14, జులై 2021, బుధవారం

ఆముక్తమూల్యద

ఆముక్తమాల్యద
అముక్తమాల్యద అనే తెలుగు పద్య కావ్యం రచించిన వారు సాహితి సమరాంగణ సార్వభౌముడు , ఆంధ్రభోజుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు వారు.
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః తుళు ప్రాంతంలో కన్నడిగుడైననూ మన తెలుగు వారు ఆయననూ స్వంతం చేసుకున్నంతగా మరి,  ఏ ఇతర రాజుని చేసుకోలేదు...ఆయన జీవితం జీవనం అనేకానేక కాల్పనిక మహమహిమాన్విత ఘట్టాలతో కూడి వుంటుంది.
ఆయన రాజ్యవిస్తరణ , పరిపాలన దక్షత , కార్యశూరత్వ కారణంగా విజయనగరసామాజ్యం అరేబియా మహసముద్ర తీరం నుంచి అనగా మంగళూరు , గోవా,  కర్నాటక ,తమిళనాడులో చాలాభాగం నుంచి ఉత్తరాది న కటకం వరకు అనగా నేటి ఒడియాలోని కటక్ వరకూ విస్తరించినది. ఇది ఓక పార్శ్వం అయితే వీరిలో ఇంకొక కోణం వీరు బహుభాషా కోవిదులు , సాహితి అభిమానులు. అందువల్లనే వీరి నిండు పేరలోగం (ఇది అచ్చ తెలుగు పదం దీని అర్ధం సకల విభాగాలతో నిండి వున్న రాజసభ) ని భువనవిజయం అని పిలిచేవారు...ఈ భువనవిజయంలో సాహిత్యం పాలు ఎక్కువగా వుండేది కారణం వీరి సభలో వున్న అష్టదిగ్గజ కవులను వీరు ఆదరించారు. అల్లసాని పెద్దన , నందితిమ్మన , మాదయగారి మల్లన , తెనాలి రామక్రిష్ణుడు , ధూర్జటి , రామరాజభూషణుడు , అయ్యలరాజు రామభద్రుడు ఇలా అనేక మంది కవులను వీరి కొలువులో వున్నారు. వీరే కాదు అపర శంకరులని పిలిచే అప్పయ్య దీక్షితులు కూడాను.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవులు .అయననూ వీరు నంది తిమ్మన , ధూర్జటి లాంటి శైవులను ఆదరించాడు. తెనాలి రామక్రిష్ణుడు వ్రాసిన ఉద్భటరాద్యుని చరిత్ర అనే కావ్యంని కూడా ఆదరించారు. ఇది శైవ కావ్యం. అలాగే వీరు హంపిలోని విరుపాక్షుని కూడా కొలచారు. కాని వీరి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.
ఇక వీరు తెలుగులో వ్రాసిన ప్రభంద కావ్యం ఆముక్తమాల్యద అనే గ్రంధం.
ప్రబంధం అంటే చిక్కటి వర్ణనలతో కూడినది అని అర్ధం. అలాగే ప్రబంధానికి 18 రకాల లక్షణాలు వుండాలి. ఇన్ని వున్నవి కాబట్టే ఇది ప్రబంధం కాగలిగినది.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు కనుక విష్ణు భక్తుల కధలు వ్రాసినాడు .
శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధ యాత్రలో భాగంగా విజయవాడ సమిపంలో క్రిష్ణా నదితీరములో గల శ్రీకాకుళ ఆంధ్ర మహవిష్ణువుని దర్శించిన సమయంలో ఆయన రాయలవారికి స్వష్నములో తన కధ వ్రాయమని ఆదేశించారని వాడుక. ఈ దేవాలయం నేటికిని ప్రతివారు దర్శించవచ్చు.
ఆముక్తమూల్యద అనేది గోదాదేవికధ. దీనినే విష్ణుచిత్తీయం గా కూడా వాడుక.
ఆముక్తమాల్యద నాయక గోదాదేవి.
ఆముక్తమూల్యద అంటే ధరించి విడిచిన పూలమాలను సమర్పణ చేయునది అని అర్ధం. అందుకనే గోదాదేవి ని తమిళంలో చూడి కొడుత్త నాచ్చియార్ అంటారు.
ఇక కధ ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
విష్ణుచిత్తుడు శ్రీవల్లిపుత్తూరులోని మన్నారు స్వామి ఆర్చకుడు. పన్నిద్దరు ఆళ్వార్ లలో ఓకడు. ఆళ్వార్ లు వైష్ణవ భక్తాగ్రేసులు. వీరికి తులసి వనంలో ఓక బాలిక లభిస్తుంది ఆమేకు గోదాదేవి అనేపేరుతో పెంచుకుంటాడు. ఆమే యుక్తవయస్సుకు వస్తూంది , గోదాదేవి స్వామి వారికోసం సిద్ధం చేసిన పూలమాలలను తాను ధరించి చూసి మురిసిపోయి మరలా అవే మాలలను స్వామికి సమర్పణ చేసేది.
