26, ఏప్రిల్ 2025, శనివారం

మనవడు ఊరు వెళ్ళితే

పెళ్ళి వారి ఇల్లు లా బోసి పోయింది....
స్థబ్దుగా గంభీరంగా వున్నది....
స్వామి వారితో విడియో కాల్ మాట్లాడి నప్పుడు తప్ప, మిగిలిన సమయాల్లో ఏమిటో కేశవ నామాలు , పాటలు మాయమైనవి.... అమ్మమ్మ , జేజమ్మ ఏమిటో వెలితితో నిద్ర పోతున్నారు...
పిల్లవాడికి నూనే పెట్టమనే  హెచ్చరికలు లేవు.....ఇటు నుంచి అటుకు మార్పులు లేవు...
మధ్య రాత్రిలో దేవతా సందర్శనంలా...
స్వామి వారు మసలటం కాని....
వారి చిరుమువ్వల సవ్వడి కాని లేవు...
మధ్య రాత్రి గుండెల నిండుగా శ్వాస పీల్చుకొని మెల్లగా నిదానంగా కృష్ణా అని పిలవటం లేదు ఏమిటో గొంతు మూగబోయినట్లు అయినది....
ఉదయాన్నే అర్జేంట్ గా రైలు కోసం హడావుడి పడినట్టు ....ఆచ్ బై లు....ఉదయాన్నే ఇడ్లి తీసుకు రావటం మాయం....
సాంబార్ తీసుకు రండి కొద్దిగా అన్నా తింటాడు అనే హెచ్చరిక లేదు...
ఈరోజు ఏ పండు పెట్టాలనే చర్చ లేదు....
రాత్రి షాపు నుంచి త్వరగా రావాలనే ధ్యాస లేదు.....ఇడ్లి పిండికి వెళ్ళేటప్పుడు.... స్వామి వారి నగరోత్సవ సేవ లేదు.....
ఎక్కడి సామాను అక్కడే.....అదేమిటో మరి స్వామి వారు వున్నప్పుడు అన్నీ వస్తువులు కి చైతన్యం ఆవహించి....నడిచి వచ్చినట్టుగా అన్నీ హాలులో ఆయన అనుగ్రహించే వారు...
ఆనాటి కృష్ణుడు కి చుట్టుతా గోవులు వుంటే...ఈ కృష్ణుడు చుట్టుతా మేమంతా....
కృష్ణుడు ద్వారక కి వెళ్ళిన తరువాత గోకులంలోని వారి పరిస్థితే మాది....
మనుషులం ఇక్కడ మనస్సు అక్కడ....
నిన్న ఉదయం వచ్చిన నుంచి మీ అమ్మ గ్యాలరిలో మీ ఫోటోలు, స్వామి వారి వీడియో స్నిప్పెట్ చూడటం....మురిసిపోవటం....మరలా అంతలోనే చేయినది ఏమి లేక చేయలేక దిగులుగా వుండటం....
ఇది రెండు రోజుల్లో  మౌనంగా మారుతుంది మరీ రెండు రోజుల్లో గంభీరంగా మారుతుంది... తరువాత ఏమిటి అనేది నాకు గుబులుగా వున్నది.....
ఏమిటో మహాలక్ష్మీ కి తెలియని ఒపిక ఉత్సాహం వచ్చినవి... లేకపోతే తొందరగా బయటకు కదలటానికి సుముఖత చూపని ఆమే .... స్వామి వారి కోసం ఇటునుంచి రైలులో వెళ్ళి మరలా అదే రైలులో స్వామి వారితో తిరుగు ప్రయాణం అయినది.....
తిరువళ్ళూర్ నుంచి వచ్చి....48 గంటలు గడవక ముందే హడావుడి గా ఇల్లు సర్ది ప్రయాణం కి కావలసిన సకల సామానులు సకల సంబారాలు వేగవేగంగా ఏర్పాటు....ఏమిటో మంత్రి గారు పర్యటన కి వస్తే హైరనా పడే సాధారణ ప్రజానీకం లా .... మహాలక్ష్మి మొత్తం పైది క్రిందకు, క్రిందది పైకి చేయాలనే బృహత్ ప్రయత్నం....
మహాలక్ష్మి ఎన్నడు నాతో చెప్పదు....
ఇది చేయమని....కాని....
ఏమిటో ఆమే లక్షణం నాకు తెలిసినదా....ఆమే మనస్సు నాకు అవగాహన అయినదా....మీరే అంచనా వేసుకోవాలి..... అందుకే సతీష్ ని రైలులో తిరుగు ప్రయాణంలో మా అమ్మాయి దిగి బుధవారం వస్తుంది అని రిక్వెస్ట్....
అందుకే కారు మాట్లాడేది....
ఆమే సంతోషంగా ఆనందంగా వుంటే ఆర్ధిక భారం అనిపించదు చేయలేను అనే ధ్యాస వుండదు....అది ఆమే కోసం చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో ముందుకు వెళ్ళటమే.....
ఇవి గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహరం....
కృష్ణా.....అందరి దుఃఖాలను తీర్చు వాడివి....వేదనను దూరం చేసేవాడివి....
సకల సంతోష ప్రదాతవు......
నా బాధ, ఆర్తి నీకు తప్ప ఎవరికి విన్నవించను.....దయచూడు స్వామి......మా నాన్నగారు ని మరలా నాకు ప్రసాదించే మార్గం అనుగ్రహించు దీన బాంధవ.....
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్....
నీవే తప్ప ఇహ పరంబుఎరగ....
అన్యధా శరణం నాస్తి రక్ష రక్షో జగన్నాధ...

23, ఏప్రిల్ 2025, బుధవారం

జోల పాటలు 2

శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సీతామనోహరం, రఘు వీరం
వేదాంత వేద్యం,  శ్రీ ధర్మ రూ
పం 
సీతామనోహరం, రఘువీరం
వేదాంత వేద్యం శ్రీ ధర్మ రూపం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
ఓ సేతు బంధం దశకంఠ నిధనం 
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సాకేత ధామం కోదండ రామం
శ్రీరామ నామం సకల కళ్యాణం 
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 

22, ఏప్రిల్ 2025, మంగళవారం

జోల పాటలు -1 me

ఎన్ని జన్మల వేచి చూతనో
ఏనాటి పూజ ఫలమో

ఏ నోము నోచెనో
ఏ పండు ఫలమిచ్చెనో
ఏ పూలు గుణమిచ్చేనో
ఏ యాగ యోగ మహిమో
ఏ పుణ్యము ఉపకరించేనో
ఏ వరము అందివచ్చేనో
నా యందు నీ కరుణ
నీ ప్రేమ అమృతంబు వర్షింప
ఈ ముకుంద నామంబున
నా ఒడిన పవళించు శ్రీకృష్ణ 
జయ మంగళ రూప జయ శ్రీకృష్ణ.

20, ఏప్రిల్ 2025, ఆదివారం

జోల పాటలు

అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
ఇంటిలోని అన్నం పప్పు 
ఉట్టి మీద పాలు పెరుగు 
దేవుడింట గంట బెల్లం
పొదరింట మొగ్గ పూలు
సావిటింట ఆవుదూడ 
వెనకింట తులసి బిల్వం
తోటలోని కాయ పండు
చేనులోని నారు మొక్క
చెరువులోని చేపనీరు
ఎగిరేటి చిలుక పిచ్చుక 
తిరిగేటి కుక్క కోడి
ప్రాణమిచ్చు అమ్మమ్మ 
మురిసిపోయే తాతయ్య 
ఆటలాడు మామయ్య 
అన్నీంట వీడే అంతటా వాడే
సకలంబు వీడే గోవిందుడు
వరాన వచ్చాడు వరమివ్వ వచ్చాడు
వరహల దేవుడే కరివరదుడు 
మోక్షమివ్వ వచ్చాడు ముకుందుడు.
అల్లరి వాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు.

4, ఆగస్టు 2024, ఆదివారం

శ్రీ కృష్ణాష్టకం విశేషార్ధం


 

శ్రీ కృష్ణాష్టకం - విశేషార్ధం


 వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
*************************************
ఈ కృష్ణాష్టకం ను భారతదేశ వ్యాప్తంగా వారి వారి భాషల్లో వారి వారి ప్రాంత ఆచార వ్యవహార రీతులకు అణుగుణంగా అర్చన, పూజ,జప, సాధన, హోమ,తర్పణ సమయాల్లో ఉపయోగిస్తారు.....
ఈ అష్టకం శంకరాచార్యులు అని దీనిలో ప్రస్తావన చేసిననూ..‌.
ఇది తదనంతర కాలంలో ఎవరో అజ్ఞాత గురుపరంపరలో వారు సృజన చేశారు అని నా అభిప్రాయం .
ఏది ఏమైనా ఈ అష్టకం విశిష్ట స్థానం ఉన్నది అన్నది నిర్వివాదాంశం.
ఇంకా ఈ అష్టకం అర్ధ విశేషాలు కి వద్దాం....
నేను ఈ అర్ధ విశేషాలు పేరుతో వివరణకు కారణం క్లుప్తంగా...
హైందవ సాహిత్యం, పూజ రీతుల్లో ఉపయోగించే భాష సంస్కృతం. కాని నేడు అది వాడుక భాష కాదు అధ్యయన భాష కాదు. ఇది పాక్షికంగా అధ్యనం నిమిత్తం వినియోగం....
దీనితో ఇది కంఠస్థం చేసి వల్లే వేయటం తప్ప ఇందులోని అర్ధం పరమార్ధం ఏమిటో ఎందుకు చెప్పినారో అన్నది మరుగున పడిపోతున్నాయి....
వాటి అర్ధ విశిష్టత తో పాటు దేవి, దేవతలు రూపం, లక్షణ, గుణ , వైభవ లాంటి విశేషాలు తెలిసిన...ఆయా దేవతలను ఇంకా శ్రద్ధగా కొలుస్తారు అనే ఒక ఆశ....
ఇంకా అష్టకం పేరుతో అన్నీ దేవి దేవతా రూపాలకు అష్టక సాహిత్యం వున్నవి...ఇవి అన్ని వివిధ విధాలుగా వున్నవి....
అష్టకం అనగా 8 శ్లోకాలలో ఆయా దేవి దేవతలను ప్రస్తుతించటమే....
అష్టకంలో సాధారణంగా మకుటం కలిగి వుంటుంది...అష్టక స్తోత్రాలకు, పురాణసాహిత్యంకి వైదిక సాహిత్యం లాగా స్వర పద్ధతి...మాత్ర, ఛందస్సు లాంటి పట్టింపులు వుండవు... అలాగే ప్రాంతీయ పదాలు, ప్రాంతీయ పలుకుబడితో దేవతలను ప్రస్తుతించుతారు...అదియిను గాక ఇవి నిత్య దైనందిన కార్యక్రమాలు చేస్తూ భగవధ్యానానికి అనువుగా వుంటాయి...తినగ తినగా వేము తియ్యగుండు...అనగ అనగా రాగమతిశయించు అని వాడుక...అలాగే దేవి దేవతల నామ స్మరణం వలన మనకు అప్రయత్న పుణ్యం, దేవి దేవతల సాన్నిహిత్యం లభిస్తుంది... అలాగే...అష్టమ సంఖ్య ఒక నిగూఢ సంఖ్య.....ఇది మన అజ్ఞాత పుణ్య పాప భవిష్యత్తు సూచన చేస్తుంది....అనగా జీవన సమరంలో దుఃఖ హేతువు అయిన స్థితి నుంచి మంచి భవిష్యత్తు వైపుకి ప్రయాణం అన్న సూచన...ఈ అష్టక పఠనం లో
 దాగి వున్నది.
అందుకే కాబోలు కృష్ణుడు అష్టమ గర్భంలో జన్మంచినారు....
ఇంకా కృష్ణాష్టక విషయానికి వస్తే....
ఈ అష్టక మకుటం...కృష్ణం వందే జగద్గురుమ్....
గురువు అనగా బోధ చేసేవాడు.... 
అజ్ఞాన తిమిరం తొలగించి వెలుగు వైపు ప్రయాణం చేయించు వాడు... 
అలాగే మన జీవన పధం ఇది అని నిర్దేశన చేయివాడు...
మరి కృష్ణుడు భగవద్గీత ప్రభోదం వలన
జగత్ గురువు  అయినాడు....
ఈ అష్టకంలో శ్లోకానికి  రెండు చరణాలు. ఇందులోనే ద్వీతియ చరణం ఆఖరున మకుటం కలిగి వుంటాయి.
ఈ అష్టకం కొన్ని నిగూఢ, మార్మిక శబ్దాలు తో పాటు ఒక విషయానికి భిన్నమైన మరోకటి ప్రతిపాదన చేస్తున్న విధంగా వున్ననూ...అవి శ్రీ కృష్ణుని నిగూఢ చర్యలను ఆయన జీవన విశేషాలను ఆయన రూప వైభవాలను మనకు తెలియచెప్పుతాయి....

