24, జులై 2022, ఆదివారం

అదివో చూడరో అందరూ మొక్కరో .. అన్నమాచార్య కీర్తన .. విశ్లేషణ.

 

అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని

రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము

క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
************************
ఈ కీర్తన పదకవితా పితామహుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు వారిది.
ఈ కీర్తన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ లోనిది.దీని వరుస నెంబరు 498. వాల్యుం నంబరు2,
అన్నమయ్య రాగి రేకు నెంబరు 197.
రాగం పాడి.
ఈ రాగం పాడి మేళకర్త రాగం అయినా మాయామాళవగౌళ 15వ జన్యురాగం.
ఈ కీర్తన వినవలసినది గాయని
శ్రీమతి శోభారాజ్ గారి గళంలోనే...ఈ కీర్తన ఆలాపన తదనంతరం పాడి రాగంలో ఈ కీర్తన పాడిన విధానం మీలో అంతర్గతంగా వున్న అధ్యాత్మిక తృష్ణని ఒక్క సారి మేలుకోలుపుతుంది...
చాలామంది అదివో అల్లదివో మరియు అదిగో చూడరో రెండూ ఒక్కటే అనే భావనలో వుంటారు‌.
కాని ఇవి రెండునూ వేరు వేరు...
ప్రారంభం చరణాలలో సమరూపకత్వం వున్ననూ...ఇవి రెండునూ శ్రీ వేంకటేశ్వరుని దివ్యత్వాన్ని వేరు వేరు మార్గాల్లో స్తుతిస్తాయి...
ప్రస్తుతం నేను వివరణ ఇవ్వబోయే  అదిగో చూడరో కీర్తన శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన.
సహజంగా మనవారికి భాగవతంలోని పోతన గారి ఇంతింతై వటుడింతై పద్యం గుర్తుకు వస్తుంది..కాని అన్నమయ్య గారు ఇదే వర్ణనని  రాగం, తాళంతో మంచి భావంతో కీర్తన పద్ధతిలో తెలియచేశారు...
ఇక కీర్తన విషయానికి వస్తే నాలుగు భాగాలుగా వున్నది...
పల్లవి ప్రకటన గాను ,
తదనంతర మూడు చరణాలు
వివరణ ,నిరూపణ మరియి ఫలితంగా భావించాలి...
మొదటి భాగమైన ప్రకటన విషయానికి వస్తే ఈ విధంగా
" అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని"
మనం కనుగొన్న విషయం సత్యం అయితే కాలాలకు అతీతంగా సర్వకాల సర్వాస్థలయందు పరిక్షలకు నిలువగలది అయితే విశ్వాసంగా రండి చూడండి లేదంటే ఆచరణ చేసి చూడండి మీకు కూడా ఇదే అనుభవం కలుగుతుంది అనే విశ్వాసం ప్రకటిస్తాం.
ఇదే విషయాన్ని శ్రీవేంకటేశ్వరుని పట్ల గల తన అచంచల భక్తి విశ్వాసాలును ప్రకటన రూపకంగా చాటుతున్నాడు.
ఈ పల్లవిలోని మొదటి పాదం అర్ధం అందరికి తెలిసినదే...రెండోవ పాదం లోని "గుదిగొని బ్రహ్మము"
ఈ రెండు పదాలు చిన్నవిగా వున్ననూ మహోన్నత భావం దాగివున్నది.
గుదిగొని అంటే వేరు వేరుగా వున్నా అంశాలను ఒక్కటిగా కూర్పు స్ఫుష్టత నివ్వటం, ఆకారంని సాకారం చేయిటను గుదిగుచ్చుట అంటారు.
పూలని గుదిగుచ్చి దండలా, భావజాలంను గుదిగుచ్చి పుస్తకంలా అనేవి ఉదాహరణ.
మరి ఇక్కడ గుదిగుచ్చినది ఏమిటో..అది బ్రహ్మము...
బ్రహ్మము అంటే చతుర్ముఖ రూపమా...కాదు
బ్రహ్మము సాకారా , నిరాకార స్వరూపము లందు , సకల సర్వాస్థలందు,సకల జీవ, అజీవ ప్రాణికోటి యందు సకల వస్తు సంచారంనందు..పంచభూతములు యందు, అణువు నుంచి విశ్వం వరకూ వ్యాపించి వున్న తత్వం బ్రహ్మము అంటారు.
కంటికి దృశ్యమానంగా వుండక, కాని తన అనుభవాన్ని వ్యక్త పరిచేది బ్రహ్మము...
అలాగే సాకారా రూపంగా దర్శనమిస్తూ..ఆ దృశ్యాన్ని శబ్దం , రూపం, వర్ణనలు లొంగని దానినే బ్రహ్మము..అంటారు...
ఏమిటి పై రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా వున్ననూ అది నిజం.
ఇది మీకు తెలియ చేయటానికి నేను తెలిపిన అతి సాధారణ వర్ణనలు.
(యోగ సాధకులకు , ధ్యాన సాధకులకు ఈ విషయమై అవగాహన వుంటుంది గమనించండి)
మరి ఇంతటి సాకారం బ్రహ్మము ఎక్కడ వ్యక్తం అంటే కోనేటి దరిన...
కనుక అన్నమయ్య తన భావాన్ని , అనుభవాన్ని తన కీర్తన ద్వారా స్పష్టంగా  ప్రకటన చేయుచున్నాడు...
శ్రీ వేంకటేశ్వరుడు ఆది మధ్యాంత రహిత బ్రహ్మ రూపుడని...
ఆయననూ సేవించమని...
మనకు తెలుపుతున్నారు.
మరి తరువాత భాగం అయిన
మొదటి చరణం అనగా కీర్తన విశ్లేషణ లోని వివరణ భాగం తెలుసుకుందాం.

"రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము "
ఒక్కసారి మిత్రులు పై నాలుగు పాదములు మరోక్కసారి పరిశీలన చేయండి....విశ్వం గురించి పూర్తిగా...శ్రీ వేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన మనకు పరిచయం...
"రవి మండలమున రంజిల్లు తేజము"
మన బాల్యం లో సోషల్ పాఠాలు చదువుకున్నాం. సౌరకుటుంబం అంటే... సూర్యుడు మరియు  మిగిలిన అన్నీ గ్రహములు కలిపి సౌరకుటుంబం అన్నారు.
సూర్యుడు కేంద్రంగా వుండి మిగిలిన గ్రహములు అన్నీయునూ సూర్యుని చుట్టూ తిరుగుతవి కాబట్టి రవిమండలము అన్నాడు.
అనగా సూర్యుడు తేజా శక్తి , గ్రహములు చలన శక్తి మధ్య వున్న ఆకర్షణ శక్తి వలన సౌరమండలం ఆవిధంగా నిలిపి వుంచింది శ్రీవేంకటేశ్వరుని అని తెలుపుతున్నారు.
(మరి ఈ సౌర కుటుంబం గురించి అన్నమయ్య గారు కోపర్నికస్ సిద్ధాంతాలు చదువుకోలేదు అంతకన్నా ప్రాచీనుడైన మన ఆర్యభట్టు లు గారు, భాస్కరచార్యులు తెలుసు)
తరువాత చరణం గురించి...
"దివి చంద్రునిలోని తేజం"
భూమి , దాని ఉపగ్రహం అయిన చంద్రుడు మాత్రమే మనకు సాకార అనుభవం...వీటి చలన శీలత...వీటి వలన ఏర్పడే కాలం, తిధి, ఋతు మొదలగు అన్నీయునూ శ్రీవేంకటేశ్వరునిదే అని మనకు ఎరుక పరుస్తున్నారు.
ఇక మూడవ పాదము
"భువిననలంబున బొడమిన తేజం"
ఈ పాదం గురించి విస్తృతంగా వివరించవలసిననూ మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను.
భువి అనగా భూమి అని విదితమే.
అనలము అంటే అగ్నీ... ఒక శక్తి...
భూమి , భూకేంద్రకంగా వున్న దాని గురుత్వాకర్షణ శక్తి .దీని వలన చలన గ్రహము అయిననూ సర్వమూ స్థిరముగా వుండుట.
దీనినే అగ్నితత్వంగా భువిననలంబున అని వర్ణన...
మరి అన్ని సార్లు సాకారమవుతుందా అంటే అందుకే బొడమిన తేజం అన్నారు.
ప్రకృతి యొక్క అనంతశక్తి పంచభూతాలు గా, మహసముద్రాలుగా, బడబానలం,
పిడుగుపాట్లు, వర్షాలు ఇవి అన్నీ అగ్నీ రూపక తేజాలు....ఇవి ఆయా సమయాల్లో మాత్రమే తమ లో దాగిన అనంత శక్తి ప్రదర్శన...
మనం ప్రమాదం, విపత్కరం అని భావించిననూ శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం యొక్క భాగంగా గ్రహించాలి.
మరి నాలుగవ పాదం
"వివిధంబులైన విశ్వం తేజం"
పైన మూడు పాదాల్లో ఒక్క కుటుంబమే కాని ఈ నాలుగొవ పాదములో ఈ విరాట్ పురుషుని విశ్వశక్తి లో ఇటువంటి సౌర కుటుంబం అనంతం....
చూశారా అన్నమయ్య ఎంత అలవోకగా నాలుగు పాదములలో ఒక చరణములో  విశ్వరూపుని విరాట్ తత్వం మనకు తెలియ చేశారు.
ఇంతవరకూ మనము  అన్నమయ్య కీర్తనలోని ప్రకటన , వివరణ గురించి తెలుసుకున్నాము... తదనంతర భాగం అయిన అధ్యాత్మీక స్వరూప సాకార నిరూపణ గురించి...
రెండోవ చరణం...మూడవ భాగం అయిన సాకార నిరూపణకు
