బాల కనక మయ చేల - అర్ధ విశేషాలు
ఏల నీ దయ రాదు కీర్తన అను పల్లవి
పల్లవి.---ఏల నీ దయ రాదు పరాకు చేసే వేళ సమయము గాదు (ఏల)
అ.ప.---బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమా లోల విధృత శర
జాల శుభద కరుణాల వాల ఘన నీల నవ్య వనమాలికాభరణ (ఏల)
1. చరణము.-- రారా దేవాధి దేవ రారా మహాను భావా రారా రాజీవనేత్ర రఘు వర పుత్ర
సార తర సుధారస పూర హృదయ పరివార జలధి గంభీర దనుజ సం
హార దశరధ కుమార బుద జన విహార సకల శృతి సార నాదుపై (ఏల)
2. రాజాధి రాజ ముని పూజిత పద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య
రాజ ధర నుత విరాజ ఉరగ సురరాజ వందిత పదాజ జనకదీన
రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజముఖ (ఏలా)
3. యాగ రక్షణ పరమ భాగ వతార్చిత యోగీంద్ర సుహృద్భావిత ఆద్యాంత రహిత
నాగ శయన వర నాగ వరద పన్నగ సు మధుర సదాఘ మోచన
సదాగ తిజ ధృతి పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగ రాజ నుత (ఏలా)
ఈ కీర్తన త్యాగరాజు గారిచే కృతి పరచబడినది....
ఈ కీర్తన పల్లవి కన్నా అను పల్లవి ప్రసిద్ధి చెందినది...
ఈ కీర్తన పూర్తిగా తెలుగు పదాలతో వుండి దీర్ఘ సమాసాలు, సంధులు అలంకారాలతో వున్ననూ...
ఎంతో హృద్యంగా ప్రతి పదం... శ్రీరామ వైభవం మనకు తెలియచేస్తుంది...
అసలు పల్లవి చూడండి...
"ఏల నీ దయరాదు పరాకు చేసే వేళ సమయం కాదు"....
ఈ కీర్తన నిర్మాణం...పల్లవి, అనుపల్లవి,3 చరణాలు కల కీర్తన...
ఇది ఆఠాన రాగం, ఆది తాళం లో స్వరపరచబడినది....
మనం నిత్య జీవితంలో కొన్ని విషయాలు సగం నుంచి గ్రహించ వలసి వస్తుంది...అతను వచ్చినాడా??? ఆమే ఏమన్నది??? ఈ అతను ,ఆమే ఎవరు అనే ప్రశ్న మనకు ఉత్పన్నమై...వారు ఎవరు అని మనం ప్రశ్నించితే మనకు దానికి సంబంధించిన వివరాలు
లభించుతాయి...
అలాగే త్యాగరాజు గారు...పల్లవిలో "ఏల నీ దయ రాదు..పరాకు చేసే వేళ సమయం కాదు'...ఇందులో ఒక అర్ధింపు తో కూడిన వేడుకోలు...దానితో పాటు "పరాకు చేసే వేళ సమయం" ఇదికాదు అనే ఓ చిన్న పాటి సూచన...
"పరాకు" అనే పదానికి నిఘంటువు అర్ధం పరధ్యానం, ఏకాగ్రత లేకపోవటం... అయితే వాడుకలో ఈవిధంగా వుంటుంది ... తనుచేయవలసిన కార్యం ను ఏమరుపాటున నిర్వర్తించ లేకపోవడం పరాకుగా వాడుక...
అలాగే సూచన ఏమిటంటే" వేళ సమయం కాదు...."
సహజంగా వేళ, సమయం ఈ రెండు పదాలు కాల గమనం ...దిన ప్రమాణం కి సూచన చేస్తాం...
కాని ఇక్కడ వేళ అన్న పదం తరుణం అన్న అర్ధంలో వాడినారు...
ఇప్పుడు అసలే ఇంగ్లీష్ మీడియం .... తరుణం అంటే....
తరుణం అంటే తగు సమయం...
మనం కీర్తన పల్లవి వరకు వింటే ఈయన ఎవరిని వేడుకుంటున్నారో తెలియక చిన్నపాటి సందిగ్ధం లో వుంటే... త్యాగరాజు గారే...వారు ఎవరో మనకు వివరంగా
చక్కగా అనుపల్లవిలో వివరిస్తున్నారు....
అను పల్లవి:
"బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీరమ లోల విధృత శరజాల
శుభద కరుణాలవాల ఘన నీల నవ్య వనమాలికాభరణ " || ఏల నీదయరాదు||
ఇది అను పల్లవి....
ఇంత చక్కటి అనుపల్లవి మీరు శ్రోత గా వినగానే , త్యాగరాజు గారు అర్ధిస్తున్న వారిపై కొంత ఉత్సుకత, ఇంకొంత ఉత్సాహం మరింతగా ఆథ్యాత్మిక భావం జనించుతుంది...
ఇంతకు త్యాగరాజు వేడుకుంటున్న వారి గుణగణాలు ఆసక్తిగా ప్రారంభం...