గోదాదేవి భూదేవి అంశ. ఈమే గత జన్మలో తాను కృష్ణుని పట్ట మహిషిలలో ఓకరుగా స్పురణకి వస్తుంది. దానితో విష్ణువు నందు విపరీతమైన అనురాగ పూరితంగా వుంటుంది. ఆమే ఆప్రాంతంనకు సమీపంలోని శ్రీరంగంలోని శ్రీరంగేశుని తన భర్తగా భావించి శ్రీరంగం తరలి వెళ్ళి స్వామి వారి ఆనుగ్రహ పాత్రురాలై స్వామి వారిలో ఐక్యం అవుతుంది. గోదా శ్రీరంగేశుల కళ్యాణం వరకూ ఈ ఆముక్తమూల్యద కావ్యం వుంటుంది.
రాయలు వారు ఎంతో నేర్పుతో ఈ కావ్యంనకు "ఆముక్తమూల్యద" అనే పేరు పెట్టినారు . నాయక లక్షణం , కావ్య స్వభావం దీనిలోనే అన్యాపదేశంగా చెప్పారు.
ముక్తం అనగా స్వీకరణ , ఆముక్తం అనగా తిరిగి ఇచ్చుట , మాల్యద అనగా పూలమాల ధరించుట. కనుక ధరించిన పూల మాల తిరిగి ఇచ్చుట.
గోదా దేవి భూదేవి అంశ అని ఉదహరించారు అని మీకు ఇంతకు ముందే తెలిపినాను. భూమికి గల విశేష లక్షణాలు సహనశీలత తో పాటు తనలో నిక్షిప్తం చేసిన ప్రతి విత్తనం నకు పలు రెట్లు ఫలసాయ రూపంలో తిరిగి ఇస్తుంది.
శ్రీమన్నారాయుణ అంశలో భాగమైన సూర్యుడు స్థిరముగా తన ఉష్ణ ప్రభావం చేత భూమిపై అనంతమైన వెలుగు , వేడిని ప్రసాదించు తున్నాడు. భూమి  స్ధిరంగా గల సూర్యుని చుట్టు గల భ్రమణ పరిభ్రమణాలతో పాటు సంవత్సరం నకు రెండుసార్లు తన భ్రమణ దిశను మార్పులు అనే విశేషాంశల వలన మనకు ఋతువులు , కాలాలు ఏర్పడి సాధారణ వ్యక్తుల జీవనం జరుగుతున్నాయు. భూమిలో వివిధ రకాల పంటలు పండుతున్నాయు. గోదాదేవి భూదేవి అంశ గనుక వనంలో ప్రకృతి సిద్ధంగా తనకు లభించిన పూలను పూలమాలలను తాను ధరించి మరలా స్వామి కి ఇవ్వటంలోని అంతరార్ధం తనకు లభించిన ప్రేమ భావనను స్వీకరించుట. వధువు మెడపై పూలమాల వేయుట ద్వారా వరుడు వధూ స్వీకారం , వధువు పూలమాలను స్వీకరించి ధరించుతూ వరునకు పూలమాల వేయుట ద్వారా వర స్వీకారం జరుగుతుంది తద్వారా వారు జీవన గమనం సాగిస్తారు. కాని గోదాదేవి భూ అంశ కనుక శ్రీమన్నారాయణుని కృపచే లభించిన పూలమాల రూప ప్రేమను స్వీకరించి మరలా తనకు గల భూ అంశ అయిన విశేషాంశ అయిన పలురెట్లు గుణింపు చెసి ఇచ్చె గుణమైన దాని వలన ఆప్రేమను పలురెట్లుగా స్వామి కి తిరిగి సమర్పించినదని దీని భావం. అందువల్లనే గోదాదేవి అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీరంగేశుని భర్తగా పొందినది.
సూర్యుని వలన ఋతువులు ఏర్పడుతాయని తమకు తెలిసినదే కదా...
గోదాదేవి భూ అంశ , శ్రీమన్నారాయణుడు సూర్య అంశ వీరి ఇరువురి మధ్యగల ప్రేమోత్పన్నం  ఋతువులు.. ఈ ఋతువర్ణనం ఆముక్తమూల్యద కావ్యంలో బహు విశేషంగా వుంటుంది.
అసలే రాయలు వారు అల్లసాని వారి కృతి అయిన మనుచరిత్ర కు కృతిపతి...మరి ఆయన ప్రభావం వీరిపై లేకుండా వుంటుందా...అయునా వీరి శైలి వీరిదే....
ఆముక్తమూల్యద ఏడు ఆశ్వాసములు గల కావ్యం.
అది ఈ విధముగా వుంటుంది.
గ్రంథస్త విషయ క్రమము
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
2 ఆ. -  మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.
3 ఆ. - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
4 ఆ. -  విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.

