4, మార్చి 2023, శనివారం

సీతా కళ్యాణ వైభోగమే - కీర్తన అర్ధం విశేషాలు

శంకరాభరణము - ఖండలఘువు

పల్లవి
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే | | సీతా | |

అనుపల్లవి
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |

చరణము 1
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా |
చరణము 2
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |
చరణము 3
సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |
చరణము 4
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాగ విదార నత లోకాధార | | సీతా | |
చరణము 5
పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా.
"సీతా కళ్యాణ వైభోగమే" ఈ కీర్తన ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు స్వామి వారిచే సృజించ బడినది.
ఈ కీర్తన శంకరాభరణం రాగంలో, ఖండలఘువు తాళంలో స్వర పరచినారు.
ఈ కీర్తన ఎంతో ప్రాముఖ్యత కలది...
పూర్వం దక్షిణాదిన ప్రతి పెళ్ళి నందు ఈ కీర్తన తప్పనిసరి , కాని నేటి కాలమాన ప్రభావం వలన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆ సాంప్రదాయ ఆచారం తగ్గి పోయింది...కాని నేటికి తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది....దానికి అభినందించాలో... తెలుగు కీర్తన తెలుగు భాషా ప్రాంతాలలో కనుమరుగు అవుతున్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్దావస్థ లో వున్నాం.
త్యాగయ్య గారు తెలుగు వారు , వారి కీర్తన సాహిత్యం అంతయునూ తెలుగులో వున్ననూ...తమిళ నాట తెలుగు మాతృభాష కాని వారు కూడా త్యాగరాజ కీర్తనలు విద్వాంసులుగా పాడుట వలన చాలా కీర్తనలలో అక్షర దోషాలు వున్నాయి...ఈ కీర్తన కూడా నేను శోధన చేయగా 5,6 వెర్షన్ దొరికినాయి. నేను దాదాపు 30 మంది ఔత్సాహికులు నుంచి ప్రముఖులు వరకూ పాడిన విధానం మరియి నా స్వబుద్ధి ఉపయోగించి శ్రీరాముల వారి కరుణతో మీ ముందుకు ....ఈ కీర్తన లోని అర్ధ విశేషాలు తెలియ చేయ ప్రయత్నం.
మాములు వచన సాహిత్యము కి పరిమితి వుండదు...కాని పద్యం నందు  మరి ముఖ్యంగా కీర్తన యందు పూర్తిగా  చాలా పరిధి లో సృజన చేయాలి.
రాగం, తాళం,చందస్సు, వృత్తం లాంటివి అన్నియునూ పరిధి నిర్దేశం . అయిననూ త్యాగయ్య గారు రామకరుణా కటాక్షములు, నారదలు వారి ఆశీస్సులు లతో లభించిన "స్వరార్ణవం" సంగీత గ్రంధం సహాయంతో అనేక విశిష్ట కీర్తనలు రచన చేశారు.
ఈ కీర్తన స్వరూపాన్ని పరిశీలన చేస్తే అనుపల్లవి, పల్లవి, 5 చరణాలు గా వున్నది. అనుపల్లవి నందు ఆంజనేయ ప్రస్తావన, ఆఖరి చరణం నందు పరమేశ్వర ప్రస్తావన వుంటుంది గమనించండి.
ఇది ఎందుకో గమనించండి...
మన పౌరాణిక కధలు, గాధలు, వ్రతాలలో ప్రారంభ సమయంలో నైమిశారణ్యంలో శౌనకాది ప్రముఖ మునుల మధ్యన, లేక ఫలానా దేవతా ఉవాచ అంటూ ప్రారంభం కాని అవే ముగింపు సమయంలో ఫలిత నిర్ణయ సమయంలో
ఈ వ్రతం, నామం పఠించిన, పారాయణ చేసిన , లేక వ్రతం శ్రద్ధగా నిర్వర్తించితే ఫలానా దేవి దేవతా స్వరూపం ఈ విధమైన ఫలితం అని నిర్దేశించుతారు గమనించండి. అదే సాంప్రదాయం, అదే ఆచరణ ఈ కీర్తన యందు కూడా త్యాగరాజ స్వామి వారు పాటించారు.
