద్విత్రభిః బహుభిః సార్థం భోజనం కారయేన్నరః‘‘శుభం జరగాలని కోరుకునే వారు ఒంటరిగా తినకూడదు. ఇద్దరుకానీ ముగ్గురుకానీ కలిసి భుజించాలి. వారిలో ఒకరు అతిథి అయితే మరీ శ్రేష్టం’’. గాంధీజీ ఆశయాలకు, ఆచరణకు ప్రభావితుడైన మార్టిన్ లూథర్‌కింగ్ 1959లో భారత్ వచ్చినప్పుడు ఆయన అనుభవం గురించి అడగ్గా.. ‘‘మిగిలిన దేశాలకు నేను యాత్రికునిగానే వెళ్లానుగానీ, భారత్‌లో మాత్రం అత్యంత సన్నిహితమైన అతిథిననే భావం కలిగింది. గాంధీకి జన్మనిచ్చిన దేశం నాకు పరాయి దేశంగా అనిపించడం లేదు. ఇక్కడి జీవన విధానంలో, ఆతిథ్యంలో ఏదో తెలియని సంతృప్తి నాకు సాంత్వన కలిగిస్తోంది’’ అంటూ తన మనసులోని మాట చెప్పారు. భారత దేశ సంప్రదాయాల్లో ముఖ్యమైన అంశం ఆతిథ్యం.. తద్వారా చర్చ, వాదోపవాదాలను ప్రోత్సహించడం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మనుగడకు అతి ముఖ్యమైనవంటారు అమర్త్యసేన్. హింసను, ద్వేషాన్ని, మన భయాలు, బాధలు, బలహీనతల్ని అధిగమించి ఆశావహ దృక్పథంతో ఒక బలమైన జాతిగా ఎదగాలంటే అందరూ కలవాలి.. పరస్పరం సంభాషించుకోవాలి.. ఆహ్వానించుకోవాలి.. ఆతిథ్యమిచ్చుకోవాలి.. ఆదరించుకోవాలి.. ఆనందించాలి. ఈ ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు ఎందరో ఉన్నారు. భగవంతుడు వారికి అన్నం రూపంలోనే కనిపిస్తాడు అంటారు గాంధీ. Generosity to others is as necessary as strictness with oneself. తిథి లేకుం డా వచ్చే వాడే అతిథి అయినా, అతిథులు కూడా కొన్ని పరిమితులు పాటించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఆతిథ్యమిచ్చే వారికి తెలియజేసి, వారికనువైన సమయంలో వెళ్లడానికి ప్రయత్నించాలి. అతిథిగా మనం వారింట్లో ఏమైనా సాయపడగలమేమో చూడాలి. పాత్రలు, మంచాలు, ఇతర సౌకర్యాలు మనం ఉపయోగించిన తర్వాత శుభ్రంగా ఉంచుతూ, వారికి పని పెంచకుండా ఉండటం, వారేమీ అడగకపోయినా మన అభిప్రాయాలు చెప్పకుండటం, వారి ఆర్థిక పరిస్థితికి అనువుగా మనం మనల్ని మల్చుకోవడం అతిథి కనీస ధర్మాలు. అతిథి సత్కారాన్ని పొందకోరిన అతిథికి సహన సద్భావాలు ఎంత అవసరమో ఈ ఉదంతంతో అవగతమవుతుంది. దక్షిణ కొరియాలోని గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒక అతిథి గది ఉంటుంది. అవసరంపై ఆ ఊరుకొచ్చిన పొరుగూరి వారికి మనస్ఫూర్తిగా ఆతిథ్యమిచ్చే ఘన సంప్రదాయం వారి సంస్కృతిలో భాగం. అలాగే అతిథిని అనాలోచితంగానైనా అన్నం పెట్టకుండా నిరీక్షింపజేయటం అతి పాపకరం. నచికేతుడు యముని దగ్గరకొచ్చి మూడు రోజులు ఆహారం లేకుండా నిరీక్షించడం వల్ల ఆ పాప