4, ఆగస్టు 2024, ఆదివారం

శ్రీ కృష్ణాష్టకం విశేషార్ధం


 

శ్రీ కృష్ణాష్టకం - విశేషార్ధం


 వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
*************************************
ఈ కృష్ణాష్టకం ను భారతదేశ వ్యాప్తంగా వారి వారి భాషల్లో వారి వారి ప్రాంత ఆచార వ్యవహార రీతులకు అణుగుణంగా అర్చన, పూజ,జప, సాధన, హోమ,తర్పణ సమయాల్లో ఉపయోగిస్తారు.....
ఈ అష్టకం శంకరాచార్యులు అని దీనిలో ప్రస్తావన చేసిననూ..‌.
ఇది తదనంతర కాలంలో ఎవరో అజ్ఞాత గురుపరంపరలో వారు సృజన చేశారు అని నా అభిప్రాయం .
ఏది ఏమైనా ఈ అష్టకం విశిష్ట స్థానం ఉన్నది అన్నది నిర్వివాదాంశం.
ఇంకా ఈ అష్టకం అర్ధ విశేషాలు కి వద్దాం....
నేను ఈ అర్ధ విశేషాలు పేరుతో వివరణకు కారణం క్లుప్తంగా...
హైందవ సాహిత్యం, పూజ రీతుల్లో ఉపయోగించే భాష సంస్కృతం. కాని నేడు అది వాడుక భాష కాదు అధ్యయన భాష కాదు. ఇది పాక్షికంగా అధ్యనం నిమిత్తం వినియోగం....
దీనితో ఇది కంఠస్థం చేసి వల్లే వేయటం తప్ప ఇందులోని అర్ధం పరమార్ధం ఏమిటో ఎందుకు చెప్పినారో అన్నది మరుగున పడిపోతున్నాయి....
వాటి అర్ధ విశిష్టత తో పాటు దేవి, దేవతలు రూపం, లక్షణ, గుణ , వైభవ లాంటి విశేషాలు తెలిసిన...ఆయా దేవతలను ఇంకా శ్రద్ధగా కొలుస్తారు అనే ఒక ఆశ....
ఇంకా అష్టకం పేరుతో అన్నీ దేవి దేవతా రూపాలకు అష్టక సాహిత్యం వున్నవి...ఇవి అన్ని వివిధ విధాలుగా వున్నవి....
అష్టకం అనగా 8 శ్లోకాలలో ఆయా దేవి దేవతలను ప్రస్తుతించటమే....
అష్టకంలో సాధారణంగా మకుటం కలిగి వుంటుంది...అష్టక స్తోత్రాలకు, పురాణసాహిత్యంకి వైదిక సాహిత్యం లాగా స్వర పద్ధతి...మాత్ర, ఛందస్సు లాంటి పట్టింపులు వుండవు... అలాగే ప్రాంతీయ పదాలు, ప్రాంతీయ పలుకుబడితో దేవతలను ప్రస్తుతించుతారు...అదియిను గాక ఇవి నిత్య దైనందిన కార్యక్రమాలు చేస్తూ భగవధ్యానానికి అనువుగా వుంటాయి...తినగ తినగా వేము తియ్యగుండు...అనగ అనగా రాగమతిశయించు అని వాడుక...అలాగే దేవి దేవతల నామ స్మరణం వలన మనకు అప్రయత్న పుణ్యం, దేవి దేవతల సాన్నిహిత్యం లభిస్తుంది... అలాగే...అష్టమ సంఖ్య ఒక నిగూఢ సంఖ్య.....ఇది మన అజ్ఞాత పుణ్య పాప భవిష్యత్తు సూచన చేస్తుంది....అనగా జీవన సమరంలో దుఃఖ హేతువు అయిన స్థితి నుంచి మంచి భవిష్యత్తు వైపుకి ప్రయాణం అన్న సూచన...ఈ అష్టక పఠనం లో
 దాగి వున్నది.
