17, మే 2026, ఆదివారం

భగవద్గీత శ్లోక గణన వివరాలు




భగవద్గీత శ్లోక వివరణ


భగవద్గీత ఒక మతం గ్రంధమా ...
ఆధ్యాత్మిక సాధన గ్రంధామా..
వ్యక్తిత్వ వికాస సాధనమా...
ఉపనిషద్ సారాంశమా....
వేద సారము...‌
సంహితల లక్షణమా...
గీత అన్నీనూ....
 గీత సాధారణ మానవులకు సంబంధించి ఒక పరుసవేది...
పరుసవేది తో మీరు ఏ లోహంని తాకిననూ అది స్వర్ణం అవుతుంది...
అలాగే భగవద్గీత పరుసవేదితో మీ జీవితం స్పృశిస్తే మీ జీవితం బంగారం అవుతుంది....
మీ నిత్యం జీవితం లో సమస్య, వత్తిడి భావించిన మీరు భగవద్గీత ను...అలా ఒక్క సారి ఒపేన్ చేయండి...మీ ఎదురుగా మీ సమస్యకు పరిష్కార శ్లోకం దర్శనం...మీలో వత్తిడి మటుమాయం...
ఇంకా భగవద్గీత వివరాలు ఇలా వున్నాయి...

భగవాన్ ఉవాచ అనగా స్వయం కృష్ణుడు పలికినవి : 574
అర్జునుడు : 84
సంజయుడు : 41
ధృతరాష్ట్రుడు : 1

ప్రధమ అధ్యాయం: 
అర్జున విషాద యోగం : 47 శ్లోకాలు 
ద్వీతియ అధ్యాయం:
సాంఖ్య యోగం : 72 శ్లోకాలు 
తృతీయ అధ్యాయం:
కర్మ యోగం : 43 శ్లోకాలు 
చతుర్ధ అధ్యాయం:
జ్నాన కర్మ సన్యాస యోగం :42 శ్లోకాలు 
 పంచమ అధ్యాయం:
కర్మ సన్యాస యోగం : 29 శ్లోకాలు 
షష్ఠమ అధ్యాయం: 
ధ్యాన యోగం లేదా ఆత్మ సంయమ యోగం : 47 శ్లోకాలు 
సప్తమ అధ్యాయం :
జ్నాన విజ్నాన యోగం : 30 శ్లోకాలు...
అష్టమ అధ్యాయం:
అక్షర బ్రహ్మ యోగం : 28 శ్లోకాలు 
నవమ అధ్యాయం: 
రాజ విద్య రాజ గుహ్య యోగం : 34
దశమ అధ్యాయం:
విభూతి యోగము : 42 శ్లోకాలు 
ఏకాదశ అధ్యాయం:
విశ్వరూప దర్శన యోగం : 55 శ్లోకాలు 
ద్వాదశ అధ్యాయం:
భక్తి యోగం : 20 శ్లోకాలు
త్రయోదశ అధ్యాయం:
క్షేత్ర క్షేత్రజ్న విభాగ యోగం : 35 శ్లోకములు 
చతుర్దశ అధ్యాయం 
గుణత్రయ విభాగ యోగం - 27 శ్లోకాలు
పంచదశోధ్యాయం
పురుషోత్తమ యోగం - 20 శ్లోకాలు 
షష్ఠాదశోధ్యాయం : 
దైవాసుర సంపద విభాగ యోగం : 24 శ్లోకాలు 
సప్తాదశోధ్యాయం : 
శ్రద్ధాత్రయ విభాగ యోగం : 28 శ్లోకాలు 
అష్టాదశోధ్యాయం :
మోక్ష సన్యాస యోగం : 78 శ్లోకాలు
ఇది మీరు గమనించండి....
అర్జున విషాద యోగం తో ప్రారంభం 
మోక్ష సన్యాస యోగం వరకు...
ఒక దాని తరువాత మరోకటి క్రమ పద్ధతిలో మానవుని మోక్షం వైపునకు ప్రయాణం...
ఇంకనూ చాలా వున్నవి.... ప్రస్తుతం ఇంతవరకు..


పచ్చని గడప

పచ్చని గడప మహలక్ష్మే
ఎన్నో స్వాగతాలకు 
మరి ఎన్నో వీడ్కోలుకు
ఎన్నెన్నో నిష్క్రమణలకు
మౌన సాక్షి...
ఒక్కసారి కదిపి చూడండి
ఇవతల తండ్రి ఆవేదన 
అవతల బిడ్డ ఆరాట పోరాటం 
పచ్చని గడప మహలక్ష్మే 
ఆమే కూడా ఆడదే కదా
అందుకే మౌనం...