పరిహారానికి మూడు వరాలు కోరుకొమ్మంటూ యముడు ఇలా అంటాడు.. ఆశా ప్రతీక్షే సంగతం సూనృతం చేష్టా పూర్తే పుత్ర పశూచ్చ సర్వాణ ఏతద్రవృం క్తే పురుషస్యాల్పి మేధసో యస్యా నశ్న న్వసతి గృహే‘‘ఎవరి ఇంట అతిథి నిరీక్షిస్తూ, భోజనం చేయకుండా ఉంటాడో ఆ ఇంట ఆశ, ఎదురు చూడటం, సజ్జన సాంగత్యం, యజ్ఞయాగాదులు, పుత్రులు, పశువులు అన్నీ నశిస్తాయి’’. ఆతిథ్యం.. మార్గనిర్దేశం:ఏదైనా మంచి మార్పు మనలో రావాలనుకున్నప్పుడు ప్రథమంగా ఉదయించే ప్రశ్న అందరూ అలా లేరు కదా నేనే ఎందుకు అలా మారాలని.. కానీ, మన నుంచి ఒకసారి మనస్ఫూర్తిగా ఆతిథ్యం తీసుకున్న వారు, దానివల్ల అనుభవించే ఆత్మానందాన్ని మరచిపోలేరు. ఎవరినైనా ఆదరిస్తున్నప్పుడు లేదా నిరాదరిస్తున్నప్పుడు మన అంతరాత్మను ఆ అనుభవం మార్గనిర్దేశనం చేస్తూ ఉంటుంది. ఆచరించే మార్గం, నమ్మిన విధానం మంచిదైనప్పుడు ఒంటరివాడివైనా ముందుకు సాగిపో..! సమాజం ఏదో ఒకరోజు అర్థం చేసుకొని, అభినందించి నీ మార్గంలో నడుస్తుందన్న విశ్వకవి ఠాగూర్ మాటలు ఆలోచనీయం. కుటుంబంలో అసూయ, అనాదరణ, అహంకారం, ఆడంబరం, అభిజాత్యం వ్యక్తిస్థాయిలో ఎప్పుడు నాటుకు పోతాయో ఆపదలు వారితో పాటు వారి కుటుంబాన్ని కబళించటానికి ఎదురు చూస్తుంటాయి. సౌజన్యం, సౌశీల్యం, సానుభూతి, ప్రేమలతోనే మనిషి మనిషికి స్నేహపాత్రుడు కాగలుగుతాడు. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏ గృహస్తు అయినా అతిథి పట్ల చూపాల్సిన కనీస గుణాలివి. భావస్ఫూర్తి, వాక్శుద్ధి ఎవరికైనా సహజాభరణాలు. వీటిని మనస్ఫూర్తిగా వినియోగించడం వల్ల ఖర్చేమీ కాదు. పైగా ఆ సద్భావ సంపన్నత, సహృదయత ఎదుటివారిలో కూడా ప్రశాంతతను నెలకొల్పి, ఆలోచింపచేసే శక్తిని కలిగి ఉంటుంది. ఒకరికొకరు ఆతిథ్యమిచ్చుకోవడం, భౌతిక, మానసిక ఆధ్యాత్మిక వనరులను పరస్పరం పంచుకోవడం, తద్వారా అనాదరం, అహంకారం, అజ్ఞానం, అభిజాత్యం లాంటి అసుర గుణాలను అంతం చేయడం.. అనురాగం, ఆక్రోధం, ఆదరణ, ఆత్మీయత, ఆర్తి, ఆర్ద్రత లాంటి దైవ గుణాలను అభివృద్ధి చేయడం దాని ఫలితంగా విశ్వశ్రేయస్సుకు తోడ్పడడం.. ఇవి నిష్కల్మష ఆతిథ్య ఫలాలు. ఎన్నో ఉపకరణాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమవుతున్నా ఒంటరితనం, ఒత్తిడి నవతరాన్ని పట్టి పీడిస్తుందంటే వ్యక్తుల మధ్యా తక్షణ అవసరాలు తీర్చుకునే (Instant Utility) సంస్కృతి పెరగడం కారణమేమో! అతిథులు ఇంటికి రావడం, వారితో గడపడం వల్ల ఒంటరితనం, మానసిక ఒత్తిడి తగ్గి, జీవన గమనం ఒక సమన్వయ స్థితిని పొందగలుగుతుందన్నది మానసిక నిపుణుల అభిప్రాయం