అందుకే కాబోలు కృష్ణుడు అష్టమ గర్భంలో జన్మంచినారు....
ఇంకా కృష్ణాష్టక విషయానికి వస్తే....
ఈ అష్టక మకుటం...కృష్ణం వందే జగద్గురుమ్....
గురువు అనగా బోధ చేసేవాడు.... 
అజ్ఞాన తిమిరం తొలగించి వెలుగు వైపు ప్రయాణం చేయించు వాడు... 
అలాగే మన జీవన పధం ఇది అని నిర్దేశన చేయివాడు...
మరి కృష్ణుడు భగవద్గీత ప్రభోదం వలన
జగత్ గురువు  అయినాడు....
ఈ అష్టకంలో శ్లోకానికి  రెండు చరణాలు. ఇందులోనే ద్వీతియ చరణం ఆఖరున మకుటం కలిగి వుంటాయి.
ఈ అష్టకం కొన్ని నిగూఢ, మార్మిక శబ్దాలు తో పాటు ఒక విషయానికి భిన్నమైన మరోకటి ప్రతిపాదన చేస్తున్న విధంగా వున్ననూ...అవి శ్రీ కృష్ణుని నిగూఢ చర్యలను ఆయన జీవన విశేషాలను ఆయన రూప వైభవాలను మనకు తెలియచెప్పుతాయి....

మొదటి శ్లోకం :
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ చరణం లో  శ్రీకృష్ణుడు వసుదేవుని
కుమారుడుగాను మరియి ఆయన అవతార లక్ష్యం చెప్పినారు...‌
శ్రీకృష్ణుడు వసుదేవుని కుమారుడు , ఆయన కంసుడు, చాణూరుడు అనే రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని సంహరించారు అని మొదటి చరణ మొదటి పాదం అర్ధం.
ద్వీతియ చరణం చూడండి.... దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుం....
ఇది మనకు  సాధారణ చరణంలా కనపడిననూ కొంత విస్తృత అర్ధం కలిగి వున్నది....
దేవకి దేవి గర్భవాసంన శ్రీకృష్ణుడు జన్మించాడు అన్నది మనకు ఎరుక.
 సాధారణంగా తల్లి కొరుకునేది తన బిడ్డ మనుగడ....ఆమే సోదరుడు,ఆమేను భర్తతో సహా ఖైదు చేసి ఆమేకు జన్మించిన 7గురు శిశువులను హత్య చేశాడు...కాని అష్టమ గర్భం అయిన శ్రీకృష్ణుడు తన దైవ అంశతో, దైవమాయ వలన రక్షించ బడినాడు...ఇది ఆనందకరమైన విషయం.... పరమానందం అంటే...ఇంతకు మించి సంతోషం లేదు అనేది పరమానందం. తన బిడ్డ ప్రయోజకుడు అయి తన సంసార భాధ్యత పంచుకుంటే...తన తల్లి కష్టాన్ని , ఇబ్బంది ని తొలగించితే ఆ తల్లి సంతోషం ఆనందం మనకు పరిచయం...మరి దేవికి కూడా సాధారణ మాతృ లక్షణం కలిగి వున్నది....ఆమే తీరని దుఃఖం పుట్టింట సోదరుని పాలనలోని చెరసాలలో వున్నది....తను తన భర్త చెరసాల జీవనం ఆమేకు తీరని దుఃఖం.
సాధారణంగా స్త్రీలు అత్తారింట ఆదరణ కోరుకుంటారు.... కొంతమంది కి నిరాదరణకు గురి అయిననూ ఓపికగా వుండి జీవితం సుఖమయం చేసుకుంటారు...కాని పుట్టింటి నిరాదరణ అనేది వేదన దుఃఖం భరితం.అంతటి వేదనను కంసుని పరిమార్చటం ద్వారా  దేవికి దేవికి పరమానందం కలిగించాడు...