మొదటి శ్లోకం :
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ చరణం లో  శ్రీకృష్ణుడు వసుదేవుని
కుమారుడుగాను మరియి ఆయన అవతార లక్ష్యం చెప్పినారు...‌
శ్రీకృష్ణుడు వసుదేవుని కుమారుడు , ఆయన కంసుడు, చాణూరుడు అనే రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని సంహరించారు అని మొదటి చరణ మొదటి పాదం అర్ధం.
ద్వీతియ చరణం చూడండి.... దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుం....
ఇది మనకు  సాధారణ చరణంలా కనపడిననూ కొంత విస్తృత అర్ధం కలిగి వున్నది....
దేవకి దేవి గర్భవాసంన శ్రీకృష్ణుడు జన్మించాడు అన్నది మనకు ఎరుక.
 సాధారణంగా తల్లి కొరుకునేది తన బిడ్డ మనుగడ....ఆమే సోదరుడు,ఆమేను భర్తతో సహా ఖైదు చేసి ఆమేకు జన్మించిన 7గురు శిశువులను హత్య చేశాడు...కాని అష్టమ గర్భం అయిన శ్రీకృష్ణుడు తన దైవ అంశతో, దైవమాయ వలన రక్షించ బడినాడు...ఇది ఆనందకరమైన విషయం.... పరమానందం అంటే...ఇంతకు మించి సంతోషం లేదు అనేది పరమానందం. తన బిడ్డ ప్రయోజకుడు అయి తన సంసార భాధ్యత పంచుకుంటే...తన తల్లి కష్టాన్ని , ఇబ్బంది ని తొలగించితే ఆ తల్లి సంతోషం ఆనందం మనకు పరిచయం...మరి దేవికి కూడా సాధారణ మాతృ లక్షణం కలిగి వున్నది....ఆమే తీరని దుఃఖం పుట్టింట సోదరుని పాలనలోని చెరసాలలో వున్నది....తను తన భర్త చెరసాల జీవనం ఆమేకు తీరని దుఃఖం.
సాధారణంగా స్త్రీలు అత్తారింట ఆదరణ కోరుకుంటారు.... కొంతమంది కి నిరాదరణకు గురి అయిననూ ఓపికగా వుండి జీవితం సుఖమయం చేసుకుంటారు...కాని పుట్టింటి నిరాదరణ అనేది వేదన దుఃఖం భరితం.అంతటి వేదనను కంసుని పరిమార్చటం ద్వారా  దేవికి దేవికి పరమానందం కలిగించాడు...
రెండోవ శ్లోకం..
ఆతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీ కృష్ణుడు అవిశ పువ్వు లాగా వున్నాడట....హారాలు, కాళ్ళకు కడియాలు లాంటివి కలిగి వున్నాయట.
చేతులకు రత్న కంకణాలు కలిగి వున్నాడట...
అవిశ పువ్వు నీలం రంగులో వుండి... గుండ్రంగా వృత్తాకృతిలో ఐదు రేకలు కలిగి వుంటుంది...
మూడవ శ్లోకం
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
ఒంపులు తిరిగిన కేశాలతో అనగా గిరజాల శిరోజాలు అనగా రింగులు జుత్తుతో వున్నాడట....ఇంకా ఎలా వున్నాడు అంటే పూర్ణ చంద్రుడు లాగా వున్నాడట... సాధారణంగా చంద్రునికి 16 కళలు వుంటాయి అవి రెండు విధాలుగా గణన...‌మొదటి విధానం పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మరియి అమావాస్య  వరకు వున్న చంద్రబింబం కళలను ఒక విధంగా  మరి రెండోవ విధం శుక్లపక్ష అష్టమి నుంచి బహూశా పక్ష అష్టమి వరకు మధ్య వున్న చంద్ర దర్శనం రూపాలను షోడశ చంద్ర కళలు గా అభివర్ణిస్తారు ..కాని పౌర్ణమి నాటి తిధి వ్యాప్తిలో  మధ్య భాగంలో పూర్ణచంద్ర దర్శనం ఆ సమయంలో చంద్రుని బింబ దర్శనం పూర్తిగా గుండ్రంగా గోళాకృతి లో దర్శనం ఇస్తుంది...స్వామి వారు అలాగే వున్నారట...స్వామి వారి చెవులకు కుండలాలు ధరించి వున్నారు...కుండలం అంటే కర్ణాభరణం అని అర్ధం.... కాని విలసత్ అనే విశేషణం ద్వారా దానికి ఒక దివ్యత్వం కల్పించారు....
4 వ శ్లోకం:
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మందారపూల పరిమళంతో , నాలుగు చేతులతో వున్నాడట....మనకు శ్రీ కృష్ణ రూపం రెండు చేతులుగానే పరిచయం...కాని ఇక్కడ మనకు నాలుగు చేతులు అని చెపుతున్నారు అంటే శ్రీ కృష్ణుడు ఒక అలౌకిక దేవతాంశ అని... సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని వైకుంఠ వారసుడిని మన హృదయానికి పరిచయం చేయటం....
తలపై నెమలి పింఛం....
బర్హీపింఛం అంటే ఆనందంతో పురి విప్పిన నెమలి పింఛం గా మనం అర్ధం చేసుకోవాలి....అనగా తనను ఆశ్రయం పొందిన వారికి తన నామ జపం తో ఆనందం లభించును అని మనకు తెలియచేయటం.
సాధారణంగా మనం ఆనందం అంటే ఐహిక పరిభాషలో ఒక విధంగా ఆధ్యాత్మిక పరి భాషలో వేరుగా వుంటుంది....మనస్సు సంతులనతో (balance) స్థిరం గా వుంటుంది....అని గ్రహించండి...
5వ శ్లోకం...
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
స్వామి వారు అరవిచ్చిన పద్మాలు వంటి కన్నులతో వున్నారట....దేవతాంశల కన్నులను పద్మాలతో పోల్చడానికి కారణం....పద్మం బురదలో పుట్టినను నిర్మలంగా ప్రకాశ వంతంగా వుంటుంది... అలాగే మానవుడు కూడా తన చుట్టుపక్కల అనేక విధాల ప్రపంచం, పరిస్థితి వున్ననూ మీ దృష్టి దేవునిపై లగ్నం చేయండి అని భావన..
అలాగే స్వామివారు నీలి  మేఘశ్యాములుగా వున్నారట...
జీమూతము అనగా మేఘం...
నీలి మేఘం శ్యాముడంటే...
వర్షించటానికి సిద్ధంగా వున్న మేఘం...
తగిన వాతావరణం పరిస్థితి రాగానే వర్షిస్తుంది.
మేఘం యొక్క వర్షం వల్లనే ప్రకృతి తన యొక్క ఆర్తిని చల్లార్చి భూమి పంటల రూపంలో మానవాళిని నిలబెడుతుంది....
మరి స్వామి వారు ఏమి వర్షిస్తారు అంటే...ఈ స్వామి ఆర్ద్రత కలిగిన వాడు సదా... ప్రేమ, కరుణ ,దయ ,ముక్తి ప్రసాదించ గలడు మీరు భక్తి శ్రద్ధలతో కొలవండి ...మీ జీవితాన్నీ అమృతమయం చేసుకోండి.( మీకు ఆసక్తి,  వీలుంటే జీమూతవాహనుడు కధ తెలుసుకోండి)...
ద్వితీయ చరణ  అర్ధం...
యాదవ కులంలో అగ్రగణ్యుడు అని అర్ధం 
యాదవ కులంలో అంటే ఈనాటి నిత్యం పరిభాషలో కులంగా వర్గీకరిద్దామా...కాదు యాదవ కులం ముఖ్య వృత్తి గోపాలనం....గోవు యొక్క సాధుత్వం మరియి దాని విశిష్టత ప్రత్యేకంగా తెలుపవలసిన పనిలేదు....సాధుజన రక్షకులు ఎవరు తమ వృత్తి గా ప్రవృత్తి గా వుంటారో వారు యాదవ వంశం వారుగా మనం అర్ధం చేసుకోవాలి....
6వ శ్లోకం 
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీకృష్ణుడు పసుపు వర్ణం కలిగిన వస్త్రాలు ధరించి రుక్మిణీ దేవితో ఆనందంగా ప్రకాశవంతంగా  వున్నాడు అని అర్ధం.
ఇక్కడ " కేళి " అనే మాటకు కొంత విశేషం వున్నది... సాధారణంగా స్త్రీపురుష సమాగమంను సంగమంగా వర్ణిస్తే....దైవాంశ స్త్రీ పురుష సాన్నిహిత్యంను " కేళి" గా వర్ణించారు.
కేళి అనే పదంనకు ఆట, సైయ్యాట, ఆనందోత్సాహాలు అనే క్రియారూపకార్ధాలు కూడా మనం ఇక్కడ గురుతు చేసుకోవాలి.
శ్రీకృష్ణునకు అష్టభార్యలు వున్ననూ రుక్మిణీదేవి సాక్షాత్  లక్ష్మీ అంశ మరియి పట్టమహిషి ఇంతేనా
అంతేకాదు ఆమే చిన్న తనం నుంచి శ్రీకృష్ణుని తన ఉచ్ఛాస్వ నిశ్వాస్వలందు శ్రీకృష్ణనామ రూపాలను తనయందు నింపుకుని వున్న స్త్రీమూర్తీ. శ్రీకృష్ణునే భర్తగా పొందాలని తపించి వరించి పొందిన వనిత.
అందుకే ఆమే పట్ట మహిషి.... భగవంతుడు ఎప్పుడూ భక్త హృదయుడే అని మనం అర్ధం చేసుకోవాలి....
ఇంకా శ్లోకంలో రెండోవ చరణం కూడా ఇంకో స్త్రీ మూర్తి ప్రస్తావన.....
రెండోవ చరణం అర్ధం... శ్రీకృష్ణుడు తులసి పరిమళాలతో నిండి వున్నాడు అని అర్ధం....
శ్రీకృష్ణుడు నారాయణ అంశగాను....తులసి ప్రియుడు గాను మనకు తెలుసు....తులసి కధ , తులసి వరం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి....
7 శ్లోకం....
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికలతో కూడిన శ్రీకృష్ణ వక్షసమ్ కుంకుమతో ప్రకాశం గా వున్నది....ఇది సాధారణ అర్థం....మనం మరికొంత విస్తృత పరిధిలో వివరణకు ప్రయత్నం చేద్దాం...