5 ఆ. - గోదాదేవి, వసంతఋతువర్ణనము.

6 ఆ. - మాలదాసరి.
7 ఆ. - బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.
గోదా పరిణయ కధతో పాటు ఉప కధలుగా ఖాండిఖ్య కేశి ధ్వజుని కధ , మాల దాసరి కధ. ఇందు మాల దాసరి కధ ప్రశంశ పూర్వకమైన కధ. నిర్మల భక్తికి సోదాహరణ. ఈ మాల దాసరి కధ విషయమై ఈనాటికి చర్చలు ఆగలేదంటే అతిశయోక్తి కాదు.
వైష్ణవుడైన రాయలు వారు తనకావ్యమైన ఆముక్తమూల్యద ను విష్ణుభక్తుల కధగా వర్ణించటానికే ఇష్టపడ్డారు. అందుకే చూడండి గోదాదేవి తండ్రిపేరు విష్ణుచిత్తుడు. విష్ణువును మనస్సు నందు నిలిపినవాడు అని దీని అర్ధం. వీరినే తమిళంలో తొండరప్పొడి ఆళ్వార్ అని పిలుస్తారు.
అలాగే ఈ కావ్యంలోని ఖాండిఖ్య కేశిధ్వజుల గురించి కొంత పరిశీలన చేద్దాం.

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.
గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు.
నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.
ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.
వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో
ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు.
కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం.
ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు.
ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది.
రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది.
ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి.
అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం.
గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు,
కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.
రాయలు వారి కావ్యం పై వ్యాఖ్యలు చేసే స్థాయి కాకపోయినా ఈ నాటి ప్రజలకు, యువతకు కొంత అయునా ఆముక్తమూల్యద గురించి తెలపాలనేది నా ప్రయత్నం.
ఇంతేకాక ఆధ్యాత్మిక కోణంలో గోదాదేవి భూఅంశ గా ఉదహరించారు...అనగా పాంచభౌతిక శరిరాలతో జన్మించిన ప్రతి ఓక్కరు భూ అంశయే గదా...కాని సాధారణ మానవులు విషయ లంపటులై, సాంసారిక , వస్తు వ్యామోహలు దుర్గుణ పీడితులై జనన మరణ చక్రంలోనే ఇమిడి పోతున్నారు...కాని భగవత్ కృప వలన లభించిన ఈ జన్మలో ప్రేమ అనురాగం నమ్మకం అనే పూలదండను సేకరించి , స్వీకరించి , ధరించి వాటి మధురిమను భగవంతునికి అందించే ప్రయత్నం మరలా స్వామికి ధరింపచేయటం...తద్వారా ముక్తి...గోదా కళ్యాణం అంటే సాధారణ వివాహమా కాదే...భగవంతుడు భక్తుడు ఆత్మీయ కలయుక , ముక్తి సంగమమే కళ్యాణం...సాధారణ మనుజుడు సర్వజీవుల పట్ల దయ ప్రేమ తో పాటు ఆ నారాయణుని దర్శించాలనే అంతర్లీన అభిలాష....
నా ప్రయత్నం నచ్చిన తెలుపగలరు.
కృతజ్ఞతతో
మీ
ఆలపాటి రమేష్ బాబు.
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262.