రెండోవ శ్లోకం..
ఆతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీ కృష్ణుడు అవిశ పువ్వు లాగా వున్నాడట....హారాలు, కాళ్ళకు కడియాలు లాంటివి కలిగి వున్నాయట.
చేతులకు రత్న కంకణాలు కలిగి వున్నాడట...
అవిశ పువ్వు నీలం రంగులో వుండి... గుండ్రంగా వృత్తాకృతిలో ఐదు రేకలు కలిగి వుంటుంది...
మూడవ శ్లోకం
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
ఒంపులు తిరిగిన కేశాలతో అనగా గిరజాల శిరోజాలు అనగా రింగులు జుత్తుతో వున్నాడట....ఇంకా ఎలా వున్నాడు అంటే పూర్ణ చంద్రుడు లాగా వున్నాడట... సాధారణంగా చంద్రునికి 16 కళలు వుంటాయి అవి రెండు విధాలుగా గణన...‌మొదటి విధానం పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మరియి అమావాస్య  వరకు వున్న చంద్రబింబం కళలను ఒక విధంగా  మరి రెండోవ విధం శుక్లపక్ష అష్టమి నుంచి బహూశా పక్ష అష్టమి వరకు మధ్య వున్న చంద్ర దర్శనం రూపాలను షోడశ చంద్ర కళలు గా అభివర్ణిస్తారు ..కాని పౌర్ణమి నాటి తిధి వ్యాప్తిలో  మధ్య భాగంలో పూర్ణచంద్ర దర్శనం ఆ సమయంలో చంద్రుని బింబ దర్శనం పూర్తిగా గుండ్రంగా గోళాకృతి లో దర్శనం ఇస్తుంది...స్వామి వారు అలాగే వున్నారట...స్వామి వారి చెవులకు కుండలాలు ధరించి వున్నారు...కుండలం అంటే కర్ణాభరణం అని అర్ధం.... కాని విలసత్ అనే విశేషణం ద్వారా దానికి ఒక దివ్యత్వం కల్పించారు....
4 వ శ్లోకం:
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మందారపూల పరిమళంతో , నాలుగు చేతులతో వున్నాడట....మనకు శ్రీ కృష్ణ రూపం రెండు చేతులుగానే పరిచయం...కాని ఇక్కడ మనకు నాలుగు చేతులు అని చెపుతున్నారు అంటే శ్రీ కృష్ణుడు ఒక అలౌకిక దేవతాంశ అని... సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని వైకుంఠ వారసుడిని మన హృదయానికి పరిచయం చేయటం....
తలపై నెమలి పింఛం....
బర్హీపింఛం అంటే ఆనందంతో పురి విప్పిన నెమలి పింఛం గా మనం అర్ధం చేసుకోవాలి....అనగా తనను ఆశ్రయం పొందిన వారికి తన నామ జపం తో ఆనందం లభించును అని మనకు తెలియచేయటం.
సాధారణంగా మనం ఆనందం అంటే ఐహిక పరిభాషలో ఒక విధంగా ఆధ్యాత్మిక పరి భాషలో వేరుగా వుంటుంది....మనస్సు సంతులనతో (balance) స్థిరం గా వుంటుంది....అని గ్రహించండి...
5వ శ్లోకం...
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
స్వామి వారు అరవిచ్చిన పద్మాలు వంటి కన్నులతో వున్నారట....దేవతాంశల కన్నులను పద్మాలతో పోల్చడానికి కారణం....పద్మం బురదలో పుట్టినను నిర్మలంగా ప్రకాశ వంతంగా వుంటుంది... అలాగే మానవుడు కూడా తన చుట్టుపక్కల అనేక విధాల ప్రపంచం, పరిస్థితి వున్ననూ మీ దృష్టి దేవునిపై లగ్నం చేయండి అని భావన..
అలాగే స్వామివారు నీలి  మేఘశ్యాములుగా వున్నారట...