శ్రీకృష్ణుడు, బృందావనం,గోపికలు, రాసలీలలు ఇవి శ్రీకృష్ణ ప్రేమతత్వం లో ప్రతి ఒక్కరు తమకు తెలుసునని భావించే విషయాలు. అలాగే ఎంత మధించినా శోధించినా అంతు చిక్కని విషయం...వారి వారి బుద్ధి, జ్ఞాన, ప్రాప్తి లను అనుసరించి వారికి అనుభవంలోకి వచ్చే విషయం...కనుక ఈ చరణార్ధం మరికొంత వున్ననూ పాఠకులకుగల శ్రీకృష్ణకృప వలన మరికొంత బోధ పడుతుంది.
ఆథ్యాత్మిక స్తోత్రము లో కుచద్వంద అనే ప్రయోగం..అందులోను గోపికానం కుచద్వందం ...ఈ ప్రయోగంతో ఆదిశంకరుల వారు తమదైన చమత్కారం చూపారు...
గోపికలు వీరు ఎవరు అనే ప్రశ్న???
వ్రజ నివా‌సులైన గోపాలుర స్త్రీలు గోపికలు. వీరికి శ్రీకృష్ణునితో కల సాన్నిహిత్యం అనుబంధం , ఓ అలౌకిక ఆథ్యాత్మిక ప్రయాణం.
గోవులు,గోపాలురు,గోపికలు ఈత్రయం సాధించిన అద్భుతం ఏమిటి అంటే... కొన్నీ కోట్ల నామ జపం, తపం, హోమం,దానం,ధర్మం లాంటి
ఇత్యాది క్రతువులు చేసీ సాధించలేని...
భగవానుని ప్రియత్వం, సఖత్వం, ప్రియసఖత్వం తమ నిర్మలమైన 
ప్రేమ ద్వారా సాధించారు. గోపికలు అయితే వర్ణించనలవి కాని ప్రేమ...
గోకులంలో శ్రీకృష్ణుడు యశోదా తనయుడే కాని శ్రీకృష్ణ లీలా వైభవం వలన గోకులంలోని ప్రతి గోపిక స్త్రీ ,బాల, కన్య, వృద్ధులు అందరూ తమ వాడిలాగానే భావన చేశేవారు.... కొంతమంది స్త్రీలు అయితే శ్రీ కృష్ణుడు దర్శన సమయంలో తమలోని వాత్సల్యం వలన మాతృత్వ భావన ఉప్పొంగి తమ స్థనద్వయం చేపుకొని పాలతో నిండగా శ్రీ కృష్ణునికి పాలు త్రాపి...తమ జన్మ ధన్యం మైనదని తరించామని భావన చేశే వారు..
. మరికొంత మంది బాల,కన్యలు శ్రీకృష్ణుని పై గల అనితర ప్రేమ అనురాగాలు వలన శ్రీ క్రిష్ణుడు తమ స్నేహసఖుడని భావన చేసేవారు.
గోపికలలో కల ద్వంద భావన యే కుచద్వంద ప్రయోగం గా భావించవచ్చు...రెండోవ పద్ధతి చేరువైన గోపికలతో రాసలీలలో కృష్ణుని వక్షస్థలం కి కుంకుమ అలదుకోవటం వలన కృష్ణ వక్షస్థలం కుంకుమతో శోభాయమానంగా వున్నది....
రెండోవ చరణం: శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం....
శ్రీనికేతం.....ఇది రెండు పదాల సంయుక్తం.
 శ్రీ అనగా లక్ష్మీ, శుభాలు అన్న వరకు ప్రస్తుతం మనం ప్రస్తావన చేసుకుందాం. నికేతం అనగా కలిగి వుండుట, స్థిరనివాసం,పద్మం, విష్ణు నివాసం అనే అర్ధాలు వున్నాయి...అనగా కృష్ణుడు శ్రీమన్నారయణాంశ అని వీరిని ఆశ్రయం పొందిన వారికి సకల శుభాలు పొందగలరని మనం తెలుసుకోవాలి....
ఇంకా మహేష్వాసం అనునది శివుడు కృష్ణునకు ప్రసాదించిన ధనుస్సు పేరు...
మనకు స్తోత్ర సాహిత్యం లో ఒక్క పదం చాలు దాని వివరణ ఇవ్వటానికి పది పేజిలు చాలదు....ఇది శంకరుల వారు అంతటి గొప్ప పదాలతో స్తోత్రం నిర్మాణం చేశారు. శివుడు కాలరూపుడు గా భావన చేయాలి.అందుకే శివాలయ ప్రదక్షణలు శివాభిషేకం అన్నది నిత్యజీవితంలో కాలప్రభావ తీవ్రత యొక్క తాపశమనం గురించి పండితులు మనకు చెపుతారు.
కృష్ణునకు శివుడు విల్లు ఇవ్వటం అంటే....మనకు భాగవతంలో కాని మిగిలిన సాహిత్యంలో కాని కృష్ణుని యుద్ధాల ప్రస్తావన కన్ననూ మిగిలిన ధర్మాధర్మచరణ తో మిగిలిన విషయాల ప్రస్తావన ఎక్కువగా వున్నది.అలాగని కృష్ణుడు కొన్ని యుద్ధాలు చేసిననూ అవి మనకు ప్రస్తుతం అవసరం లేదు.
ఇంకా ధనస్సు లక్షణం ఏమిటి... లక్ష్యం వద్దకు శరంను వేగంగా పంపటం....అనగా లక్ష్యనిర్దేశం చేయటం...మహభారత యుద్ధరంగంలో భీరువైన అర్జునకు శ్రీకృష్ణుడు గీతరూపకంగా లక్ష్యనిర్దేశం చేసినాడు. మనం మన నిత్యజీవితంలో అనేకానేక సమస్యలతో సతమవుతుంటాం వాటి నివారణోపాయం...శ్రీకృష్ణ నామ ఆశ్రయం....కృష్ణ కృష్ణ అని పలుకుతూ మీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించండి మీకు జయం.
అందుకే మన పూర్వులు చిన్న దానం చేసిన ధర్మం చేసినా కృష్ణార్పణం భగవతార్పణం అనే మాట పలికేవారు...
అందుకే  భగవద్గీత లో సంజయుడు ద్వారా ఆఖరి శ్లోకం ప్రస్తావన చేస్తారు...
అది...
"యత్ర యోగేశ్వర: కృష్ణ: యత్ర పార్థో ధనుర్ధర:|తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ||"
(శ్రీమత్‌ భగవద్గీత అధ్యాయం: 18 శ్లోకం: 78 )
తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్య ము, వాటితో పాటు ధర్మము, నీతి, దృఢంగా, స్థిరం గా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయు డు ధృతరాష్ట్రునితో చెప్పాడు.
ఈ శ్లోకంలోని యత్ర,తత్ర పదాలుద్వార మనకు సమయం కూడా నిర్దేశన అనగా సకల కార్య సర్వావస్థలయందు అని మనం అర్ధం చేసుకోవాలి.
అనగా శ్రీకృష్ణ నామం సదా జయప్రదం ఫలప్రదం అని మనం అర్ధం  చేసుకోవాలి.
8వ శ్లోకం.
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ శ్లోకం కి నేరుగా విస్తృత అర్ధం తెలుసుకుందాం....
శ్రీవత్సం అనేది విష్ణువు యొక్క హృదయం పైన వున్న మణి పేరు.
శ్రీవత్సాంకం అనేది శ్రీ+ వత్స+అంకం అనే మూడుపదాల సంయుక్త పదం.
శ్రీ అనగా లక్ష్మీ...
వత్సము అనగా లేగదూడ, వాత్సల్యం,శిశువు
అనే అర్ధాలు వున్నవి....
అంకం అనగా ఒడి....
సకల జగత్తు కి లక్ష్మీనారాయణులు తల్లితండ్రులుగా మనకు తెలుసు....
తండ్రి పాలన అయితే తల్లి లాలన పోషణ....తల్లి ఒడిలో వున్న శిశువుకు నిశ్ఛంత, భద్రత ఇంతకన్నా మంచి ప్రదేశం సృష్టి లోనే లేదు...మాతృ వాత్సల్యం అన్నది భాషకు భావానికి అందని ఒక లక్షణం...
తల్లి వద్ద పిల్లవానికి ప్రాయంతో నిమిత్తం లేదు అన్నీ అవసరాలు అనగాఆహార, ధన,కనక, వస్తు,మనో ధైర్యాలు శిశువుకు లభిస్తాయి...
కొన్ని సమయాలలో తండ్రి ఏ సదుపాయం అయిననూ కల్పించ నిరాకరించిన.... తండ్రిని ఒప్పించి నప్పించి సాధించగల ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే....ఇది నిత్యం మనం గృహాలలో కూడా మనం అనుభవిస్తున్నది చూస్తున్నది జరుగుతున్నదే....
అనగా శ్రీకృష్ణ ఆశ్రయం తో మనం
నిశ్చంతగా నిర్భయంగా వుండవచ్చు...
అది ఎలా అంటే మహోరస్కంగా అంటే
మంచి వెలుగుతో అని అర్ధం....
అదియినూ క్రిష్ణుడు ఎలా వున్నాడు అంటే
వనమాల విరాజితమ్....అనగా....పూల దండలు ధరించి
వున్నాడట.
శంఖ, చక్రం ధరించిన శ్రీమన్నారాయణ స్వరూపం అయి సకల జగత్తుకు గురువు అయిన శ్రీకృష్ణునకు నమస్కారం.....
ఇది కృష్ణాష్టక విశేషార్ధం....
నాకు టీకా తాత్పర్య అనువాదం తెలపటం అంత ఇష్టం వుండదు...
అంతరార్ధం, విశేషార్ధంగా నాదైన వ్యాఖ్య తెలిపినప్పుడే సంతృప్తి.
ఈ విశేష వ్యాఖ్య వ్రాయటానికి కొంత సమయం పడుతుంది...
అంతకాలం స్వామి తోనే ప్రయాణం....
 స్వామి గురించి స్వామి వారే చెప్పాలి...
కాకపోతే ఇప్పుడు స్వామివారు మాఇంట్లో దౌహిత్రుడుగా శిశువుగా చిరంజీవి జీవాన్ష్ ముకుంద్ గా ...ఉదయించి అతని ముద్దు ముచ్చట్లు తో ప్రేరణ కలిగిస్తున్నాడు...
కనుక ఈ క్రేడిట్ మా మనుమడు ముకుంద్ దే...
ఈ తాత ముకుంద్ కు ఇస్తున్న చిరుకానుక...అందరూ ధన కనకాల పట్ల ప్రీతి చూపుతున్నారు...కాని ఈ తాతకు అక్షర లక్షల పట్ల ప్రీతి....
స్వామి వారు మా మనుమడి కి సకలం సర్వం ప్రసాదించాలని స్వామి వారి పాద పద్మాలను వేడుకుంటూ....
శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీకు వివరణ కావలసిననూ లేక సందేహ నివృత్తి....
లేక విమర్శ అయిననూ...
ఆలపాటి రమేష్ బాబు....
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో 
11-44-29A కుమ్మరి వీధి..
విజయవాడ...
9440172262.

