దీనికి కారణం మీరు చేయి ఈ క్రియ ఫలానా దేవతా స్వరూపం వారిది అని మనకు తెలియ చేయటం.
ఇక ఈ కీర్తన సమయం త్యాగయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మి వివాహ సందర్భంగా అని నా అభిప్రాయం.
ప్రతి తండ్రి తన కుమార్తె వివాహం చేయాలని కలలు కంటాడు .తను అల్లారుముద్దుగా పెంచుకున్న తన లావణ్యరాశి, బంగారు బొమ్మ, సాక్షాత్తు తన ఇంటి మహాలక్ష్మి గా భావించే కన్యకు ఎటువంటి వరుడు లభిస్తాడో అని సర్వులు భావిస్తారు. ఆ కన్య వివాహ సమయంలో వరుని యొక్క వంశ, రూప, గుణాలను పరిశీలించి ప్రస్తుతిస్తుంటారు . అందుకే కాబోలు త్యాగయ్య గారు వరుని గుణ గణాలు శ్రీరాముని పరంగా చూపుతూ అదే సమయంలో శ్రీరాముని ఆధ్యాత్మికంగా కీర్తీంచారు. మనము శ్రీరామ కీర్తన గా భావన లేక వర ఎంపిక లక్షణ కీర్తన అంటే వారి వారి భావజాలం పరంగా భావన చేయండి.
పల్లవి
" సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే"
చూడండి గమ్మత్తు... కీర్తన ఏమో రామ ప్రస్తుతి, కాని కీర్తన ఆరంభం మాత్రం సీతతో... ఎందుకంటే మనం సమాజం మాతృ స్వామ్యయ వ్యవస్థ నుంచి పితృ స్వామ్యం కి మారినది  అన్న విషయం మనం గుర్తించాలి , అయినా వివాహ విషయంలో స్త్రీ కి వున్న ప్రాధాన్యత పురుషునకు కొంత తక్కువ. అమ్మాయి వివాహం అంటే అందరూ కదలి వస్తారు తమ వంతు పాత్ర నిర్వర్తించుతారు.

ఇది మన సాంప్రదాయం... స్త్రీ చేరిక తరువాత మాత్రమే పురుషుడు వ్యక్తుడుగా , కుటుంబ జీవన అర్హుడుగా సమాజంలో గుర్తింపు , తద్వారా సమాజం నకు ఇంకొక చైతన్య వంతమైన చేరిక కలుగుతుంది. దీనికి రాముడు కూడా బద్ధుడే...
"సీతా కళ్యాణ వైభోగమే" అన్న పల్లవిలో సీతారాముల కళ్యాణ విశిష్టత ను "వైభోగమే" అన్న పదం ద్వారా మనకు సూచన చేస్తున్నారు.
భోగము, విభవం, వైభోగం మూడునూ సమరూప పద ప్రయోగాలుగా భావిస్తారు  కాని ఇవి మూడునూ వేరు వేరు సందర్భాలలో ఉపయోగిస్తారు.
భోగము అన్నది ఐహిక సుఖ, లేక ఆహర నివేదన సమయాలలో మాత్రమే వినియోగం.
వైభవం అన్నది ఐశ్వర్య జీవన ప్రదర్శన సమయాల్లో ప్రయోగం.
వైభోగం అన్నది మాత్రము దైవకృప మరియి దైవసంబంధ సామూహిక ఘట్టాలలో ప్రయోగం...
మరి వైభోగం ఆయా దేవతా రూపాలకా...
కాదు కానేరదు... ఆయా దేవి దేవతా రూపాల కళ్యాణ దృశ్యదర్శనం మనకు యోగం. సాక్షాత్తు లక్షీ, నారాయణ రూపాలైన సీతారాముల కళ్యాణ దర్శనం మనకున్న యోగంలలో ఒక గొప్ప యోగం. అందుకే త్యాగయ్య గారు
"సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే"
అని ప్రారంభించారు.
అనుపల్లవి
"పవనిజస్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"
సాధారణంగా కీర్తన సాహిత్యం లో మనం పల్లవి మాత్రం గమనిస్తాం. కాని ఈ కీర్తన లో అనుపల్లవి కూడా కలదు.
ఈ అనుపల్లవి లో శ్రీరాముని యొక్క విశేషతను ఒక దైవ రూపం ద్వారా ప్రారంభించారు. పవనిజ అనగ వాయు పుత్రుడు అయిన ఆంజనేయుడు అని సర్వ విదితిమే. ఆంజనేయుడు , శ్రీరాముని పవిత్ర చరిత్రను స్తుతి చేస్తున్నారు.
హనుమది  అచంచలమైన రామభక్తి అని మనకు తెలిసినదే.
ఈ సమయంలో మనం హనుమ రామ భక్తుడు ఎందుకు అనేది కొంత వరకు తెలుసుకుందాం....
మనం ఆంజనేయుని ఈ విధంగా ప్రార్ధన చేస్తాం " మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధీమతాన్వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి"
ఆంజనేయుడు శివ అంశ. విశేష ప్రజ్ఞ కలవాడు. నవ వ్యాకరణ పండితుడు, సూర్యుని వద్ద విద్యని అభ్యసించినవాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సర్వ ప్రాణకోటికి చైతన్యం ప్రసాదించు వాడు. సూర్యుడు ఆత్మరూపానికి గుర్తు. మరి అంతటి సూర్యుని వద్ద విద్య నేర్వటం అంటే ఆత్మ నిగ్రహ శక్తి కలిగి వుండటం.
వాల్మీకి వారు ఈ విషయంను రామ, హనుమ ప్రధమ సమాగమ ఘట్టం అయిన కిష్కింధ కాండ , 3 సర్గ యందు విశేషంగా వివరించారు.
రాముడు ధర్మ రూపం.  ధర్మం అన్నిటి కన్నా గొప్పది. కనుక హనుమ, శ్రీరామ భక్తుడు అవటంలో అసంబద్ధం ఏమి లేదు.
తరువాత పాదం
"రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"
శ్రీరాముని కన్నులు ఈ విధంగా వున్నాయట...ఒక కన్ను దగ్ధాయమానంగా ప్రకాశించు సూర్యునిలాగా, రెండోవ కన్ను చల్లని హాయి కొలుపు చంద్ర కాంతిలా...
మనం ఈ ఉపమానం చదువుతాము కాని ఇలా ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే......
మనం ఎవరినైనా దర్శనం చేసినప్పుడు మొట్ట మొదట మనకు అప్రయత్నంగా వారి ముఖ కవళికలు లోని కన్నులు వారికి మన పట్ల గల భావం కాని వారి స్థితిని కాని ప్రస్ఫుటంగా తెలియ చేస్తాయి. తద్వారా వారు ఆనంద, దుఖః, వైరాగ్య, సంతాప, సంతోష, సందిగ్ధత లాంటి అనేకానేక వ్యక్తి అవస్థలు మనం గుర్తు పట్టగలం.
కాని ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకుంటున్నది శ్రీరాముని గురించి...
అయన ఇటువంటి అవస్థలన్నింటికి అతీతుడు....వారి కన్నులు సదా ప్రకాశవంతంగా, ఆత్మనిగ్రహంతోను, గంభీరంగా ఎంతో సుదూరంగా వున్న విషయం అయననూ గ్రహించే విధంగా, సర్వ జనులకు ఆకర్షణీయంగా వుంటూ ప్రశాంతత, ఆదరణీయ దృష్టితో, తనను అర్ధించే వారి పట్ల ప్రసన్నత కలిగి వుంటాడని.... తద్వారా సర్వులకు భరోసా నమ్మకం ఉపశమనం కేవల వీక్షణ ద్వారా లభిస్తుంది.
అందుకే త్యాగయ్య గారు సోమ వర నేత్ర..సోమ అంటే చంద్రుడు. చంద్ర  కాంతి వంటి శీతలత్వం మరియి హాయి కలుగ చేయు కలడని, వర అనగా మనకు ఒక భరోసా, ఒక నమ్మిక ఏర్పరచ  గల పరమపురుషుడని వారి భావన.
ఇటువంటి పరమ పురుష చరిత్ర ఏ విధంగా వున్నదో అంటే రమణీయంగా ప్రజలు గాత్రం చేస్తున్నారట.
రామచరిత్ర మాత్రమే రమణీయం ఎందుకైనది....అంటే అనేకానేక కారణాలు...ఎందుకు మీ చరిత్ర, నా చరిత్ర లాంటివి కావు అవి స్వొత్కర్ష మరియి సుత్తి అవుతాయి రెండోవ సారికే మనకు మనకే బోర్ అనుకుంటాం కాని రాముడు త్రేతాయుగ నాటి అవతార పురుషుడు నేడు కలియుగంలో వున్నాం ..అయిననూ  అనేక విశేషాలు కలవి కాబట్టి యుగాలు మారినా నేటికి ఆరాధ్యుడు...అదియును గాక రామ చరిత్ర ఎన్ని సార్లు విన్నను ,దర్శించిననూ ఏమిటో అక్షణం లో కొత్తగా ఇంకొక విషయం తెలుసుకొని ఆశ్చర్యం చెందుతాం...అరే ఈ విషయం మనకు ఇంతకు ముందు తెలియదే అని ఆశ్చర్యం చెందుతాం...
ఈ సమయంలో అప్రస్తుతం అయిననూ  ఇహలోక సంబంధ విషయం కొంత ప్రస్తావన...
మనం అందరం గమనిస్తూ వుంటాం...మనం ఇండ్ల లోని కుటుంబ స్త్రీ లు, బాలికలు, యువతులు రక రకాల అలంకరణలతో ఎప్పటి కప్పుడు నిత్యనూతనంగా...రోజు చూసే మన బంగారు తల్లి  కూడా ఎప్పటి కప్పుడు కొత్తగా నిత్య నూతనంగా...  గౌను లో  ఒకలా, సల్వార్ లో మరోలా, పట్టు పావడా పరికిణి లలో మరోలా, చీరలో, పూల జడ తో, ఇలా అనేకానేక అలంకరణలతో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా దర్శనం ఇచ్చి మనకు ఆనందం కలిగిస్తారు....
మరి రామ చరిత ఎన్ని సార్లు విన్నను మరలా మరలా విని ప్రస్తుతించ గలం కాబట్టే రామ చరిత్ర రమణీయం అయినది.
చరణం1
"భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల"
ఈ చరణంలో శ్రీరాముడు తన ఆశ్రీతులకు, భక్తులకు, బ్రాహ్మణులకు, సాత్వికులకు  ఏవిధైమన రక్షణ కల్పిస్తున్నారో మనకు తెలియ చేస్తున్నారు.
శ్రీరాముడు అయోధ్యకు మహారాజు మరియు జగత్ ప్రభువు అన్న కోణంలో వివరించు కుందాము...
ఈ చరణంలో శ్రీరాముని రాజసం,క్షాత్రం ను తెలుపుతున్నారు.
రాజు యొక్క అధికారం రాజ్యపాలన.
రాజ్యపాలన అంటే అధికార దర్పం,అధికార ప్రదర్శన కాదు కానేరదు
అధికారమంటే ప్రజలను రక్షించటం, కాపాడటం,శిక్షించడం..
ఈ విషయం లో వాల్మీకి వారే రామాయణ రచన లోనే అద్భుతమైన కౌశలం చూపారు.. శ్రీరాముడు బాల్యం తదుపరి యౌవ్వన ప్రారంభం, అంతేకాదు రావణ సంహరనకు ప్రాతిపదిక మరియు ,రాముని యొక్క క్షాత్రాన్ని అనన్యమైన రీతిలో మనకు రామాయణం లో చూపదలచి విశ్వామిత్ర పాత్ర ప్రవేశం ద్వారా జరిపించారు. విశ్వామిత్రుడు రాముని
యాగ సంరక్షణార్థం తన వెంట తీసుకుని వెళ్ళి ప్రజా కంటకంగా వున్న తాటకి సంహారం. యాగ విధ్వంసం చేయుచున్న మారీచ సుభాహులలో, సుబాహు సంహారం, మారీచుడు పలాయనం రాముని యొక్క వీరత్వ క్షాత్ర లక్షణం ప్రదర్శన...
రాముడు భక్తితో తనను ఆశ్రయించిన వారి యొక్క కార్య నిమిత్తం తన తూణిరం నుంచి శర పరంపరతో సదా సిద్ధమే... భక్తితో అంటే.... నమ్మకం, విశ్వాసం, ఆర్తి తో కూడిన హృదయ నివేదన భక్తి....
సరే రాజ ధర్మం అయిన క్షాత్రం , వీరత్వం తో పాటు పాలన...భుక్తి ముక్తిద లీల భూదేవ పాల...
ఈ చరణం గురించి త్యాగయ్య గారిని ఎంత ప్రశంసించననూ తక్కువే...
తన ఆశ్రయించిన భూదేవులు అనగా బ్రాహ్మణులు కి...భుక్తి...అనగా సాత్వికులకు అవసరమైన నిత్యకర్మానుష్ఠానం, యజ్ఞ యాగాదులకి అవసరమైన ధన, కనక, వస్తు ,వాహన,సంభారాలు అన్నింటిని సమకూర్చే వాడు.
సరే రాజ ధర్మం లో అవి రెండును సహజమే కదా అనుకుందాం...మరి "ముక్తి"...
ముక్తి మాములుగా క్షేత్రాలలో దొరకు పంట...కాదే...
అసలు ముక్తి అంటే...
మానవుడు పునరపి జననం పునరపి మరణం అన్నారు... ఆత్మ తన ప్రార్బద కర్మలను బట్టి జన్మ తీసుకోవటం..ఈ జన్మ కర్మలను బట్టి ఇంకొక జన్మ తీసుకునే జనన మరణ చక్రం లోని  వారికి శ్రీరాముడు జన్మరాహిత్య స్థితిని ప్రసాదించటమే ముక్తి....ఇది భగవత్ కృప వలన మాత్రమే సాధ్యం.
మరి 'లీల' అంటే....
సాధారణ మానవుడు చేయి క్రియలు, చర్యలు అన్నియినూ భౌతికమైనవి కనుక ఇవి జీవన క్రియలు గా అభివర్ణిస్తారు. కాని అధి మానవుడైన దైవ రూపం చేయి అధి భౌతిక చర్య లీల గా పిలుస్తారు.
మరి రామాయణం లో రాములువారు తాను అవతార పురుషుడు అనే ప్రకటనే లేదు మరి ఇక లీలలు ఏమిటండి...
లీలలు అంటే శ్రీక్రిష్ణులవారివే కదా!...
రామాయణంలో కూడా వున్నదా అంటే వున్నది అండి అది " అహల్య శాప విమోచనం"...
యాగ సంరక్షణ తరువాత విశ్వామిత్రుడు తో కలిసి శ్రీరాముడు ప్రయాణిస్తున్న సందర్భం లో గౌతమ ముని ఆశ్రమం లో రాయిగావున్న అహల్య శ్రీరామ పాద స్పర్శ చే మరలా స్త్రీ గా మారుటే అహల్య శాప విమోచనం.
అహల్య శాప సమయం కి శ్రీరాముని వలన శాప విమోచనం కి మధ్యలో కాలవ్యవధి చాలా వున్నది...ఈ మధ్యలో జరగని శాపవిమోచనం ఆ సమయంలో
జరగడమే లీల అని నా అభిప్రాయం.
మీరు శ్రద్ధగా గమనిస్తే... సీతా స్వయంవరం ముందు వచ్చు ఘట్టాలు అన్నీ శ్రీరాముడు వరుడు గా కాబోతున్నారని వాల్మీకి సూచన ప్రాయంగా తెలిపినారు.
సీత అయోనిజ...భూమి నందు జనకునికి లభించిన పుత్రిక....భూమి నందు అంటే... సహజంగానే మనం మన తల్లి తండ్రుల వారసత్వ లక్షణాలు కలిగి వుంటాము. మరి సీత భూదేవి ద్వారా అంటే భూమాతకి కలిగిన సహనం, ఓర్పు, సచ్ఛీలత,శీలం అన్నవి ఆమేకు సహజ సిద్ధంగా వున్నవి...మరి ఆమెను పొందవలనంటే శ్రీరాముడు ఎంతటి వాడు గా వుండాలి....
రామాయణం లో ఇంతవరకూ సీత ప్రస్తావన వుండదు...కాని వాల్మీకి రచన నైపుణ్యం అదే.. రాబోవు సన్నివేశాలకు ముందుగానే ఇక్కడే ప్రస్తావన చేస్తూ మనకు సూచనలు ఇస్తుంటాడు...
రాముని యొక్క వీర, ధీర, క్షాత్రం తోపాటు పరస్త్రీ లో పట్ల మాతృభావం కలిగినవాడు అన్న కోణం కూడా అహల్య శాపవిమోచనం ద్వారా తెలియ చేస్తూ మనల్ని శ్రీరాముడు వరుడు కాబోతున్నాడు అని సమాయత్తం చేస్తున్నాడు...
మరి ఈనాటి కాలం కి మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి...
వర ఎంపిక నందు వధువు తల్లి తండ్రులు చూడ వలసినది ఏమిటి..
వరుని రూప, గుణాలతో  వ్యక్తిత్వ, సౌశీల్యం, కుటుంబ జీవనంలో తమ కుమార్తె ను ఏ విధంగా సంరక్షించ గలడు అన్నది, మరియు తన వంతు బాధ్యత ఏ విధంగా నిర్వర్తించ గలడు అన్నది చూడాలి... కాని నేటి వాతావరణం తత్ భిన్నంగా వున్నది.
మన వివాహ మంత్రముల లోనే ధర్మేచ ,అర్ధేచ,కామేచ, మోక్షేచ నాతిచరామి అని వర ప్రమాణం వున్నది...
కాని నేటి సమాజం లో 'అర్ధం ' ఒక్కటి పట్టుకుని మిగతావన్ని వదిలివేసినారు...
కాబట్టి  సమాజం లో ఇన్ని విపర్యాలు చోటు చేసుకున్నవి.
2 చరణం
" పామర సుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ"
సాకేతం అంటే అయోధ్య నగరం .
సాకేతం అంటే అర్ధం స్వర్గానికి దగ్గరగా...
అనగా ఆనాటి సాధారణ ప్రజలు కూడా ఎటువంటి అండ లేని వారు అయిననూ
అనగా విద్య, ధన, వర్ణ, వర్గం,లేని దుర్బల పామర ప్రజలు కూడా మా దేవుడు శ్రీరాముడు వారి అండ మాకు బలం , రక్షణ అని విశ్వసించే వారు వారి ధర్మ బద్ధ మనో కామనలు అన్నీయునూ పూర్తి చేయగలిగేవారు. అందుకనే రాముడు జగదభిరాముడైనాడు.
3 చరణం
"సర్వలోకాధార సమరైక ధీర
గర్వ మానసదూర కనకాగధీర"
సర్వలోకాలను రక్షించుట కొరకు యుద్ధం చేయగల ధైర్య వంతుడు...లోక  చలనం దేనిమీద... ధర్మం అనే నియతి పైన...
మరి ఆ ధర్మమే సరిగ్గా లేని నాడు
ధర్మ బద్ధుడైన శ్రీరామడు యుద్ధం చేయగల ధీరుడు.
అలాగే తన వెంట ఎంత సంపద వున్ననూ...ఆయన స్థితప్రజ్ఞత తో వుంటారు...
ఈ చరణంలో క్లుప్తంగా ఒక చిన్న పదం
కనకగాధీర ‌‌....చూడండి...
ఈ పదం యొక్క అర్ధం...కనకం అంటే బంగారం...అంటే లక్ష్మి...అంటే అష్టలక్ష్మీ స్వరూపాలు....అంటే రాజ్యలక్ష్మి తో కలిపి కూడా అని...ఇంకొక అర్ధం ఇల్లాలు అని కూడా మనం అన్వయం చేసుకోవాలి...
సీత సాక్షాత్ లక్ష్మీ స్వరూపం...శ్రీరాముని ఇల్లాలు...మరి అంతటి సిరి కల లక్ష్మీ వున్నదని శ్రీరాముడు అహంతో వున్నాడా లేదే స్థితప్రజ్ఞత వున్నారు...
అటు వంటి గర్వం తో వ్యవహరించే వారిని ఇతను చేరనీయడు...
అనగా వరుడు డబ్బు వ్యామోహంలో భార్యను నిర్లక్ష్యం చేయు వాడు కాదు...
తన జీవన సమరంలో స్థితప్రజ్ఞత తో వుండి తన వద్ద డబ్బు, అందమైన భార్య వున్నది, ఆమే తో వచ్చు సిరి సంపదలకు ఆశపడి గర్వంతో వ్యవహరించు వాడు కారాదు...తన జీవన పోరాటంలో తన కుటుంబ సభ్యులందరికి ఆధార భూతుడై వుండగలవాడుగా భావించాలి...
ఆ విధంగా నేడు వధు, వరులు వున్నారా అంటే... శూన్యం అనే సమాధానం...
సమాజం...ఉమ్మడి కుటుంబం నుంచి వ్యష్ఠి కుటుంబానికి అక్కడ నుంచి నేను , నా భర్త మాత్రమే అన్న కోణంలోకి పయనం...దీని వలన వచ్చు సాధక బాధకాలు అనేకం...
మనిషి సంఘజీవి, కుటుంబ జీవి...అలా కాకుండా నలుగురుతో కలవని పంచుకోని జీవనం ఏకాంత వాసం...అది ఘోరం దుర్భరం..
ఇది నేటి కాలపు తల్లిదండ్రులు గమనించుకోవాలి.
చరణం 4
" నిగమాగమ విహర నిరుపమ శరీర
నగద రాగ విదార నత లోకా ధారా "
ఈ చరణంలో తన అభిరుచి...తన కీర్తనలు అన్నీయునూ రాముని రూపం గానే అన్న భావన...
శ్రీరాముడు వేదాంత వేద్యుడు...వేదం ప్రకారం నడుచు కొను స్వభావం కలవాడు... నిగమం అంటే వేదాలు...ఆగమం అంటే వివిధ రీతులలో దేవతలను పూజ చేయు విధానం అని అర్ధం...
అంటే సర్వ వేదాలు, సకల శాస్త్రాలు, అన్నీ రకాల పూజలు ఎవరిని పూజ చేస్తున్నాయి... నిరుపమానమైన శరీరం  కల శ్రీరాముని....
ఉపమానం అంటే పోలిక, సామిప్యం అని అర్థం...అదే నిరుపమాన అంటే వర్ణనలకు కూడా అందనంత ప్రకాశవంతమైన ...
రూపం అంటే కొంత పరిధి పరిమితి కలదని కాని శ్రీరాముని యొక్క సుగుణ రూపంనకు పరిమితులు నిర్దేశించటం సాధ్యం కాదు....
మరి  చూడండి అన్నీ కీర్తనలు, రాగాలు ఎవరిని పాడుతున్నాయి అంటే శ్రీరాముని...
