సామజవరగమన - శంకరాభరణం ఓక పరిశీలన.
మానవమేధో వికాసంలో లలిత కళలు ఓక విభిన్నపరిణామం. లలితకళలలో సంగీతం మరి విశిష్టమైనది. సప్తస్వరాలు స , రి , గ , మ , ప ,ద ,ని. ఈ ఏడు స్వరాల కలయికే అనంతకోటి రాగాలు . ఈ సంగీత శాస్త్రం బహు విస్తారమైనది. ఇందు లయ , శృతి ప్రధాన్యత వహిస్తాయి. ఈ సంగీత సాధనలో మనస్సు కేంద్రీకరించి శృతి ,లయలతో పాటు రాగయుక్త స్వరసహితంగా పాడగలిగినదే సాంప్రదాయ కర్నాటక సంగీతం. మన భారతదేశ సంగీతాన్ని దక్షిణ భారత సాంప్రదాయం కర్నాటక సంగీతంగా , ఉత్తర భారత సాంప్రదాయం హిందుస్తాని సంగీతంగా ప్రాధమికంగా విభజించారు. మరలా ప్రాంతాలని అనుసరించి మత పరంగా జరిగే కార్యక్రమాలను అనుసరించి అనేక విభజనలు. మరలా ఇందులో గాత్ర సంగీతం వాయిద్య సంగీతం అనే విభజనలు....
ఇలా మీకు కూలంకషగా వివరించాలని వున్నా ప్రస్తుత అంశంనకు అణుగుణంగా వివరించవలసి వున్నందున విస్తారభీతిచే ఇంతవరకూ చాలు...ఇక అంశం పరిధిలోకి వద్దాం......
మన దక్షిణ భారత సంగీతంలో విశిష్టమైనది త్యాగరాజకీర్తనలు. త్యాగరాజుగారు ప్రస్తుత తమిళనాడు లోని తిరువైయ్యారులో జన్మించిన అచంచల రామభక్తుడు. ఆయన రాముని పరంగా ఏన్నో వేల కీర్తనలను సృజించారు....
అందులో ఓక కీర్తన సామజవరగమన....
సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :
హిందోళరాగం , ఆది తాళం...
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥
ప్రతి పదార్ధం :
సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా
సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా
కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా
సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ
గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ
మాంపాలయ – నన్ను పాలించు
వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన
సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా
స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా
మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;
త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా
అర్ధం:
ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..
సామావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మమ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..
ఇది భక్తి పరంగా...శ్రీకృష్ణుని పరంగా...మన సాంప్రదాయ కీర్తన.....
ఇక శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ప్రాశస్త్యం మనందరికి తెలిసినదే....అదో గర్వించదగ్గ తెలుగు సినిమా...
ఇందులో ఓ సాంప్రదాయ సంగీతకారుని జీవన వైభవాన్ని...కాల మహిమచే సమాజ నిరాదరణ వలన అతని జీవనంలో ఓడిదొడుకులను దర్శకులు విశ్వనాధ్ గారు ఏంతో చక్కగా దృశ్యకావ్యంలా వివరించారు...
శంకరశాస్త్రికి సంగీతం అంటే ప్రాణ సమానం...
ఓక రాగం ఆలాపన చేయాలంటే స్వరసహితంగా ఎక్కడా పొరపాటు పోనివ్వని నైజం...మనకు ఇదే విషయాన్ని శంకరశాస్త్రి తన కుమార్తె కి కృష్ణానదినీటిలో మంచులో గొంతువరకు చిన్న పాపను వుంచి సంగీత సాధన చేయించే దృశ్యం మనకు ఉపమానంగా చూపుతాడు. ఆ పాప సాధనలో ఓక స్వరం తప్పుగా పలకగానే..శంకరశాస్త్రి...ఊ ....అనే హూంకారంతో స్వరంను షరిదిద్దటం కూడా మీరు గమనించవచ్చు...ఈ దృశ్యం చూసిన వారికి శంకరశాస్త్రి శుద్ధ ఛాంధసుడిలాగా...ఫక్తూ సాంప్రదాయవాది లాగా కన పడతాడు...కాని సాంప్రదాయ సంగీత కారుల సాధన వైశిష్ట్యాన్ని మనకు దర్శకుడు ఈ విధంగా స్పృశించారను కోవచ్చు...
ఓక రాగా ఆలాపాన స్వరసహితంగా ఆరోహణ ,అవరోహణ స్వర ప్రస్తారాలు తప్పు పోకుండా వుండాలి అంటే కఠోర సాధన మరియి మానసిక పరిపక్వత , మానసిక నిగ్రహం తద్వారా శరీరం ప్రతి అణువు సంగీతంకై కేటాయించిన విధంగా తయారవుతుంది.
ఇక సినిమా విషయానికి వస్తే....శంకరశాస్త్రి జీవితం కాలమహిమచే కష్టాలపాలు...కచేరిలు లేవు సంపాదన లేదు...కాని అతని కూతురు యుక్తవయస్కురాలు అవుతుంది. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి సహజంగా తోడు కోరుకోవటం సహజం.....