జీమూతము అనగా మేఘం...
నీలి మేఘం శ్యాముడంటే...
వర్షించటానికి సిద్ధంగా వున్న మేఘం...
తగిన వాతావరణం పరిస్థితి రాగానే వర్షిస్తుంది.
మేఘం యొక్క వర్షం వల్లనే ప్రకృతి తన యొక్క ఆర్తిని చల్లార్చి భూమి పంటల రూపంలో మానవాళిని నిలబెడుతుంది....
మరి స్వామి వారు ఏమి వర్షిస్తారు అంటే...ఈ స్వామి ఆర్ద్రత కలిగిన వాడు సదా... ప్రేమ, కరుణ ,దయ ,ముక్తి ప్రసాదించ గలడు మీరు భక్తి శ్రద్ధలతో కొలవండి ...మీ జీవితాన్నీ అమృతమయం చేసుకోండి.( మీకు ఆసక్తి,  వీలుంటే జీమూతవాహనుడు కధ తెలుసుకోండి)...
ద్వితీయ చరణ  అర్ధం...
యాదవ కులంలో అగ్రగణ్యుడు అని అర్ధం 
యాదవ కులంలో అంటే ఈనాటి నిత్యం పరిభాషలో కులంగా వర్గీకరిద్దామా...కాదు యాదవ కులం ముఖ్య వృత్తి గోపాలనం....గోవు యొక్క సాధుత్వం మరియి దాని విశిష్టత ప్రత్యేకంగా తెలుపవలసిన పనిలేదు....సాధుజన రక్షకులు ఎవరు తమ వృత్తి గా ప్రవృత్తి గా వుంటారో వారు యాదవ వంశం వారుగా మనం అర్ధం చేసుకోవాలి....
6వ శ్లోకం 
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీకృష్ణుడు పసుపు వర్ణం కలిగిన వస్త్రాలు ధరించి రుక్మిణీ దేవితో ఆనందంగా ప్రకాశవంతంగా  వున్నాడు అని అర్ధం.
ఇక్కడ " కేళి " అనే మాటకు కొంత విశేషం వున్నది... సాధారణంగా స్త్రీపురుష సమాగమంను సంగమంగా వర్ణిస్తే....దైవాంశ స్త్రీ పురుష సాన్నిహిత్యంను " కేళి" గా వర్ణించారు.
కేళి అనే పదంనకు ఆట, సైయ్యాట, ఆనందోత్సాహాలు అనే క్రియారూపకార్ధాలు కూడా మనం ఇక్కడ గురుతు చేసుకోవాలి.
శ్రీకృష్ణునకు అష్టభార్యలు వున్ననూ రుక్మిణీదేవి సాక్షాత్  లక్ష్మీ అంశ మరియి పట్టమహిషి ఇంతేనా
అంతేకాదు ఆమే చిన్న తనం నుంచి శ్రీకృష్ణుని తన ఉచ్ఛాస్వ నిశ్వాస్వలందు శ్రీకృష్ణనామ రూపాలను తనయందు నింపుకుని వున్న స్త్రీమూర్తీ. శ్రీకృష్ణునే భర్తగా పొందాలని తపించి వరించి పొందిన వనిత.
అందుకే ఆమే పట్ట మహిషి.... భగవంతుడు ఎప్పుడూ భక్త హృదయుడే అని మనం అర్ధం చేసుకోవాలి....
ఇంకా శ్లోకంలో రెండోవ చరణం కూడా ఇంకో స్త్రీ మూర్తి ప్రస్తావన.....
రెండోవ చరణం అర్ధం... శ్రీకృష్ణుడు తులసి పరిమళాలతో నిండి వున్నాడు అని అర్ధం....
శ్రీకృష్ణుడు నారాయణ అంశగాను....తులసి ప్రియుడు గాను మనకు తెలుసు....తులసి కధ , తులసి వరం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి....
7 శ్లోకం....
