3, మే 2012, గురువారం

దశావతారాలు ఏన్ని? వాటి దశావతారాలు అన్నపేరుకు కారణము!


మనిషి తన కర్మఫలాన్నిబట్టి జన్మపరంపర జరుగుతుంది.ఈ జన్మపరంపరలో ఎవరైన సమాజములో వున్న అశాంతిని రూపుమాపి శాంతి సమత్వాలు  స్థాపించాడో వారే అవతారపురుషులు.వారిని ఆధారముగావున్నవే అవతారకథలు.
ఈ అవతారకథల  వర్ణనచేసేది శ్రీమద్భాగవతము. మరి ఇందు అప్పటివరకు ప్రకటితమయిన మత్స్య,కూర్మ,వరాహ,నారసింహ,వామన,పరుశురామ,శ్రీరామ,శ్రీక్రిష్ణ అవతారాలు మొత్తము 8 రాబొయేది కల్క్యావతార ప్రస్తావనతో 9 అయినవి.  మరి 10 అవతారం?
 ఈ 10 అవతారముగా  వైష్ణవులు బలరాముని ,మిగతావారు బుద్ధుని అవతారమూర్తిగా పిలుస్తారు. దీనితో 10 కాబట్టి దశావతారాలు అని పరిగణన.

మరి ఇది సరి అయినదా? బలరామా అవతరాములో సమాజముకు ఎమి జరిగిందని అవతార పట్టాభిషేకము. అది వారి సాంప్రదాయము కాబట్టి మనము ఏమి చేయలేము.
మరి బుద్ధుడు అన్నిటిని వ్యతిరెకించినవాడు.మరి వీరికి ఏందుకు అవతార పట్టాభిషేకము.    
      అంటే పురాణకాలానికి దశావతారాలు అన్న గణనలేదు కాని తరువాత మన పూర్వికులు వారి పరిశీలనతో దశావతారాలని వాడుకలోకితెచ్చారు.
బహుశా ఈ రెండు కారణాలు ఆయి వుండవచ్చు.
అందు మొదటిది జీవ పరిణామ సిద్ధాంతాన్ని మనము ఇక్కడ అన్వయిస్తే అంటే సృష్టిలో జీవము ఏర్పడినది నీటిలో అనగా మత్స్య అవతారము. ఆతరువాత ఉభచరము ఇలా  అన్ని అవతారాలకు  సరిపొల్చారని భావించవచ్చు.

రెండొవది నా ఆలొచన ఇందు "ద" అనే అక్షరము దమనత్వాని ప్రతిఫలిస్తే, "శ" అనే అక్షరము శమించాటాన్ని,పరిమార్ఛటాన్ని సూచిస్తుంది.అనగా సమాజములొని రాక్షసత్వాన్ని రూపుమాపి సమత్వాన్ని స్థాపన .   
 కాబట్టి మన పూర్వికులు భాగవతములొ వున్న 9 కి బుద్ధుడిని జొడించి మొత్తము 10 కి సరి చేసి దశావతారాలు అన్నారు.

ఇది మన పూర్వుల ఆలొచనల సారము.    




*********************************************************************************
తాజా అప్ టూ డేట్

 మానవుడు సకల బాధలకు కారణమయిన కొరిక (అనగా సాధారణ మానవుడి లొని దమనత్వాని) . మరి ఇంతటి దానిని జయించి బుద్ధుడుగా సర్వులచే ప్రస్తుతింపపడ్డాడు.
ఇక కల్కి అవతారములొకి వస్తే "శంబల" నుంచి వస్తాడని ఐతిహ్యము. ఇది ఎక్కడది. శంబల అంటే కూడా ఇదే పాపాన్ని ఎవరు అడ్డుకుంటారో అక్కడివాని నివాసమని.అక్కడవున్నవారే కల్కి అవతారమని. మన పూర్వులు కొన్ని సూచన గా మనకు వదిలారు. కాని మనము వాటిని సరిగా ఆర్థము చేసుకొలేక రకరకాలా ప్రక్షిప్తాలు.రకరకాల కథలు.
ఓక్క సారి అలా పరిశీలించండి చాలు.    

