17, నవంబర్ 2023, శుక్రవారం

పలికేడిది భాగవతం అర్ధ విశేషాలు...

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ పద్యం చాలా ప్రాముఖ్యత కలది...

చాలా చాలా సందర్భాల్లో ఈ పద్య ప్రస్తావన చేశారు.

ఎందుకంటే....ఈ పద్య రచనా చమత్కారం అటువంటిది....

పోతన వంటి భక్తి విశ్వాసాలు గల వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం.

సహజంగా మానవులు.... ఏ విషయం ప్రస్తావనకు తెచ్చిననూ ప్రధమ పురుషులో చెపుతారు... అనగా నేను చేశాను నా వలన జరిగినది...అని స్వ కేంద్రం గా ప్రస్తావన చేస్తారు...

కాని పోతన గారు ఉత్తమ పురుష తో చెపుతున్నారు.... అనగా వారు తెలిపారు వారు చేయించారు...వారు లేనిదే నేను లేను అనే భావం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది...

మనలో చాలామంది ఈ పద్య పఠన విధానం తెలియదు...కాని సహస్రవాధాని మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకానోక అవధాన ప్రక్రియ లో ఈ పద్యం ఎలా చదవాలో తెలిపితే గమనించి ఆశ్చర్యం పొందటం నా వంతు అయిపోయింది...

మొదటి సాధారణంగా అందరు భావన చేసే విధానం లో...

"పలికెడెది భాగవతమట"

గమనించండి ఇక్కడ 'అట'...అనే శబ్ద విశేషం సహజంగా మనం ఏ ఏ సమయాల్లో ఉపయోగం అంటే...

అస్పష్ట విషయ ప్రస్తావన లో ఉపయోగం అనగా.. అక్కడ మనుషులు వున్నారంట, ఆ పని అవుతుందట, ఇలా అనేకానేక అస్పష్ట క్రియా రూపక శబ్ద విశేషం గా వాడతాం..దీనితో వక్త భాధ్యత తీరుతుంది కాని శ్రోత స్థితి నమ్మక అపనమ్మకాల మధ్య త్రిశంకు స్వర్గంలా వుంటుంది...

కాని ఆ విధంగా కాక ఈ టకార శబ్దవిశేషాన్ని SUFFIX గా కాక Prefix గా ప్రయోగించి చూడండి అప్పుడు ఈ విధంగా మారుతుంది అచ్చట మనుషులు వున్నారు, అటులే ఆపని అవుతుంది గా మారుతుంది...

కనుక మీకు పద్య అర్ధ విశేషం తెలిపే ముందు ఈ పద్యం యొక్క పది విచ్ఛేదన, విరామ క్రమం తెలుపుతాను...

పలికెడెది భాగవతం,

అట పలికించేడివాడు రామభద్రుడు,

అట నే పలికిన భవహరమగును,

అట పలికేద వేరోండు గాథ

బలుకగనేలా...

గమనించారా విరామ చిహ్నం మార్పుతో పద్య గమనం మొత్తం మారిపోయి పాఠకుడికి స్పష్టం గా దర్శనం అవుతుంది....

ఇప్పటి వరకు మనం పద్య గమనం తెలుసుకున్నాం ఇప్పుడు అర్ధ విశేషాలు తెలుసుకుందాం...

ఎలాగు నేను మిత్రులకు పద్యానికి ప్రతిపదార్ధ రూపం, వచన అర్ధ రూపం కాకుండా అంతర్గత భావ అర్ధ విశేష విశ్లేషణ విధానం లో ముందుకు వెళుతున్నాం కాబట్టి...

పోతన గారు భాగవతం రాసినది.. కీర్తి, కనకం కోసం కాదు "భవ హరం" .

అదే విషయం అనేక మార్లు ప్రస్తావించారు...మరి దానిపైన ఒక పద్యం రాసినారు " ఇమ్మనుజ రాజేశ్వరులు"...

మరి భవం అంటే....

మానవుడి పుట్టు రోగం...

ఇది సంచిత ప్రారబ్ధం...గత జన్మ కర్మ యావత్తు మోసుకుంటూ వచ్చాం...

మరలా ఈ జన్మ లో చేయి, జరుగు క్రియలు వలన జనించు కర్మ ఫలం ఇక్కడే అనుభవిస్తున్నామా లేదే ఆగామిత కర్మ ఫలం గా వచ్చే జన్మకి మోసుకుని పోతున్నాం...

మరి ఇది పూర్తిగా పరిహారం అయి మోక్ష స్థితి కలగాలి అంటే ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయం చేయాలి...అందుకే రాముడు అని అనకుండా రాముభద్రుడు అనే పద విశేషం...అనగా రాముడు తగిన వాడు, భద్రమైన వాడు, నమ్మ తగిన వాడు...రామ ఆశ్రయం, రామ నామ ధ్యానం తో మనం మనయొక్క భవ హరం చేసుకో గలం...

మరి అంతటి రామభద్రడే...

భాగవతం రాయమని స్పష్టం గా తెలుపుతూ...ఇది రామ ఆజ్ఞ, ఇది రాముని పలుకు , ఇది రాముని వాక్కు కనుక భాగవతం రాస్తున్నాను...

వేరే వేరే కధలు, వేరే వారి కధలు నేను పలుకనేల...( ఆ రోజుల్లో వీరి బంధువు అయిన శ్రీనాథుడు కాశీ ఖండం, శృంగార నైషధం వ్రాసి ఖ్యాతిలో వున్నారు )

మరి ఇది ఆయన కోసమా కాదు మన కోసం మన అందరి కోసం...

జననమరణ చక్ర విచ్ఛేదన సుదర్శన చక్రధారి ఈ కోదండ రాముడు అంతటి రాముని పలుకు అయిన భాగవతం మన భవ హరం కూడా అవుతుంది...

ఇది పద్య అర్ధ విశేషం...

(పండితార్ధాలు తెలపాలి అంటే ఇంకను చాలా వున్నాయి...కాని నేటి సమాజ నడవడి కి కొంత లలితంగా తెలిపితే నే బాబోయ్ ఆంటున్నారు)

సకలం సర్వం శ్రీరామ జయం...

సర్వులకు శ్రీరామ జయం...

తమరు చదివి భాగున్నది అని భావన చేస్తే... శ్రీరామ రామ రామ అని ఒకసారి పలకండి...

తప్పులన్నియూనూ నావే....కనుక తమరు తెలియ చేసిన సరిదిద్దుకుంటాను...

మీ

ఆత్మీయ మిత్రడు/ సహోదరుడు

ఆలపాటి రమేష్ బాబు...

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ....

9440172262

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.