30, జూన్ 2021, బుధవారం

మధురాపురి సదన విశేషార్ధములు

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదు వదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… కృష్ణా… ఆ ఆ

ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ మధుసూదన…
ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ మధుసూదన…

ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ కువలయపీడన…

మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…
మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…

శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ
శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ

ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…
ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…

మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…
మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…

స ద ప గ రి… పగరిసదస
స రి గ ప ద స ద ప గ రి పగరిసదస…

స స రి రి గ గ పద స స
ద ప ప గ రి రి
ప గ రి స ద స…

సరిగ రిగప గపదస ద ప గ రి పగరిసదస…

తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…
తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…

తకతరి కుకుతన కిట తకధీం… ||8||

కృష్ణా… ఆ ఆ ఆ
**************
బహుశా ఈ కీర్తన విన్న ఈనాటి యువతరానికి పవన్ కళ్యాణ్ సినిమా లో పాట గా జ్ఞాపకం వుంటుంది... కాని అది మనసునుంచి చెరిపి...
ఓక్కసారి ఈ క్రింద విశేషాలు చదవండి...
ఈ కీర్తన రచించిన వారు ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్. వీరి జీవన కాలం 1700 - 1765 వరకు. వీరు సంస్కృతంలో అసమాన పండితులు....వీరు సంస్కృతంలో , మరాఠి (ఆనాటి ఆప్రాంత రాజ భాష) , మాతృభాష తమిళంలో ఎన్నో కీర్తనలు రచించారు...ప్రస్తుతం వీటిల్లో ఓక 500 కీర్తనలు లభ్యం.
వీరు వీరి గురువు గారి వద్ద పూర్తిగా సంగీతం నేర్చుకున్న తరువాత... నాయన నాకు తెలిసిన సంగీతం అంతా నీకు నేర్పినాను అని తెలుపగా... వీరు తదనంతర గురువు కృష్ణం వందే జగద్గురుం అన్న నానుడితో కృష్ణుని గురువుగా స్వీకరించి అనేక కీర్తనలను కృష్ణుని పై రచన చేశారు.
వీరి కీర్తన " అలై పాయిదే కన్నా ఆనంద మోహన అలై పాయిదే కన్నా" కానడ రాగంలో స్వర పరిచిన ఈ తమిళ కీర్తన జగద్విదితం...ప్రతి తమిళుడు ఈ కీర్తన ను వారి పిల్లల బాల్య వేడుకలలో పాడతారు...
ఇక ప్రస్తుత కీర్తన మోహనరాగంలో సంస్కృతంలోనిది...
ఈ కీ‌ర్తన స్వభావం పల్లవి , అనుపల్లవి (సినిమాలో ఇవ్వలేదు నిడివి పెరుగుతుంది మరియి కొన్ని క్లిష్ట పదాలు మరియి సినిమా స్వభావం నకు సరిపోక) , చరణం , థిల్లాన చివరకూ మరలా పల్లవితో ముగుస్తుంది....
ఇక కీర్తన విశేషానికి వస్తే
ఈ కీర్తన స్వభావం... కష్టంలో సమస్యలలో వున్న వారిని కాపాడటానికి క్రిష్ణుడు ఏ విధంగా వస్తారో వివరణ. కంసుని పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలు కృష్ణనికి స్వాగతం పలకటం ఈ కీర్తన లో కనపడుతుంది... మధుర ప్రజలకు గోకులంలో కృష్ణుని లీలా వైభవాలు , పూతన , శకటాసుర , తృణావర్త మొదలగు రాక్షస నిర్మూలన కాళింగ నర్తన , గోవర్ధన ధారణ , గో , గోపాలక , గోపికా జన రక్షణ గురించి తెలుసుకున్న ప్రజలు కృష్ణుని స్వాగత వర్ణన ఈ కీర్తన లో మనం గమనించ వచ్చు.
అసలు ఈ కీర్తన ఎత్తుగడే ఓక గమ్మత్తు...మధురాపురి సదన...ఈ పదం వరకు అర్ధం మధురకు వేంచేస్తున్న క్రిష్ణా నీకు స్వాగతం...అని...కాని ఛాయమాత్రంగా అనాటి ప్రజల దుస్థితి ని ఆ మొదటి పదంలోనే సూచించారు...
మధుర అంటే తేనే...తేనే తీపిదనం , ఔషధగుణాలు కాని ఇదే తేనేలో ఈగ పడితే దానికి విషంగా మారుతుంది.ఇది నాటి ప్రజల స్థితి...కంసుని మధాంధ నిర్భంధ క్రూర పరిపాలన తట్టుకోలేక విలపిస్తున్నవాళ్ళు..మరి గమ్మత్తు చూడండి క్రిష్ణుడు మధురలోనే జననం కాని కొద్ది క్షణాలు కూడా గడవకుండానే వసుదేవుడు యమున ద్వారా గోకులంకి యశోద వద్దకు.. ఇక అక్కడ స్వామి వారి లీలా వైభవం ...ఓహ్  ఆనాటి  గోకులం వారికి ఎన్నో ప్రాకృత జన్మ సౌభాగ్యం... ఆయనతో కలసి జీవించి ఆడి పాడి మమేకం అయుపోయారు...క్రిష్ణుడు ,వారు వేరు కాదు ఏకీకృత స్వరూపం అన్న విధంగా తాదాత్మ్యం చెందినారు...