8 కామెంట్‌లు:

  1. ఈ దశావతారాలగూర్చి నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని...ఈ కాన్సెప్ట్ పుక్కిటి పురాణంలాగా ఉందే అని. ఎందుకంటే బుద్ధుడు ఇటీవలికాలంనాటివాడే కదా!

    ఏమైనా మంచి చర్చనీయాంశం గురించి రాశారు. అభినందనలు. ఇంకా లోతుగా దీనిపై చర్చ జరగాలి.

    రిప్లయితొలగించండి
  2. అవతారం: అవ + తారం = దిగి వచ్చినది. పరమాత్మ పూర్ణ గుణములతో, పూర్ణ జ్ఞానముతో జన్మనెత్తినవే (పాంచభౌతిక దేహమును స్వీకరించినవే) అవతారములుగా పరిగణింపబడతాయి. అవతార ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది కానీ, శ్రుతి ప్రమాణము ప్రకారము మాత్రం ప్రయోజనం మాత్రమే అవతారకారణం కాదు. ప్రయోజనార్థం జన్మించేవార్లలో దివ్యాత్ములను కారణజన్ములని అంటారు.

    మనం దశావతారాలు ఎక్కడినుంచి వచ్చాయో పరిశీలించటానికి మనకి ముఖ్యంగా లోకంలో ఉన్న ప్రమాణములు: శ్రుతి, పురాణములు, ఇతిహాసములు, కవికృతాది లోకప్రచారములు. దశావతారాలు వాడుకలోంచి వచ్చినవేనని చాలా మంది పెద్దలు, పండితులు, వైదీకులు (వేదాధ్యాయులు) అభిప్రాయపడతారు. భాగవతం పరిశీలిస్తే అనేకావతారాలు కనిపిస్తాయి. ఈందులో కొన్ని భాగవతంలో అంతగా వర్ణింపబడనివి కూడా ఉంటాయి - ఉదాహరణ: రామావతారం.

    వైదిక ప్రమాణాలని అనుసరిస్తే, "అజాయమానో బహుధాభిజాయతే" అంటుంది శ్రుతి. పూర్ణావతారాలు, అంశావతారాలు, గుణావతారాలు ఇత్యాదులెన్నో; లెక్క తేల్చడం కూడా సాధ్యం కాదు. అందుచేత, దశావతారాలు శ్రుతి ప్రమాణంగా చెప్పలేము. అంతవరకూ ఎకీభవిస్తాను.

    ఇక, బుద్ధావతారం. ఇది గౌతమ బుద్ధుడు కాదు. వివరాలు పుర్తిగా లేవు కాని, సంపాదించటానికి ప్రయత్నిస్తాను. శ్రీ చాగంటివారు భాగవత ప్రవచనంలో ఈవిధంగా ప్రస్తావించారు: "బుద్ధావతారం ఈ గౌతమ బుద్ధుడు కాదు. చాలా సుక్ష్మంగా, అతి కొద్దికాలం మాత్రమే ఉండి అతి శీఘ్రంగా చాలించిన అవతారం బుద్ధావతారం".

    గౌతమ బుద్ధుడు చెప్పిన అనేక బోధనలు చాలామందికి ఆదర్శప్రాయమైనవే కావచ్చు, కానీ ఆయన అవైదిక వాది. కాబట్టి వైదిక ప్రస్తావనములైన ఈ అవతారాలలో గౌతమబుద్ధుడు గణింపబడరాదు.

