4, ఆగస్టు 2020, మంగళవారం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..వివరణ

"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎనుగులు తిన్న వెలగపండు జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం కృష్ణుని తిన్న వెన్న ముద్ద  జీర్ణం ఈ పాపాయి తినే పాల బువ్వ జీర్ణం..."
బహుశా ఈ శ్లోకం తెలియని తెలుగువారు వుండరు. మన ఇండ్లలో పసివారికి పాలబువ్వ తినిపించిన తరువాత తల్లులు పాపాయికి తినిపించిన పాలబువ్వ గిన్నేను దిష్టి తీస్తూ
పై పద్యం చదువుతారు.
హైందవ సాంప్రదాయం లో జాతకర్మలైన షోడశకర్మలలో ఏడవది అన్నప్రాసన.
శిశువు జన్మ లగాయితు మాతృ స్తన్యం తో అతని జీవన అవసరాలు తీరుతాయి. ఆరు నెలల తరువాత శిశువు ఎదుగుదలకు శారీరక పటుత్వానికి స్తన్యం చాలదు. అదియును గాక మహిళ శారీరక నిర్మాణం వలనకాని , నిత్యకృత్యాలైన గృహకృత్యాల వలన కాని , సంసార జీవనం ప్రారంభం వలన కాని ఆమేయందు స్తన్యం లభించటం తగ్గుతుంది. అందువలన శిశువు కు ఘన ఆహరం పెట్టాలి. ఈ విషయం సుశ్రుతుడు కూడా తన గ్రంధాలలో తెలిపియున్నాడు. దీనినే మన వారు వేదోక్తంగా మంత్రబద్ధంగా షోడశ కర్మలలో ఓకటిగా ఆచరిస్తున్నారు. తదాదిగా శిశువుకు తెలికగా జీర్ణం అయ్యే పాల బువ్వ తినిపిస్తారు.
అన్నం ప్రాణ ఆధారం, జీవ ఆధారం. దీనిని ఆశ్రయించి అనేక పాప పుణ్యాలు వుంటాయి.
శిశువు భూవాతావరణం వచ్చిన తదాదిగా ఈ భూప్రపంచంలో వున్న కర్మలు ప్రారంభం అయితే అది స్టేజి ఓకటి అయితే అన్న ప్రాసన నుండి మరో స్టేజి .
ఇది అలావుంటే ఇక మన శ్లోక వివరణకు వస్తే...
అహరం ఆశ్రయించి అనేక సూక్ష్మ జీవులు , ఆహరం పులిసి పాడయిపోయి విషతుల్యం అయి ఓక్కోసారి ప్రాణం మీదకు వస్తాయి. దీనిని సూచిస్తూ రామాయణం లో ఓకధ వున్నది.
వాతాపి , ఇల్వలుడు అనే సోదరులు రాక్షసులు. వీరు అనేక కపట మాయోపాయాలతో ప్రజలను చంపి తింటారు. వీరిలో వాతాపి మేక రూపం ధరిస్తాడు. ఇక ఇల్వలుడు దారిన పోతున్న సాధుజనులను , బుషుల వద్దకు వెళ్ళి అయ్యా ఈ రోజు మాతండ్రిగారి ఆబ్దీకం మీరు భోక్తగా రావాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్ళిన అతిధికి మేక రూపంలో వున్న వాతాపిని వధించి భోజనంగా వడ్డిస్తాడు. అతిధి భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి రా..అని పిలుస్తాడు..దానితో అతిధి కుక్షి చీల్చుకుంటూ వాతాపి వస్తాడు . దీనితో మరణించిన అతిధిని సోదరులు ఇరువురు శుభ్రంగా తినేస్తారు.
