14, జులై 2021, బుధవారం

ఆముక్తమూల్యద

ఆముక్తమాల్యద
అముక్తమాల్యద అనే తెలుగు పద్య కావ్యం రచించిన వారు సాహితి సమరాంగణ సార్వభౌముడు , ఆంధ్రభోజుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు వారు.
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః తుళు ప్రాంతంలో కన్నడిగుడైననూ మన తెలుగు వారు ఆయననూ స్వంతం చేసుకున్నంతగా మరి,  ఏ ఇతర రాజుని చేసుకోలేదు...ఆయన జీవితం జీవనం అనేకానేక కాల్పనిక మహమహిమాన్విత ఘట్టాలతో కూడి వుంటుంది.
ఆయన రాజ్యవిస్తరణ , పరిపాలన దక్షత , కార్యశూరత్వ కారణంగా విజయనగరసామాజ్యం అరేబియా మహసముద్ర తీరం నుంచి అనగా మంగళూరు , గోవా,  కర్నాటక ,తమిళనాడులో చాలాభాగం నుంచి ఉత్తరాది న కటకం వరకు అనగా నేటి ఒడియాలోని కటక్ వరకూ విస్తరించినది. ఇది ఓక పార్శ్వం అయితే వీరిలో ఇంకొక కోణం వీరు బహుభాషా కోవిదులు , సాహితి అభిమానులు. అందువల్లనే వీరి నిండు పేరలోగం (ఇది అచ్చ తెలుగు పదం దీని అర్ధం సకల విభాగాలతో నిండి వున్న రాజసభ) ని భువనవిజయం అని పిలిచేవారు...ఈ భువనవిజయంలో సాహిత్యం పాలు ఎక్కువగా వుండేది కారణం వీరి సభలో వున్న అష్టదిగ్గజ కవులను వీరు ఆదరించారు. అల్లసాని పెద్దన , నందితిమ్మన , మాదయగారి మల్లన , తెనాలి రామక్రిష్ణుడు , ధూర్జటి , రామరాజభూషణుడు , అయ్యలరాజు రామభద్రుడు ఇలా అనేక మంది కవులను వీరి కొలువులో వున్నారు. వీరే కాదు అపర శంకరులని పిలిచే అప్పయ్య దీక్షితులు కూడాను.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవులు .అయననూ వీరు నంది తిమ్మన , ధూర్జటి లాంటి శైవులను ఆదరించాడు. తెనాలి రామక్రిష్ణుడు వ్రాసిన ఉద్భటరాద్యుని చరిత్ర అనే కావ్యంని కూడా ఆదరించారు. ఇది శైవ కావ్యం. అలాగే వీరు హంపిలోని విరుపాక్షుని కూడా కొలచారు. కాని వీరి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.
ఇక వీరు తెలుగులో వ్రాసిన ప్రభంద కావ్యం ఆముక్తమాల్యద అనే గ్రంధం.
ప్రబంధం అంటే చిక్కటి వర్ణనలతో కూడినది అని అర్ధం. అలాగే ప్రబంధానికి 18 రకాల లక్షణాలు వుండాలి. ఇన్ని వున్నవి కాబట్టే ఇది ప్రబంధం కాగలిగినది.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు కనుక విష్ణు భక్తుల కధలు వ్రాసినాడు .
శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధ యాత్రలో భాగంగా విజయవాడ సమిపంలో క్రిష్ణా నదితీరములో గల శ్రీకాకుళ ఆంధ్ర మహవిష్ణువుని దర్శించిన సమయంలో ఆయన రాయలవారికి స్వష్నములో తన కధ వ్రాయమని ఆదేశించారని వాడుక. ఈ దేవాలయం నేటికిని ప్రతివారు దర్శించవచ్చు.
ఆముక్తమూల్యద అనేది గోదాదేవికధ. దీనినే విష్ణుచిత్తీయం గా కూడా వాడుక.
ఆముక్తమాల్యద నాయక గోదాదేవి.
ఆముక్తమూల్యద అంటే ధరించి విడిచిన పూలమాలను సమర్పణ చేయునది అని అర్ధం. అందుకనే గోదాదేవి ని తమిళంలో చూడి కొడుత్త నాచ్చియార్ అంటారు.
ఇక కధ ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
విష్ణుచిత్తుడు శ్రీవల్లిపుత్తూరులోని మన్నారు స్వామి ఆర్చకుడు. పన్నిద్దరు ఆళ్వార్ లలో ఓకడు. ఆళ్వార్ లు వైష్ణవ భక్తాగ్రేసులు. వీరికి తులసి వనంలో ఓక బాలిక లభిస్తుంది ఆమేకు గోదాదేవి అనేపేరుతో పెంచుకుంటాడు. ఆమే యుక్తవయస్సుకు వస్తూంది , గోదాదేవి స్వామి వారికోసం సిద్ధం చేసిన పూలమాలలను తాను ధరించి చూసి మురిసిపోయి మరలా అవే మాలలను స్వామికి సమర్పణ చేసేది.