కూడా.. తదేవ లభతే భద్రే కర్తా కర్మజ మాత్మనః‘‘పుణ్యమైనా, పాపమైనా మానవుడు ఏ కర్మ చేస్తాడో దాని ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు’’. ఎవరికి వారు తమకు తాము జీవితపు లోతుల్లోకి వెళ్లి, వారి జీవితం ఎక్కడ ప్రారంభమైందో.. ఎక్కడికి చేరాలనుకుంటున్నారో.. ఎలా చేరాలనుకుంటున్నారో.. ఆత్మాన్వేషణ చేసుకుంటే కృత్రిమ పోకడల కంటే సహజ సహృదయతే వారిని అక్కడికి క్షేమంగా చేర్చగలుగుతుందని అర్థం చేసుకోగలుగుతారు. ‘‘ధన రాశుల కంటే ఘనమైన గుణరాశులు మానవ సమాజ మనుగడకు అత్యవసరం. ధనరాశులు పెరిగి, దాగిన చోట పాపపు రాశులు మరిగి ఆవిరిగా బయట పడతాయి. తనను, తనతోటి వారిని భక్షిస్తాయి. గుణరాశులు పెరిగిన చోట, పుణ్యపు రాశులు సుగంధంలా వ్యాప్తి చెంది తనను, తన సమాజాన్ని రక్షిస్తాయి అంటారు’’ ఆలివర్ గోల్డ్‌స్మిత్. వ్యక్తి మనుగడకూ, కుటుంబ శాంతికీ, సమాజ సాఫల్యానికి, ప్రజాస్వామ్య పరిపక్వతకు అతిథి సేవనం ఒక ఉత్ప్రేరకం వంటిది. మరణానంతరం దైవం మన జీవితంపై తీర్పు చెప్పేటప్పుడు ఎంతమంది ఆకలిని మనం ప్రేమతో నింపిన ఆహారంతో తీర్చామన్న దాని ఆధారంగానే తీర్పు ఇస్తాడంటారు మదర్ థెరీసా. పెద్దలను గౌరవించడం, అనాథలను ఆదరించడం, వృద్ధులను దయతో పలకరించడం, అతిథులను మర్యాదతో సత్కరించడం, సన్మార్గ ఆచరణ.. సామాజిక జీవనం లో సంక్షోభాన్ని నివారిస్తాయని భరతునికి రాజధర్మం ఉపదేశిస్తూ రాముడు చిత్రకూటంలో చెబుతాడు. సమాజానికి గృహస్థాశ్రమం పునాది. పునాది గట్టిగా ఉంటేనే సమాజమనే భవనం దృఢంగా ఉంటుంది. సమాజం పటిష్టంగా తయారైనప్పుడు దేశంలో విభేదాలు, విద్వేషాలు, వికృతులు,వ్యష్టివాదం సమసి శాంతియుత సహజీవనం సాధ్యమవుతుంది. అతిథుల్ని ఆదరించడం భవన రక్షణకు చేసే మరమ్మతులాంటిది. అది పునాదిని, భవనాన్ని రెంటినీ దృఢపరుస్తుంది. అందుకే తైత్తిరీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు... మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి, తండ్రి, గురువు, అతిథి దైవంతో సమానం... |
The Best, The best, The best.....
రిప్లయితొలగించండిThis is the precise weblog for anybody who needs to seek out out about this topic. You notice so much its almost arduous to argue with you. You positively put a brand new spin on a subject that's been written about for years. Nice stuff, simply nice!
రిప్లయితొలగించండిI am extraordinarily affected beside your writing talents, Thanks for this nice share.
రిప్లయితొలగించండి