మరి జన్మతః క్రిష్ణుడు మధుర వాసి...
‌అందులోను దేవకి వసుదేవులు కారాగారంలో...కనుకనే మధుర పునరాగమనం...
‌చూడండి కాల ప్రభావం...భగవంతుడైననా కాల ప్రభావం తప్పించుకోలేక పోయాడు...నిర్ణిత కాల వ్యవధి బయట
గడిపి సమయ పరిపక్వం అయున తరువాత అవతార లక్ష్యం అయిన కంస నిర్మూలన నిమిత్తం పునరాగమనం...
మరి ఆయన మధుర కు వేంచేసే సమయంలో ఎలా వున్నా‌రు..చూడండి
మృదువదన మధుసూదన...
ఎంతటి భారమైన కర్మ నిమిత్తం వస్తున్ననూ ప్రశాంత వదనం తో వున్నారట...మరి తదనంతర పదం మధుసూదన..
మధు , కైటభులు అనే రాక్షసులను సంహరించారు..అది ఈ సమయంలో ప్రస్తావన...కాని మధుర ప్రజలు అన్యాపదేశంగా కంసనిర్మూలన చేయు స్వామి అని వేడుకోవటం.
అసలు కీలకం అంతా ఏత్తుగడ పదం లోనే వున్నది.
మధు ..దీని మీద కొంత స్వేచ్ఛా వివరణ.
సహజంగా మనం మన మిత్రులను మీ జీవనం ఎలా సాగుతోంది అని ప్రశ్నించితే...వారు బాగుంది.. మధురంగా సాగుతుంది ఆని జనాతిక సమాధానం ఇస్తారు. ఇది సాధారణ జనులకు శాంత స్వభావులకు.
మరి దమన గుణమే ప్రాకృతిక జీవనం కలిగిన మానవులకు , రాక్షస స్వభావులకు,అధికారయుతులకు , ఈ మధురం ఉన్మత్తత ,అహంకారం , కండకావరం ఇత్యాది గుణాలు అలవడుతాయి...కారణం వాళ్ళకు ఏది కావాలంటే అది మాట మాత్రం లభిస్తాయి...దానితో ప్రతిది చులకన గా మారిపోతుంది...వీరి పాలనలో వున్న సాధు జనావళి బాధలు పడుతారు.
తేనె ను మనం మధు అని వాడుక.
మరి ఇదే మధుని భల్లూకాలు త్రావి ఉన్మత్తతో ప్రవర్తించుతాయి. ఈ విషయం రామాయణం వాల్మీకి లో చక్కగా వివరుంచుతాడు. మరి మీకు భల్లూకం అంటే అవగాహన వున్నది వాటి తాలూకు ప్రవర్తన పై అవగాహన వున్నది కదా...
ఇక తదనంతర పదాలు పరిశీలించండి కీర్తనలో...కంసుని కన్నా ముందు ఎవరిని ఏదుర్కోవాలో తెలుపుతున్నారు.
ముష్టికాసురుడు , చాణూరుడు.
ముష్టికుడు పిడిగుద్దులతో ప్రత్యర్దిపై దాడి చేసి సంహరించుతాడు . చాణూరుడు భీతిగొలిపే శరీరంతో విపరీతమైన శక్తితో ప్రత్యర్దిపై దాడి...ఓక విధంగా చెప్పాలి అంటే ప్రత్యర్ధిని పిప్పి చేస్తాడు. చమనం అంటే నములుట...కాని వీడు శక్తితో యుక్తితో పిప్పి చేస్తాడు కాబట్టి వీడికి చాణూరుడు అనే పేరు...వీరిద్దరిని క్రిష్ణుడు సంహరించుతాడు.
కువలయపీడన...కువలయం కంసుని భద్రగజం...కాని ఇది మదగజం...దీని
వలన అందరూ ఇబ్బంది ...కంసునకు వినోదం. ఏనుగుకు చిక్కిన ప్రజలను తన తొండంతో గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టి చంపుతుంది .దీనిని కూడా క్రిష్ణుడు ముష్టిఘూతాలతో లొంగదీసు కుంటాడు...
తదుపరి చరణం
మర్దన కాళింగ నర్తన...ఇది భగవస్తుతి...నాయనా క్రిష్ణ! విషం చిమ్మే కాళీయుని మదమణచి గోకులాన్ని రక్షించావు..స్వజనం పైనే విషం చిమ్ముతున్న కంసుని మదమణచవా దేవా..మరి కంసుడు స్వజనం స్వబంధువర్గం...తండ్రిని , సోదరిని బావని
ఖైదు చేశాడు...
తదుపరి చరణం...మకుటాయమాన  చరణం అసలు అద్భుత చరణం...
ఓకసారి పరిశీలించుదాము..
ఈ చరణానికి లోని పదప్రయోగానికి ఊతుకాడు వెంకటకవి గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు...
"శిష్టజనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ"
సహజంగా కల్ప అనే శబ్దం మూడు సార్లు పునరుక్తం అవుతుంది...మొదటది సంకల్ప, కల్ప , కల్ప శతకోటి ..
ఈ మూడు శబ్దాలకి వేరు వేరు అర్ధం.. కాని ఓకే శబ్దంతో గుదిగుచ్చాడు...
మొదటి శబ్దమైన  సంకల్ప కి అర్ధం సాధారణమైనదే సంకల్పం అనగా డిటర్మినేషన్...( తెలుగు పదానికి ఇంగ్లీషు అర్ధం)
రెండోవ శబ్దం కల్ప...దీని అర్ధం క్రియ , ఓక కార్యము , ఓక పోరాటం
మూడవ కల్ప కి అర్ధం...కాల గణన , సంఖ్యా గణన...కల్పం అనగా..బ్రహ్మకు ఓక పగలు కాలం అనగా 432 కోట్ల మానవ సంవత్సరాలు...
ఇప్పుడు మీరు పూర్తి వివరణ తెలుసుకొందురు...
భగవంతుడు భక్తులను , సాధుజన రక్షణ సంకల్పుడైతే తనపోరాటం కల్ప పరిధి అయునా చేస్తాడు అని తెలుపుతున్నాడు..అయుతే ఈ బ్రహ్మ కల్పాలు , పోరాటాలు ఏన్నో తెలుసా శతకోటి అనగా వందకోట్లు ..
అనగా  భక్త జన రక్షణకు అన్నీ కాలాలో , అన్నీ మార్గాలలో , అన్నీ విధాలుగా సిద్ధమై వుంటాడు అని  తెలపటమే...
తరువాత రెండు చరణాలు భగవస్తుతి...
మిత్రులు చదివిన తరువాత తమరి రిప్లై లని మరువక తెలపండి...
ఆలపాటి రమేష్ బాబు.
9440172262.