7, ఏప్రిల్ 2026, మంగళవారం

బాల కనక మయ చేల- అర్ధ విశేషాలు

 బాల కనక మయ చేల - అర్ధ విశేషాలు 
ఏల నీ దయ రాదు కీర్తన అను పల్లవి





పల్లవి.---ఏల నీ దయ రాదు పరాకు చేసే వేళ సమయము గాదు  (ఏల)
అ.ప.---బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమా లోల విధృత శర
           జాల శుభద కరుణాల వాల ఘన  నీల నవ్య వనమాలికాభరణ        (ఏల)
1. చరణము.--  రారా దేవాధి దేవ  రారా మహాను భావా రారా రాజీవనేత్ర రఘు వర పుత్ర  
సార తర సుధారస పూర హృదయ పరివార జలధి గంభీర దనుజ సం
హార దశరధ కుమార బుద జన విహార సకల శృతి సార నాదుపై (ఏల)
2. రాజాధి రాజ ముని పూజిత పద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య
రాజ ధర నుత విరాజ ఉరగ సురరాజ వందిత పదాజ జనకదీన
రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజముఖ  (ఏలా)
3. యాగ రక్షణ పరమ భాగ వతార్చిత యోగీంద్ర సుహృద్భావిత ఆద్యాంత రహిత
నాగ శయన వర నాగ వరద పన్నగ  సు మధుర సదాఘ మోచన
సదాగ తిజ  ధృతి పదాగమాంత చర  రాగ రహిత శ్రీ త్యాగ రాజ నుత  (ఏలా)

ఈ కీర్తన త్యాగరాజు గారిచే కృతి పరచబడినది....
ఈ కీర్తన పల్లవి కన్నా అను పల్లవి ప్రసిద్ధి చెందినది...
ఈ కీర్తన పూర్తిగా తెలుగు పదాలతో వుండి దీర్ఘ సమాసాలు, సంధులు అలంకారాలతో వున్ననూ...
ఎంతో హృద్యంగా ప్రతి పదం... శ్రీరామ వైభవం మనకు తెలియచేస్తుంది...
అసలు పల్లవి చూడండి...
"ఏల నీ దయరాదు పరాకు చేసే వేళ సమయం  కాదు"....
ఈ కీర్తన నిర్మాణం...పల్లవి, అనుపల్లవి,3 చరణాలు కల కీర్తన...
ఇది ఆఠాన రాగం, ఆది తాళం లో స్వరపరచబడినది....
మనం నిత్య జీవితంలో కొన్ని విషయాలు సగం నుంచి గ్రహించ వలసి వస్తుంది...అతను వచ్చినాడా??? ఆమే ఏమన్నది??? ఈ అతను ,ఆమే ఎవరు అనే ప్రశ్న మనకు ఉత్పన్నమై...వారు ఎవరు అని మనం ప్రశ్నించితే మనకు దానికి సంబంధించిన వివరాలు 
లభించుతాయి...
అలాగే త్యాగరాజు గారు...పల్లవిలో "ఏల నీ దయ రాదు..పరాకు చేసే వేళ సమయం  కాదు'...ఇందులో ఒక అర్ధింపు తో కూడిన వేడుకోలు...దానితో పాటు "పరాకు చేసే వేళ  సమయం"  ఇదికాదు అనే ఓ చిన్న పాటి సూచన...
 "పరాకు" అనే పదానికి నిఘంటువు అర్ధం పరధ్యానం, ఏకాగ్రత లేకపోవటం... అయితే వాడుకలో ఈవిధంగా వుంటుంది ...  తనుచేయవలసిన కార్యం ను ఏమరుపాటున నిర్వర్తించ లేకపోవడం పరాకుగా వాడుక...
అలాగే సూచన ఏమిటంటే" వేళ సమయం  కాదు...."
సహజంగా వేళ, సమయం ఈ రెండు పదాలు కాల గమనం ...దిన ప్రమాణం కి సూచన చేస్తాం...
కాని ఇక్కడ వేళ అన్న పదం తరుణం అన్న అర్ధంలో వాడినారు...
ఇప్పుడు అసలే ఇంగ్లీష్ మీడియం .... తరుణం అంటే....
తరుణం అంటే తగు సమయం...
మనం కీర్తన పల్లవి వరకు వింటే ఈయన ఎవరిని వేడుకుంటున్నారో తెలియక చిన్నపాటి సందిగ్ధం లో వుంటే... త్యాగరాజు గారే...వారు ఎవరో మనకు వివరంగా
చక్కగా అనుపల్లవిలో వివరిస్తున్నారు....
అను పల్లవి:
"బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీరమ లోల విధృత శరజాల
శుభద కరుణాలవాల ఘన నీల నవ్య వనమాలికాభరణ " || ఏల నీదయరాదు||
ఇది అను పల్లవి....
ఇంత చక్కటి అనుపల్లవి మీరు శ్రోత గా వినగానే , త్యాగరాజు  గారు అర్ధిస్తున్న వారిపై కొంత  ఉత్సుకత, ఇంకొంత   ఉత్సాహం     మరింతగా ఆథ్యాత్మిక భావం జనించుతుంది...
ఇంతకు త్యాగరాజు వేడుకుంటున్న వారి గుణగణాలు ఆసక్తిగా ప్రారంభం...
"బాల కనక మయ చేల..."
ఇందులో బాల పదంను చాలామంది...
శ్రీరాములవారిని బాలుడిగా ఊహిస్తారు... నా అభిప్రాయం ప్రకారం అది కాదు...