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికలతో కూడిన శ్రీకృష్ణ వక్షసమ్ కుంకుమతో ప్రకాశం గా వున్నది....ఇది సాధారణ అర్థం....మనం మరికొంత విస్తృత పరిధిలో వివరణకు ప్రయత్నం చేద్దాం...
శ్రీకృష్ణుడు, బృందావనం,గోపికలు, రాసలీలలు ఇవి శ్రీకృష్ణ ప్రేమతత్వం లో ప్రతి ఒక్కరు తమకు తెలుసునని భావించే విషయాలు. అలాగే ఎంత మధించినా శోధించినా అంతు చిక్కని విషయం...వారి వారి బుద్ధి, జ్ఞాన, ప్రాప్తి లను అనుసరించి వారికి అనుభవంలోకి వచ్చే విషయం...కనుక ఈ చరణార్ధం మరికొంత వున్ననూ పాఠకులకుగల శ్రీకృష్ణకృప వలన మరికొంత బోధ పడుతుంది.
ఆథ్యాత్మిక స్తోత్రము లో కుచద్వంద అనే ప్రయోగం..అందులోను గోపికానం కుచద్వందం ...ఈ ప్రయోగంతో ఆదిశంకరుల వారు తమదైన చమత్కారం చూపారు...
గోపికలు వీరు ఎవరు అనే ప్రశ్న???
వ్రజ నివా‌సులైన గోపాలుర స్త్రీలు గోపికలు. వీరికి శ్రీకృష్ణునితో కల సాన్నిహిత్యం అనుబంధం , ఓ అలౌకిక ఆథ్యాత్మిక ప్రయాణం.
గోవులు,గోపాలురు,గోపికలు ఈత్రయం సాధించిన అద్భుతం ఏమిటి అంటే... కొన్నీ కోట్ల నామ జపం, తపం, హోమం,దానం,ధర్మం లాంటి
ఇత్యాది క్రతువులు చేసీ సాధించలేని...
భగవానుని ప్రియత్వం, సఖత్వం, ప్రియసఖత్వం తమ నిర్మలమైన 
ప్రేమ ద్వారా సాధించారు. గోపికలు అయితే వర్ణించనలవి కాని ప్రేమ...
గోకులంలో శ్రీకృష్ణుడు యశోదా తనయుడే కాని శ్రీకృష్ణ లీలా వైభవం వలన గోకులంలోని ప్రతి గోపిక స్త్రీ ,బాల, కన్య, వృద్ధులు అందరూ తమ వాడిలాగానే భావన చేశేవారు.... కొంతమంది స్త్రీలు అయితే శ్రీ కృష్ణుడు దర్శన సమయంలో తమలోని వాత్సల్యం వలన మాతృత్వ భావన ఉప్పొంగి తమ స్థనద్వయం చేపుకొని పాలతో నిండగా శ్రీ కృష్ణునికి పాలు త్రాపి...తమ జన్మ ధన్యం మైనదని తరించామని భావన చేశే వారు..
. మరికొంత మంది బాల,కన్యలు శ్రీకృష్ణుని పై గల అనితర ప్రేమ అనురాగాలు వలన శ్రీ క్రిష్ణుడు తమ స్నేహసఖుడని భావన చేసేవారు.
గోపికలలో కల ద్వంద భావన యే కుచద్వంద ప్రయోగం గా భావించవచ్చు...రెండోవ పద్ధతి చేరువైన గోపికలతో రాసలీలలో కృష్ణుని వక్షస్థలం కి కుంకుమ అలదుకోవటం వలన కృష్ణ వక్షస్థలం కుంకుమతో శోభాయమానంగా వున్నది....
రెండోవ చరణం: శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం....
శ్రీనికేతం.....ఇది రెండు పదాల సంయుక్తం.
 శ్రీ అనగా లక్ష్మీ, శుభాలు అన్న వరకు ప్రస్తుతం మనం ప్రస్తావన చేసుకుందాం. నికేతం అనగా కలిగి వుండుట, స్థిరనివాసం,పద్మం, విష్ణు నివాసం అనే అర్ధాలు వున్నాయి...అనగా కృష్ణుడు శ్రీమన్నారయణాంశ అని వీరిని ఆశ్రయం పొందిన వారికి సకల శుభాలు పొందగలరని మనం తెలుసుకోవాలి....
ఇంకా మహేష్వాసం అనునది శివుడు కృష్ణునకు ప్రసాదించిన ధనుస్సు పేరు...
మనకు స్తోత్ర సాహిత్యం లో ఒక్క పదం చాలు దాని వివరణ ఇవ్వటానికి పది పేజిలు చాలదు....ఇది శంకరుల వారు అంతటి గొప్ప పదాలతో స్తోత్రం నిర్మాణం చేశారు. శివుడు కాలరూపుడు గా భావన చేయాలి.అందుకే శివాలయ ప్రదక్షణలు శివాభిషేకం అన్నది నిత్యజీవితంలో కాలప్రభావ తీవ్రత యొక్క తాపశమనం గురించి పండితులు మనకు చెపుతారు.
కృష్ణునకు శివుడు విల్లు ఇవ్వటం అంటే....మనకు భాగవతంలో కాని మిగిలిన సాహిత్యంలో కాని కృష్ణుని యుద్ధాల ప్రస్తావన కన్ననూ మిగిలిన ధర్మాధర్మచరణ తో మిగిలిన విషయాల ప్రస్తావన ఎక్కువగా వున్నది.అలాగని కృష్ణుడు కొన్ని యుద్ధాలు చేసిననూ అవి మనకు ప్రస్తుతం అవసరం లేదు.
ఇంకా ధనస్సు లక్షణం ఏమిటి... లక్ష్యం వద్దకు శరంను వేగంగా పంపటం....అనగా లక్ష్యనిర్దేశం చేయటం...మహభారత యుద్ధరంగంలో భీరువైన అర్జునకు శ్రీకృష్ణుడు గీతరూపకంగా లక్ష్యనిర్దేశం చేసినాడు. మనం మన నిత్యజీవితంలో అనేకానేక సమస్యలతో సతమవుతుంటాం వాటి నివారణోపాయం...శ్రీకృష్ణ నామ ఆశ్రయం....కృష్ణ కృష్ణ అని పలుకుతూ మీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించండి మీకు జయం.
అందుకే మన పూర్వులు చిన్న దానం చేసిన ధర్మం చేసినా కృష్ణార్పణం భగవతార్పణం అనే మాట పలికేవారు...
అందుకే  భగవద్గీత లో సంజయుడు ద్వారా ఆఖరి శ్లోకం ప్రస్తావన చేస్తారు...
అది...
"యత్ర యోగేశ్వర: కృష్ణ: యత్ర పార్థో ధనుర్ధర:|తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ||"
(శ్రీమత్‌ భగవద్గీత అధ్యాయం: 18 శ్లోకం: 78 )
తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్య ము, వాటితో పాటు ధర్మము, నీతి, దృఢంగా, స్థిరం గా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయు డు ధృతరాష్ట్రునితో చెప్పాడు.
ఈ శ్లోకంలోని యత్ర,తత్ర పదాలుద్వార మనకు సమయం కూడా నిర్దేశన అనగా సకల కార్య సర్వావస్థలయందు అని మనం అర్ధం చేసుకోవాలి.
అనగా శ్రీకృష్ణ నామం సదా జయప్రదం ఫలప్రదం అని మనం అర్ధం  చేసుకోవాలి.
8వ శ్లోకం.
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ శ్లోకం కి నేరుగా విస్తృత అర్ధం తెలుసుకుందాం....
శ్రీవత్సం అనేది విష్ణువు యొక్క హృదయం పైన వున్న మణి పేరు.