శంకరశాస్త్రి తో స్నేహాతీతంగా మాటమంతి జరిపే అల్లు గారు...శంకరశాస్త్రి కూతురు రాజ్యలక్ష్మి ని తీసుకుని అన్నవరం వెళ్ళటం...అక్కడ గుడి ప్రాంగణంలో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల కలయిక తద్వారా ఓకరంటే ఓకరు మరులు కొలిపి అభిమానం కలిగి ఉభయుల మధ్య ప్రేమ పుడుతుంది....కాని సాంప్రదాయ కుటుంబాలు అవటం వలన ఆ ప్రేమ గుడి ప్రాంగణంలోనే విరామం....కాని అల్లు వారు చంద్రమోహన్ నే పెళ్ళి చూపులకు ఆహ్వానిస్తారు కధా పరంగా...ఇక పెళ్ళి చూపులలో మరలా చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల పునః పరిచయం...కాకపోతే ఇద్దరూ వధు , వరుల గా ఓకరికొకరు పరిచయం.... దానితో ఇద్దరి మనస్సులో అన్నవరం తాలుకు తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని...ఓకరంటే ఓకరు ఆసక్తి అనురక్తి తో ఉత్సాహంగా వున్నారు....ఆ సమయంలో... సాంప్రదాయ అనుసారం వధువు కి గల అర్హతలు పరిశీలనలో ఓక పాట పాడమంటే...రాజ్యలక్ష్మి...
సామజవరగమన పాట పాడుతుంది...
**********
సామజవరగమనా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
ఆ ఆ ఆ...
సామనిగమజసుధా ఆ ఆ ఆ...
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజవరగమనా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
మధురలాలసల మధుప లాలనల
మధురలాలసల మధుప లాలనల
పెదవిలోసి మధువులాను వ్రతము పూని జతకు చేరగా
నిసా దనీ మదా గమా
సమమగ గదదమ
మనిసద నసదమ గససని నిగగస
సనినిద దనినిస మదదని గమదని గమదని
సనిద మగసా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా ఇలా…
ఈ విధంగా జరుగుతున్న సన్నీవేశంలో శంకరశాస్త్రి " శారద" అనే పెద్ద కేకతో సన్నివేశం మొత్తం రసాభస అవుతుంది... శంకరశాస్త్రి తన కుమార్తె ను నీవు పాడుతున్న రాగం ఏమిటి... దాని ఆరోహణ అవరోహణ ఏమిటి అనే విషయంతో ప్రేక్షకుడు అది రాగం తప్పుగా భావిస్తాడు...కాని కఠోర సాధనతో మనస్సు నిగ్రహపరచి సంగీతం పాడుతుంటే...యుక్తవయస్కురాలు అయిన
రాజ్యలక్ష్మి , చంద్రమోహన్ పై ఆసక్తితో పాటలో తన భావిజీవితాన్ని ఊహించుకోవటం... తద్వారా ఇల్లాలుగా తన మధురోహలతో తనపై తాను అదుపు కోల్పోవుతుంది...దానితో రాగ ఆలాపనలో స్వరం తప్పుగా పాడుతుంది....
ఇదంతా పరిశీలిస్తున్న శంకరశాస్త్రి తన కుమార్తె మానసిక పరిస్థితి తదుపరి దేహపరిస్థితి అవగాహన వచ్చిన వాడు...కాని పెళ్ళి చేయలేని ఆర్ధిక స్థితి...కాని కుమార్తె వయస్సు వచ్చినందున ఎదుట వున్న వరునితో తన భావిజీవతం అనే భావనతో కుటుంబ సాంప్రదాయ కట్టు దాటిపోతున్న విషయం పరిగణలోకి తీసుకున్న దర్శకుడు... దాన్ని నర్మగర్భంగా రాగం పై మరలచి....నీవు నీ స్వాధీనం లో వున్నావా అని కుమార్తె ను అన్యాపదేశంగా ప్రశ్నించారు......
ఇలా ఈ చిత్రం లో మన దృశ్యమాన విషయం వేరు...అంతఃకోణంలో వివరం వేరు....
ఇది ఓక పరిశీలన మాత్రమే....
ఇక శంకరాభరణం సినిమాలోని సామజవరగమన పాట...పల్లవి , మకుటం త్యాగరాజకీర్తన లోనివి తదుపరి భావవ్యక్తీకరణ పార్ట్ వేటూరి సుందరరామ్ముర్తీ రాసినది.....
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సామజవరగమన గురించి వివరించాలని వున్నా వివరించలేని పరిస్థితి.... అది సీతారామశాస్త్రి మాత్రమే చెప్ప తగ్గరు....
ఇది నా పరిశీలన మాత్రమే....
సర్వులకు శ్రీరామ జయం.
మీ అభిప్రాయాలను తెలపవలసినది
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
9440172262.
మీ ఖండనలు , విమర్శలు కై ఎదురుచూపులు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.