ఇందులో బాల కనక పదం సీతమ్మ తల్లిని ఉద్దేశించి...
ఇందులో కనక  అనే పదం బహు కీలకం... దీనిని ఈ విధంగా అర్ధం చేసుకుంటే దీనిలో మర్మం బోధ పడుతుంది... కనక పదం రెండు పదాల మధ్య వారధి అనుకుంటాం కాదు...
బాల కనక వరకు మొదటి భావం....
కనక మయ చేల అనేది రెండోవ భావం మనం మొదటి  భావం తెలుసు కుందాము...
బాల కనక...అంటే బంగారం లాంటి స్త్రీ...
అనగా రూపమా గుణమా....
అది సీతమ్మ కాబట్టి రూపం కాదు గుణమే....
అయిననూ సర్వగుణలక్షణ శోభిత మైన స్త్రీ ని మనం ఈనాటి కి... బంగారం లాంటి స్త్రీ అని వాడుక...
అందునా సీతమ్మ వారు లక్ష్మీ అంశ...
కనక అంటే కూడా లక్ష్మీ అనే కదా మనం నిత్యం వాడుకలో అనుకునేది..
అయిననూ సీతమ్మతో  కీర్తన ప్రారంభం అంటే....
ఇదో మాతృభావన...మనం మన గృహం తలచుకోగానే ఎవరు తలంపుకి వస్తారు అంటే  ప్రధమంగా   అమ్మ..తరువాత నాన్న...
అలాగే బాల అనే పదానికి ఇంకోక విశేషం తెలుసుకుందాం..
అమ్మ వారి అనేక రూపాలలో బాల రూపం ఒకటి...
అమ్మ అంటే శక్తి, అమ్మ అంటే ఆదరణ, ఆప్యాయత, ప్రేమ ...సకలం అనుగ్రహించు దివ్యశక్తి...
అమ్మ అతి స్వల్ప మైన వాటితో కూడా అత్యద్భుతంగా సృజన చేయి శక్తి...
అమ్మ అల్ప సంతోషి...బిడ్డడి ఆనందం తన ఆనందంగా భావన చేయి ఎకైక వ్యక్తి అమ్మ మాత్రమే...
తన బిడ్డడి ఆర్తీ అమ్మకి తప్ప మరి ఎవరికి తెలుస్తుంది...
మరి ఇంతటి చల్లని తల్లితో వున్నవారు ఎలావున్నారు అంటే...కనక మయ చేల..
కనక అంటే బంగారం ...మయ అంటే నిర్మితి, నిండి వుండుట, అలదు కోవటం...చేల అనగా వస్త్రాలు....
బంగారు వస్త్రాలు ధరించి వున్నారట....
మరి ఇవి అన్నీ రాజ లాంఛనాలు సూచన చేస్తున్నాయి...మరి ఈయన ఎవరిని పాలన చేస్తున్నారు అంటే సుజన పరిపాల అంట...
సుజనులు అనగా మంచి వారు అని గ్రహించాలి...
మరి ఆయన ఎలాంటి వారు అంటే ....శ్రీరమాలోల అనే పదంతో సూచన...
శ్రీ అన్ననూ లక్ష్మీ.....  
 రమా అన్ననూ లక్ష్మీ నే....  
మామూలు అర్ధం చూస్తే లక్ష్మీ దేవికి వశ్యుడు అనే విధంగా కనపడుతుంది...  
కాని అది కాదు...  
శ్రీ అంటే స్థిరనివాసం...  
రెండోవ పదం అయిన రమ కు లక్ష్మీ అనే భావానికి సకల శుభలక్షణాలు శుభ గుణాలు అనే విధంగాను అష్టలక్ష్మీలు ఆవాసం అని   మనం భావన చేయాలి...
త్యాగరాజు గారు ప్రతి పదం ఆచి తూచి స్వరయుక్తంగా రాగయుక్తంగా వుండేలా చూసి ప్రయోగించారు...  
మనం ఉచ్ఛారణ లో కూడా అది గ్రహించాలి...  
శ్రీరమాలోల అన్న పదం మనం స్త్రీ లోల అని ఉచ్ఛారణ చేశామా పూర్తి విరుద్ధంగా వుండే అర్ధం వస్తుంది...  
ఇక్కడ త్యాగరాజు గారు అర్ధి అని మనం గుర్తించాలి....  
ఎవరైనా ఆర్ధి తనకు సహాయం కావలసి వచ్చిన, దానిని పూర్తి చేయగల శక్తిమంతుల వద్ద వేడుకుంటాడు....
.మరి త్యాగరాజు ఆర్ధిగా తన వేడుకోలు ను  ఎవరు నిర్వర్తన చేయగలరు అంటే శ్రీరమాలోల అన్నపదం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. 
మరి త్యాగరాజు కోరినది ఏమిటి అంటే కైవల్యసిద్ధి....
ఇప్పుడు  మీకు పూర్తిగా శ్రీరమాలోల అన్న పదంనకు విస్తృత  అర్ధం ఆపై      శ్రీరాములు వారు సకలశుభ సమన్వితుడుగాతో పాటు వాటిని ప్రసాదించగల వేలుపు గా    దర్శనం..