వీరి ఈ క్రూర కార్యం వలన ప్రజలు భయవిహ్వలు అయి అగస్త్యమహర్షిని శరణు కోరతారు. సరే అని అభయమిచ్చిన అగస్త్యులవారు వారి అతిధిగా వెళ్లి భోజన కార్యక్రమం అవగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం పలుకు తారు. దీనితో అగస్త్యులవారి మంత్రశక్తికి వాతాపి జీర్ణం అయిపోతాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి రా అని పిలుస్తాడు కాని ఇంకేక్కడ వాతాపి వాడు ఎప్పుడో అగస్త్యులవారి కుక్షిలో జీర్ణం. ఇది కధ కాని పరిశీలిస్తే...సోదరులు ఇద్దరు వైరస్ లు గా ఆహరాన్ని పాడుచేసేవారుగా భావన చేయాలి. ఇక వాతాపి మేక రూపం చూడండి..మేక ఓక్కటే కనపడిన ప్రతి ఆకును మేస్తాయి...ఇది అది అని లేదు ప్రతి ఆకును ఆబగా మేస్తూనే వుంటాయి. అందువలన వాటి జీర్ణవ్యవస్థ సరిగా వుండక మేక విసర్జన పెంటికలుగా గోలిలుగా వుంటుంది.
ఇటువంటి లక్షణాలు శిశువుకూడా వుంటాయి...శిశువు దోగాడుతున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఏది కనపడితే అది ..అతనిని ఆకర్షించిన ప్రతి ఆహర , వస్తు సంచయాలను నోట్లో పెట్టుకుంటాడు దాని వలన అతనికి విరోచనాది లక్షణాలు కలుగుతాయి...అందుకే వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణం అవ్వగా తల్లి తన మాతృహృదయ మమకారంతో తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కలగాలని కోరుకుంటుంది.
ఇక రెండోవ వాక్యం ఏనుగులు తిన్న వెలగుపండు జీర్ణం. సహజంగా ఏనుగు భారి పరిమాణంలో వున్నను దానికి దంతాలు బాహ్యంగా వుండి చమన పద్దతి అనగా నమిలే అవకాశం లేక అన్నీటిని అలా మ్రింగుతాయి . వెలగపండు లోపల గుజ్జు వుంటుంది. దాని చుట్టూ వున్న దాని ఉపరితల భాగం బాగా కఠినంగా వుంటుంది. కాని ఏనుగు పొట్టలోనికి వెళ్ళిన వెలగపండు అక్కడి ఉష్ణోగ్రత కి లోపలి గుజ్జు జీర్ణం అయి విసర్జకంగా పండు పండుగానే వస్తుంది. ఇది  మనకి గమత్తుగా వింతగా వున్నను ఇది వాస్తవం. చూడండి ఏనుగు లక్షణం ఆహరభాగం మాత్రమే స్వీకరించి పిప్పి భాగాన్ని విసర్జిస్తుంది.
కనుక తల్లికి  తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కావాలనే అర్ధం. ఇక ఇంకో అంతరంగీక అర్ధం వున్నది. గజముఖుడు వినాయకుడు అన్న సంగతి తెలిసినదే. మరి వినాయకుని విఘ్నాధిపతిగాను , విద్యలకెల్ల ఒజ్జ అయిన గణాధిప అనే భావంలో కొలుస్తాం. మరి ఇంతటి మహనీయిడి లక్షణం మాతాపితురుల ప్రదక్షిణం భూప్రదక్షిణం అని నమ్మీ విజయం పొంది విఘ్నాధిపత్యం స్వీకరిస్తాడు. కనుక తల్లికి తన బిడ్డ మంచి విషయాలు మంచి జ్ఞానం తల్లితండ్రులపట్ల ప్రేమ , బిడ్డశరిరంలో జీర్ణం అవ్వాలని కోరికతో ఏనుగులు తిన్న వెలగపండు జీర్ణం అంటారు.
ఇక మూడవ వాక్యం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం. గుర్రం అత్యంత వేగంగా పరుగు తీయగల జీవి. అలాగే గుర్రం ఎన్నడూ నేలపై పడుకోదు ...నించునే నిద్రపోతాయి...వాటి శక్తి అనంతం . అందుకే మన మోటారులను కూడా అశ్వశక్తితో పోల్చుతాం. ఇంతటి చలన శక్తికి వాటి కాళ్ళకున్న గిట్టలే కారణం. వీటి వలన కొండలు లాంటి కఠిన ప్రదేశాలలో కూడా పయనం. మరి వీటి ఆహరం గుగ్గిళ్ళు. మరి తల్లి అందుకే తన బిడ్డకు అశ్వం లాంటి శక్తి కోరుతున్నది. ఇది జీవలక్షణం. ఇక దైవరహస్యం పరిశీలించుదాం. హయగ్రీవుడు వైష్ణవసాంప్రదాయంలో సకల విద్యాధిపతి. వీరి తల గుర్రం గా వుంటుంది. తలమాత్రమే గుర్రంగా వుండటం అంటే మన మేధ అంత వేగంగా వుండాలి అని. జ్ఞాన స్వీకరణలో అంత వేగంగాను అంత స్థిరంగా వుండాలని. మన మెదడు అనేక ఆలోచనలు స్వీకరించి శోషణ చేసి తృటిలో మంచి చెడులను మనకు తెలియచెప్పుతుంది. అంటే ఈనాటి అడ్వాన్స్ ప్రోసేసర్ పని అంతా మన మెదడు నిర్వహిస్తుంది. కాబట్టి తల్లి తనబిడ్డ అంత జ్ఞానసంపన్నుడు , వేగ కార్య నిపుణుడు కావాలని గుర్రాలు తినే గుగ్గిళ్ళు జీర్ణం అని పలుకుతుంది.
ఇక నాలుగో వాక్యం కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం. వెన్న ,పెరుగు చిలకగా మజ్జిగ మరియు వెన్న వస్తుంది అన్న విషయం సర్వులకి విదితమే. పాలు కాచి తోడు వేయగా పెరుగు ఏర్పడుతుంది. పాలు తోడు వేయటం వలన ఈష్ట్ గా మారి ..పెరుగు ఏర్పడుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఫెర్మంటేషన్ అంటారు. పెరుగు రుచిగా వున్నను వాత లక్షణం కలది. అందుకే రాత్రి ఆహరంలో పెరుగు నిషిద్ధం. మరి ఈ పెరుగు చిలకగా ఆ ఉష్ణంనకు అందులోవున్న ప్రోటిన్ మరియి శక్తినిచ్చే పదార్థాలు వెన్నగాను . మిగిలిన ద్రవరూపం అంతా మజ్జిగ గాను ఏర్పడుతుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వలనే ఆయన క్రీడా వినోదాలు , రాసలీలలు , లీలామానుషత్వ లక్షణాలు , సర్వులను అతను ఆకర్షించే లక్షణాలు , స్థిరమైన పురుషత్వ లక్షణాలు ఏర్పడుతాయని తల్లి నమ్మకం. అందుకే తన బిడ్డ కూడా కృష్ణుడంత మహనీయుడు కావాలని కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం అని పలికేది. చూశారా మన దేశంలో ప్రతి తల్లి దేవకి , యశోదలే ప్రతి శిశువు చిన్ని క్రిష్ణుడే....
ఇక చివరిదైన పాపాయి తిన్న పాల బువ్వ జీర్ణం.
ఇది మామూలే తన అనురాగతో ప్రేమతో తినిపించే పాల బువ్వ వలన శక్తితో ఆరోగ్యంతో తన బిడ్డ కలకాలం మనుగడ సాగించాలనే ఆకాంక్ష.
చూశారా మీకు ఓ చిన్న శ్లోకం లాగా పద్యపాదం లా కనపడే ఈ నాలుగు వాక్యాలలో మన పూర్వీకులు ఇంత అంతరార్ధం లో  మనకు సాంప్రదాయాలుగా ఆచారాలుగా ఏర్చి కూర్చినారు.
ప్రతి శిశువు కి తల్లి చక్కని ఆరోగ్యవంతమైన ఆహరం అందచేయాలని , వారికి లభించాలని శ్రీరాముని ప్రార్ధిస్తున్నాను.
సకలం సర్వం శ్రీరామ జయం.
చదివి నచ్చినవారు ఓ చిన్న నవ్వు...సందేహం వున్నవారు తెలపండి నివృత్తికై...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.