4, ఆగస్టు 2020, మంగళవారం

మార్కండేయుని చరిత్ర - మరి కొన్ని విశేషాలు

మార్కండేయుని చరిత్ర.
మార్కండేయుడి చరిత్ర చదవటం అంటే ఈనాటి వారికి తెలియదుకాని పాతరోజులలో చిన్నపిల్లలు ఆరోగ్యం లేక విధివశాత్తు వ్యాధిగ్రస్తుడై బాధపడుతుంటే ఏమి చేయాలో తెలియక తోచని స్థితిలో వున్నవారికి  ఇచ్చే సలహా మార్కండేయపురాణం చదవమని.
ఈనాటి పిల్లలకు పురాణమంటే అవగాహన పోయింది కాని పురాణపఠనమంటే కధారూప పూజ , కధారూప ఈశ్వరార్చన. కధ చదువుతు ఈశ్వరమహిమను ప్రభుతను విభుతను అర్ధం చేసుకుంటూ ధ్యానసమాధి కావటమే అని ఎందరికి తెలుసు. ఆసమయంలో తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయమని భగవంతుని వేడుకోవటం...అలాగే చిన్నపిల్లలు వరుసగా తుమ్ము తే చిరంజీవ చిరంజీవతో పాటు మార్కేండేయ ఆయష్షు , హనుమంత ఆయష్షు అని ఉచ్ఛరించేవారు..ఈ ఆచారం మెల్లగా పోయింది. కారణం తుమ్మిన సమయంలో కొన్ని సార్లు హృదయస్పందన ఆగిపోయి ప్రాణాపాయం జరిగేవి...వాటికి కారణాలు తెలియక అన్నిటికి దేవుడే దిక్కు అనే రోజులలో ఇటువంటి ఆచారాలు ప్రవేశం...
ఇక మన మార్కండేయుని కధ తెలుసుకుందం.
మార్కండేయుడు కధ భృగువు కి జైమినికి సంవాదరూపకంగా ఓకసారి , భాగవతపురాణంలో ఇంకొకసారి ప్రస్తావనకి వస్తుంది.
మార్కండేయుడు  తండ్రి మృకండుమహర్షి , తల్లి మరుద్వతి. మృకండుడు గొప్పతపఃశాలి..ఆయన ఎంత నిశ్చలంగా వుండేవాడంటే ఆయన తపస్సలో వున్నప్పడు ఆయన శరీరం కొండలా మారిపోతే జంతుజాలం ఆ శిలకు తభ శరీరం ను రాపాడించి వాటి దేహభాధ ఉపశమింప చేసుకునేవి కాబట్టి మృగముల కండూతి తీర్చిన వాడు కాబట్టి మృకండుడు అని పిలిచేవారు. 
ఈ దంపతులకి పిల్లలు లేరు. అపుత్రస్య గతిఃర్నాస్తి ..అనగా పుత్రులు లేకపోతే ఉత్తమగతులు వుండవని వాడుక దీనితో ఆ దంపతులు కాశీలో రెండు శివలింగాలు ప్రతిష్టించి శ్రద్ధగా అర్చించగా పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షం అయి  సకల సద్గుణవంతుడు పదహరు సంవత్సరాల ఆయుష్షు కలవాడు కావాలా లేక దురవ్యసనపరుడైన చిరాయువు వున్నవాడు కావలనగా .వారు సద్గుణవంతుడు అయిన పుత్రవరం పొందితే ఆ దంపతులకి మాఘపౌర్ణమి రోజున మార్కండేయుడి జననం. ఆ రోజునే మార్కండేయుడి జననానికి కారణం..
మాఘమాసం పౌర్ణమి రోజు మఖ నక్షత్రం. ఈ మఖనక్షత్రం అధిపతి కేతువు. ఈ కేతువు ఆధ్యాత్మిక కారకుడు , మోక్షకారకుడు..అదియునుగాక మాఘమాసంలో చంద్రుడుపూర్ణకళలతో విరాజిల్లుతాడు. సింహరాశిలో చంద్రుడు కేతువు వుంటారు..కుంభరాశిలో రవి వుండటం ఆ రోజు ప్రత్యేకత..
ఈ బాలుడు మృకండుడు పుత్రుడు కాబట్టి మార్కండేయనామధేయంతో పిలుస్తున్నారు.అతను దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఈ సమయంలో సప్త ఋషులు మృకండుని ఆశ్రమంనకు వచ్చిన సమయంలో వారు మార్కండేయుడి ని చిరంజీవ అని దీవిస్తారు దానితో మృకండుని మదిలో కొత్త ఆశలు వచ్చి నా బిడ్డ చిరంజీవికదా అని ప్రశ్నించగా...సప్త ఋషులు తమ యోగదృష్టితో శివుని వరం గురించి తెలుసుకున్నవారై..అయ్యా ఈశ్వరానుగ్రహం ఎలాగున్నదో ఆయన లీల ఏమిటో ఎరుగక వున్నాం అయిననూ ఋషివాక్కు వ్యర్ధం కాదు అంటూ బాలునితో బ్రహ్మవద్దకు వెళ్ళగా ఆయనకూడా అప్రయత్నంగా చిరంజీవ అని దీవిస్తారు... అప్పుడు బ్రహ్మదేవ అలా ఎలా ఆశ్వీరదించారు మీ లలాటలిఖితం చూడలేదా అనగా..అయ్యయో అని ఆయన విచారిస్తూ తన భార్య సరస్వతి వంక ఏమి ఇటువంటి వాక్కు ఇచ్చావు అని ప్రశ్నించగా మన తప్పు ఏమిలేదు అంతా కాలపురుషుడు అయిన పరమేశ్వరుని లీలావినోదం అని ఆమె పలికినది. దీనితో బ్రహ్మదేవుడు మార్కండేయుని ఓ సలహ ఇచ్చాడు నాయనా మార్కండేయ కనురెప్పపాటు కూడ విడవక ఈశ్వరార్చన చేయమని ప్రభోదించాడు. దానితో మార్కండేయుడి శివలింగ ప్రతిష్టకావించి బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం అకుంఠిత దీక్షతో శివోపాసన చేయసాగాడు. ఈ శివోపాసన తీక్షణతకు లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి.అంతలో మార్కండేయునికి పదహరుసంవత్సరాలు నిండపోతున్నాయి...ఈ హడావుడి అంతా గమనించిన నారదుడు యముని వద్దకు పోయి..ఏమిటి యమ ధర్మరాజ మార్కండేయుని ఆయష్షు ఇంకనూ రోజులు ఘడియలలో వున్నవి తమరు ఆ బాలకుని వదిలివేస్తున్నారా అని ప్రశ్నించగా..యమధర్మరాజు నా మృత్యుపాశంనకు సర్వులు సమమే వాని విధివ్రాత ప్రకారం జరుగవలిసినదే అని తన కింకరులను ఆదేశిస్తారు మార్కండేయుని తీసుకుని రమ్మని.. ఆజ్ఞ మేర కింకరులు మార్కండేయుని తీసుకుని రావటంనకు అతనివద్దకు చేరటం సరికదా మార్కండేయుని తపఃతీక్షణతకు అతని వద్దకు అడుగు పెట్టలేని స్థితిలో యమధర్మరాజు కి తమ అశక్తతను మొరపెట్టుకున్నారు. దానితో యమధర్మరాజు తన మృత్యుపాశంతో మార్కండేయుడు వున్న ప్రదేశంనకు ప్రవేశించి తన కాలపాశం ప్రయోగించగా...మార్కండేయుడు భయంతో మహదేవ పాహిమాం రక్షమాం అంటూ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. దానితో యమధర్మరాజు ప్రయోగించిన కాలపాశం లింగంను కౌగిలించుకున్న మార్కండేయుని స్పృశించునంతలో ఫెఠిల్లున పరమ ఉగ్రరూపంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాసన్నిధిలో నా వొడిలో నారక్షణలో వున్న మార్కండేయునిపై నీ మృత్యుపాశమా అని ఆగ్రహంతో తన త్రిశూలం తో మృత్యుపాశంను ఏదుర్కొన్నాడు...అంత ఆమృత్యుపాశం ప్రయోగించిన యమధర్మరాజు మీదకి రాసాగినది...దానితో యమధర్మరాజు సంకటస్థితికి లోనై ...శివా! మీ అజ్ఞానుసారం నాకర్తవ్య నిర్వాహణతప్ప వేరుకాదు ...నన్ను మన్నించి అనుగ్రహించి నాకర్తవ్యబోధ చేయమని ప్రార్ధన చేయగా...పరమేశ్వరుడు ప్రసన్నత చెందిన వాడై...యమునికి కూడా అభయప్రదాయం చేస్తూ  మార్కండేయుడు నా వీక్షణతో అమృతత్వం పొంది చిరంజీవి అయినాడు అనే వరం ప్రసాదించాడు...దానితో మార్కండేయుడు పరమేశ్వరానుగ్రహంతో చిరంజీవత్వం సాధించాడు.
ఆ తదనంతరం మార్కండేయుడు తన వంశస్థులకు , తనను ఆరాధించేవారికి పాశములను బంధన శక్తి వుండే విధంగా అనుగ్రహించాడు...అందుకే ఆయన పరంపరలోని వారే పద్మశాలిలు.. వారి నేత పోగులు (దారాలు ,పాశాలు) అంత ధృడంగా వుండుటకు ఆయన వరమే కారణం అని వారి నమ్మిక. అందుకే పద్మసాలిలు వున్న ప్రాంతాలలో మార్కండేయుని మందిరాలు వుంటాయి.
మార్కండేయునిపై యముడు తన యమపాశం ప్రయోగించిన సమయంలో మార్కండేయుడు స్తుతించినది "చంద్రశేఖరాష్టకం" .
ఇందు మొదటిది ఓక శ్లోకం రాస్తాను...
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌| 1


రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |

శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |

క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2
ఇంకనూ ఆరు శ్లోకాలు వున్నాయి అన్నింటా చివర కిం కరిష్యతి వై యమః అని వుంటుంది.. ఈ యముని బారి నుండి  నన్ను ఎందుకు  రక్షించవు అని వుంటుంది.
ఈ సంఘటన తరువాత పరమశివుని "కాలంతక" అనే నామంతో పిలుస్తారు.
మార్కండేయునికి అమృతత్వం ప్రసాదించారు కాబట్టి అమృతేశ్వరుడు అంటారు.
ఈ అమృతేశ్వర దేవాలయం తమిళనాడులోని మాయవరం కి 21కిమి దూరంలో వున్న తిరుకడయూరు అనే ఊరు వున్నది . అక్కడ ఓ పెద్ద దేవాలయం వున్నది. అది అత్యద్భుతంగా వుంటుంది. ఈ గుడి విశిష్టత షష్టిపూర్తి చేయించటం. ఈ గుడిలో షష్టిపూర్తి చేసుకొనటానికి వందలు వేలకొద్ది వస్తారు. అన్నీ వేదోక్తంగా చేయటానికి చాలా మంది అయ్యవార్లు వున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.