దీని తరువాత పదం ....
విధృత శరజాల.....
ధృతి అనే సంస్కృత పదానికి శౌర్యం, వీరత్వం అనే అర్ధాలు వున్నాయి...ఈ పదంకు "వి " అనే ప్రత్యయం చేరి ...విధృత అనగా విశేషమైన శౌర్యం...అసమాన పరాక్రమం...
రాజుయొక్క క్షాత్రం అతని సైనిక పాటవంలో అతని ఆయుధ నైపుణ్యం లో అతని ప్రవర్తన లో దృగ్గోచరం అవుతుంది...
రాముని యొక్క ఆయుధం...కోదండం...
దాని నుంచి శర ప్రయోగం...
ప్రయోగ శర లక్షణం సూటిగా నేరుగా 
లక్ష్య ఛేదన....
విల్లు యొక్క నారి ఎంత విస్తృతంగా సారించి లక్ష్యం వైపుగా గురి పెట్టి శర ప్రయోగం చేస్తారో అంత శక్తివంతంగా లక్ష్య ఛేదన జరుగుతుంది.
ఇది వీరత్వం యొక్క లక్షణమైతే...ప్రవర్తన కు ఈ విధంగా అన్వయించుకోవాలి....రాముని ప్రవర్తన సూటిగా స్పష్టంగా వున్నదట....
ఇప్పుడు మన పాఠకులకు ఒక సందేహం...ఇంత గొప్ప క్షాత్రం వున్న శ్రీరాముడు మన మాట...మన మొర ఆలకించుతాడా అంటే....దానికి వెంటనే త్యాగరాజు గారు ప్రయోగించిన పదం...
శుభద కరుణాలవాల....
మనకు కొన్ని సమయాలలో కొన్ని భరోసాలు కావాలి.... కోర్టు వారు మన మొర వినటం ఒక విధమైన భరోసా...
అలాగే ఆపద సమయంలో మన తాలుకా ఇబ్బంది వినే వారు మనకు భరోసా... ఇలా వినాలి అంటే వారి హృదయము ఆర్ద్రత తో నిండి వుండాలి అప్పుడే కరుణ , దయలాంటి లక్షణాలు కలిగి వుంటాయి...
మరి అందుకే శ్రీరామ చంద్రుడు శుభద
కరుణాలవాల అని త్యాగరాజు గారు తెలుపుతున్నారు...
మరి ఇంతటి మూర్తి  సాదృశ్యుడా లేక అదృశ్యుడా లేక మార్పు చెందుతాడా అంటే....
తరువాత పదం "ఘన నీల"
రెండు భిన్నమైన పద ప్రయోగాలతో 
విలక్షణమైన అర్ధ సౌందర్యం...
ఘన అన్న పదానికి గొప్పదైన, స్థిరమైన, కీర్తీవంతమైన అన్న అర్ధాలు వున్నవి... 
అలాగే నీల అనే పదానికి నీలం, గరళం, జలం లాంటీ అర్ధాలు వున్ననూ ప్రస్తుతం మనం నీల వర్ణం అన్న విషయం తెలుసుకుందాం..... అలాగే శ్రీరామ విషయంలో ఘన అనే పదానికి అనేకానేక విశేషణాలు వున్నవి.... శ్రీరామ చంద్రుడు వంశ పూర్వీకులు రఘవంశీకులు గా ప్రసిద్ది.... అలాగే శ్రీరామ నిర్ణయం, వాక్కు స్థిరము....
నీల అనగా శ్రీరాముల వారిని మేఘ శ్యామ అనే విధంగా పోల్చుతారు...
మేఘం ఆకాశం లో వుండి మనకు నీల వర్ణంగా కనపడుతుంది...
ఆకాశం అనేది సర్వ ప్రాణికోటికి అవకాశం ఇస్తుంది... అలాగే జీవకోటి మనుగడకు ముఖ్యమైన జలం ప్రసాదిస్తుంది...
కనుక సకల ప్రాణికోటికి శ్రీరాముల వారు ఆకాశ సదృశ్యులు....
దీని తరువాత పదం...
నవ్య వనమాలికభరణ....
వివిధ మైన అందమైన పూలమాల ధరించిన....
ఇది అనుపల్లవి వరకు విశేషార్ధం....
పూర్తి చరణాలకి అర్ధ విశేషాలు తెలుపుదామని వున్ననూ సమయ భావం వలన అవకాశం లేదు...
అయిననూ శ్రీరామ కరుణ, ఆజ్ఞ అయితే మహాప్రసాదం....
అంత వరకూ కొంత విరామం...
సర్వులకు సకలం శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, విమర్శలు , సందేహాలుకి...
ఆలపాటి రమేష్ బాబు..
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో 
విజయవాడ 
9440172262.