గరుడ గమన విశేషార్ధం


గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం ( 2)

మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ (2)

విబుధవినుత-పదపద్మ

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహార (2)

జననమరణ-భయహార

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2).

శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ ( 2)

సర్వలోక-శరణ

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల ( 2)

విదళిత-సురరిపుజాల

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం ( 2)

పాహి భారతీ తీర్థం

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం2)

మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ (2)

మమపాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ…

సహజంగా భగవన్నామాన్ని అనేక విధాలుగా ప్రస్తుతించటమే స్తోత్రం... స్తుతి గా పిలువ బడుతుంది.
కాకపోతే కొన్ని స్తోత్రములకు ప్రత్యేక లక్షణం కలవిగా , ప్రత్యేక పర్వ దినములలో , ప్రత్యేక పూజ విధానాలలో స్తుతించేవిగా వుంటాయి. కాని మీరు గమనించితే ఆ ఆయా స్తోత్రాల ప్రారంభ , గమన మరియు చివరి నందు స్వామి వారి వైభవం ను కొన్ని ప్రత్యేక పద సంచయంతోను , విశేష నామ ,గుణ ,రూప , యశో ,లీలా వైభవాలను ప్రస్తుతించుతారు....
చాలామంది అవి ఏందుకో విచారణ చేయకనే భగవన్నామ సంకీర్తన గావించి ధన్యులు అవుతారు.
భగవన్నామాన్ని దివ్యాఔషధిగా చెపుతారు. శరీర అసౌకర్యంనకు మనం ఔషధం స్వీకరిస్తాం. ఆ ఔషధం మీరు తయారు చేసినారా లేదే మీ వలన లభించినదా లేదే...కాని సిద్ధపరచి వున్న ఔషధంను స్వీకరిస్తే వెంఠనే శరీర బాధ నివారణ జరుగుతుంది. అలాగే భగవన్నామము అనే దివ్య ఔషధం జీవన తరుణోపాయం , జీవన్ముక్తిని ప్రసాదించుతుంది. ఇంకొద్దిగా మీకు వివరించు దామనే ప్రయత్నం...
రావణ సంహర నిమిత్తం శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా అవతార ధారణ అన్న రహస్యం నారదుల వారికి తెలిసినది. దేవ రహస్యం బయట పెట్టరాదు.. కాని చెప్పనిదే కుదిరిచావదు...అందుకే భూలోకం వచ్చి ఏవరు లేని ఏకాంత ప్రదేశంలో వున్న పుట్టలో దేవ రహస్యంని యుక్తిగా చెప్పాడు ఏమని..." రావణ సంహరణార్ధం శ్రీమన్నారాయణుడు 'మరా' అవతారం ధరించపోవుచున్నారు...ఆ అవతార మహిమ వలన అనేక జీవరాశులు ముక్తినొందపోవుచున్నారు అని. కాని భగవద్ లీల చూడండి...ఈ పుట్టలో వున్నది రత్నాకరుడు అనే బోయవాడు. ఈ బోయవాడిని పాపకూపం నుంచి రక్షణార్ధం అతనిని పాపమార్గం నుంచి నారదుడే తప్పించుతాడు. రత్నాకరుడు దీనితో భగవన్నామ తపోదీక్షలో వున్నాడు.
మరి రత్నాకరునికి ప్రచ్ఛన్నంగా అయిన భగవన్నామం లభించినది...దానిని ఉపాసించే వాల్మీకి అయినారు ...ఆద్భుత దివ్యగాధ..మానవ...జన్మసాఫల్యత నొసగు రామాయణం ప్రసాదించారు.
మరి కొన్ని ఉదాహరణలు వున్నాయి కాని నేటి వివరణ లక్ష్యానికి దూరం అవుతాము...
గరుడ గమన స్తోత్రం. భక్తకోటికి ప్రసాదించిన వారు శృంగేరి పీఠాధిపతులు ,