నగధరుడు అంటే విష్ణువు...
కృష్ణావతారం లో గోవర్ధన ఘట్టం వలన ఈ నామధేయం.
5 చరణం
" పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజ నుత"
చూడండి అనుపల్లవి ప్రారంభం...పవనిజ అంటూ...
ఈ చరణం ప్రారంభం పరమేశ నుత అంటూ...
ఒక దైవాంశ ప్రారంభం..ఇంకొక దైవం కాలరూపుడైన పరమేశ్వరునితో కీర్తన ముగించటం..ఒక విశిష్ట సాంప్రదాయం.
పరమేశ్వరుడు సమస్త మానవాళి కి...ఇహ లోక సంబంధమైన సమస్త విచారము లోను దాటటానికి ప్రసాదించిన మహామంత్రం
" శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"
ఈ మహామంత్రం ను పార్వతి దేవి కోరిక పై సాక్షాత్తు పరమేశ్వరుడు తల్లి గర్భం ద్వార జన్మించిన సకల జీవ రాశి మీ ఇహ జీవన సాధక బాధలు దాటి తరించ గల తారక మంత్రము...
శ్రీరామ నామము.
ఇది త్యాగరాజ కీర్తన పై నాకు భగవదనుగ్రహం గా లభించిన బుద్ధితో మీకు తెలుప బడిన కొన్ని విశేషాలు...
ఈ కీర్తన ను నా మాతృచ్ఛాయ పరదేవతా ప్రసాదంగా భావించే నా బంగారు తల్లి వివాహ సమయంలో ఆలపించాలని భావన చేశాను....
కాని రకరకాల కారణాంతరాల వలన అది సాధ్య పడలేదు...కాని నాటి నుండి
నా మనస్సులో దాగి నేటికి శ్రీరామ కరుణచే రూపాంతరం చెంది ఈ విధంగా..స్వామి పాద పద్మాలకు...
స్వామి వారి కరుణ సంపూర్తిగా నా బంగారు తల్లికి లభించాలని కోరుకుంటున్నా...
అలాగే ఈ కీర్తన ఉపసంహరం చేసే ముందు...మరి కొన్ని...
సీతారాములు...ఇరువురా ఒక్కరా అంటే
చాలామంది , అదియునూ రామతత్వం పూర్తిగా తెలిసిన వారు చెప్పే మాట...
వారు ఇరువురూ ఎన్నడు వేరు వేరు కాదు..
ఇరువురునూ ద్విదేహలలో వున్న ఏక ఆత్మ స్వరూపులే అని, సీతారాములు ఇరువురునూ బింబ, ప్రతిబింబాలని...అంటే ఒకరిని దర్శనం చేస్తే రెండోవ వారు ప్రతిఫలిస్తారు...
శ్రీరామ దర్శనం అయితే మనకు అప్రయత్నంగా సీతామాత దర్శనం అయినట్లే....
మీరు గమనించితే శిల్ప శాస్త్రం, చిత్ర లేఖనంలో సీతారామస్వరూపాలు రెండుగా వున్ననూ...రెండురూపాలు ఒకే విధమైన పోలికలు, మొక్కట్లు తో వుంటాయి... కాకపోతే ఒకటి పురుష స్వరూపం...రెండవది స్త్రీ స్వరూపం...
అంతటి ఘనమైన వారు కాబట్టి యుగయుగాలుగా దాంపత్య జీవనం అంటే సీతారాములదే...
మరి ఈనాటి వధు, వరులు ఏంపికలో ఎవరిని, ఏ విధమైన వారిని ఆదర్శంగా తీసుకోవాలో వారు నిర్ణయం...
సర్వం సకలం జయం కలగాలని...
శ్రీరామ జయం.
ఈ కీర్తన పై ఎవరికైనా సందేహం వున్నా నాకు ఫోన్ చేయవచ్చు
సద్విమర్శ సదా ప్రీతి పాత్రమే...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిప్
విజయవాడ -1
94401 72262.
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.