6, మే 2025, మంగళవారం

ముకుందుడు మెట్ట్లు ఎక్కుతున్నారు..

మన తెలుగు నాట ఒక సాంప్రదాయం వున్నది...
అది ఏమిటంటే...గృహంలో వున్న శిశు బాలకుడిని... శ్రీకృష్ణ అంశగా భావన....
ఆయన ప్రసాదమని.... శ్రీకృష్ణ రూపుడనే భావనతో... శ్రీకృష్ణుని పరంగా శిశువు ఎదిగే క్రమంలో...నిత్య క్రియలు సందర్భంగా... శ్రీకృష్ణుని కి అన్వయం చేస్తూ అనేకానేక కీర్తనలు...పాటలు...పద్యాలు వున్నవి....
ఇది మన తెలుగు నాట కాదు యావత్ దేశంలో వున్న భావన....
అందుకు అనేకానేక ఉదాహరణలు వున్నాయి...
మొట్ట మొదటి ఉదాహరణ....
సూరదాస్...ఈయన పుట్టు అంధుడు....కాని ఈయన రచనలలో బాలక్రిష్ణుని వర్ణన  ఎంత మధురంగా వుంటదంటే...సాధారణ ప్రజలు ఆవర్ణన పుట్టు అంధుడు చేశాడు అంటే నమ్మలేనంత.... అందుకే ఆయన స్మృతి పధం లో సదా శ్రీకృష్ణుడు నాట్యం ఆడుతున్నారని వాడుక...
తమిళనాట  వెంకట కృష్ణకవి వున్నారు... కాకపోతే  వీరు సంస్కృతం లో రచన....
తెలుగు నాట క్షేత్రయ్య.....
మహారాష్ట్ర లో అయితే విఠలుని పరంగా గుర్తించ తగిన మంది భక్తులు వున్నారు....
గుజరాతి లో వున్నారు...
ఇక బెంగాల్ ప్రాంతం అయితే... శ్రీచైతన్యులు....
ఇక ఈయనను అయితే శ్రీకృష్ణుడు మరలా ఈ రూపంలో లో జన్మించారు అంటారు...
ఇలా అనేకానేక....ఉదాహరణలు...
అసలు మన మోక్ష ప్రదాయక గ్రంధం...
శ్రీ మహాభాగవతంలో వ్యాసుల వారు దశమ స్కంధం మొత్తం శ్రీకృష్ణుని లీలా వైభవం....
పోతన గారు కూడా యధావిధిగా కొనసాగించారు...
ఆనాడు ద్వాపర యుగ సందర్భం గా శ్రీకృష్ణుని లీలా వైభవం మనం స్వయంగా చూడలేదు...
అందుకే మన శిశు బాలుడిని  శ్రీకృష్ణునిగా భావన...మన ఇల్లు గోకులం అయితే అనుకుంటే...
ఇక మన ఒడిన వున్నవాడు....స్వయంగా ఆయనే....
అందుకే మా దౌహిత్రుడైన ముకుందుడు ను నేను క్రిష్ణ రూపంగా పాటలు పాడేది....
కాకపోతే నేను ఇక్కడ మీకు తెలిపేది....రాబోవు రోజుల్లో మీరు కూడా ఈ సాంప్రదాయం పాటిస్తారనే భావన...
ఇక ఇక్కడ నేను తెలుపు తున్న చిన్న పాట....
మనవడు మొదటి సారిగా మెట్లు ఎక్కు తున్నారని...మా అమ్మాయిగారు పంపిన వీడియో చూడగానే నా నుండి వచ్చిన అప్రయత్న స్పందన....
వడి వడి నడకల శ్రీకృష్ణ 
వడి వడి నడకల శ్రీకృష్ణ 
పడి ఎరు పరంధామ పురుషోత్తమ 
పడి ఎరు పరంధామ పురుషోత్తమ...
వడి వడి నడకల శ్రీకృష్ణ
+++
వడి = వేగంగా 
పడి = మెట్టు
ఎరు = ఎక్కుట
+++
వడి తెలుగు పదమే....
పడి , ఎరు - ఈ రెండు పదాలు ద్రావిడ పదాలు అంటే తమిళ పదాలు...