జగద్గురు ఆదిశంకరాచార్య పరంపరలోని వారు ఈనాటి పీఠాధిపతులు అయిన శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహస్వామి వారు.వీరు తెలుగు , తమిళ ,కన్నడ ,హింది మరియు సంస్కృతంలో అపార పండితులు...తపః సంపన్నులు..మరియు..భక్తజన కోటిపై అపార కరుణా సముద్రులు.
ఈ స్తోత్రం ను ఓకసారి పరిశీలించితే...
మొదటి పద్య చరణాలు అయిన గరుడ గమన నుంచి మమ పాపమపాకురు దేవ వరకు తదనంతర ఆరు పద్యాలనంతరం పునరావృతం అవుతుంటాయు.
కనుక ఈ పునరావృత చరణాలను గురించి వివరించటమే ఈ వ్యాస లక్ష్యం.
ఈ మొదటి పద్య చరణాల సాధారణ అర్ధం పరిశీలించితే...
ఓ గరుడ వాహన ! నీ పాద పద్మములపై మా మనస్సు సదా నిలుపునట్టు..
మా తాపాలను , మా పాపాలను ఉపశమింపు దేవా!
మరి ఈ పద్య పాదాలపై శ్రీరాముని దయవలన నా విశేషార్ధం ఆయన పాద పద్మాలతో పాటు మీకు గూడా...
మనిషి జననమే సంచిత ప్రార్బద కర్మలతో జననం ఆన్నది జగద్విదితమే. కాని ఈ లౌకిక జీవన సౌలభ్యాల కోసం అనేక రకాల పోరాటాలు అనేక మార్గాలలో ఆరాటాలు పడుతుంటారు....వీటి వలన చాలా సార్లు కర్మ , ధర్మ విఘాతం జరుగుతునే వుంటాయు. వీటినే మనం పాపం గా పిలుస్తాం. దైనందిన జీవనంలో వైదిక సాంప్రదాయం కాని అనేక క్రియా కర్మ వలన   పాప పంకిలం వ్యక్తులను ఆవహిస్తున్నది.
మరి కొంతమంది విపరీత సుఖలాలసకో మరో దానికో చాలా ఎక్కువ హైరానా , ప్రయత్నాలు చేస్తుంటారు...ఆ సమయంలో
మన ఇంటిలోని పెద్దవారు విజ్ఞులు "ఏమిరా! ఎందుకు అంత తాపత్రయం పడిపోతున్నావు. కొద్దిగా నెమ్మది . అయినా భగవదాజ్ఞ లేనిదే జరుగుతుందా అని మనలను హెచ్చరిస్తారు.
మరి పాపం అంటే సాధారణ ప్రజలకి కొంత అవగాహన వున్నది మరి తాపత్రయం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే...
తాపం అనగా వేడి. ధాన్యం బియ్యంగా మారాలంటే రోకటిపోటు అవసరం ఇదో రకం తాపం. ఈ బియ్యం అన్నం గా మారాలంటే మరలా వేడి అవసరమే...
అలాగే సంచిత ప్రారబ్దాలు సుకర్మలుగా , దుష్కర్మలుగా మార్పు చెందటం ఓక విధమైన తాపం. ఈ అర్దం వరకు సాధారణ జీవన శైలికి.. మరి అథ్యాత్మిక జీవనంకి
ఈ తాపం అనే దానిని ఏవిధంగా వుంటుంది అనేది పరిశీలించుదాం.
“తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడు.
త్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;
తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;
ఆధ్యాత్మిక తాపం:
మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడే
అరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;
ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల మొత్తంలో 
నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకున్న,
మరి మనకు మనం కల్పించుకుంటూన్న బాధలే.
అదిభౌతిక తాపం:
ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలను “ఆదిభౌతిక తాపాలు” అంటాం.
మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన
మనకు కలిగే భౌతికపరమైన బాధలు అన్నమాట;
ప్రతి మనిషికి 9% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.