17, నవంబర్ 2023, శుక్రవారం

మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి

నువిద చెంగటనుండ నొప్పువాఁడు,

చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,

వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,

నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,

పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు,

వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’

++++

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.

పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.

కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....

నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...

ఇలా చాలా చాలా మధన పడినారు..

ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...

గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...

ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.

సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .

పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.

పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా

భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....

ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..

"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"

ఇది మొదటి పాదం అర్ధం...

మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...

కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...

సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...

మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...

తరువాత పాదం..

'చంద్రమండల సుధా సారంబు '

చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు

అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....

తరువాత పాదం...

"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"

తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.

అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.

తరువాత పాదం...

" నీలనగాగ్ర సన్నిహిత భానుని"

శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది

ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.

"పుండరీక యుగం బోలు కన్నుల వాడు"

పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.

తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.

సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.

అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.

అది భక్త సులభుడు అనే కోణంలో.

మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.

తరువాత పాదం...

"వెడద యురము వాడు, విపుల భద్ర

మూర్తి వాడు..."

విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...

విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...

ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...

విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...

విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.

కాని మనం ఇచ్చట....

మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...

మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి

జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.

తరువాత పాదం...

"రాజముఖ్యుండోకరు

డదే కనుగవకు ఎదురు కానబడియే"

అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...

మరి అంతరార్ధం ఏమిటో....

రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...

మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.

కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....

అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...

"కను గవకు ఎదురు కాని బడియే"

ఇందులో విశేషం కను గవ....

అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...

కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.

'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'

అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.

కిటికి కి మరో పేరు గవాక్షం....

మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...

ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.

అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...

అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...

గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...

మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....

ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...

పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....

రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.

అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....

పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.

కారణం త్రేతా యుగం నాటి రాముడు,

కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.

అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....

ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....

రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"

తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....

మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.

అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...

ఇక దూషణలు అన్నీయునూ నావే...

మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...

ఆలపాటి రమేష్ బాబు

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ...

94401 72262.

తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.

పలికేడిది భాగవతం అర్ధ విశేషాలు...

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ పద్యం చాలా ప్రాముఖ్యత కలది...

చాలా చాలా సందర్భాల్లో ఈ పద్య ప్రస్తావన చేశారు.

ఎందుకంటే....ఈ పద్య రచనా చమత్కారం అటువంటిది....

పోతన వంటి భక్తి విశ్వాసాలు గల వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం.

సహజంగా మానవులు.... ఏ విషయం ప్రస్తావనకు తెచ్చిననూ ప్రధమ పురుషులో చెపుతారు... అనగా నేను చేశాను నా వలన జరిగినది...అని స్వ కేంద్రం గా ప్రస్తావన చేస్తారు...

కాని పోతన గారు ఉత్తమ పురుష తో చెపుతున్నారు.... అనగా వారు తెలిపారు వారు చేయించారు...వారు లేనిదే నేను లేను అనే భావం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది...

మనలో చాలామంది ఈ పద్య పఠన విధానం తెలియదు...కాని సహస్రవాధాని మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకానోక అవధాన ప్రక్రియ లో ఈ పద్యం ఎలా చదవాలో తెలిపితే గమనించి ఆశ్చర్యం పొందటం నా వంతు అయిపోయింది...

మొదటి సాధారణంగా అందరు భావన చేసే విధానం లో...

"పలికెడెది భాగవతమట"

గమనించండి ఇక్కడ 'అట'...అనే శబ్ద విశేషం సహజంగా మనం ఏ ఏ సమయాల్లో ఉపయోగం అంటే...

అస్పష్ట విషయ ప్రస్తావన లో ఉపయోగం అనగా.. అక్కడ మనుషులు వున్నారంట, ఆ పని అవుతుందట, ఇలా అనేకానేక అస్పష్ట క్రియా రూపక శబ్ద విశేషం గా వాడతాం..దీనితో వక్త భాధ్యత తీరుతుంది కాని శ్రోత స్థితి నమ్మక అపనమ్మకాల మధ్య త్రిశంకు స్వర్గంలా వుంటుంది...

కాని ఆ విధంగా కాక ఈ టకార శబ్దవిశేషాన్ని SUFFIX గా కాక Prefix గా ప్రయోగించి చూడండి అప్పుడు ఈ విధంగా మారుతుంది అచ్చట మనుషులు వున్నారు, అటులే ఆపని అవుతుంది గా మారుతుంది...

కనుక మీకు పద్య అర్ధ విశేషం తెలిపే ముందు ఈ పద్యం యొక్క పది విచ్ఛేదన, విరామ క్రమం తెలుపుతాను...

పలికెడెది భాగవతం,

అట పలికించేడివాడు రామభద్రుడు,

అట నే పలికిన భవహరమగును,

అట పలికేద వేరోండు గాథ

బలుకగనేలా...

గమనించారా విరామ చిహ్నం మార్పుతో పద్య గమనం మొత్తం మారిపోయి పాఠకుడికి స్పష్టం గా దర్శనం అవుతుంది....

ఇప్పటి వరకు మనం పద్య గమనం తెలుసుకున్నాం ఇప్పుడు అర్ధ విశేషాలు తెలుసుకుందాం...

ఎలాగు నేను మిత్రులకు పద్యానికి ప్రతిపదార్ధ రూపం, వచన అర్ధ రూపం కాకుండా అంతర్గత భావ అర్ధ విశేష విశ్లేషణ విధానం లో ముందుకు వెళుతున్నాం కాబట్టి...

పోతన గారు భాగవతం రాసినది.. కీర్తి, కనకం కోసం కాదు "భవ హరం" .

అదే విషయం అనేక మార్లు ప్రస్తావించారు...మరి దానిపైన ఒక పద్యం రాసినారు " ఇమ్మనుజ రాజేశ్వరులు"...

మరి భవం అంటే....

మానవుడి పుట్టు రోగం...

ఇది సంచిత ప్రారబ్ధం...గత జన్మ కర్మ యావత్తు మోసుకుంటూ వచ్చాం...

మరలా ఈ జన్మ లో చేయి, జరుగు క్రియలు వలన జనించు కర్మ ఫలం ఇక్కడే అనుభవిస్తున్నామా లేదే ఆగామిత కర్మ ఫలం గా వచ్చే జన్మకి మోసుకుని పోతున్నాం...

మరి ఇది పూర్తిగా పరిహారం అయి మోక్ష స్థితి కలగాలి అంటే ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయం చేయాలి...అందుకే రాముడు అని అనకుండా రాముభద్రుడు అనే పద విశేషం...అనగా రాముడు తగిన వాడు, భద్రమైన వాడు, నమ్మ తగిన వాడు...రామ ఆశ్రయం, రామ నామ ధ్యానం తో మనం మనయొక్క భవ హరం చేసుకో గలం...

మరి అంతటి రామభద్రడే...

భాగవతం రాయమని స్పష్టం గా తెలుపుతూ...ఇది రామ ఆజ్ఞ, ఇది రాముని పలుకు , ఇది రాముని వాక్కు కనుక భాగవతం రాస్తున్నాను...

వేరే వేరే కధలు, వేరే వారి కధలు నేను పలుకనేల...( ఆ రోజుల్లో వీరి బంధువు అయిన శ్రీనాథుడు కాశీ ఖండం, శృంగార నైషధం వ్రాసి ఖ్యాతిలో వున్నారు )

మరి ఇది ఆయన కోసమా కాదు మన కోసం మన అందరి కోసం...

జననమరణ చక్ర విచ్ఛేదన సుదర్శన చక్రధారి ఈ కోదండ రాముడు అంతటి రాముని పలుకు అయిన భాగవతం మన భవ హరం కూడా అవుతుంది...

ఇది పద్య అర్ధ విశేషం...

(పండితార్ధాలు తెలపాలి అంటే ఇంకను చాలా వున్నాయి...కాని నేటి సమాజ నడవడి కి కొంత లలితంగా తెలిపితే నే బాబోయ్ ఆంటున్నారు)

సకలం సర్వం శ్రీరామ జయం...

సర్వులకు శ్రీరామ జయం...

తమరు చదివి భాగున్నది అని భావన చేస్తే... శ్రీరామ రామ రామ అని ఒకసారి పలకండి...

తప్పులన్నియూనూ నావే....కనుక తమరు తెలియ చేసిన సరిదిద్దుకుంటాను...

మీ

ఆత్మీయ మిత్రడు/ సహోదరుడు

ఆలపాటి రమేష్ బాబు...

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ....