4, మే 2025, ఆదివారం

జీవన తరంగాలు 1

భరించలేని గుండే కోతగా వున్నది...
ఏమిటో తెలుసు ఎందుకో తెలుసు కాని ఆశక్తుడను...ఆ బాధ గుండే దాటి పోవటం లేదు....ఇది నాలోని అంతర్మధనం...ఇది అలాగే కొనసాగుతుంది....
నిరుత్తరత అనే పదానికి అర్ధం అనుభవం లోకి వస్తుంది....
మౌనంగా నాలోకి నేను కుచించుకు పోవటమా...ఒదిగి పోవటమా....
అంతర్మధనం చెందటమా...ఎమో నాకు తెలియదు...ఎదో జరుగుతుంది....
అది ఆపని...ఆపుకోలేని వెల్లవలా కమ్ముతున్నది...ఎంత ప్రయత్నించినా...ఎంత అదిలించినా...బెదిరించినా...అంతకు రెట్టింపు బలంగా సునామిలా....వేసవి గాడ్పులా... అమావాస్యపు చీకటిలా....చిక్కటి పొగలా నన్ను ఆవహిస్తున్నది...ఆక్రమించుతుంది....
కోమాలో వున్న వ్యక్తి జీవించే వుంటాడు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేయలేడు. నేను కూడా రివర్స్ కోమాలో వున్నాను. నిత్య నైమిత్తిక క్రియలు జరుగుతున్నాయి. వ్యక్తిగా నా భాధ్యత లు నేను నిర్వర్తించ లేను...
ఇది ఒక విధమైన నిర్లిప్తత కు దారితీస్తుంది....ఈ మానవ ప్రపంచపు సమూహాలలో నాది మాత్రం కదిలే ఏకాంతర వాసం....నాలో నేను...
నాతో నేను...ఇది కధ...ఇది వ్యధ...
ఇది మూర్ఖత్వమా అమాయకత్వమా తెలియదు...నాన్నగారి ప్రభావం ఇంకనూ విడవకున్నది....
ఆయన నడిచిన మార్గం ఇంకనూ నాకు పచ్చగానే కనపడుతున్నది...ఆయనకు ఇచ్చిన మాట మరచిపోలేకున్నది...
ఆయన కదలిక...ఆయన మాట... స్మృతి పధం వీడనంటున్నవి....
ఆయన నా బలం...నా బలహీనత...
ఆయన కుటుంబంని ధృడంగా పట్టుకోవటం నేర్పారు....సంతానం పై ప్రేమ అనురాగం నేర్పారు....అన్నిటి కన్నా ముఖ్యంగా ఆయన నన్ను నమ్మారు....దీనికి ఋజువులు ఉదాహరణలు లేవు...ఆయన మనస్సు...నా మనస్సు తప్ప...
నాన్న నాకు చాలా కొత్తగా దర్శనం ఇచ్చింది ...30-04-1994 న అంటే నమ్ముతారా....ఆయన అంత బేల అవటం....ఆయన నుంచి నేను విడిపోవటం...జీవనం గురించి విజయవాడ కుటుంబం షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆయన వేదనకి సాక్ష్యం నా మనస్సు...ఆరోజు ఆయన నన్ను పట్టుకున్న తీరు....
గృహప్రవేశం మరికొద్ది సమయంలో ప్రారంభం అవుతున్న సమయంలో ఆయన అభిమానంగా దగ్గరకు తీసుకుని...నా నుదురుపై ఆయన పెదవులతో స్పృశించిటం...అది ప్రేమ...అభిమానమా... ఆప్యాయత....జీవితపు ఆఖరి క్షణంలో ఆయన నాపై చూపిన అపార నమ్మకం....తీసుకున్న వాగ్దానం....
ఇలా అనేకం...
ఇలా వీటి అన్నీటికి జవాబులా.....
నా మనవడు గారిని మా నాన్నగారు గా భావన చేయాలనే సంకల్పం, పట్టుదల....
( ఆయన పేరు పెడతారా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు) ఆయన లాంటి ఉదాత్తుడును...శిశువుగా నా ఒడిలో కూర్చొనబెట్టి మురిసి పోవాలని....
కాల చక్రభ్రమణం అంటే అర్ధం ఇది అని తెలుసుకోవాలనే తపన.... ఆశ...
అలాగే...వంశపు పెద్ద మనవడి గా నేను అనుభవించిన హోదా....ముద్దు ముచ్చట...మా వంశపు రాబోవు మనవడికి అందించాలనే భాధ్యత సంకల్పం...
ఇది మా పెద్ద నాయనమ్మ గారు..
కీ.శే. శ్రీమతి ఆలపాటి రావమ్మ గారు అందించారు.....ఆమే నాకు ఊహ వచ్చు వరకు 1979 వరకు జీవించారు కనుక..ఆమే నన్ను ఎంత ప్రేమించారు అభిమానించారు అనేది నాకు మాత్రమే అనుభవం...
అలాగే మా తాతగారు శ్రీరాములు గారు.... అయితే వీరిది కొంత విలక్షణ ప్రేమ...ఇలా మనవడిగా నేను పొందిన ఆప్యాయత....నా తదనంతర తరాలకి అందించాలనే తపన.
అందుకే హితం అని భావించిన ప్రతి చిన్న ప్రయత్నం ని వదలక పట్టుకోవటం.
సంసార సాగరపు మధ్యన...ఏ చిన్న గడ్డి పోచ లాంటి ఆధారం చిక్కిననూ....అది హితం అని నమ్మితే దానిని ప్రతిపాదన చేస్తున్నా....
కాక  పోతే లౌకిక భావనలు దృష్ట్యా ఆ ప్రతిపాదనలు వీగి పోవటమో లేక నిరాదరణకు గురి అవటమో లాంటి చర్యలుకి గురి అవుతున్నాయి....
ఏమో కాలరూపుడైన శివుడు నాతో ప్రతి రోజు ఆరాట పోరాట ఆట....ఆడిస్తున్నాడు...ఆట గదరా శివ...ఆట...
అంటే....బాధ్యత శూలపు కొనతో తట్టుతూ ... పరిహాసం ఆడుతున్నాడు...
రోజు ఉదయించే కాలపు మలుపులో నీవు గెలుస్తావు అనే నమ్మకం ఇస్తున్నాడు.... రాత్రికి...నిద్రపోయే సమయానికి.... జీవన అనుభవపు ఎత్తులు జిత్తులు తప్పులు వెరసి అన్నీ కలిసి....మనిషి, మనస్సు అలసి పోయి , సొలసి పోయి , డస్సి పోయి...ఒరే బడుద్దాయ్! అని శివుడి పరిహాసం....
ఇది కథ..
ఇదే కథ...
ఇంతే కథ...
వెరసి...
నాలో నేను...
నాతో నేను....