గోదాదేవి భూదేవి అంశ. ఈమే గత జన్మలో తాను కృష్ణుని పట్ట మహిషిలలో ఓకరుగా స్పురణకి వస్తుంది. దానితో విష్ణువు నందు విపరీతమైన అనురాగ పూరితంగా వుంటుంది. ఆమే ఆప్రాంతంనకు సమీపంలోని శ్రీరంగంలోని శ్రీరంగేశుని తన భర్తగా భావించి శ్రీరంగం తరలి వెళ్ళి స్వామి వారి ఆనుగ్రహ పాత్రురాలై స్వామి వారిలో ఐక్యం అవుతుంది. గోదా శ్రీరంగేశుల కళ్యాణం వరకూ ఈ ఆముక్తమూల్యద కావ్యం వుంటుంది.
రాయలు వారు ఎంతో నేర్పుతో ఈ కావ్యంనకు "ఆముక్తమూల్యద" అనే పేరు పెట్టినారు . నాయక లక్షణం , కావ్య స్వభావం దీనిలోనే అన్యాపదేశంగా చెప్పారు.
ముక్తం అనగా స్వీకరణ , ఆముక్తం అనగా తిరిగి ఇచ్చుట , మాల్యద అనగా పూలమాల ధరించుట. కనుక ధరించిన పూల మాల తిరిగి ఇచ్చుట.
గోదా దేవి భూదేవి అంశ అని ఉదహరించారు అని మీకు ఇంతకు ముందే తెలిపినాను. భూమికి గల విశేష లక్షణాలు సహనశీలత తో పాటు తనలో నిక్షిప్తం చేసిన ప్రతి విత్తనం నకు పలు రెట్లు ఫలసాయ రూపంలో తిరిగి ఇస్తుంది.
శ్రీమన్నారాయుణ అంశలో భాగమైన సూర్యుడు స్థిరముగా తన ఉష్ణ ప్రభావం చేత భూమిపై అనంతమైన వెలుగు , వేడిని ప్రసాదించు తున్నాడు. భూమి  స్ధిరంగా గల సూర్యుని చుట్టు గల భ్రమణ పరిభ్రమణాలతో పాటు సంవత్సరం నకు రెండుసార్లు తన భ్రమణ దిశను మార్పులు అనే విశేషాంశల వలన మనకు ఋతువులు , కాలాలు ఏర్పడి సాధారణ వ్యక్తుల జీవనం జరుగుతున్నాయు. భూమిలో వివిధ రకాల పంటలు పండుతున్నాయు. గోదాదేవి భూదేవి అంశ గనుక వనంలో ప్రకృతి సిద్ధంగా తనకు లభించిన పూలను పూలమాలలను తాను ధరించి మరలా స్వామి కి ఇవ్వటంలోని అంతరార్ధం తనకు లభించిన ప్రేమ భావనను స్వీకరించుట. వధువు మెడపై పూలమాల వేయుట ద్వారా వరుడు వధూ స్వీకారం , వధువు పూలమాలను స్వీకరించి ధరించుతూ వరునకు పూలమాల వేయుట ద్వారా వర స్వీకారం జరుగుతుంది తద్వారా వారు జీవన గమనం సాగిస్తారు. కాని గోదాదేవి భూ అంశ కనుక శ్రీమన్నారాయణుని కృపచే లభించిన పూలమాల రూప ప్రేమను స్వీకరించి మరలా తనకు గల భూ అంశ అయిన విశేషాంశ అయిన పలురెట్లు గుణింపు చెసి ఇచ్చె గుణమైన దాని వలన ఆప్రేమను పలురెట్లుగా స్వామి కి తిరిగి సమర్పించినదని దీని భావం. అందువల్లనే గోదాదేవి అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీరంగేశుని భర్తగా పొందినది.
సూర్యుని వలన ఋతువులు ఏర్పడుతాయని తమకు తెలిసినదే కదా...
గోదాదేవి భూ అంశ , శ్రీమన్నారాయణుడు సూర్య అంశ వీరి ఇరువురి మధ్యగల ప్రేమోత్పన్నం  ఋతువులు.. ఈ ఋతువర్ణనం ఆముక్తమూల్యద కావ్యంలో బహు విశేషంగా వుంటుంది.
అసలే రాయలు వారు అల్లసాని వారి కృతి అయిన మనుచరిత్ర కు కృతిపతి...మరి ఆయన ప్రభావం వీరిపై లేకుండా వుంటుందా...అయునా వీరి శైలి వీరిదే....
ఆముక్తమూల్యద ఏడు ఆశ్వాసములు గల కావ్యం.
అది ఈ విధముగా వుంటుంది.
గ్రంథస్త విషయ క్రమము
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
2 ఆ. -  మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.
3 ఆ. - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
4 ఆ. -  విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.