9440172262

13, మార్చి 2023, సోమవారం

సిగ్గు పూబంతి... సిరివెన్నెల పదప్రయోగాలు

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2)
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది.
పై గీతం....స్వయంకృషి సినిమాలో విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల గారు వ్రాయగా బాలుగారు , జానకి గారు పాడినారు...సంగీతం రమేష్ నాయిడు.
గత కొద్ది కాలంగా ఈ పాటలోని సాహిత్యం నన్ను ఆకట్టుకున్నది..అంతకన్నా ముందు ఈ పాటలోని పద ప్రయోగాలు గురించి చెప్పాలని భావించాను. నేను పెద్ద పండితుడిని కాకపోయిననూ ఏదో నాలుగు అక్షరాలు భగవత్ కృపతో వ్రాస్తున్నాను...
భారతీయ సమాజవ్యవస్థ ఇంత బలంగా వున్నదంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ బలంగా వుండటమే.
పూర్వకాలంలో అష్టావర్షత్ భవేత్ కన్యా అన్న ప్రమాణానుసారం వధువుకి 8సంలలోపు వివాహం చేసేవారు....ఈ వివాహం తరువాత అనేక రకాల కుటుంబ వేడుకలు ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు కారణం వధువుకి వరునకు సాన్నిహిత్యం ఎర్పరచటమనే ప్రక్రియలో భాగంగా దీని వలన ఒకరిపై ఒకరికి ఆకర్షణ, అనురాగం ఏర్పడి వారి భవిష్యత్  సజావుగా వుంటుంది.
ఈ కుటుంబ వేడుకలలో ముఖ్యమైనది పానుపు లేక చెండ్లాట అని పిలుస్తారు.ఈ వేడుకలో వధూవరులను ఓక పానుపుపై ఎదురు ఎదురు కూర్చోనబెట్టి...ఏవో కొన్ని ఆటలతో పాటు...ఓక పూల మాలను బంతిలాగా చేసి వధువరులను ఆడుకోవడానికి అందిస్తారు...ఇరుపక్షాల బంధువర్గాలు వధువరులను సపోర్ట్ చేస్తూ ఆట ఆడించుతారు...ఇందులో ఎవ్వరు ఓడి పోరు...గెలిచేది వధూవరుల మధ్య ఆకర్షణ.
ఇక పాట విషయానికి వద్దాం....
మన  స్త్రీల పాటల సాహిత్యం మొత్తం
వధూవరులను శ్రీరామ చంద్రునిగా , సీతమ్మ తల్లిగా భావన చేస్తూ పాటలు పాడతారు....ఈ పాటకూడా అటువంటిదే....
ముందు చూడండి ప్రారంభమే...
"సిగ్గు పూబంతి ఇసిరే సీత మాలచ్చి..."
అమ్మవారు బిడియంతో సిగ్గుతో మనోహరంగా రామునిపై పూలబంతి విసిరారు అంట....
అది లా మొగ్గ సింగారం
" ఇరిసే సుదతి మినాచ్చి..."
అమ్మవారు కన్య కాబట్టి ఆమేను మొగ్గగా భావన...ఆమే అలంకరణ పువ్వు విచ్చుకునబోయేటప్పుడు వున్నంత మనోహరంగా వుండటంతో పాటు ఆమే మనోహరమైన పలువరుసతో అందంగా నవ్వటంతో పాటు...ఆమే రెప్పవాల్చకుండా రామునే చూస్తున్నారు..అని తెలుపుతున్నారు...
చూడండి  ఈ వాక్యంలో సుదతి ప్రయోగం , మీనాక్షి ప్రయోగం విశిష్టమైనవి....
భార్య మనోహరంగా నగుమోముతో వుంటే భర్త చాలా జయించిన వాడులా
ఆనందపడతాడు. అలాగే మీనాక్షి అన్న పదం చూడండి...ఏమి ఆడవారి కన్నులు చేప కన్నులేనా వేరే ప్రయోగం చేయవచ్చుగా....
చేపకు శరీరంలో రెండుప్రక్కలా రెండు కనులుంటాయి...అవి భిన్న దృశ్యాలను చూపుతాయి...(ఈనాటికి ఫిష్ విజన్ గురించి పలురకాల చర్చలు)...
ఒకటి పుట్టింట వారి దృశ్యమైతే రెండోవది అత్త ఇంటివారి దృశ్యం... రెండిటిని కలగలిపి తనదైన దృశ్యం అనగా....ఇరుకుటుంబాల మధ్యవున్న సాధ్యాసాధ్యాలు మరియి తన భర్త వ్యవహరదక్షత మరియి సంతానం యొక్క కోరికలు తో ఆమే ఒడుపుగా తనదైన ముద్రవేస్తుంది...ఇంత చేసి చేప నీటి నుంచి తీసివేస్తే ఇబ్బంది పడుతుంది స్త్రీ కూడా తన సంసార సాగరం నుంచి దూరంగా వుండటమో లేక ఇంకొక ఇబ్బంది వస్తే ఆమే కూడా విలవిల లాడిపోతుంది....
అమ్మవారి సిగ్గు , నవ్వు మొదలైన వాటితో రాములవారిపై మన్మధ బాణాలు తగిలినవంట...
తరువాత చూడండి కవి తన ప్రయోగం...
"విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా"
విరజాజి పూల బంతి అమ్మవారు మోయలేకుండా వున్నారట...
ఇది సీతమ్మ సౌకుమార్యం తెలుపుతున్నారు....విరజాజి పూలబంతి...విరజాజి మొగ్గ చిన్నగా వుండి చాలా బరువుతక్కువగా వుంటుంది.... ఆ విరజాజి పూలబంతి కూడ మోయలేనంత సుకుమారమా అన్నట్లుగా వున్నారట సీతమ్మ తల్లి...అందుకనే మన జానపద కధలలో రాకుమారి ని ఏడుమల్లేల ఎత్తు అని వర్ణన చేసేవాళ్ళు....(నేను కూడా నా భార్య ను వివాహం అయిన కొత్తలో ఏడుమల్లేల సుకుమారి అని ఆటపట్టించే వాడిని)....
మరి ఇంత సుకుమారి అయినా సీతమ్మ ఎంతో బరువైన శివధనస్సుని అలవోకగా ప్రక్కకు జరిపినది ఈ సుకుమారి చిన్నదేనా...అంత పెద్ద కార్యం చేసిననూ తనకూ ఏమి తెలియనట్టు నవ్వుతూ సుకుమారంగా వున్నదా...ఏమి ఈ జాణ తనం....
అమ్మవారిపై జాణ అనే పద ప్రయోగం పెద్ద సాహసం అయితే కవి సమర్ధన చేసుకోవటం ఎలాగంటే శివుని విల్లుని సోదాహరణంగా తీసుకోవటంతో సరిపోయింది.
సాధారణ గృహకృత్యాలలో సతమతమైన గృహస్థు సంతానం ఏవో కొత్త కోరికలు , నూతన భాధ్యత నిర్వాహణకు బెంబేలు పడుతుంటే స్త్రీ తనదైన ఆచరణాత్మక ఆలోచన తన పొదుపు నుంచి భర్తను కాపాడికూడా...ఏమి తెలవన్నట్టుగా వుంటారు....అదే ఇది..
ఇక తరువాత వాక్యాలు కి వెళదాం.....
"ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి...."
సీతమ్మ వారి సౌకుమార్యం చూసి రాములవారు ఆశ్చర్యం తో భలే భలే అన్నట్టుగా సీతమ్మవారికన్నులలో కొంటేగా చూశారట...
మరి చూశారా మేలమాడి అనే పద ప్రయోగం...సాధారణంగా వధూవరుల మధ్య కాని బావమరదల మధ్యకాని ఓక విధమైన మనోహరమైన శృంగార వెటకారం వేళాకోళం వుంటుంది... కాని ఇదే వరుస అయినవారి మధ్యమాత్రమే సన్నిహితత్వం తో కూడిన హస్యసంభాషణను మేలమాడటం అంటారు.
దీనితో సీతమ్మ వారు రాముల వారి భావం గ్రహించినదై కొంత అలకతో కూడిన సిగ్గుతో నవ్వినారట....
మరి తరువాత చరణాలు కి వెళదామా.....
"సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు"
ఇంత చేసిన సీతమ్మ వారు ముగ్ధమనోహరంగా తలవంచి కూర్చుని...తన కొన చూపుతో రాములవారిని అందంగా చూస్తున్నదట...అది ఎలా బొండుమల్లే చెండు జోరు....ఆమేను ఏమో విరజాజి గా వర్ణించుతూ....కాని ఆమే చూపులను బొండుమల్లేలుతో వర్ణించటం గమ్మత్తు... బొండుమల్లేలు సౌరభం గుబాళింపు వధూవరుల మధ్య ఎనలేని సాన్నిహిత్యం కలుగచేసి ఓకరిపై ఓకరికి ఆకర్షణ బలపడేవిధంగా వుంటుంది... అందుకే ఆ పద ప్రయోగం....
మరి సౌరు అన్న పదానికి అర్ధం అందంగా నవ్వటం అని...వధువు తన మనోహరమైన నవ్వుతో సిగ్గుతోను వరుని మదిలో స్థానం అనే భావనలో ప్రయోగం....
మరి తరువాత చరణాలు కూడా చూద్దాం.....
"సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది."
పంట పండాలి అంటే వర్షం అవసరం...ఆ వర్షం నల్లమబ్బుల రూపంలో వస్తుంది...
మరి సీతమ్మ వారు మనోహరమైన సిగ్గు నవ్వులతో రాముని వారు ప్రేమాస్పదుడై అమ్మవారిపై వర్షపు మబ్బులా తన ప్రేమ ఆప్యాయత ఆనే వర్షం వరద వచ్చేంతగా కురిపించారట...
ఈ వాక్యాలు లో తళుకు, నల్లమబ్బు ,వరదైనాది పద ప్రయోగాలు విశిష్టత కలిగినాయి....తళుకు అనేది స్త్రీ తన అందచందాలు ప్రవర్తనతో భర్తను ఆకట్టుకుంటదని.....
నల్లమబ్బు....నల్లమబ్బు లో మాత్రమే వర్షపు నీరు దాగి వుంటుంది అని తన భార్య పై పురుషునకు అదేవిధమైన ప్రేమ కలిగివుంటుంది అని....
ఇంతటి అనురాగ పూరితమైన సంసారంలో వలపు వరదలా వుంటుంది అనేది కవి భావన...
మరి ఇంతటి గొప్ప సాహిత్యం... దాని వెనుక పరామార్ధం...ఎంతమంది వధూవరులు ఆచరణో....అసలు వారికి తెలుసా...ఏమో....తెలిసినది ఓకటే ఈగోలు , ప్యాకేజిల మధ్య చిక్కుకుపోతున్నారు....
మీ అభిప్రాయం తెలపండి
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262 వాట్సప్...., టెలిగ్రాం...
rameshsssbd@gmail.com.
సకలం సర్వం...
శ్రీరామ జయం.