శ్రీవత్సాంకం అనేది శ్రీ+ వత్స+అంకం అనే మూడుపదాల సంయుక్త పదం.
శ్రీ అనగా లక్ష్మీ...
వత్సము అనగా లేగదూడ, వాత్సల్యం,శిశువు
అనే అర్ధాలు వున్నవి....
అంకం అనగా ఒడి....
సకల జగత్తు కి లక్ష్మీనారాయణులు తల్లితండ్రులుగా మనకు తెలుసు....
తండ్రి పాలన అయితే తల్లి లాలన పోషణ....తల్లి ఒడిలో వున్న శిశువుకు నిశ్ఛంత, భద్రత ఇంతకన్నా మంచి ప్రదేశం సృష్టి లోనే లేదు...మాతృ వాత్సల్యం అన్నది భాషకు భావానికి అందని ఒక లక్షణం...
తల్లి వద్ద పిల్లవానికి ప్రాయంతో నిమిత్తం లేదు అన్నీ అవసరాలు అనగాఆహార, ధన,కనక, వస్తు,మనో ధైర్యాలు శిశువుకు లభిస్తాయి...
కొన్ని సమయాలలో తండ్రి ఏ సదుపాయం అయిననూ కల్పించ నిరాకరించిన.... తండ్రిని ఒప్పించి నప్పించి సాధించగల ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే....ఇది నిత్యం మనం గృహాలలో కూడా మనం అనుభవిస్తున్నది చూస్తున్నది జరుగుతున్నదే....
అనగా శ్రీకృష్ణ ఆశ్రయం తో మనం
నిశ్చంతగా నిర్భయంగా వుండవచ్చు...
అది ఎలా అంటే మహోరస్కంగా అంటే
మంచి వెలుగుతో అని అర్ధం....
అదియినూ క్రిష్ణుడు ఎలా వున్నాడు అంటే
వనమాల విరాజితమ్....అనగా....పూల దండలు ధరించి
వున్నాడట.
శంఖ, చక్రం ధరించిన శ్రీమన్నారాయణ స్వరూపం అయి సకల జగత్తుకు గురువు అయిన శ్రీకృష్ణునకు నమస్కారం.....
ఇది కృష్ణాష్టక విశేషార్ధం....
నాకు టీకా తాత్పర్య అనువాదం తెలపటం అంత ఇష్టం వుండదు...
అంతరార్ధం, విశేషార్ధంగా నాదైన వ్యాఖ్య తెలిపినప్పుడే సంతృప్తి.
ఈ విశేష వ్యాఖ్య వ్రాయటానికి కొంత సమయం పడుతుంది...
అంతకాలం స్వామి తోనే ప్రయాణం....
 స్వామి గురించి స్వామి వారే చెప్పాలి...
కాకపోతే ఇప్పుడు స్వామివారు మాఇంట్లో దౌహిత్రుడుగా శిశువుగా చిరంజీవి జీవాన్ష్ ముకుంద్ గా ...ఉదయించి అతని ముద్దు ముచ్చట్లు తో ప్రేరణ కలిగిస్తున్నాడు...
కనుక ఈ క్రేడిట్ మా మనుమడు ముకుంద్ దే...
ఈ తాత ముకుంద్ కు ఇస్తున్న చిరుకానుక...అందరూ ధన కనకాల పట్ల ప్రీతి చూపుతున్నారు...కాని ఈ తాతకు అక్షర లక్షల పట్ల ప్రీతి....
స్వామి వారు మా మనుమడి కి సకలం సర్వం ప్రసాదించాలని స్వామి వారి పాద పద్మాలను వేడుకుంటూ....
శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీకు వివరణ కావలసిననూ లేక సందేహ నివృత్తి....
లేక విమర్శ అయిననూ...
ఆలపాటి రమేష్ బాబు....
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో 
11-44-29A కుమ్మరి వీధి..
విజయవాడ...
9440172262.

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.