"బాల కనక మయ చేల..."
ఇందులో బాల పదంను చాలామంది...
శ్రీరాములవారిని బాలుడిగా ఊహిస్తారు... నా అభిప్రాయం ప్రకారం అది కాదు...
ఇందులో బాల కనక పదం సీతమ్మ తల్లిని ఉద్దేశించి...
ఇందులో కనక అనే పదం బహు కీలకం... దీనిని ఈ విధంగా అర్ధం చేసుకుంటే దీనిలో మర్మం బోధ పడుతుంది... కనక పదం రెండు పదాల మధ్య వారధి అనుకుంటాం కాదు...
బాల కనక వరకు మొదటి భావం....
కనక మయ చేల అనేది రెండోవ భావం మనం మొదటి భావం తెలుసు కుందాము...
బాల కనక...అంటే బంగారం లాంటి స్త్రీ...
అనగా రూపమా గుణమా....
అది సీతమ్మ కాబట్టి రూపం కాదు గుణమే....
అయిననూ సర్వగుణలక్షణ శోభిత మైన స్త్రీ ని మనం ఈనాటి కి... బంగారం లాంటి స్త్రీ అని వాడుక...
అందునా సీతమ్మ వారు లక్ష్మీ అంశ...
కనక అంటే కూడా లక్ష్మీ అనే కదా మనం నిత్యం వాడుకలో అనుకునేది..
అయిననూ సీతమ్మతో కీర్తన ప్రారంభం అంటే....
ఇదో మాతృభావన...మనం మన గృహం తలచుకోగానే ఎవరు తలంపుకి వస్తారు అంటే ప్రధమంగా అమ్మ..తరువాత నాన్న...
అలాగే బాల అనే పదానికి ఇంకోక విశేషం తెలుసుకుందాం..
అమ్మ వారి అనేక రూపాలలో బాల రూపం ఒకటి...
అమ్మ అంటే శక్తి, అమ్మ అంటే ఆదరణ, ఆప్యాయత, ప్రేమ ...సకలం అనుగ్రహించు దివ్యశక్తి...
అమ్మ అతి స్వల్ప మైన వాటితో కూడా అత్యద్భుతంగా సృజన చేయి శక్తి...
అమ్మ అల్ప సంతోషి...బిడ్డడి ఆనందం తన ఆనందంగా భావన చేయి ఎకైక వ్యక్తి అమ్మ మాత్రమే...
తన బిడ్డడి ఆర్తీ అమ్మకి తప్ప మరి ఎవరికి తెలుస్తుంది...
మరి ఇంతటి చల్లని తల్లితో వున్నవారు ఎలావున్నారు అంటే...కనక మయ చేల..
కనక అంటే బంగారం ...మయ అంటే నిర్మితి, నిండి వుండుట, అలదు కోవటం...చేల అనగా వస్త్రాలు....
బంగారు వస్త్రాలు ధరించి వున్నారట....
మరి ఇవి అన్నీ రాజ లాంఛనాలు సూచన చేస్తున్నాయి...మరి ఈయన ఎవరిని పాలన చేస్తున్నారు అంటే సుజన పరిపాల అంట...
సుజనులు అనగా మంచి వారు అని గ్రహించాలి...
మరి ఆయన ఎలాంటి వారు అంటే ....శ్రీరమాలోల అనే పదంతో సూచన...
శ్రీ అన్ననూ లక్ష్మీ.....
రమా అన్ననూ లక్ష్మీ నే....
మామూలు అర్ధం చూస్తే లక్ష్మీ దేవికి వశ్యుడు అనే విధంగా కనపడుతుంది...
కాని అది కాదు...
శ్రీ అంటే స్థిరనివాసం...
రెండోవ పదం అయిన రమ కు లక్ష్మీ అనే భావానికి సకల శుభలక్షణాలు శుభ గుణాలు అనే విధంగాను అష్టలక్ష్మీలు ఆవాసం అని మనం భావన చేయాలి...
త్యాగరాజు గారు ప్రతి పదం ఆచి తూచి స్వరయుక్తంగా రాగయుక్తంగా వుండేలా చూసి ప్రయోగించారు...
మనం ఉచ్ఛారణ లో కూడా అది గ్రహించాలి...
శ్రీరమాలోల అన్న పదం మనం స్త్రీ లోల అని ఉచ్ఛారణ చేశామా పూర్తి విరుద్ధంగా వుండే అర్ధం వస్తుంది...
ఇక్కడ త్యాగరాజు గారు అర్ధి అని మనం గుర్తించాలి....
ఎవరైనా ఆర్ధి తనకు సహాయం కావలసి వచ్చిన, దానిని పూర్తి చేయగల శక్తిమంతుల వద్ద వేడుకుంటాడు....
.మరి త్యాగరాజు ఆర్ధిగా తన వేడుకోలు ను ఎవరు నిర్వర్తన చేయగలరు అంటే శ్రీరమాలోల అన్నపదం ద్వారా మనకు తెలియచేస్తున్నారు.
మరి త్యాగరాజు కోరినది ఏమిటి అంటే కైవల్యసిద్ధి....