9, మార్చి 2023, గురువారం

సంపుటీకరణ - మంత్ర వివరణ

సంపుటికరణ...
బహుశా ఈ పదం చాలా మంది సాధారణ ప్రజలకు కొత్త. కాని అధ్యాత్మికత రంగంలో శ్రద్ధ వున్నవారికి ఇది తెలుసు, మరీయు బీజాక్షరాలు అన్నీయును పరమేశ్వర ప్రోక్తం అన్నది గమనార్హం. మరి ఈ బీజా ఆక్షరకూర్పు మంత్రం అన్నది కూడా మీకు తెలుసు.
సహజంగా మానవుడు అనేక రకాల కామ్యంలు గురించి మంత్ర సాధన చేస్తాడు. అవి అతని జీవన కాలంలో ఇంక చెప్పాలంటే త్వరగా సిద్ధించితే ఫలితంను పరమేశ్వరాను గ్రహంగా భావించి సంతోషించి ఆనందపడతాడు. కాని కొంతమందికి అది జీవనకాలంలో సాధ్యపడదు. ఎందుకు ఎలా అనేదానికి పరిష్కారం చిక్కదు.
ఇది ఈనాటి జీవన విధానంలో కాదు పూర్వం
మహర్షుల కాలంలో కూడా వున్నదే..అందుకు ఋషులు పరమేశ్వరుని ద్వారా సందేహ నివృత్తి కై పరమేశ్వర మంత్రం సాధనలో కల అవరోధాలను , సాధనలో ఫలితాలలో కల ఆలస్యాలు వలన మేము ఈ జన్మలో సంకల్ప సిద్ధి లేక ..కొండకచో ఆయష్షు తీరి మరుజన్మ ఎత్త వలసి వస్తున్నది...అప్పుడు కూడా సంచిత ప్రారబ్దకర్మలు వలన అనేకానేక ఇబ్బందులు వీటీని దాటగలటానికి తరుణోపాయం తెలియచేయగలరు అని అడగటంతో..ఆయన వారికి ఈ సంపుటికరణ ను సూచించారు.
అసలు సంపుటికరణ అంటే ఏమిటి.. కూర్పు లేదా జోడింపు. అనగా మన కామ్యసిద్ధిగా జప , పారాయణలో వున్న మంత్ర , స్తోత్రాలకి ఇంకోక వేగ వంతమైన మంత్రం జోడించి జప , హోమ , తర్పణాదులు చేయాలి. స్తోత్రాలకి అయితే పారాయణ మాత్రం సరిపోతుంది. అనగా మన గృహిణులు లలిత పారాయణ చేస్తారు..అందులో వున్న ఓక్కో శ్లోకం కొన్ని నామాలా కూర్పు గా వుంటుంది. మీరు సంకల్ప కార్యసిద్ధి త్వరగా కావాలంటే ఈ స్తోత్రాలకి మరో నామం కాని శ్లోకం కాని సంపుటి చేయాలి...
ఇది ఎలాగంటే లలితలో ప్రారంభ శ్లోకం అయిన
శ్రీమాత శ్రీమహరాజ్ఞి శ్లోకం చదివి తదుపరి మీరు సంపుటి చేయవలసిన శ్లోకం పఠించాలి.
ఇలా అన్నీ శ్లోకాలకి ముందు పారాయణ శ్లోకం తదుపరి సంపుటి శ్లోకం చదివాలి ఇందువలన మీ సంకల్ప సిద్ధి నందు వేగం కలుగుతుంది.
సాధారణ శ్లోకం మీరు ఓక్కసారి పారాయణ చేస్తే సంపుటీ శ్లోకం బహుమార్లు పారాయణ చేస్తారు. అందువలన ఈ సంపుటి శ్లోకం మీ సంకల్పంనకు ప్రచోదనం లా పని చేస్తుంది.
సాధారణ పరిభాషలో వేగంగా వెళ్ళు కారుకి ఇంకొంత వేగంగా వెళ్ళు శక్తిని జోడింపు.
ఇది ఓక తాంత్రిక పద్ధతి. సాధారణంగా తాంత్రిక పద్ధతి వామాచారంలో గమనిస్తాం. మరి ఈ వామాచారం అంటే ఏమిటి...
సాధరణంగా మనం చేయి పూజలు పురాణోక్త , వేదోక్తంగా వుంటాయి వీటిలో వాడు వస్తువులు కూడా పండ్లు , పూలు లాంటివే . కాని వామాచారంలో మద్య , మాంసాలు లాంటి మరికొన్ని ఉపయోగం చేస్తారు. మనం పూజించి దేవతా రూపాలని బట్టి ఈ వస్తు వినియోగం వుంటుంది. అనగా శాంతరూపాలకి ఓక విధంగా , అదే దేవత తామస రూపాలకి మరో విధంగా వుంటుంది. ఇది ఎలాగంటే లలిత , రాజరాజేశ్వరి శాంత రూపాలైతే తామస రూపాలైన కాళి ,(కాళిలో 24రూపాలు),భైరవి ,చండి లాంటివన్నమాట..అంత మాత్రం చేత భయపడవలసిన పనిలేదు. అమ్మ సదా అమ్మే...చాలామంది మూఢనమ్మకాలతో అమ్మో ఆరూపం చెడు ఈ రూపం చేటు అనే వాఖ్యానాలు చేస్తారు...కాని జగన్మాత ఏ రూపంలో వున్నను తన సహజ లక్షణమైన కరుణను విడవదు...ఇది తెలిసిన వారికి కాళి రూపం ముగ్దమనోహరంగా దర్శనం...అందుకే రామక్రిష్ణ పరమహంస కాళిరూపంలో మమేకం అయి సదా ఆమే ధ్యానంలో వుండేవారు.
అసలు వామాచారంనకు ఆ పేరు రావటంనకు గల కారణం...అర్ధనారీశ్వర రూపంలో గల వామభాగం నందు అమ్మ వుండటమే. మనం ఈశ్వరుని ధ్యానిస్తే సరిపోతుందా...ఆయన వరం ఇవ్వటానికి అమ్మ ప్రోద్బలం వుండాలిగా అందుకే సంపుటిలో అమ్మవారి నామం జోడింపుతో అమ్మ వాడు నా బిడ్డ వాడి సంకల్పం ఏమి చేశారు అని ఈశ్వరుని కోరి సిద్ధింప చేస్తుంది. కావలంటే గమనించండి మన ఇళ్ళల్లో పిల్లలు తండ్రికి చెప్పినా చేయని పనిని తల్లిద్వారా అడిగి చేయించుకుంటారు. ఆకార్య సాధనలో భర్తతో విముఖత అయినా లక్ష్యపెట్టదు. ఆమేకి కావలసినది తన బిడ్డ మనోరధం తీర్చటం. సాధారణ గృహిణిలే ఇలా వుంటే జగద్ధాత్రి ఆ పరమేశ్వరి ఏరూపంలో వున్న తన బిడ్డ సంకల్పం మరచిపోతుందా...ఇది ఇంకనూ సూక్షంగా చెప్పాలంటే శిశువు స్తన్యం గురించి రోదన చేసే సమయంలో దూరంగా తల్లి తండ్రి వున్నను ప్రకృతిలోని సూక్ష్మ ప్రకంపనల వలన తల్లికే ముందు తెలుస్తుంది. శిశు రోదన వలన స్తన్యం  ఉబికి వక్షం భారమవుతుంది. అందుకే తల్లులు శిశువు రోదన ప్రారంభం కాగానే స్తన్యం ఇవ్వటానికి తపన పడతారు. ఇది మరీ ఏక్కవగా ఆవు, దూడలలో మనకు తెలుస్తుంది.
నేను సంపుటి గురించి తెలుపుతూ ఇవి అన్ని తెలపటం వేరు కాదు...మీరు భయపడవలసిన పనిలేదని తెలపటం.
ఈ సంపుటిలో కొన్ని సార్లు పాశుపతం కూడా సంపుటిస్తారు. అసలు సంపుటి శ్లోకం , మంత్రం ఎలా ఎన్నుకోవాలి. మీ నామ నక్షత్రాలకి , దశ నాధులకి , సంకల్ప కార్య సాధనకి గల అధిష్టాన దేవతను బట్టీ ఎన్నుకోవాలి. ఇది వ్యక్తిని బట్టి , సందర్భాన్ని బట్టి మార్పు వుంటుంది. కనుక మీ సంకల్ప సిద్ధికై తగు శ్లోకంతో సంపుటికరించి లబ్దిపొందండి.
సర్వులకి శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
పై వ్యాసంలోని సందేహలకి సంప్రదించండి.