అదిదైవిక తాపం:
ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను
“ఆదిదైవిక తాపాలు” అంటాం . . 
ఉదాహరణకు: అతివృష్టి, అనావృష్టి, అతిశీతలం, అతిఉష్ణం మొదలైనవి
అనేక బాధలను కలిగిస్తూ ఉంటాయి;
ప్రతి మనిషికి 1% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
గమనించారా అందుకే మానవులను తాపత్రయపీడితులు అనేది.
సరే మరి ఈ తాపం , పాపం చేయటానికి మూలకారణం ఏమిటి అంటే మనస్సు.
భగవంతుడు మానవులకి తన దేహ అవసరాలకి , మానవి పరిధికి సరిపోయిన అన్ని అవయవాలు ఇచ్చినా...ఇవి వాటి పరిధిలోనే పని చేస్తాయి...కాని దృష్టి మాత్రం అలాకాదు పరిధి అనంతం. దీనికి చలన శీలత వున్నది. కన్ను సుకుమారమైన , అందమైన ,లావణ్యమైన ప్రతి దానియందు ఆకర్షితమవుతుంది.
మరి ఈ దృష్టిలో వచ్చిన ప్రతిది ఎక్కడ నిక్షిప్తం అవుతాయి అంటే మనస్సులో.
ఈ మనస్సు అనేది తుఫాను నాటి సాగరగర్భం. కదిలే కాలం ఆపవచ్చునేమో కాని మనస్సు స్థిర పరచటం ఆపటం కష్టసాధ్యం అంటారు. కాని యోగులు ఋషులు దీనిని ఆచరణ చేసి చూపారు. మరి నిత్య జీవనంలో అనేకానేక పోరాట పీడితులమైన మనకు సులభం ఎలాగు అంటే భగవన్నామం అనే సాధనంతో దేనికి సంధానపరచాలి అంటే భగవంతుని పాదపద్మాలకు.
అనగా స్థిర చిత్తంతో భగవన్నామంతో ఆయన పాదపద్మాలను ఆశ్రయంచటం.
అలాగే మనవాళ్ళు ఇంకో మాట కూడ అంటారు. పాపం పాము వంటింది ఎదో నాడు నిన్ను కాటు వేస్తుంది అంటారు.
మరి ఈ పాము నిన్ను విడవాలి అంటే
ఎవరు రావాలి...అమృతకలశం అతి వేగంగా  తెచ్చిన గరుత్మంతుని వలనే సాధ్యం. గరుడఛాయ పడిన వెంఠనే ఎంతటి పాము అయినా బెదరి పారిపోవటం సాధారణ జీవనంలోనే మనకు ఎరుక. మరి స్వామి వారు గరుడ వాహనధారిగా రావటమంటే ...మన తాప , పాప ఉపశమనం.
కనుక మిత్రులారా భగవన్నామము అనే సాధనతో మీ మనస్సును లగ్నం చేయండి
స్వామివారి కృపకు పాత్రులు కండి.**
*********************
ఈ వ్యాసం పై మీ స్పందననూ
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
తెలియ చేయ ప్రార్ధన.