9, మార్చి 2014, ఆదివారం

:: ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః ::. శ్రీ రాజమౌళి గారి వ్యాసాలు - 3

బుద్ధిపూర్వకంగా పూర్తి ఇష్టంతో చదివేదే చదువు. నేటి తరం విద్యార్థులకు చదివే చదువుకంటే దాని వల్ల వచ్చే ఆరంకెల జీతాన్ని ఇచ్చే కోర్సుల వైపే ఎక్కువ మక్కువ ఉంటోందన్నది నిపుణుల విమర్శ. దీంతో మిగతా కోర్సుల గురించి ఆలోచించడానికే భయపడే పరిస్థితి. మంచి జీతాన్నిచ్చే కోర్సులు జీవితాన్ని ఆనందమయం చేస్తాయా? ధృక్పథం, అభిరుచులు, మాట, సాహిత్యం, పొదుపు లాంటి మౌలిక అంశాలు లేకుండా జీవితంలో సామరస్యాన్ని, సమతుల్యతను సాధించడం కష్టం. సామాజిక బాధ్యత అందివ్వని చదువు దేశ సమగ్రతకు, పాలనావ్యవస్థకు సమస్యగా మారవచ్చు. విద్యార్థులు, ఉద్యోగార్థులు డిగ్రీలతో పాటుగా ఈ మౌలిక లక్షణాలను ఆకళింపుచేసుకుని ఆచరిస్తే... మంచి విద్యార్థిగా, పౌరుడిగా, పాలానాధికారిగా, నాయకుడిగా ఎదిగి ఆనంద భారతావనికి పునాదులు పటిష్టం చేసినవాళ్లవుతారు.
అమెరికా రాజ్యాంగాన్ని ఆ దేశ అగ్రనాయకులు ఆమోదించుకొని బయటకు వస్తున్న సమయంలో... ‘‘మాకు ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థను ఇచ్చారు. నియంతత్వమా - రాచరికమా - రిపబ్లికా?’’ అని ఒక యవకుడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్‌ను అడిగాడు. దీనికి ఫ్రాంక్లిన్... మీరు సురక్షితంగా ఉంచుకోగలిగే ‘రిపబ్లిక్’ అని సమాధానమిచ్చారు. ప్రభుత్వాధినేతను ప్రజలే ఎన్నుకునే పాలనా వ్యవస్థే రిపబ్లిక్. అంటే అలాంటి పాలన వ్యవస్థను విజయవంతంగా నడిపించుకుంటూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఫ్రాంక్లిన్ భావం. ఆ బాధ్యత ప్రతి పౌరుడిలోనూ నరనరాన జీర్ణించుకోవాలన్నదే ఆయన అభిప్రాయం.
‘‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’’ అన్న గురజాడ మాటలకు అర్థం ఇదే. సమర్థవంతమైన పాలనా వ్యవస్థలో భాగస్వాములై బాధ్యతాయత పౌరులుగా, అధికారులుగా, ప్రజాసేవకులుగా, పాలకులుగా లక్ష్య నిర్దేశం చేసుకుని ముందుకు వెళ్లాలనుకునేవారు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ మాటల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి.
దృక్పథం:
రెండు కప్పలు ఒక లోతైన గుంటలో పడిపోయాయి. తన ఖర్మే దీనికి కారణం అనుకుని ఒక కప్ప అలానే ఉండిపోయింది. మరో కప్ప మాత్రం బయటికి రావడానికి అనేక విధాలుగా ప్రయత్నించి గట్టు చేరింది. అప్పటివరకు.. ‘మీరు బయటికి రావడం అసాధ్యం’ అని కేకలు వేసిన తోటి కప్పలు ఈ దృశ్యాన్ని చూసి... ‘మేము అంతలా అసాధ్యం అని అరుస్తుంటే నీకు విన్పించలేదా’? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... మీరు అరుస్తుండటం కన్పించింది కానీ విన్పించలేదు. మీరంతా నన్ను బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారని భావించాను అని సమాధానమిచ్చింది. దీని సారాంశం ఏంటంటే... చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను నిందిస్తూ... స్పష్టమైన లక్ష్యం, గమ్యం లేకుండా సాగే నిరాశావాదులందరికీ, ఆశావాదులందరికీ కూడా బయటకు వచ్చిన కప్ప దృక్పథం అనుసరణీయం, ఆచరణీయం. ఇది ఆచరణ సాధ్యం కావాలంటే ఆత్మపరిశీలనకు అధిక సమయం కేటాయిస్తే... తద్వారా ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి మన దగ్గర సమయం ఉండదు. ఇతరుల నిరాశావాదాన్ని స్వీకరించడానికి మనసు ఇష్టపడదు.
 
సమయానికి తగుమాటలాడే: 
సంభాషణ ఒక కళ. దీన్ని సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఈ తరం పిల్లల్లో సమయస్ఫూర్తి, సంభాషణా చాతుర్యం, చమత్కారం తగ్గుముఖం పడుతున్నాయని ఇంటర్వ్యూలు నిర్వహించే మానవ వనరుల నిపుణుల అభిప్రాయం. సమయస్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం చేయమని కాదు. సమయస్ఫూర్తి, జీవితానుభవం, ఆత్మావలోకనం ద్వారా చక్కటి సంభాషణ నైపుణ్యం అలవడుతుంది.

1926లో రాధాకష్ణ పండితులు అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తూ... భారతీయ తత్వ విలువల్లో ప్రపంచాన్ని రక్షించే సందేశం ఉంది అని అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. వెంటనే ఒక విద్యార్థి ఇండియా తనను తాను రక్షించుకోలేకపోతోంది. ప్రపంచాన్ని ఏమి రక్షిస్తుంది? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా... ‘‘ఏసుక్రీస్తు ఇతరులను రక్షించడానికి పుట్టాడు కానీ తనను తాను రక్షించుకోవడానికి కాదు కదా’’ అని ఆయన చమత్కరించారు.  ఆ సమయస్ఫూర్తి, చమత్కారం ఆయనను  దేశంలోనే అత్యుత్తమ పరిపాలకునిగా తీర్చిదిద్దాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామాయణంలో సంభాషణ ఎలా ఉండాలనే అంశంపై వాల్మీకి చక్కగా వివరిస్తారు...
అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యథం
ఉరస్థం కంఠగం వాక్యం వర్థతే మధ్య మన్వరం
(సంభాషణ క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువైన స్వరంతో వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి మధ్యమ స్వరంలో ప్రతి అక్షరం పలకాలి.)
అప్పుడే ఆ సంభాషణ శ్రోతను ఆత్మీయతతో ఆకట్టుకోగలుతుంది. గంటల కొద్దీ టాక్‌టైమ్‌ను వేలకు వేలు వెచ్చించి కొనుక్కుంటున్నాం కానీ... ఆ ‘టాక్’లో స్పష్టత, లక్ష్యం కొరవడి... సంభాషణ కొరత (కమ్యూనికేషన్ గ్యాప్)తో మానవ సంబంధాలు తల్లడిల్లిపోతూ... సామాజిక మూలాలనే దెబ్బతీస్తోంది అన్న విషయం మరిచిపోతున్నాం. అర్థం, లక్ష్యం లేని సంభాషణలు (చిట్ చాట్, గాసిప్) ఆ సమయంలో ఆనందింపజేసేవిగా ఉన్నా... తర్వాత మానసిక క్లేశాన్ని, న్యూనతాభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో కూడా తేలింది. అర్థవంతమైన సంభాషణ ద్వారా.. ఆ సంభాషణలో వాడే పదాల ద్వారా.. వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగే పరిస్థితి ఉందంటే సంభాషణ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలి.
సాహిత్య ఆస్వాదనం:వందలకొద్దీ పుట్టుకు వస్తున్న కోర్సుల వరదలో సాహిత్య పఠనాన్ని పూర్తిగా విస్మరించడం యువతరానికి, నవతరానికి శాపమే. సాహిత్యపఠనం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఏమీ తక్షణం గోచరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు. అయితే సాహిత్య ప్రయోజనాలను విస్మరిస్తే... ఆధునికత పెరగవచ్చు ఏమో కానీ నాగరికత పెరగదు. సాహిత్య పఠనంలో.. శారీరక మానసిక వికారాలు అణిగి మనస్సు నిర్మలమవుతుంది. కఠిన హృదయాలను మృదు హృదయలుగా మార్చగలగడమే సాహిత్య ప్రయోజనం. అందుకే విశ్వశ్రేయ: కావ్య: అన్నారు. కావ్యం విశ్వశ్రేయస్సును కాంక్షించేది.
 
ఒక రోజు ఒక చిన్న పిచ్చుక రోడ్డు మధ్యలో వీపు నేల మీద ఆన్చి పడుకుని కాళ్లు పెకైత్తి ఆందోళనతో.. కాళ్లను విదిలిస్తుంది. అటుగా వెళుతున్న ఒక గుర్రం దానిని చూసి.. ‘తలకిందులుగా ఏం చేస్తున్నావ్’? అని అడిగింది. దానికి ఆ పిచ్చుక.. ఈ రోజు ఆకాశం, భూమి ఒకటి కాబోతున్నాయట. ఆకాశం, భూమి మీదకు వస్తే.. మనం మిగలం కదా? అందుకే ఆకాశాన్ని భూమి మీద పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అంది. దానికి గుర్రం.. ‘పుల్లల్లాంటి కాళ్లతో ఆకాశాన్ని ఆపుతావా’ అంటూ హేళన చేసింది. దానికి పిచ్చుక ‘ఎవరు చేయగలిగింది వారు చేయూలి కదా. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను’ అంది. అంత అల్ప ప్రాణికే లోక కల్యాణంపై అంత సమర్పణ భావం ఉందంటే ఉత్కృష్ట ప్రాణులమైన మనకు ఎంత ఉండాలి? ఏదైనా ప్రమాదం లేదా విపత్తు సంభవించినా లోకం ఎలా పోతే నాకేం? నేను సురక్షితంగానే ఉన్నాను కదా అని భావించేవారూ, గుర్రంలా ఆరోపించే వారూ మనలో అధికం. పిచ్చుకలా తమవంతు కృషి చేసేవారూ ఉన్నారు. తమ చుట్టూ ఉన్న సమాజం ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటేనే మనం భద్రంగా ఉంటాం అనే భావన బలపడాలి. ఆ భావనను సృష్టించి, పెంపొందించేదే సాహిత్యం. విశ్వశ్రేయస్సులోనే వ్యక్తి సౌభాగ్యం కూడా ఇమిడి ఉంది అని దీని అర్థం.

అంతర్ముఖ అభివృద్ధికి అభిరుచి:ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ అంటారు టాల్‌స్టాయ్. నచ్చిన కళలో ఆనందించడమే అభిరుచి. అభిరుచిని ఎవరికి వారు తమ మానసిక స్థితిని బట్టి ఎంచుకోవాలి. ఎందుకంటే మానసిక స్థితి ప్రతి ఒక్కరిదీ భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఎవరో చెప్పారనో, ఇంకెవరో చేస్తున్నారనో కాకుండా.. ఎవరికి వారు తమ తమ ఆత్మానందం కోసం అభిరుచిని అభివృద్ధి చేసుకోవాలి. జీవిత కాలం నిండుగా, నిర్భయంగా, మానవత్వంతో బతకాలంటే అభిరుచి అత్యవసరం అంటారు సంజీవ్‌దేవ్.

సాధారణ వ్యక్తులు కాల, భావ ప్రవాహాల్లో కొట్టుకుపోతారు. కొందరు సమస్యలు, కష్టాల కడగండ్లు చుట్టుముడుతున్నా వాటిలో కొట్టుకుపోకుండా.. తాము సుఖపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకుంటూ తమకు చేతనైనంత ఆనందం పంచుతారు. దీనికి కారణం అభిరుచి కారణంగా వారిలో ఏర్పడిన అంతర్ముఖ అభివృద్ధి. దురదష్టవశాత్తూ నేటి సమాజంలో మనుషుల మధ్య ప్రేమానురాగాల కంటే సాంఘిక హోదాకే ఎక్కువ గౌరవం లభిస్తోంది. ప్రతివాళ్లకు తాము సుఖంగా జీవించే కంటే అందరూ తాము సుఖంగా జీవిస్తున్నట్లు అనుకోవాలని భావిస్తూ క్రమంగా జీవితంలో పై మెరుగులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జీవనం, జీవితం డొల్లగా మారిపోయి మానవసంబంధాల్లో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాకుండా ఆకలిని సగమే తీర్చినట్లు హృదయాలతో మానవసంబంధాలను నెరపని ప్రస్తుత స్థితి అంతర్ముఖ అభివృద్ధి లేని కారణంగా తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప జేస్తోంది. అందుకే ఆనందమయ జీవన శైలికి అభిరుచి అత్యవసరం. ‘నీ అభిరుచి చెబితే నువ్వేంటో నేను చెబుతా’ అంటారు ఐన్‌స్టీన్.

థామస్ ఆల్వా ఎడిసన్‌ను సృష్టిలో నీకు ఆసక్తి కలిగించే అంశాలు ఏమిటని ప్రశ్నిస్తే.. ‘అన్నీ’ అని సమాధాన మిచ్చారు. ఆయన అభిరుచి సాంద్రత ఆయన జీవన సాంద్రతను పెంచడమే కాకుండా మానవ జీవన గమనాన్ని ఎన్నో రెట్లు సారవంతం చేసింది.
 
పొదుపు:
వివేకానందుని మాటల్లో... మనిషికి గల పాపాలు రెండు. అసహనం, అత్యాశ. అత్యాశవల్ల స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల స్వర్గాన్ని చేరుకోలేక పోయాడు. దీనికి కారణం మానవుడు సంపద సృష్టి, వినియోగంలో పొదుపు అనే మూల సూత్రాన్ని విస్మరించడమే. ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే నిచ్చెనలో ఏ మెట్టు మీద నిలబడాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఉరుకులు, పరుగులతో కూడిన యాంత్రిక జీవనాన్ని సాగిస్తూ.. విశ్రాంతి కోసం టీవీ లాంటి ఉపకరణాన్ని ఆశ్రయిస్తే... మంచి నాన్న అనిపించుకోవాలంటే ఫలానా కారులో తిరగాలని... మంచి భర్త కావాలంటే... ఫలానా కంపెనీ డైమండ్ రింగ్ బహుమతిగా ఇవ్వాలని... కంప్లీట్ మ్యాన్ అనిపించుకోవాలంటే ఫలానా కోటు వేసుకోవాలంటూ చేసే ప్రకటనల దండయాత్రలకీ, పొందాలనుకునే విశ్రాంతికి బదులు అశాంతి, అసహనానికి లోనవుతున్నాం. ఆ అశాంతిలో ఆనందం ఏంటో మరిచిపోయి ఆ ప్రకటనల యద్ధంలో గుచ్చుకున్న బ్రాండ్ల గాయాలన్నీ మాన్పుకోవడానికి షాపింగ్‌మాళ్లకు పరుగెడతాం. ఈ బ్రాండ్ల గందరగోళంలో మన బ్రాండ్ ఏంటో మనమే తెలుసుకోలేని కత్రిమ అజ్ఞానానికి గురవుతున్నాం. ఇంట్లో వస్తువుల బ్రాండ్లన్నీ మార్చినా... మళ్లీ కొత్త బ్రాండ్స్.. కొత్త ప్రకటనలు.. మళ్లీ.. పాత అసహనం.

కూర్చుని టీవీ చూస్తే పొట్ట పెరుగుతుందని.. ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతూ టీవీ చూడమని చెప్పే ప్రకటనను అమలు చేయడానికి పరుగెడతాం. ఈ పరుగులో ప్రశాంత జీవన గమనానికి కావాల్సిన శాంతి, సహనం, పొదుపు, తృప్తి అనే మౌలిక అంశాలను మరిచిపోయి... ప్రతి వస్తువు విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ మన ఉనికిని కోల్పోతున్నాం. మానవ జీవనన ప్రాథమిక దశలో మనిషి తనకు అవసరమైనంతే వేటాడేవాడు. మరి ఇప్పుడు? ఏ పక్షి కూడా అవసరాన్ని మించి ఆహారాన్ని కూడా పోగేయదు. మరి మనం?

ఇటీవల కొందరు మిత్రులు జర్మనీలో ఒక హోటల్లో భోజనం చేస్తూ... అవసరానికి మించి ఆర్డర్ ఇవ్వడం వల్ల అవి తినలేక వదిలేశారు. ఇదంతా గమనిస్తున్న జర్మన్ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తే... మా డబ్బు, మా ఆహారం, మా ఇష్టం అని ఆ మిత్రులన్నారు. దానికి ఆమె  ఆవేదనతో స్పందిస్తూ... డబ్బు మీది కావచ్చు కానీ వనరులు సమాజానివి. మీ చర్య వల్ల సామాజిక శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ ఆ మహిళ సాంఘిక భద్రతా దళాలకు తెలపడం, ఆ యవకులు జరిమానా చెల్లించాల్సి రావడం జరిగింది.

ఆమెకు ఉన్న సామాజిక స్పృహ, పొదుపుపై అవగాహన అందరికీ ఆదర్శం. తనను కలవడానికి వచ్చిన సందర్శకులను చాణుక్యుడు.. ‘మీరు వచ్చిన పని వ్యక్తిగతమా? వృత్తి పరమైనదా’? అని ప్రశ్నించాడు. వారు వ్యక్తిగతం అని చెప్పడంతో.. తాను పనిచేస్తున్న పెద్ద (ప్రభుత్వ) దీపాన్ని ఆర్పివేసి చిన్న (వ్యక్తిగత) కొవ్వొత్తిని వెలిగించాడు. ఆశ్చర్యపోయిన సందర్శకులతో.. వ్యక్తిగత కార్యానికి వ్యక్తిగత వనరుల పరిమితంగా వాడటమే తన జీవనసూత్రమని చాణుక్యుడు వివరిస్తాడు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు. బాట వేయడం.. దారి చూపడం. ఎంత దూరం వెళ్లాం, ఎన్ని వింతలు చూశాం అని కాదు ఎన్ని అనుభూతుల్ని మూటగట్టుకున్నాం? ఎంత ఆత్మ సంతప్తిని పొందగలిగాం అన్నది ముఖ్యం. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ బతికుండగానే మరణించినట్లు వార్తలు వచ్చాయట. డైనమెట్ కనిపెట్టి అనేక మంది వినాశనానికి కారణమయిన వ్యక్తి మరణించాడు  అని పత్రికలు సంపాదకీయాలు రాశాయి. నిజంగా మరణించినా ఈ ప్రపంచం తనను ఇలానే గుర్తుంచుకుంటుందని భావించి... తన పేరు చెబితే మంచి గుర్తుకురావాలని ఆయన నోబెల్ బహుమతిని ప్రారంభించాడు. ఇపుడు నోబెల్ అనగానే బహుమతి గుర్తుకువస్తుంది కానీ డైనమెట్ కాదు.

అసంపూర్ణంగా ఉన్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నింపుకోవటమే అభివృద్ధి. అందుకు అనుశీలన, అంతర్‌దృష్టి, అధ్యయనం, ఆలోచన అవసరం. ఆయా రంగాల్లోని మేధావులందరినీ అధ్యయనం చేయాలి. వారికి తట్టని అంశాలను పరిశీలించాలి. సమాజానికి మన వంతు తోడ్పాటును అందించాలి.
  
రుగ్వేదంలో అన్నట్లు
‘ఆనోభద్రా క్రతఓ యంతు విశ్వతః’
(అన్ని వైపుల నుంచి ఉదాత్త భావాలు మనకు సంక్రమించుగాక.)

6, మార్చి 2014, గురువారం

ధాన్యానాముత్తమం దాక్ష్యం - RAJAMOULI ESSAY'S - 2

అమెరికాలోని ఒక నిరుపేద నీగ్రో కుటుంబంలో పుడుతూనే బానిసగా జన్మించాడు. తండ్రిని బాల్యంలోనే కోల్పోయాడు. తనను, తన తల్లిని బానిసలుగా అమ్మడానికి ప్రయత్నించిన వర్తకులు తల్లిని అమ్మేశారు. కానీ జబ్బుపడ్డ అతడిని కష్టపడటానికి పనికిరాడని ఒక పండ్ల తోట వద్ద వదిలి వెళ్లిపోయారు. ఖాళీ సమయాల్లో బట్టలు ఇస్త్రీ చేయగా వచ్చిన డబ్బుతో.. వృక్షశాస్త్రాన్ని మధించి దాదాపు మొక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు 300 రకాల మందులను వృక్షశాస్త్ర మెళకువలతోనే కనిపెట్టాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం, మేధస్సు చూసి సంవత్సరానికి లక్ష డాలర్లు ఇస్తానని, తనతో కలిసి పని చేయాలని కోరాడు థామస్ ఆల్వా ఎడిసన్. కానీ తన కాలేజీలోనే తన విద్యను, పరిశోధనల ఫలితాలను అందరికీ పంచుతాననీ తద్వారా అమెరికా వ్యవసాయరంగం అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పాదకత గల దేశంగా అవతరించగలదని నమ్మి అనుకున్నది సాధించాడు. ‘నేను తయారుచేసిందంతా భగవంతుడు నాకు ఇచ్చింది. దాన్ని వేరొకరి లాభం కోసం ఎలా అమ్మగలను’ అనేవాడాయన. దేశమంతా లక్షలాది రైతులకు ఉచితంగా తన పరిశోధనల సారాన్ని అందించి వారిని, వారి పంటలను ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా తోడ్పడ్డాడు.

ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిమీద ఇలా రాసి ఉంది.

"He could have added fortune to fame, but caring for neither he found happiness and honour in being helpful to the World''

‘‘కావాలనుకుంటే కీర్తితోపాటు సంపద కూడా వచ్చేది కానీ రెంటినీ లెక్కచేయక తన ఆనందం, గౌరవం ప్రపంచానికి సాయపడడంలోనే ఉంది అని భావించాడు’’ ఆయనే జార్జి వాషింగ్టన్ కార్వర్
. చిన్న విషయాన్ని కనిపెట్టినా పేటెంటు కోసం పరుగులు పెట్టి రాయల్టీ కోసం రాద్ధాంతం చేసే రోజుల్లో ఒక్క పేటెంటు తీసుకోకుండా లాభాపేక్ష లేకుండా తనదేశ రైతులు పదికాలాలపాటు చల్లగా ఉండాలన్న అతని తపన అందరికి ఆదర్శనీయం. తన జీతంలో పొదుపు చేసిన మొత్తంతో కార్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇలా తను మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే అతని ఆశయాలు ఎంత ఉదాత్తమైనవో అర్థమవుతుంది.

అంగణవేదీ వసుధా కుల్యా జలధి: స్థవీచ పాతాళమ్
వాల్మీక: చ సుమేరు: కృతప్రతిజ్ఞానస్య ధీరస్య

పరోపకారం కోసం కృతనిశ్చయంతో ఉన్నవారికి భూ మండలమంతా చిన్న తోటలా, సముద్రం ఒక చిన్న కాల్వలా, పాతాళం ఒక విహార ప్రదేశం లాగా, మేరు పర్వతం ఒక చిన్న పుట్టలా కనిపిస్తుంది. అటువంటి వీరులకు ఎన్ని అవరోధాలొచ్చినా వాటికవే తొలగిపోతాయి. లేకపోతే తొలగించుకోగలరు. తన సోదరుని వివాహానికి బంధుమిత్రులందరికీ భోజనం పెట్టాలనుకున్నా... దేశంలో (భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత) ఆహార కొరత వల్ల, అప్పుడున్న నియమం ప్రకారం కేవలం 30 మందికి మాత్రమే పెట్టాలని తెలిసి... ఎలాగైనా దేశాన్ని వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయించాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎస్‌కు ఎంపికైనా చేరకుండా.. హరితవిప్లవం ద్వారా భారతదేశాన్ని స్వావలంబన దిశగా అడుగులు వేయించిన ఎం.ఎస్. స్వామినాథన్ స్ఫూర్తిదాయక ప్రయాణం విద్యార్థులందరికీ దిక్చూచే.

బాల్యం నుంచీ సమస్యలు సతమతం చేసినా, ధైర్యంగా ఎదుర్కొని, వాటిని అధిగమించి విఫలమవడానికి వేయి సాకులున్నా సఫలమైన ఈ మహానుభావులు.. విద్యార్థి దశలో నిర్ణయాత్మక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పారని, మరెవరో తీసుకున్నారని, వేరెవరో బాగా సంపాదిస్తున్నారనీ అస్పష్ట వైఖరితో అసమంజస నిర్ణయాలు తీసుకుని తమకూ, తమ వారికీ క్లేశ కారణమవుతున్న వారందరికీ ఆదర్శమే.

చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకం పఠనమే కాక మానవసంబంధాల సున్నితత్వాన్ని అర్థంచేసుకుని చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు-వాదోడుగా ఉండటమే. ఇంటి పనులు చేసుకోవడం చిన్నతనంగా భావిస్తే అది విద్యాభ్యాసంలో లోపమే.

కుటుంబం నడవడానికి, తన చదువుకు ఎంత ఖర్చువుతోంది? కుటుంబ ఆదాయం ఎంత? ఎక్కడి నుంచి వస్తోంది? తదితర అంశాలు విద్యార్థులు అర్థం చేసుకొంటే వారి ఆహారం, ఆహార్యం, అలవాట్లలో, ఆనందాలలో, అభిరుచులలో మితవ్యయం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇలా ఏర్పడే ఆర్థిక క్రమశిక్షణ చదివే చదువుపట్ల మరింత అంకితభావం పెంచడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేస్తుంది. అది కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకర, ప్రజాస్వామ్యబద్ధమైన సంభాషణ పెంపొందింపచేసి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికోసం ఒకరు జీవించే ఆహ్లాదకర వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే జీవితానుభవం జీవితంపట్ల వాస్తవిక దృక్పధాన్ని అలవరుస్తుంది.

అలాకాకుండా చదివిన చదువును జీవితానికి అన్వయించుకుంటూ, అర్థవంతంగా నిజజీవితంలో గమనిస్తూ ముందుకు సాగాలి. ఇలా చదువు పెరిగే కొద్దీ, చదవాల్సిన పుస్తకాలు పెరిగే కొద్దీ విషయసేకరణపై, విషయంపై పట్టు పెరిగి అది విద్యార్థిలో అంతర్భాగం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది జరగాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చర్చించి ముందుకు కలిసి నడవాలి. లేకపోతే జీవితానికి అన్వయించని చదువు, చదివినా అర్థంకాని జీవితం ఇవే ప్రాథమిక సమస్యలుగా మిగిలిపోతాయి. అన్నం, కూర, నెయ్యి కలుపుకుని సమపాళ్లలో రుచిగా భుజించడం నేర్పిస్తే జీవితాంతం ఆ అలవాటు ఉపయోగపడుతుంది. అదే అన్నీ కలిపి ముద్దలుగా చేసి పెడితే తినడం సులభమే కానీ, ముద్ద తయారు చేయడం రాదు. పాఠ్యపుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయగలిగే వారుగా తయారైతేనే Intelligence quotient, Emotional quotient, Social quotient, Spiritual quotient అన్నీ సమపాళ్లలో కలిసిన వ్యక్తిగా రూపొందుతారు.

ఐఐటీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తానన్న మాధవన్‌ను తల్లిదండ్రులు వారించినా "I want to transform what I study in to what I love'' అనుకుని..పనిచేసి దాచుకున్న డబ్బుతో ఆరు ఎకరాలు కొని వ్యవసాయం చేస్తే.. మొదట్లో నష్టం వచ్చింది. అయినా పట్టువిడవకుండా ఇజ్రాయెల్‌లోని డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని (750 లీటర్లు అవసరం అయ్యే దగ్గర లీటరు నీరు సరిపోతుంది) అవలంభించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ రుణాలు ఎలా తీసుకోవాలో చెప్పేకంటే ఆచరణాత్మక ప్రయోగాలు చేయాలంటారు. తన పొలంలో ప్రతి ఎకరాలో 10 సెంట్లు పరిశోధనలకు కేటాయిస్తారు. అమెరికాలో గంట పనిచేసి మూడు భోజనాలు సంపాదిస్తే ఇక్కడ రోజంతా పనిచేసినా ఒక్క భోజనం రాని పరిస్థితి. దీన్ని మార్చాలి. లేకపోతే ఆహార అభద్రత అణుబాంబు కంటే ప్రమాదకరమైంది అంటారు మాధవన్. ఆయన లాంటి ఎందరో ఇంజనీర్లు తమ ఇంజనీరింగ్ జ్ఞానాన్ని తమ హృదయానికి నచ్చిన రంగంలో వినియోగిస్తే మనదేశాన్ని ఎంతముందుకు తీసుకువెళ్లవచ్చో? మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం మాధవన్ పొలాన్ని సందర్శించి అబ్బురపడి మనకు మిలియన్ మాధవన్‌లు కావాలన్నారు.

జీవితంలో అన్నీ మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అన్వేషించాలి. జీవిత గమనంలోని ప్రతి మలుపులోనూ మనకు ఎన్నో పాఠాలు దొరుకుతాయి నేర్చుకోగలిగితే. ఉదయం నాలుగు గంటలకు లేచి, పేపర్లు వేసి, స్నానం చేసి చదువుకొని ఆ తర్వాత పై చదువులు ఉపకారవేతనంతో ఎంఐటీలో చదువుతున్నప్పుడు రెండురోజుల్లో ఆశించిన ఫలితం రాకపోతే ఉపకారవేతనం నిలిపివేస్తానన్న అధ్యాపకుని మాటలతో ఆ ఫలితాన్ని చెప్పిన సమయానికి అందించారు అబ్దుల్ కలాం. ఈ సంఘటన కాలం విలువ చెప్పడమే కాకుండా ఒక పని నిర్దేశిత సమయంలో పూర్తి కావడానికి కొంత ఆరోగ్యకరమైన ఒత్తిడి, మనసునిండా కాంక్ష అవసరమనే పాఠాన్ని నేర్పిందంటారు కలాం. అంతేకాకుండా ప్రతిమనిషి యజమానిగా మాత్రమే కాకుండా పనివాడిగా కూడా పనిచేయగలిగినపుడే విజయవంతమైన ఫలితాలు వస్తాయని తాను నేర్చుకున్న జీవితపాఠం అంటారాయన. స్కాలర్‌షిప్ ఆపేస్తానని టీచర్ అంటే ఎంతమంది ఇలాంటి పాఠాలు నేర్చుకుంటారు?

కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్
వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా కలహేనచా

బుద్ధిమంతుడు శాస్త్ర విజ్ఞాన విషయాలను అధ్యయనం చేస్తూ స్వానుభవంతో ప్రావీణ్యత సాధిస్తాడు.
మూర్ఖులు వ్యసనాలు, నిద్ర, కలహాలతో కాలం వెళ్లదీస్తారు.
గొప్పవారిని చూసినా, వారి గురించి విన్నా మనకు కూడా వారిలా పేరు ప్రఖ్యాతులు వస్తే బాగుండుననిపిస్తుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో, అసాధారణ సమస్యలు వచ్చినపుడు మనోనిబ్బరం కోల్పోకుండా వివేకం, సహనం, సూక్ష్మ గ్రాహ్యత, లోకజ్ఞానం ఉపయోగించి వారు ప్రతిస్పందించే తీరు వారినడక, నడత, నైపుణ్యాలను మనకు చెప్పడమే కాకుండా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గుర్తు చేస్తుంది.

కాలేజీ చదువుల కోసం ట్యూషన్లు చెప్పి, స్వశక్తితో కొంతస్థాయికి ఎదిగి తర్వాత మైసూరు సంస్థానం వారి సాయంతో సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రథమస్థానాన్ని సాధించి.. మొదటి ఉద్యోగంలోనే సింధునది నీటిని సుక్కూరు పట్టణానికి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడ పనిచేసినా తనదైన ముద్రను వేసేవారు. మహానది డ్యామ్ నుంచి వరదనీరు వృథాగా పోతుందని దాన్ని వాడుకోవడానికి ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లు తయారు చేశారు. మూసీనది వరదల్లో విలవిలలాడిన హైదరాబాద్‌ను హైదరాబాద్ చీఫ్ ఇంజనీరుగా డ్యామ్‌లు, బండ్‌లు, పార్కులు కట్టి సురక్షితంగా, సుందరంగానూ మలిచారు. కర్ణాటకలో కృష్ణరాజసాగర్ డ్యామ్‌ను నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. ైమైసూరు దివానుగా తనను నియమించినపుడు బంధువులందరినీ భోజనానికి పిలిచి, తన పదవి ద్వారా వారు ఎటువంటి స్వలాభాలనూ ఆశించనంటేనే ఆ పదవి చేపడతానని వారి దగ్గర మాట తీసుకునే వరకు పదవి చేపట్టలేదు. కానీ ఏ బంధువుకు ఏ అవసరం వచ్చినా తన జీతంలో నుంచి ఇచ్చేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే

"To give real service you must add something which cannot be bought or measured with money''
‘‘డబ్బుతో కొనలేనిది, వెలకట్టలేనిది ఏదైనా జోడించగలిగితేనే మనం నిజంగా సేవచేసినట్లు’’ 

అంత మహానుభావుడు కాబట్టే ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ‘ఇంజనీర్‌‌స డే’గా జరుపుకుంటాం. ఆయన జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన నేర్పు, నమ్రత ఉన్నవారికి ఎన్ని నాయకత్వ పాఠాలు.

అభివాదస్య శీలస్య నిత్యం వృద్ధో పసేవిన:
చత్వారి తస్య వర్ధన్త ఆయు: ప్రజ్ఞా యశో బలం
ఎవరైతే విజ్ఞులు, మహానుభావుల పట్ల వినమ్రతతో, భక్తిభావంతో ఉంటారో వారి ఆయువు, వివేకం, యశస్సు, బలం వృద్ధి చెందుతాయి.

ఒక ప్రముఖ కంపెనీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఎంపికైన విద్యార్థులకు ఇలా ఉత్తరం రాసింది.‘‘మీలో చాలామంది డిగ్రీ పూర్తి చేస్తున్నందుకు, మొదటి ఉద్యోగంలో చేరుతున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా భావిస్తుంటారు. మీకు రాబోయే జీతాల గురించి, పదవుల గురించి చర్చించుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం మీరు పంపిన బయోడేటాలు చూస్తూ మీ నాణ్యత, మీ నైపుణ్యం, మీ ఉత్పాదకత, మీ విశ్వసనీయత ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతూ రాస్తున్నాం. కానీ మీకు చెప్పకపోతే మీ తరం, మీ తర్వాతి తరం కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకోక నాణ్యతా ప్రమాణాలను తగ్గించి వేస్తాయనే ఆందోళనతో రాస్తున్నాం.

మీరు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలం, రాయగలం అని బయోడేటాలో రాస్తారు. కానీ సగానికిపైగా బయోడేటాల్లో ఇంగ్లిష్ తప్పుల తడకలు. ప్రపంచస్థాయిలో పనిచేయడానికి అవసరమైన భాషలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం లేదా? ఆలోచించండి?

సమస్యా పరిష్కార నైపుణ్యం పుష్కలంగా ఉందని రాస్తారు. ఇంతకుముందు మీ సీనియర్లు కూడా ఇలాగే రాశారు. ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా నిబ్బరంగా పరిష్కారం ఆలోచించకుండా వెంటనే ఏం చేయాలని అడుగుతారు. మీస్థాయి సమస్య మీరు పరిష్కరించలేకపోతే మీరు మీ సంస్థలో ఆత్మవిశ్వాసంతో ఎలా పని చేయగలరు? ఇప్పటినుంచైనా ఈ అలవాటు చేసుకుంటారని ఆశించవచ్చా?

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త మెళకువలు నేర్చుకుంటామని మాట ఇచ్చి బాధ్యతలు చేపడతారు. విధుల్లో చేరిన తర్వాత నేర్చుకోవడమే మానేస్తున్నారు. నైపుణ్యాన్ని మెరుగుపరచుకోకుండా మెరుగైన జీతం ఇవడం ఎలా సాధ్యం?

సంస్థ పట్ల పూర్తి నిబద్ధతతో సంస్థ పురోభివృద్ధికి తోడ్పతామని చెబుతారు. కానీ కాస్త మెరుగైన జీతం ఎవరైనా ఇస్తానంటే అవకాశం వచ్చిన వెంటనే సంస్థను వదిలి వెళ్లిపోతారు. మేము మిమ్మల్ని అర్ధంతరంగా సంస్థ నుంచి బయటకు పంపితే మీరు ఎంత బాధపడతారో అవసరమైన సమయంలో మీరు సంస్థను వదిలేస్తే ఆ సంస్థకు ఎంత కష్టమౌతుందో ఆలోచించారా? మీ విశ్వసనీయతను ఎలా విశ్వసించడం?

మీకు వ్యక్తిగత అవసరం ఉన్నపుడు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చినా ఏమీ అనకూడదని మీరు అనుకోవడం తప్పుకాదు. కానీ సంస్థకు అవసరమైనపుడు సహజమైన ఇష్టంతో మీరు సంస్థ సమస్యను పరిష్కరించడంలో తోడ్పడాలని ఆశించడం అత్యాశా?

మీ కెరీర్ ఆరంభం-అంతం కూడా మీ చేతిలోనే ఉంది. ఒక మీరు వీలైనంత నైపుణ్యం, సామర్థ్యం పెంచుకుని మీకు, మీ కుటుంబానికీ, మీ సంస్థకూ, దేశానికీ ఒక తరగని ఆస్తిగా మారాలని - ఒక బాధ్యతాయుతమైన కంపెనీగా మా ఆకాంక్ష. భాషా నైపుణ్యం, జ్ఞాన తృష్ణ, స్వవివేకం, విలువలతో కూడిన భాగస్వామ్యం, Professionalism - ఇవి మీ ఎదుగుదలకు, మీ ద్వారా మా ఎదుగుదలకు మెట్లు/పునాదులు.

నిజాయితీతో ఆత్మావలోకనం చేసుకుని, సుహృద్భావంతో అర్థం చేసుకుని సహకరిస్తూ సంస్థలో శాశ్వత భాగస్వాములవుతారని ఆశించవచ్చా?

ఈ ఉత్తరం మనందరికీ ఏదో ఒక విషయంలో వర్తిస్తుంది. మరి వారు పేర్కొన్న ప్రొఫెషనలిజం అంటే ఏమిటి?
తండ్రి లేని ఐదేళ్ల మహదేవ అనే చిన్న కుర్రవాడిని.. అతని తల్లి ఏదో ఒక పనిచేస్తూ పోషించేది. అనారోగ్యంతో చనిపోయిన తన తలి అంత్యక్రియలు అనాథలా జరిగాయిని భావించి తన తల్లిలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని భావించి... ఎవరూ లేనివారికి తనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసేవాడు. ఇప్పటి
వరకూ దాదాపు 45 వేల మందికి అలా శ్రద్ధగా అంత్యక్రియలు చేశాడు. ఇంకా చేస్తున్నాడు. అతను మృతదేహాలను ఏదైనా నదిలో పారేసినా అడిగేవారు లేరు. కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకుండా తను నిర్ధారించుకున్న ప్రక్రియ ప్రకారం అంకితభావంతో పని పూర్తి చేసేవాడు. మరి జీతం తీసుకుంటూ మన పని మనం చేయడానికే 10 సార్లు చెప్పించుకుని, పర్యవేక్షకుడితో తిట్లు తిని, ఆ భయంతో పనిపూర్తి చేసే మనలో ప్రొఫెషనలిజం ఉందా? లేదా? ప్రశ్నించేవారు, పర్యవేక్షణ లేకున్నా పూర్తి నిబద్ధతతో మహదేవ చేసేపనిలో ప్రొఫెషనలిజం ఉందా? అనేది ప్రతి రంగంలో తమని తాము ప్రొఫెషనల్ అని పిలుచుకునే ప్రతివారూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన వాస్తవ ఉదాహరణ. ప్రొఫెషనలిజం అంటే డిగ్రీలు, కోర్సులు, దుస్తులు, వాహనాలు, ఐడెంటిటీ కార్‌‌డ్స.... ఇవేనా? లేదా పర్యవేక్షణ ఉన్నా లేకున్నా తన పనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడమా? కంపెనీవారు రాసిన ఉత్తరం, మహాదేవ ఉదాహరణ కింది సుభాషితాన్ని గుర్తుకు తెస్తాయి.

గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనమ్
విక్రయన్తే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః
నాకీ గుణాలున్నాయని చెప్పడం కంటే ఆ గుణాలు అలవర్చుకోవడం అత్యవసరం.
మెడలో గంటకట్టినంత మాత్రాన పాలివ్వని ఆవును మభ్యపెట్టి అమ్మినా.. వాస్తవం తెలిసి వదిలివేస్తారు.

ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ తన పరిశోధనల సారాన్నంతా చక్కని సొంపైన భాషలో, ఒక చదివింపచేసే శైలిలో వ్యాసాలు రాసేవారు. క్లాసిక్స్‌తోపాటు ఆంగ్ల కవులైన టి.ఎస్.ఇలియట్, షేక్‌స్పియర్, హెమింగ్‌వే లాంటి ప్రముఖ రచయితల రచనలు చదువుతున్నప్పుడు, తన పరిశోధనల సారాన్ని వారిలాగా చదివింపచేసేలా, ఆనందింప చేసేలా ఎందుకుండకూడదని ఒక విలక్షణశైలిలో రాసేవారు. ఇది శాస్త్ర సాంకేతిక పరిశోధనా వ్యాసాల్లో బహు అరుదు. అందుకే అంత గొప్పవాడయ్యారు చంద్రశేఖర్. ఆయన ఏం చేసినా పరిపూర్ణత్వం, కళాత్మకత, సౌందర్యాభిలాష నిండుగా కనిపించేవి. ""Science is not only a way of making discoveries but a way of life'' సత్యం సౌందర్యం వీటిని విడదీయలేమని సైన్సుని ప్రోత్సహించి, కళని విస్మరించలేమనీ, సైన్సులో అవసరమయ్యే క్రమశిక్షణ, పట్టుదల, హేతుబద్ధత, దృక్పథం లాంటివి పాటిస్తూనే సంగీతం, కళలు, సాహిత్యంలో కూడా అభిరుచిని కలిగిఉండి పరిపూర్ణ మానవ నిపుణుడిగా వికసించడం ప్రతి విద్యార్థికి అవసరం. ఈ సమతుల్యత, సమన్వయం ఈనాటి యాంత్రిక జీవన గమనానికి పరిష్కారమేమైనా చూపిస్తుందేమో.

ఒక వ్యక్తి విద్యాపరంగా/ కెరీర్ పరంగా ఉన్నతస్థానానికి ఎదగడానికి అతని పట్టుదల, పరిశ్రమ, పనితనంతోపాటు కుటుంబంలో అందరూ లేదా వీలైనంతమంది తమతమ స్థాయిలో వీలైనంత త్యాగాలు చేస్తారు. ఆ ఫలితం సామూహికంగా కుటుంబ సభ్యులందరిదీ. మూలాలు మరిచిన వారినీ, అసూయాపరులను, అహంకారులను, అజాగ్రత్తపరులనూ ప్రకృతి ప్రోత్సహించదు. యక్ష ప్రశ్నలలో ధర్మరాజు - సుఖానికి ఆధారమైనది ఏది అని యక్షుడడిగితే ‘శీలం’ అంటాడు. సంపద అనలేదు. సుఖాల్లో గొప్పది ఏది అనడిగితే సంతోషం అన్నాడు. ఎవరు సంతోషంగా ఉంటాడు అనడిగితే యాచించకుండా తనకున్న దానిని తనవారందరితో ఆనందంగా పంచుకుని తృప్తి చెందేవాడు అని సమాధానమిస్తాడు. అందువల్ల ఉన్నతికి కారణమైన వారందరిపట్లా జీవితాంతం కృతజ్ఞతాభావంతో ఉండటమే వారికి మనం ఇచ్చే మర్యాద.

ఈ సందర్భంలో మార్టిన్ లూథర్ కింగ్ తను నోబెల్ ప్రైజ్ అందుకుంటూ అన్నమాటలు. ""we should be grateful not only to known pilots but also unknown ground crew'' విమానం ఎగురుతుందంటే అందరూ నడుపుతున్న పైలట్‌ను చూస్తారు కానీ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌స్టాఫ్ పగలూ, రాత్రీ శ్రమించి విమానాన్ని ఎగరడానికి సమానంగా తోడ్పడతారని ఆలోచించరు. ఎందుకంటే వారు ముఖ్యాంశాల్లో ఉండరు. కానీ పైలట్ విజ్ఞడయితే వారి శ్రమను గుర్తుంచుకొని వారిని మనసునిండా ఉంచుకోవాలి. ఉన్నతస్థితికి ఎదిగినా తన ప్రాథమిక సూత్రాలను మరవకూడదు. ఢిల్లీ మెట్రోను, కొంకణ్ రైల్వేను అనుకున్న దానికంటే ముందే పూర్తిచేసిన కర్మయోగి శ్రీధరన్ ఇప్పటికీ తెల్లవారుజామునే నిద్రలేస్తారు. ధ్యానం, భగవద్గీతా పఠనానికి రెండు గంటలు కేటాయిస్తారు. పని సమయంలో పూర్తిగా పని, విశ్రాంతి సమయంలో పూర్తిగా విశ్రాంతి, ఆహార సమయానికి ఆహారం లేకపోతే రెండు అరటిపండ్లతో ఆకలి తీర్చుకోవడం, సాధారణ జీవనశైలినే అనుసరించడం అందరికీ ఆచరణీయం. ఎందుకంటే..

ఆచారాల్లభతేః ఆయుః ఆచారా దీప్సితాః ప్రజా
ఆచారాద్ధనమక్షయ్యమ్ ఆచారోహన్త్యలక్షణమ్

మంచి శీలం, నడవడిక ఉంటే ఆయుర్వృద్ధి, సత్సంతానం, తరగని సంపద, (కీర్తి), లభించడమే కాకుండా ఏవైనా చిన్నలోపాలుంటే నశించిపోతాయి. Rudyard kipling మాటల్లో చెప్పాలంటే...

If you can talk with crowds and keep your virtue or walk with the kings - nor loose the common touch yours is the earth and everything that's in it and which is more- you will be a man my son.

జన సందోహంలో ఉంటూ కూడా తన విశిష్ట గుణాలను కోల్పోనివాడు, గొప్పవారితో తిరుగుతూ కూడా తన సామాన్య, సాధారణ ప్రవృత్తిని కోల్పోనివాడు అసలైన మనిషి. 
అందుకే
నచ్చిన పనిని చేపడదాం
చేపట్టిన పని పనిబడదాం
ఎందుకంటే ధర్మరాజు చెప్పినట్లు
(యక్ష ప్రశ్నలకు సమాధానమిస్తూ)

ధాన్యానాముత్తమం దాక్ష్యంగొప్పతనాల అన్నింటిలోనూ
ఉత్తమమైన గొప్పదనం.. చేపట్టిన పనిలో నేర్పరితనమే.