2, మే 2025, శుక్రవారం

మురళి మనోహర గోపాల

మురళిమనోహర గోపాల
రాధ మాధవ గోపాల
పరమ పురుష గోపాల 
భాగవతోత్తమ గోపాల 
మోక్షప్రదాయక గోపాల
గోపిక ప్రియనే గోపాల 
గోరూపధార గోపాల
కేళి లోల గోపాల 
ధర్మరక్షక గోపాల 
చక్రధారి గోపాల
మునిగణ వందిత గోపాల 
సర్వ జన ప్రియనే గోపాల
కుచేల సఖనే గోపాల
అనాధ నాధ గోపాల
ఆపద రక్షక గోపాల



26, ఏప్రిల్ 2025, శనివారం

మనవడు ఊరు వెళ్ళితే

పెళ్ళి వారి ఇల్లు లా బోసి పోయింది....
స్థబ్దుగా గంభీరంగా వున్నది....
స్వామి వారితో విడియో కాల్ మాట్లాడి నప్పుడు తప్ప, మిగిలిన సమయాల్లో ఏమిటో కేశవ నామాలు , పాటలు మాయమైనవి.... అమ్మమ్మ , జేజమ్మ ఏమిటో వెలితితో నిద్ర పోతున్నారు...
పిల్లవాడికి నూనే పెట్టమనే  హెచ్చరికలు లేవు.....ఇటు నుంచి అటుకు మార్పులు లేవు...
మధ్య రాత్రిలో దేవతా సందర్శనంలా...
స్వామి వారు మసలటం కాని....
వారి చిరుమువ్వల సవ్వడి కాని లేవు...
మధ్య రాత్రి గుండెల నిండుగా శ్వాస పీల్చుకొని మెల్లగా నిదానంగా కృష్ణా అని పిలవటం లేదు ఏమిటో గొంతు మూగబోయినట్లు అయినది....
ఉదయాన్నే అర్జేంట్ గా రైలు కోసం హడావుడి పడినట్టు ....ఆచ్ బై లు....ఉదయాన్నే ఇడ్లి తీసుకు రావటం మాయం....
సాంబార్ తీసుకు రండి కొద్దిగా అన్నా తింటాడు అనే హెచ్చరిక లేదు...
ఈరోజు ఏ పండు పెట్టాలనే చర్చ లేదు....
రాత్రి షాపు నుంచి త్వరగా రావాలనే ధ్యాస లేదు.....ఇడ్లి పిండికి వెళ్ళేటప్పుడు.... స్వామి వారి నగరోత్సవ సేవ లేదు.....
ఎక్కడి సామాను అక్కడే.....అదేమిటో మరి స్వామి వారు వున్నప్పుడు అన్నీ వస్తువులు కి చైతన్యం ఆవహించి....నడిచి వచ్చినట్టుగా అన్నీ హాలులో ఆయన అనుగ్రహించే వారు...
ఆనాటి కృష్ణుడు కి చుట్టుతా గోవులు వుంటే...ఈ కృష్ణుడు చుట్టుతా మేమంతా....
కృష్ణుడు ద్వారక కి వెళ్ళిన తరువాత గోకులంలోని వారి పరిస్థితే మాది....
మనుషులం ఇక్కడ మనస్సు అక్కడ....
నిన్న ఉదయం వచ్చిన నుంచి మీ అమ్మ గ్యాలరిలో మీ ఫోటోలు, స్వామి వారి వీడియో స్నిప్పెట్ చూడటం....మురిసిపోవటం....మరలా అంతలోనే చేయినది ఏమి లేక చేయలేక దిగులుగా వుండటం....
ఇది రెండు రోజుల్లో  మౌనంగా మారుతుంది మరీ రెండు రోజుల్లో గంభీరంగా మారుతుంది... తరువాత ఏమిటి అనేది నాకు గుబులుగా వున్నది.....
ఏమిటో మహాలక్ష్మీ కి తెలియని ఒపిక ఉత్సాహం వచ్చినవి... లేకపోతే తొందరగా బయటకు కదలటానికి సుముఖత చూపని ఆమే .... స్వామి వారి కోసం ఇటునుంచి రైలులో వెళ్ళి మరలా అదే రైలులో స్వామి వారితో తిరుగు ప్రయాణం అయినది.....
తిరువళ్ళూర్ నుంచి వచ్చి....48 గంటలు గడవక ముందే హడావుడి గా ఇల్లు సర్ది ప్రయాణం కి కావలసిన సకల సామానులు సకల సంబారాలు వేగవేగంగా ఏర్పాటు....ఏమిటో మంత్రి గారు పర్యటన కి వస్తే హైరనా పడే సాధారణ ప్రజానీకం లా .... మహాలక్ష్మి మొత్తం పైది క్రిందకు, క్రిందది పైకి చేయాలనే బృహత్ ప్రయత్నం....
మహాలక్ష్మి ఎన్నడు నాతో చెప్పదు....
ఇది చేయమని....కాని....
ఏమిటో ఆమే లక్షణం నాకు తెలిసినదా....ఆమే మనస్సు నాకు అవగాహన అయినదా....మీరే అంచనా వేసుకోవాలి..... అందుకే సతీష్ ని రైలులో తిరుగు ప్రయాణంలో మా అమ్మాయి దిగి బుధవారం వస్తుంది అని రిక్వెస్ట్....
అందుకే కారు మాట్లాడేది....
ఆమే సంతోషంగా ఆనందంగా వుంటే ఆర్ధిక భారం అనిపించదు చేయలేను అనే ధ్యాస వుండదు....అది ఆమే కోసం చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో ముందుకు వెళ్ళటమే.....
ఇవి గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహరం....
కృష్ణా.....అందరి దుఃఖాలను తీర్చు వాడివి....వేదనను దూరం చేసేవాడివి....
సకల సంతోష ప్రదాతవు......
నా బాధ, ఆర్తి నీకు తప్ప ఎవరికి విన్నవించను.....దయచూడు స్వామి......మా నాన్నగారు ని మరలా నాకు ప్రసాదించే మార్గం అనుగ్రహించు దీన బాంధవ.....
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్....
నీవే తప్ప ఇహ పరంబుఎరగ....
అన్యధా శరణం నాస్తి రక్ష రక్షో జగన్నాధ...