5 ఆ. - గోదాదేవి, వసంతఋతువర్ణనము.

6 ఆ. - మాలదాసరి.
7 ఆ. - బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.
గోదా పరిణయ కధతో పాటు ఉప కధలుగా ఖాండిఖ్య కేశి ధ్వజుని కధ , మాల దాసరి కధ. ఇందు మాల దాసరి కధ ప్రశంశ పూర్వకమైన కధ. నిర్మల భక్తికి సోదాహరణ. ఈ మాల దాసరి కధ విషయమై ఈనాటికి చర్చలు ఆగలేదంటే అతిశయోక్తి కాదు.
వైష్ణవుడైన రాయలు వారు తనకావ్యమైన ఆముక్తమూల్యద ను విష్ణుభక్తుల కధగా వర్ణించటానికే ఇష్టపడ్డారు. అందుకే చూడండి గోదాదేవి తండ్రిపేరు విష్ణుచిత్తుడు. విష్ణువును మనస్సు నందు నిలిపినవాడు అని దీని అర్ధం. వీరినే తమిళంలో తొండరప్పొడి ఆళ్వార్ అని పిలుస్తారు.
అలాగే ఈ కావ్యంలోని ఖాండిఖ్య కేశిధ్వజుల గురించి కొంత పరిశీలన చేద్దాం.

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.
గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు.
నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.
ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.
వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో
ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు.
కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం.
ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు.
ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది.
రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది.
ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి.
అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం.
గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు,
కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.
రాయలు వారి కావ్యం పై వ్యాఖ్యలు చేసే స్థాయి కాకపోయినా ఈ నాటి ప్రజలకు, యువతకు కొంత అయునా ఆముక్తమూల్యద గురించి తెలపాలనేది నా ప్రయత్నం.
ఇంతేకాక ఆధ్యాత్మిక కోణంలో గోదాదేవి భూఅంశ గా ఉదహరించారు...అనగా పాంచభౌతిక శరిరాలతో జన్మించిన ప్రతి ఓక్కరు భూ అంశయే గదా...కాని సాధారణ మానవులు విషయ లంపటులై, సాంసారిక , వస్తు వ్యామోహలు దుర్గుణ పీడితులై జనన మరణ చక్రంలోనే ఇమిడి పోతున్నారు...కాని భగవత్ కృప వలన లభించిన ఈ జన్మలో ప్రేమ అనురాగం నమ్మకం అనే పూలదండను సేకరించి , స్వీకరించి , ధరించి వాటి మధురిమను భగవంతునికి అందించే ప్రయత్నం మరలా స్వామికి ధరింపచేయటం...తద్వారా ముక్తి...గోదా కళ్యాణం అంటే సాధారణ వివాహమా కాదే...భగవంతుడు భక్తుడు ఆత్మీయ కలయుక , ముక్తి సంగమమే కళ్యాణం...సాధారణ మనుజుడు సర్వజీవుల పట్ల దయ ప్రేమ తో పాటు ఆ నారాయణుని దర్శించాలనే అంతర్లీన అభిలాష....
నా ప్రయత్నం నచ్చిన తెలుపగలరు.
కృతజ్ఞతతో
మీ
ఆలపాటి రమేష్ బాబు.
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262.