    ఉపాసనా విధానాలు నిర్దేశింపబడినవే దశావతారాలలుగా పరిగణింపబడుతున్నాయనుకోవచ్చు. చాలా అవతారాలకీ ఉపాసనా విధానాలున్నట్లుగా తోస్తుంది. ఐతే, నాకు తెలిసినంతవరకూ, పరశురామావతారం పూర్ణావతారం కాదు. కానీ, కపిల మహర్షి పూర్ణావతారం. ఇరువురికీ ఉపాసనా విధానాలున్నాయేమో తెలియదు కానీ, నాకు తెలిసినంతవరకూ ప్రస్తుతం లభించట్లేదు.

    నాకు తెలిసినంతవరకూ, కల్కి అవతారం కలియుగాంతంలో, యుగసంధిలో, కాశ్మీరదేశంలో వస్తుంది. ఈ కలియుగాంతానికి (ఇంకా చాలా సమయముంది లేండి) ప్రళయం నిర్దేశింపబడలేదు. పూర్ణసంకల్పం చదవగల బ్రాహ్మణులెవరైనా ఉంటే, అక్కడ ఈ లెక్క చెప్పబడుతుంది - "అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే..."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శ్రీనివాస్ గారికి నమస్కారములు.అవతారములు లేవని,కావని కాదు నా పొస్ట్. శ్రుతులు,వేదాలలో లేవని మీరు అంగీకరిస్తున్నారు. ఇక పురాణప్రవచనాలంటారా చాగంటివారు పండితులే కాకపొతే ఈ విషయములో కొద్దిగా పొరపడ్డారని నా అభిప్రాయము.సాధారణ తర్కానికి అందుతుంటే అన్ని ప్రమాణాలు అవసరమంటారా.చెడుని అణచినవాడు ఎప్పుడు అవతారపురుషుడే, దేవుడే. కాకపొతే మనకు తెలిసి మనమధ్య వున్నవాడిలో మనము లోపాలు చూస్తాము.తరాలు గడచి వాడిగురించి ఎవరో ఓక కథ వ్రాస్తే మనము వాడిని దేవుడు అనుకుంటాము.
      ఏది ఎమయినా మీరు నాపొస్ట్ చదవటమేకాక చాలా కష్టపడి మంచి విషయ సేకరణతో ఓ పెద్ద వాఖ్య వుంచినారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. >>> అవతారములు లేవని,కావని కాదు నా పొస్ట్.
      కృతజ్ఞతలు. కానీ నేనలా అన్నట్లుగా నా వ్యాఖ్య ఉందనుకోలేదు.

      >>> శ్రుతులు,వేదాలలో లేవని మీరు అంగీకరిస్తున్నారు.
      కాస్త గడబిడగా ఉంది. ఏవి లేవని అంగీకరించినట్లు? దశావతారాలు శృతుల్లో ఉన్నాయో లేవో నాకు పూర్తిగా తెలియదు. కానీ, కేవలం దశావతారాలే ఉన్నాయని మాత్రం చెప్పలేదని అంగీకరిస్తున్నాను.

      >>> ఇక పురాణప్రవచనాలంటారా చాగంటివారు పండితులే కాకపొతే ఈ విషయములో కొద్దిగా పొరపడ్డారని నా అభిప్రాయము. సాధారణ తర్కానికి అందుతుంటే అన్ని ప్రమాణాలు అవసరమంటారా.
      నా దృష్టిలో అవసరమే. సాధారణ తర్కం ఒక్కొక్కసారి పెడదారి పట్టించవచ్చు. విజ్ఞులు పూర్ణతర్కాన్నే స్వీకరిస్తారు. తర్కంలో మనం రెండు వైపులా స్వీకరించాలి, చివరికి అన్ని వాదనలలోనూ సారాన్నీ గ్రహించాలి. చాగంటి వారు సాధారణ ప్రచారంలో ఉన్న నాణానికి మరొక వైపు అందించటానికి ప్రయత్నించారు. మీరు వారిని తప్పు అని నిరూపించగల ఆధారాలను అందించగలిగితే కృతజ్ఞులం.