"క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము ఈరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము"
మరి ఈ విరాట్ పురుషుడు ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలియ చేయిచున్నాడు...
పాలకడలిపై శేషశయనంగా విరాజమానము అగు వైకుంఠ వాసుడగు శ్రీమన్నారాయణుడు ఈవిరాట్ పురుషుడు.
ఈయన సమస్త జగదాధిపతిగా , యోగింద్రుల మనః కర్తగా , యాగాదులు తోపాటు తపః ఫలితమున వారికి లభించు సాకారం దర్శనం...సకల జగత్తు తహ తహలాడు సాకార దర్శనం అయిన వైకుంఠ వాసుని దివ్యదర్శనం.
మరి ఈ చరణంలో నిరూపణ అంటే విరాట్ పురుషుడే ... వైకుంఠ వాసుడు...ఆయనే..శ్రీ వేంకటేశ్వర స్వామి వారు...ఈయనే కోనేటి దరిన వున్న గోవిందుడు.
ఇప్పుడు మనం చివరి భాగం అయిన ఫలితం గురించి తెలుసుకుందాం.
"పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము"
అనేక యాగ ,తపః , జపం, హోమం, దాన ఫలితం వలన సిద్ధించే సాకార బ్రహ్మము యొక్క దర్శనం ..మీరు నామః స్మరణతో..
మనః వాచా కర్మలతో శ్రీవేంకటేశ్వర డే నాకు రక్ష అని నమ్మి...
అన్యధా పాదశరణం ...రక్ష రక్ష శ్రీ వేంకటేశ్వర...మీరే నా పెన్నిధి భావించి ఆ స్వామిని ఆశ్రయించితే...నీకు సకల విధ ఫలితము అనుగ్రహించి...మీకు కైవల్యం ప్రసాదించు తారని...ఈ కీర్తన భావం....
చూశారా కీర్తన చిన్నదిగా వున్ననూ భావన ఎంత సమగ్రముగా వున్నదో...
కనుక మనమందరం సదా వేంకటేశం స్మరామి స్మరామి...
గోవింద గోవింద....
ఈ వ్యాసంకు కర్త, కర్మ , క్రియ అంతా ఆ గోవిందుడే...ఇచ్చిన శక్తి...ఆయన పాదపద్మముల సాక్షిగా ఇది ఆయన మాట...
స్వత్కృష గా భావించకుండా..నా అనుభవం ఇది...
గత 3 రోజులుగా వివిధ సందర్భాలలో శోభారాజ్ గారి ఆలాపన ..కీర్తన పల్లవి..ఒకటికి రెండుసార్లు గుర్తుకు రావటం...వినటం జరిగింది...అది మెలుకువ తో వున్నప్పుడే కాక నిద్రలో కూడా కలలో ఈ కీర్తన ఆలాపన కలలో కూడా కనపడింది... స్వామి వారి చరణాలు ఫోటో నాకు దర్శనం...దానితో స్వామి వారు...ఈ నాలుగు మాటలు వ్రాయమనే ఆనతిగా భావించి...ఈ వివరణ సిద్ధం చేశాను.
నేను సహజంగా ఒక్కసారే వ్రాస్తాను...వ్రాయటం... దిద్దుబాటు..లాంటివి వుండదు..
స్వామి పాదరక్షగా భావిస్తూ...ఆయన నా మనః ఫలకం పై ఉదయించే అక్షరాలు టైపు చేయటం ...
కనుక మీ అభినందనలు అన్నీ...
ఆ విరాట్ పురుషుని పాద పద్మములకే....
ఈ వ్యాసం వ్రాయగలిగాను అంటే...
మా నాన్నగారు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు నాకు ప్రసాదించిన అక్షర బిక్ష...
వారి పాద పద్మములు నేను సదా శరణు.
గోవింద..గోవింద..గోవింద...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో...
విజయవాడ.
94401 72262.