23, ఏప్రిల్ 2025, బుధవారం

జోల పాటలు 2

శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సీతామనోహరం, రఘు వీరం
వేదాంత వేద్యం,  శ్రీ ధర్మ రూ
పం 
సీతామనోహరం, రఘువీరం
వేదాంత వేద్యం శ్రీ ధర్మ రూపం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
ఓ సేతు బంధం దశకంఠ నిధనం 
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సాకేత ధామం కోదండ రామం
శ్రీరామ నామం సకల కళ్యాణం 
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 

22, ఏప్రిల్ 2025, మంగళవారం

జోల పాటలు -1 me

ఎన్ని జన్మల వేచి చూతనో
ఏనాటి పూజ ఫలమో

ఏ నోము నోచెనో
ఏ పండు ఫలమిచ్చెనో
ఏ పూలు గుణమిచ్చేనో
ఏ యాగ యోగ మహిమో
ఏ పుణ్యము ఉపకరించేనో
ఏ వరము అందివచ్చేనో
నా యందు నీ కరుణ
నీ ప్రేమ అమృతంబు వర్షింప
ఈ ముకుంద నామంబున
నా ఒడిన పవళించు శ్రీకృష్ణ 
జయ మంగళ రూప జయ శ్రీకృష్ణ.

20, ఏప్రిల్ 2025, ఆదివారం

జోల పాటలు

అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
ఇంటిలోని అన్నం పప్పు 
ఉట్టి మీద పాలు పెరుగు 
దేవుడింట గంట బెల్లం
పొదరింట మొగ్గ పూలు
సావిటింట ఆవుదూడ 
వెనకింట తులసి బిల్వం
తోటలోని కాయ పండు
చేనులోని నారు మొక్క
చెరువులోని చేపనీరు
ఎగిరేటి చిలుక పిచ్చుక 
తిరిగేటి కుక్క కోడి
ప్రాణమిచ్చు అమ్మమ్మ 
మురిసిపోయే తాతయ్య 
ఆటలాడు మామయ్య 
అన్నీంట వీడే అంతటా వాడే
సకలంబు వీడే గోవిందుడు
వరాన వచ్చాడు వరమివ్వ వచ్చాడు
వరహల దేవుడే కరివరదుడు 
మోక్షమివ్వ వచ్చాడు ముకుందుడు.
అల్లరి వాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు.