4, ఆగస్టు 2020, మంగళవారం

రుద్ర నమక చమక పారాయణ విశేషాలు

మిత్రులు,
నమస్కారం...
మనవారు తమ జీవన ఆనందాలకి కృతజ్ఞతలు మరియు కష్టనష్టాల నివేదనకు రుద్రాభిషేకం, అభిషేకం చేశాం చేస్తాం..మరి ఈ అభిషేకంలో అయ్యవారు కొన్ని మంత్రాలు చదువుతారు చివరకు మనకు రెండు చుక్కల తీర్ధం ఇస్తే పుచ్చుకుని వస్తున్నాం. ఆ భోళాశంకరుడు మన మన ప్రాప్త , అప్రాప్తలను బట్టి తన కరుణప్రసాదిస్తున్నారు. మరి ఇంతటి రుద్రాభిషేకంలో ఏమున్నాయి..మనం స్వామి వారిని ఏమి అడుగుతున్నాం స్వామి వారిని ఏ ఏ ప్రదేశాలలో దర్శిస్తున్నామో తెలుసా..వీటిని తెలియచెప్పేది . ఈ రుద్రాభిషేకవిధిలో వున్నవి మహన్యాసం , రుద్రనమక , చమకాలు.
శివుని (రుద్ర) దర్శించాలంటే శివుడు కానివాడు శివుని చూడలేరు. అంటే స్థిరచిత్తంతో ధ్యానంలో వున్న శివుని అంతే స్థిరచిత్తంతో మీ ఆత్మనందు మీ మనస్సు నందు స్థిర పరచిన కాని ఆయన దర్శనం కాదు..ఆయనను స్పృశించలేము. మరి స్వామిని స్పృశించటం అంటే అగ్నిశిఖలా ప్రజ్వరిల్లే స్వామిని ఈ కారణభూత శరీరంతో ఎలా స్పృశించాలో తెలియచేసే ప్రక్రియ మహన్యాసం.దీనిని రౌద్రికరణ అంటారు. ఈ ప్రక్రియలో ఐదురకాల అంగన్యాసాలు వుంటాయి..అంటే శిఖాది పర్యంతం పాదాంతం వరకూ శుద్ధి చేతనత్వం కలిగించే ప్రక్రియ ఈ మహన్యాసం.
గమనించారా అయ్యవారు మనలను పైకి క్రిందకూ చూడమంటారు. మన సహస్రారం నుండి పాయువు వరకూ , మన శిఖ నుండి అరి పాదం వరకూ ప్రతి అంగాన్ని స్పృశించి శుద్ధి చేయమంటారు. ఈ సమయంలో ఆయా ప్రదేశాలలో వున్న అంతఃశ్చక్రశక్తిని సమంత్రపూర్వకంగా చేతనత్వం కలిగించటమే ఈ మసన్యాస లక్ష్యం.
దీని తదుపరి రుద్రనమక,చమకపారాయణ చేస్తారు. మరి ఇవి ఏమిటి ....
రుద్రపారాయణ..ఇది శివుని వైభవాన్ని ప్రస్తుతించే మంత్రాలు..ఇందు శివుడు ఏక్కడ ఏక్కడ వున్నాడో తన దర్శనాలు , ప్రజ్ఞ ,కరుణ ఇత్యాది అనేకానేకం ఈ రుద్రంలో వుంటాయి.
ఇది మొదట రుద్రం ఇది రుద్రధ్యానం..తదుపరి నమకం... ఇందు శివుని ప్రస్తుతించుతూ 11 అనువాకాలు వుంటాయి..ఈ 11అనువాకాలలో ఈ సృష్టిలోని జీవ అజీవ పశు పక్ష్యాదులు సూర్య చంద్రగోళాదులు సకల దిక్కులు సకల చర అచర ప్రపంచం మొత్తంలో శివుని దర్శించుతూ అంజలి ఘటించటం అనగా నమస్కరించటం..ఇది ఏ విధంగా వుంటుందో క్లుప్తంగా ప్రథమ , పదకొండవ అనువాకాలు మీకు తెలియచేస్తాను..
ఇక్కడ నేను మంత్రాలు తెలుపను వచనం మాత్రమే..
మొదటి అనువాకం :
:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
పదకొండవ అనువాకం :

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఇవేకాదు మానవజీవతంలో ప్రతి అవస్ధలో ప్రతి స్వభావం లో శివుని దర్శించారు మన పూర్వీకులు. బాల్య యవ్వనాది అవస్థలలో శాంత కోపాది స్వభావాలలో దర్శనం..
చమకపారాయణం:
ఇది ఇంకా విశిష్టం అయినది. చమే అంటే నాకు ప్రసాదించు అని వేడుకోవటమే..మానవ జీవితానికి అవసరం అయిన ప్రతి దానిని ప్రసాదించమని వేడుకోవటమే..
జన్మనుంచి జన్మరాహిత్యం వరుకు , పుట్టుక నుండి మరణం వరకూ...మీరు చదివినది నిజమే మరణం..అవును నాయన మాకు బాధ నొప్పి ఎవరి మీద ఆధారపడని మరణం ప్రసాదించమని వేడుకోవటం..జీవితానికి కావలసిన తేజస్సు ఓజస్సు ఊర్జత్వం ఇలా ప్రతి ఓక్కటి..ఇంతేనా ఆహరం పానియం ...భూమి ఆకాశం , జ్ఞానం అజ్ఞానం ఇలా ప్రతి ఓక్కటి ప్రసాదించమని వేడుకోవటమే..
ఇది  కూడా పదకొండు అనువాకాలు వుంటుంది
కొన్నిటి గురించి తెలుసుకుందాం
ఇక్కడ కూడా నేను మంత్రాలు తెలుపట లేదు వచన వివరణ మాత్రమే...
1వ అనువాకం.
ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 
2 వ అనువాకం:
నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 
3వ అనువాకం
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.
ఇలా విశేషమైనది విశిష్టమైనది..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.