5, మార్చి 2023, ఆదివారం

వాలి సంహారం అంతర్గత రహస్యాలు

రాముడు - పరిశీలన - సీరిస్ 4
************************
వాలి సంహరం.
రామాయణం తో పరిచయం వున్న ప్రతి ఓక్కరికి తెలిసే పాత్రలు.వాలి,సుగ్రీవులు.
మన తెలుగు నాట సతతంకీచులాడుకునే అన్నదమ్ములను నర్మగర్భంగా..ఆ.... వారి మధ్య  వాలి సుగ్రీవుల సంబంధం అని ఉదహరిస్తారు. ఆ శ్లేష...తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది... ధనం గురించో , కుటుంబ స్త్రీల గురించో వారిలో వైరుద్ధ్యాలున్నాయని....
పౌరాణికంగా ఆంజనేయుని విశిష్టత ముందు వాలిప్రభ మనకు అంతగా పరిచయం లేదు...
కాని వాలి మహ వీరుడు...కాకపోతే స్త్రీ వ్యామోహి...
వాలి ఇంద్రుని కుమారుడు. వాలి తండ్రి ఋక్షరజుడు...(కొంతమంది వృక్షజుడు అంటారు..అంటే చెట్లమీద పుట్టినవి...అని.. చెట్లమీద ఏమి వుంటాయి..పక్షులు , కోతులు)
ఇతను వానర రాజు...ఇతను ఓకరోజు పొరపాటున ఓక కొలనులో పడి...అప్సరస గా మారిపోతాడు...ఈ అప్సర సౌందర్యం చూసిన ఇంద్రుడు మోహించి కామించి...ఆమేను చెర పట్టుతాడు...ఈ హడావుడి ఇలాగుంటే ఇదే అప్సరను బ్రహ్మదేవుడు చూసి కామించి మోహించి..తాను కూడా ఆమేతో పొందుకోరతాడు..(.వీళ్ళద్దరు ఆమేతో సంగమం నేను కొద్దిగా శ్లేషగా వివరిస్తున్నాను...మీరు అర్ధం చేసుకోండి). ఈ అప్సర వాలభాగం నుంచి ఇంద్రుడు సంగమించి ఆప్రదేశంలో తన వీర్యనిక్షిప్తం...కంఠభాగంలో బ్రహ్మ సంగమించి... తన వీర్యనిక్షిప్తం.... అందువల్లనే...ఇంద్రాంశతో...వాలి..బ్రహ్మంశతో సుగ్రీవజననం. ఇద్దరూ మహవీరులే. ఇంద్రుడు
తార అనే అప్సరసను వాలికి ఇచ్చి భార్యను చేస్తాడు,  అలాగే విపరీతమైన మహిమగల ఓక హరం ఇస్తాడు.
కాకపోతే మొదటి నుంచి సోదరుల మధ్య స్త్రీ పర వైషమ్యం వున్నది. అది తార , వాలి భార్య కావటంతో కొంత ముదిరి పాకాన పడింది... ఇరువురి మధ్య ప్రచ్ఛన వైరం....
దీనితో బ్రహ్మదేవుని గురించి వాలి తపస్సు చేసి...లౌక్యంగా ఓక వరం కోరతాడు..యుద్ధంలో తన ప్రత్యర్ధి నుండి తనకు  సగం బలం సంక్రమించాలని కోరతాడు...దానితో బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. బ్రహ్మ నాలుగు తలకాయలు వున్నను తేడా పడి...తపస్సుకు వరం కాబట్టి ఇస్తాడు. వాలి యొక్క శత్రవు సుగ్రీవుడు తన కుమారుడు (అంశ)అన్న విషయం మరచి పోతాడు. (కొన్ని వాటిల్లో వాలికి వరం బ్రహ్మ ఇచ్చారని మరికొన్నింటీల్లో ఇంద్రుడు ఇచ్చారని వున్నది...మొత్తానికి వరం వున్నది )(అందుకే మనవాళ్ళు అంటారు బ్రహ్మ నాలుగుతలలులో ఓకటి అవునంటది ఇంకోటి కాదంటది మరోకటి లేదంటది ఆతరువాతది చూద్దాం అంటుంది అంటారు)... దీనితో వాలి ,  సుగ్రీవుని లక్ష్య పెట్టని రీతిలో కిష్కింధను పాలిస్తుంటాడు.
ఇంతలో దుందుభి అనే రాక్షసుడు వాడి వీరత్వాన్ని పరిశీలించుకోవటానికి వరణుడు , సముద్రుడు లను యుద్ధానికి ఆహ్వానిస్తారు.
దానితో వారిద్దరు తమ వల్లకాదు ..నీ వీరత్వం మొత్తం.. వాలి వద్ద ప్రదర్శించు అంటారు. దానితో వాడు దున్నపోతు రూపం ధరించి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. కాని వాలి అనునయంగా వద్దులే అంటాడు..కాని దుందుభి.. వాలి వీరత్వాన్ని కించపరిచే మాటలు పలుకుతాడు...దానితో  వాలి దుందుభి తో యుద్ధానికి దిగి వాడితో పోరాటంలో భాగంగా వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసరివేస్తాడు..వాడేమో ఋష్యమూక పర్వతంపైన  వున్న మతంగమహర్షి ఆశ్రమంలో  పడి రక్తం కక్కుతూ మరణిస్తాడు. దీనితో మతంగమహర్షి.. ఆశ్రమప్రాంతం కలుషితమైనదన్న ఆగ్రహంతో వాలిని ఋష్యమూక పర్వతంపై అడుగు పెట్టితే నీ తల వేయి ముక్కలవుతుంది శాపం పెట్టుతాడు...ఈ విషయం తెలిసిన వాలి ఋష్యమూక పర్వతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో సంచారం.
ఇది ఇలావుంటే వాలికి రావణునితో విపరీతమైన మైత్రి ఏర్పడుతుంది . ఇదో విచిత్ర సంబంధం. రావణునికి విపరీతమైన అహం..తాను వీరాధివీరుడననని...దానితో ఓకసారి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే రావణుని బంధించితే రావణునికి ఊపిరందక గిలగిలాడిపోతు శరణుజోచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటాడు.
అయిననూ బుద్ధి రాక మరోక్క సారి వాలిపై యుద్ధానికి వస్తాడు. ఆసమయంలో వాలి సంధ్యావందనంనకు సముద్రతీరానికి వస్తాడు..ఆ సమయంలో రావణుని కవ్వింపు... దానితో వాలి రావణుని క్రిమి కీటకంతో సమానంగా భావించి ఓక్కసారిగా రావణుని చంకన పెట్టుకుని ఆకాశపయనం...
వాలి ప్రతిరోజు తన సంధ్యావందనం లో భాగంగా...సప్తసముద్రాలలో సూర్యుడు ఏ సముద్రం వద్ద ఉదయించుతాడో...అంతకన్నా ముందు వెళ్ళి పూజాదికాలు చేసేంత వేగం.
ఇలా సప్తసముద్రాలను రెండు ఘడియలలో చుట్టి వచ్చేంత వేగం. ఇలా రావణుడు వాలి చంకలో బందిగా చాలా రోజులు వుంటాడు.ఇదే సమయంలో వాలి ప్రవర్తన వలన వాలికి గల స్త్రీ వ్యామోహం తెలుసుకున్న వాడై. రావణుడు ఎలాగోలా అగ్నిసాక్షిగా మైత్రి. ఈ మైత్రికి ఓక ఓప్పందం ఇస్తాడు రావణుడు.లంకలోని సమస్తానికి తన భార్యలతో  సహ..తనతో పాటు అనుభవించే సహ హక్కులు ఇస్తాడు. కాని వాలి పట్టించుకోక ఓక నెల వుండి వస్తాడు.
దుందుభి కొడుకు మాయావి అనేవాడు వచ్చి వాలిని కవ్విస్తాడు..దానితో వాలి వాడి వెంటపడతాడు...ముందు మాయావి తరువాత వాలి...వీరి వెనుక సుగ్రీవుడు..
మాయావి ఓక గుహలో ప్రవేశిస్తాడు...వాడి వెంట వాలి...సుగ్రీవుడు తన అన్నగారి కోసం బయటనే ఆగి ఎదురు చూస్తుంటాడు...ఓక నెలరోజుల తరువాత గుహనుంచి అరుపులు కేకలుతో పాటు రక్తం బయటకు వస్తుంది...అది తన అన్నగారిదేనన్న భావనతో సుగ్రీవుడు లోపల వున్న మాయావి మరలా బయటకి రాకూడదని ఓక పెద్ద బండరాయి ని గుహకి అడ్డుగా పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళి..మంత్రుల సలహపై రాజ్యపాలన చేస్తుంటాడు...కాని వాలి లోపల మాయావిని సంహరించటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది... బయటకు వచ్చిన వాలికి..అది సుగ్రీవరాజ్యం అని తెలుస్తుంది. దానితో తమ్మునితో యుద్ధంచేసి తమ్ముని ఓడించి...రాజ్య బహిష్కరణతో పాటు...తమ్ముని భార్య రుమ ని స్వాధిన పరుచుకొని...సుగ్రీవుడు తన రాజ్యంలో వుంటే మరణశిక్ష అనే ఆదేశం...దానితో సుగ్రీవుడు తన మంత్రులు అయిన హనుమ , జాంబవంతుడు , సుశేషణుడు మొదలగు వారితో ఋష్యమూక పర్వతంపైన నివాసం...మంచి కాలం కోసం ఎదురు చూపులు...
ఇటువంటి నేపథ్యంలో సీతాపహరణం...ఆమేని అన్వేషిస్తూ రామలక్ష్మణుల వెదుకులాటలో జటాయువు ని కలుస్తారు. ఇతను పక్షిరాజు.ఇతను దశరధుని మిత్రుడు. రామభక్తుడు. కధా కాలానికి వృద్ధుడైనాడు.ఇతను గరుత్మంతుని సోదరుని కుమారుడు. ఇతను మొదటిసారిగా రామునికి సీతాపహరణం జరిగినది రావణుని వలన అని తెలియచెప్పి ...తాను సీతాపహరణాన్ని ఎలా ఎదుర్కోన్నది...వీటితోపాటు రావణుని తాలూకు అన్నీ వివరాలు తెలిపి...వాడిని ఎదుర్కోవటంలో భాగంగా తగిలిన గాయాలతో పాటు ఋష్యమూకపర్వతం పైన తగిన జాడలు కాని తగు సహయం కాని లభిస్తుంది ఆని తెలిపి ప్రాణత్యాగం చేస్తాడు. దీనితో రాముడు ఎంతో బాధతో జటాయువు కి అగ్నిసంస్కారం జరిపి ఉత్తమగతులు కల్పించుతాడు. (గమనించారో లేదో రాముడు పక్షి కి కూడా అగ్ని సంస్కారం చేస్తాడు. కాని నేటి కాలంలో స్వంత తల్లి తండ్రులకి చేయాలంటే నీవంటే నీవు అనుకుంటూ ఆస్థులు లెక్క తేలేంత వరకు విభేదాలు... మరి ఈ కోవిడ్ రోజుల్లో ఈ గోల మొత్తం మునిసిపాలిటీ వాళ్ళు చేస్తుండటంతో మన సన్నాసులు విపరీతమైన నటన ప్రదర్శన . నేటికి ఆవుకి మాత్రమే అగ్ని సంస్కారం కొంతమంది చేస్తున్నారు)
