17, నవంబర్ 2023, శుక్రవారం

మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి

నువిద చెంగటనుండ నొప్పువాఁడు,

చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,

వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,

నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,

పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు,

వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’

++++

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.

పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.

కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....

నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...

ఇలా చాలా చాలా మధన పడినారు..

ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...

గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...

ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.

సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .

పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.

పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా

భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....

ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..

"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"

ఇది మొదటి పాదం అర్ధం...

మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...

కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...

సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...

మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...

తరువాత పాదం..

'చంద్రమండల సుధా సారంబు '

చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు

అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....

తరువాత పాదం...

"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"

తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.

అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.

తరువాత పాదం...

" నీలనగాగ్ర సన్నిహిత భానుని"

శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది

ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.

"పుండరీక యుగం బోలు కన్నుల వాడు"

పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.

తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.

సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.

అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.

అది భక్త సులభుడు అనే కోణంలో.

మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.

తరువాత పాదం...

"వెడద యురము వాడు, విపుల భద్ర

మూర్తి వాడు..."

విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...

విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...

ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...

విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...

విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.

కాని మనం ఇచ్చట....

మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...

మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి

జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.

తరువాత పాదం...

"రాజముఖ్యుండోకరు

డదే కనుగవకు ఎదురు కానబడియే"

అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...

మరి అంతరార్ధం ఏమిటో....

రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...

మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.

కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....

అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...

"కను గవకు ఎదురు కాని బడియే"

ఇందులో విశేషం కను గవ....

అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...

కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.

'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'

అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.

కిటికి కి మరో పేరు గవాక్షం....

మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...

ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.

అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...

అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...

గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...

మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....

ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...

పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....

రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.

అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....

పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.

కారణం త్రేతా యుగం నాటి రాముడు,

కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.

అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....

ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....

రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"

తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....

మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.

అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...

ఇక దూషణలు అన్నీయునూ నావే...

మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...

ఆలపాటి రమేష్ బాబు

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ...

94401 72262.

తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.

1 కామెంట్‌:

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.