      >>> చెడుని అణచినవాడు ఎప్పుడు అవతారపురుషుడే, దేవుడే. కాకపొతే మనకు తెలిసి మనమధ్య వున్నవాడిలో మనము లోపాలు చూస్తాము.తరాలు గడచి వాడిగురించి ఎవరో ఓక కథ వ్రాస్తే మనము వాడిని దేవుడు అనుకుంటాము.
      దయచేసి దేవునికి, ఈశ్వరునికి, అవతారానికి, కారణజన్ములకి భేదమును గమనించండి. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు మానవుడు. ఒక మానవుడు కేవలం ధర్మమార్గాన్ని, త్యాగాన్ని అనుసరించి ఆరాధ్యమైనాడు. కానీ, దైవత్వాన్ని కానీ, ఈశ్వరత్వాన్ని కానీ ఎక్కడా ప్రకటించలేదు. పూర్ణత్వాన్ని కలిగి ఉండటం చేత పరమాత్ముడైనవాడు అని చెప్పవచ్చు. మరి ఛత్రపతి శివాజీ కూడా చెడుని అణచి మంచిని స్థాపించాడు, ఆయనకూడా మీ దృష్టిలో అవతారపురుషుడేనా?
      విజ్ఞులు అంగీకరించినంతవరకూ, స్థూలంగా:
      * కారణజన్ములు: ఎదైనా ఒక ఉత్తమ కార్య సాధనకై జన్మించిన వారు. మంచిని ఉద్ధరించినవాడు. ముఖ్యంగా ధర్మాన్ని ఉధ్ధరించినవారు. వీరికి ఉపాసన నిర్దేశింపబడలేదు. వీరికి పూజ, ఆరాధన నియమింపబడలేదు. వీరు సమాజానికి ఆదర్శములు, కానీ అరాధ్యములు కాదు.
      * దేవతలు: ప్రకృతి శక్తులకు అధిపతులు. వీరికి పాంచభౌతిక దేహము నిర్దేశింపబడలేదు. పురాణ దేవతలు వేరు, దేవాలయాలలో ఉండే లేదా ఉపాసింపబడే దేవతా శక్తులు వేరు. గమనించగలరు. ఏదైన ప్రత్యేక కార్య సాధనకోసం వీరిని ఉపాసిస్తాం. ఉదా: విఘ్నేశ్వరుడు.
      * ఈశ్వరుడు: సర్వ స్వతంత్రుడు, సర్వ నియామకుడు. అయ్యవారిగానైనా చెప్పవచ్చు, అమ్మవారిగానైనా చెప్పవచ్చు. పెద్దదేవాలయాల్లో మనం వీరి అర్చా మూర్తిని చూస్తాము. శృతి ప్రమాణ ఉపాసన నిర్దేశింపబడినది.
      * పరమాత్ముడు - పరాశక్తి: జ్ఞాన మార్గం. పూర్ణ శుద్ధ స్వరూపం. త్రిగుణ పూర్ణులు, త్రిగుణాతీతులు. ఉన్నది ఒకటే అయినా, మన సౌలభ్యంకోసం ప్రరమాత్మ - పరాశక్తి గా భావిస్తాం. ఇంకా వ్రాయటానికి ప్రస్తుతం సందర్భం కాదు.

      >>> ఏది ఎమయినా మీరు నాపొస్ట్ చదవటమేకాక చాలా కష్టపడి మంచి విషయ సేకరణతో ఓ పెద్ద వాఖ్య వుంచినారు. ధన్యవాదాలు.
      కృతజ్ఞతలు. "స్వాధ్యయన ప్రవచనానిచ" అని అన్నారు. నేర్చుకోవటం, నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవటం - రెండూ ముఖ్యమే. ఏదో తెలిసిన వాటిల్లొంచి రెండు ముక్కలు ఈవిధంగా పంచుకునే అవకాశమిచ్చినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు.

      తొలగించండి
  3. నాకు దశావతారముల పద్యాలు కావాలి సార్,దయచేసి పంపించగలరు..

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.