ఇప్పుడు మీకు పూర్తిగా శ్రీరమాలోల అన్న పదంనకు విస్తృత అర్ధం ఆపై శ్రీరాములు వారు సకలశుభ సమన్వితుడుగాతో పాటు వాటిని ప్రసాదించగల వేలుపు గా దర్శనం..
దీని తరువాత పదం ....
విధృత శరజాల.....
ధృతి అనే సంస్కృత పదానికి శౌర్యం, వీరత్వం అనే అర్ధాలు వున్నాయి...ఈ పదంకు "వి " అనే ప్రత్యయం చేరి ...విధృత అనగా విశేషమైన శౌర్యం...అసమాన పరాక్రమం...
రాజుయొక్క క్షాత్రం అతని సైనిక పాటవంలో అతని ఆయుధ నైపుణ్యం లో అతని ప్రవర్తన లో దృగ్గోచరం అవుతుంది...
రాముని యొక్క ఆయుధం...కోదండం...
దాని నుంచి శర ప్రయోగం...
ప్రయోగ శర లక్షణం సూటిగా నేరుగా
లక్ష్య ఛేదన....
విల్లు యొక్క నారి ఎంత విస్తృతంగా సారించి లక్ష్యం వైపుగా గురి పెట్టి శర ప్రయోగం చేస్తారో అంత శక్తివంతంగా లక్ష్య ఛేదన జరుగుతుంది.
ఇది వీరత్వం యొక్క లక్షణమైతే...ప్రవర్తన కు ఈ విధంగా అన్వయించుకోవాలి....రాముని ప్రవర్తన సూటిగా స్పష్టంగా వున్నదట....
ఇప్పుడు మన పాఠకులకు ఒక సందేహం...ఇంత గొప్ప క్షాత్రం వున్న శ్రీరాముడు మన మాట...మన మొర ఆలకించుతాడా అంటే....దానికి వెంటనే త్యాగరాజు గారు ప్రయోగించిన పదం...
శుభద కరుణాలవాల....
మనకు కొన్ని సమయాలలో కొన్ని భరోసాలు కావాలి.... కోర్టు వారు మన మొర వినటం ఒక విధమైన భరోసా...
అలాగే ఆపద సమయంలో మన తాలుకా ఇబ్బంది వినే వారు మనకు భరోసా... ఇలా వినాలి అంటే వారి హృదయము ఆర్ద్రత తో నిండి వుండాలి అప్పుడే కరుణ , దయలాంటి లక్షణాలు కలిగి వుంటాయి...
మరి అందుకే శ్రీరామ చంద్రుడు శుభద
కరుణాలవాల అని త్యాగరాజు గారు తెలుపుతున్నారు...
మరి ఇంతటి మూర్తి సాదృశ్యుడా లేక అదృశ్యుడా లేక మార్పు చెందుతాడా అంటే....
తరువాత పదం "ఘన నీల"
రెండు భిన్నమైన పద ప్రయోగాలతో
విలక్షణమైన అర్ధ సౌందర్యం...
ఘన అన్న పదానికి గొప్పదైన, స్థిరమైన, కీర్తీవంతమైన అన్న అర్ధాలు వున్నవి...
అలాగే నీల అనే పదానికి నీలం, గరళం, జలం లాంటీ అర్ధాలు వున్ననూ ప్రస్తుతం మనం నీల వర్ణం అన్న విషయం తెలుసుకుందాం..... అలాగే శ్రీరామ విషయంలో ఘన అనే పదానికి అనేకానేక విశేషణాలు వున్నవి.... శ్రీరామ చంద్రుడు వంశ పూర్వీకులు రఘవంశీకులు గా ప్రసిద్ది.... అలాగే శ్రీరామ నిర్ణయం, వాక్కు స్థిరము....
నీల అనగా శ్రీరాముల వారిని మేఘ శ్యామ అనే విధంగా పోల్చుతారు...
మేఘం ఆకాశం లో వుండి మనకు నీల వర్ణంగా కనపడుతుంది...
ఆకాశం అనేది సర్వ ప్రాణికోటికి అవకాశం ఇస్తుంది... అలాగే జీవకోటి మనుగడకు ముఖ్యమైన జలం ప్రసాదిస్తుంది...
కనుక సకల ప్రాణికోటికి శ్రీరాముల వారు ఆకాశ సదృశ్యులు....
దీని తరువాత పదం...
నవ్య వనమాలికభరణ....
వివిధ మైన అందమైన పూలమాల ధరించిన....
ఇది అనుపల్లవి వరకు విశేషార్ధం....
పూర్తి చరణాలకి అర్ధ విశేషాలు తెలుపుదామని వున్ననూ సమయ భావం వలన అవకాశం లేదు...
అయిననూ శ్రీరామ కరుణ, ఆజ్ఞ అయితే మహాప్రసాదం....
అంత వరకూ కొంత విరామం...
సర్వులకు సకలం శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, విమర్శలు , సందేహాలుకి...
ఆలపాటి రమేష్ బాబు..
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
9440172262.