తదనంతరం రామలక్షణులు ఋష్యమూక పర్వతం వద్దకు వస్తారు...అక్కడ వున్న హనుమని మొదట గుర్తించి హనుమని ఆలింగనం చేసుకుని సుగ్రీవునితో పరిచయం.సుగ్రీవునికి అనుమానం వీరు వాలి పంపిన చారులని...వీరి ఉభయులు మధ్య పరిచయాలు కష్టసుఖాలను పంచుకున్న తరువాత ఇద్దరునూ ఓకే విధమైన కష్టాలలో వున్నారని...కాకపోతే రాముడు సుగ్రీవుల మధ్య వానర మానవ బేధం తప్ప అంతా ఓక్కటే.దీనితో ఇద్దరు ఓకరికొకరు సహయం చేసుకోవాలనే నిశ్చయంకి వస్తారు. అయిననూ సుగ్రీవునకు ఇంకనూ శంక..వాలి వధ..రాముని వల్లన అవుతుందా...దానిని లౌక్యం గా అడుగుతాడు...మీ అన్న ఎంత విశేష ప్రజ్ఞ , వీరత్వం కొద్దిగా తెలుపుదూ అంటే...ఓక ప్రదేశంలో వున్న 7సాల వృక్షాలను చూపి మా అన్న వీటిన్నంటిని కలిపి ఓక్క సారిగా పెకలించ గలడు అన్నాడు. దీనితో రాముడు తన బాణం సంధించి వదులుతాడు...ఆవిఅన్నీ...ఓక్కసారిగా నేలకూలుతాయి...దీనితో సుగ్రీవుడు స్థిమితపడి రామునిపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించగా...అగ్నిసాక్షిగా వీరిద్దరి మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. రాముడు సుగ్రీవునికి రాజ్యం , అతని భార్య లభ్యతలో సహయం చేయాలని...అలాగే సుగ్రీవుడు సీతాన్వేషణకి అవసరమైన సహయం చేయాలని.
దీనితో సుగ్రీవుడు రాముడు వెన్ను వున్నాడన్న ధైర్యం తో వాలిని ద్వందయుద్ధానికి ఆహ్వానిస్తాడు...అసలే తమ్మడంటే పడని వాలి కోపంతో యుద్ధం చేస్తాడు...ఇరువురు ఏక సమయంలో జన్మించిన నందున ఏకరూపంలో వుంటారు రాముడు కొద్దిగా గందరగోళం పడి తన బాణ ప్రయోగం చేయడు. దానితో వాలి సుగ్రీవుని తీవ్రంగా గాయపరచి ఓడించుతాడు. వాలి వెళ్ళగానే సుగ్రీవుడు రామునితో నీవున్నావన్న నమ్మకంతో కదా నేను యుద్ధం సిద్ధం అయినది...ఇలా జరిగింది ఏమిటి అని వాపోతాడు...దానికి రాముడు... మీ ఇరువురూ ఓకే విధంగానే వున్నారు...నేను ఆనవాలు కట్టలేక పోయాను అంటూ మీ అన్ననూ మరలా యుద్ధానికి పిలువు..ఈసారి నిన్ను గుర్తింపు కి వీలుగా ఈ పూలమాల ధరించు అని సూచనతో...అదే విధంగా చేసి..అన్న అయిన వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు...వాలి సిద్ధపడతాడు...కాని తార వారించుతుంది..ఇంత అర్ధరాత్రి పూట యుద్ధ ఆహ్వానం అంటే ఎదో అనుమానంగా వున్నది...అందునా మన చారుల వార్త ప్రకారం సుగ్రీవునకు రాముడనే వానితో స్నేహం ఏర్పడినది...అతను మహ ప్రజ్ఞ కలవాడు అని తెలిసినది....కాని వాలి ఆవేశంలో ఈమాటలు లక్ష్య పెట్టక...వీడికి ఈసారి మరణమే శరణ్యం లాగున్నది...అని యుద్ధానికి బయలుదేరతాడు.
వాలి సుగ్రీవుని యుద్ధంలో సమయంచూసి రాముడు చెట్టు చాటునుంచి వాలిపైకి తన బాణం ప్రయోగిస్తాడు...దానితో వాలి నేలకూలతాడు....వాలి వలవలా ఏడుస్తూ రాముని అనేక ప్రశ్నలు సంధిస్తాడు...
రామా వానరాన్ని...నీకు ఆహరంగా పనికిరాను...నీ భక్తుడనే...వీరుడవే..చాటునుంచి కొడతవా...ఇది న్యాయమా...అంటాడు...పోని సీత గురించి అంటావా...ఆవిషయం నీవు  తెలిపితే చాలు..నేను రావణుని ఆజ్ఞాపించితే చాలునే రావణుడే స్వయంగా సీతను తిరిగి తీసుకుని రాగలడే..
దీనికి రాముడు సమాధానంగా...
వాలి...నీవు నా భక్తుడవు అన్నమాట నిజమే..ఈ విషయంలో నీపట్ల ప్రపన్నత వున్ననూ..ఇది నీ తప్పులను కాయదు...పుత్ర సమానుడైన తమ్ముని భార్యను చెరపట్టటం..నీ అహంకారపూరిత ప్రవర్తన...వానరుల పట్ల నీ ప్రవర్తన నీవు జ్ఞప్తీకీ తెచ్చుకో..అందునా మేము క్షత్రియులము వేట మా నైజం...నీవా వానరానివి,జంతు సమానుడివి కాబట్టి వేటాడాను...పోని నేను నిన్ను ఎదుర్కోవాలంటే నీ వరం వల్లన అది సాధ్యపడదు...ఇది మా మహరాజ్యం..ప్రస్తుతం రాజప్రతినిధిగా ఈ ప్రాంతంలో వున్నా...రాజప్రతినిధికి వున్న దండనాధికారం గురించి నీకు తెలియనది కాదు...అయిననూ నీ పశ్చాత్తాపం వలన నీ ప్రాణం నిలబడక పోయినూ నీకు సద్గతి వున్నది...నీ అంతిమ కోర్కేను అమలు పరచటం నా కనిస ధర్మం...
అనగా..వాలి..రామచంద్రా..బుద్ధికర్మాను సారణి అన్న విధంగా ప్రవర్తించా..ఈనాడు ఆలోచిస్తే తెలుస్తుంది.. కాని నా బాధ ఈనాడు... అంగదుని గురించే...దీనితో రాముడు అంగదుని బాధ్యత తనదని చెప్పి...అంగదుడు యువరాజుగానే వుంటాడు అన్న మాటతో వాలి సంతృప్తిగా మరణిస్తాడు...
ఇది మొత్తం పౌరాణిక కధ...
వాల్మీకి వారి నామధారణలోనే వారి బుద్ధులు తెలిపినాడు.. వాలం అంటే తోక..ఓక విధంగా అది వాడి ఆధినంలో వుండదు అని భావన..అనగా వాలి ఇష్టానుసారం ప్రవర్తన అని సూచన..సుగ్రీవుడు.. అనగా మంచి వారిలో కొమ్ము లాంటి వాడు..అనగా నమ్మ దగిన వాడు..అందునా సుగ్రీవుడు బ్రహ్మ అంశ , హనుమంతుడు శివాంశ వీరిద్దరూ కలసి నారాయణాంశకై ఎదురు చూపు...ఇక  త్రిమూర్తులు చేరికతో తదుపరి జగన్మాత సీతమ్మ రక్షణ...రావణ పతనంనకు ఇది సూచన.
రావణుడు , వాలి మధ్య ఉమ్మడిస్నేహకారణం స్త్రీ వ్యామోహం. వాలి చనిపోయే ముందు నీ భక్తుడను అంటాడు..మరి అంతటి వినయవిధేయతలు వున్నవాడు...సీతాపహరణ విషయం వాడికి తెలసి ఉదాసీనత తో వూరకున్నాడు...ఈ విషయం రామునికి తెలియదా..అంటే వాడి ఉద్దేశ్యం  మంచా చెడా... వాలి మాటతో రావణుడు సీతను తిరిగి తెస్తే...రాముని వ్యక్తిత్వ ,క్షాత్ర హీనత అవుతుంది.
ఇక సుగ్రీవ స్నేహనికి రాజకీయ కారణం..నిర్వాహణ కారణం ..సూత్రబద్ధ ధర్మ కారణ హేతువులు వున్నాయి.
కిష్కింధలోని వానరులు , సుగ్రీవుడు సర్వులు వాలి భాధితులే...వాడి అహంకార పూరిత ప్రవర్తనకి విసిగి వేసారి పోయారు...పోని ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు వాడి వరం వల్లన ఇది మనకు సుగ్రీవుని భార్య రుమని తన స్వాధీనం లో వుంచుకోవటమే..ఆమే ఏమి చేయలేదు..హితులు సన్నిహితులు ఏమి చేయలేక బయటకు రావటమే సూచన. దీనితో వాళ్ళను వాలి నుంచి ఎవరు కాపాడుతారో అన్వేషణ...ద్వంద యుద్ధంతో పనికి రాదు..అస్త్రనిపుణుడే కావాలి...వానరుల హస్తనిర్మాణం విలువిద్యకు సరికాదు...ఓకవేళ ఎవరైనా వున్ననూ వారు నిపుణులు కాదు...దాదాపు వానరులు అందరూ ద్వంద యుద్ధంలో గాని , భుజ బలం వల్లకాని , గద , పరిఘ , బరిశ లాంటి ఆయిధప్రయోగం..అవి వాలి వద్ద పనికి రావు..కారణం అవి ముఖతా ప్రయోగం...కాని శర అస్త్ర ప్రయోగం అలాకాదు దూరం నుంచి అవకాశం... అందుకే సుగ్రీవుడు రాముని విలువిద్యా నైపుణ్యం పరిక్షించుతాడు..దానితో సుగ్రీవునికి నమ్మకం కుదురుతుంది. వానరులకి వాలి పీడ పోయిన తరువాత అంత ఉత్సాహంగా కోట్లాదిమంది రామదండుగా కదులుతారు.
రాముని కారణాలు రాముని కున్నాయి...
ముందు రాముడు ఎంత వీరుడైననూ రావణుని వంటి వాడి మీద దండయాత్రకు తాను ఒక్కడే చాలడు..ఈ విషయం పై పూర్తి అవగాహన వున్నది. అందుకే తోడ్పాటు కావాలి. ఎవరన్నా రాజసహయాం అడిగితే ఇతని క్షాత్రంనకు అవమానం..అలా జరిగితే రాముని వ్యక్తిత్వం వీరత్వం బలహీనపడుతుంది...పోని అటువంటి వాడు దొరికినా రాముడు అతనితో స్నేహనికి ఆరాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాలి..అప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాటకి వాగ్దాన భంగం జరుగుతుంది... అరణ్యవాసం పదనాలుగు సంవత్సరాల కాలంలో ఏ రాజ్యవాసం చేయరాదు.. అందువల్ల తప్పని సరిగా అరణ్యవాసులతోనే స్నేహం..వారి సైనికులతోనే దాడి చేయాలి. రామునికి వానరుల సహయాం కావలని జటాయువు తో మాట్లాడిన తరువాత అవగాహన కి వస్తుంది.. మరి దగ్గరలో అందుకు తగ్గ వానర రాజ్యం..కిష్కింద మాత్రమే...పోని వెనుకకు పోయి తనకు తెలిసిన వానర రాజ్యాల సహయం తీసుకోవాలన్నా సమయాతీతం..అప్పటికే అరణ్యవాసంలో పదిసంవత్సరాల కాలం అయిపోయింది...వెనుకకూ పోయేది ఎప్పడు అందుకు తగ్గ వానరులను వెదికి వాళ్ళను కూడగట్టి తీసుకుని రావాలి అంటే పూర్తి సమయాతీతం..సమయంలో అయోధ్య కి తిరిగి వెళ్ళక పోతే భరతుని ప్రాణత్యాగం అనే మాట ఇన్ని పరిధిల మధ్య సుగ్రీవ స్నేహం చేయాలి, అందునా వానరులు , వానరప్రముఖులు సుగ్రీవునితో...ఇదే కాకుండా భార్యా వియోగం , రాజ్య పాలనలో ఇద్దరిది సరిసమాన బాధ...ఓకరు పాలనలో వున్న వారికి రాజ్యం పోయింది.. రెండోవ వారికి రేపు రాజ్యపట్టాభిషేకం అనగా అరణ్యవాసం...ఓక బాధితుడు రెండోవ బాధితుడి దుఃఖం , అవసరం గుర్తించ కలడు...
అలాగే కాకుండా శత్రవు మిత్రడు కూడా శత్రువు తో సమానం అన్న రాజనీతి .
ఇది పూర్తిగా దైవ ప్రణాళిక.
ఇది రాముని రాజ , క్షాత్ర ,వీర ,వ్యక్తిత్వ ధర్మం.
ఇన్ని విధాల ఆలోచన చేసి మాత్రమే వాలిని సంహరించాడు.
సకలం సర్వం శ్రీరామ జయం.
సర్వం శ్రీరామ ప్రసాదమే...
మిత్రులకు , విమర్శకులకు  స్వాగతం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
మీకు తప్పు అని తలచిన విషయం వాట్సప్ చేయండి...పరిశీలించి సరిదిద్దుకుంటాను.
ఇది నా ఘనత కాదు పూర్తిగా రామునిదే...ఆయన ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు...
కనుక సర్వం శ్రీరామ జయం.