1, జులై 2012, ఆదివారం

సాల వృక్ష బేధనం - కృష్ణలీలా అంతరార్ధం.

పాఠక మిత్రులు గతంలో కుబ్జ,పూతన ఘట్టాలలొని అంతరార్ధము తెలుసుకున్నారు. ఇప్పుడు సాల వృక్ష బేధనములోని అంతరార్ధము పరిశీలించండి.

కుబేరుడు ఐశ్వర్యవంతుడు శివపూజా దురంధరుడు. కుబేరుని కుమారులు నలకుబేరుడు,మణిగ్రీవుడు మాత్రము ఐశ్వర్యమదముతో సప్తవ్యసనాలకు బానిసగా వున్నారు. వారు చేయని దురాగతo లేదు. వారు ఒకనాడు వారకాంతలతో కూడి మందాకిని నదీ తీరములో నిర్లజ్జగా దిశమొలతో స్నానపానాలు, విచ్చలవిడి శృంగారము అనుభవిస్తున్నారు.అదే సమయములో నారదులవారు వైకుంఠము నుంచి నారాయణుని దర్శించి నారాయణ సంకీర్తనా గానముతో అటువైపుగా వస్తున్నారు. సంకిర్తనా గానము విన్న మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డవారై అక్కడవున్న ఆకులు, అలములు, వీలయిన వారు తమ వస్త్రాలను తమ దేహ భాగాలకు కప్పుకున్నారు.కానీ నలకుబేరుడు,మణీగ్రీవులు సురాపనముతో మత్తెక్కి ఎవరో ఎమిటో కూడా గమనించక అలాగే నగ్నముగా నారదుల వారిని అవహేళన చేసారు. దానితో అగ్రహో దగ్రుడైన నారదులు మీరు సాలవృక్షాలుగా  జన్మించమని శాపము ఇచ్చారు. దానితో వారికి ఓక్కసారిగా మత్తు దిగినట్లయి నారదుని కాళ్ళమీద పడి తమ తప్పుని వొప్పుకోని క్షమించమని ప్రార్ధించారు. దీనితో నారదుడు శాంతించి శాపవిమోచనము మాత్రము తెలుపుతాను తప్పుకు మాత్రము శిక్ష ( శాపం) అనుభవించవలసినదే అని తెలుపగా. వారి కొరిక మీదశాపవిమోచనముగా ఈ విషయము తెలిపినారు. ద్వాపరయుగములో శ్రీమన్నారయణుడు కృష్ణునిగా జన్మించనున్నారు వారిద్వారా మాత్రమే మీకు విముక్తి అని తెలిపినారు. దానితో నలకుబేరుడు,మణీగ్రీవుడు ఇరువురు గోకుల ప్రాంతములో సాలవృక్షాలుగా జన్మించి కృష్ణునిద్వార శాపవిమొచనమునకై నిరిక్షణ చేస్తూ ప్రార్ధించసాగారు.
  ద్వాపరము వచ్చినది శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణార్ధము శిష్టరక్షణార్ధము కృష్ణునిగా జన్మము అపై గొకులమునకు రాక.
 బాలకృష్ణుని లీలావైభవములు ఏక్కువ అవుతున్న కొద్ది యశోదకు ఆందోళన తనబిడ్దడు ఎమవుతాడో అన్న భయము. పాపం అమెకు తెలియదు కదా తనవద్ద వున్నది,లోకపావనమూర్తి,లోకకళ్యాణమూర్తి,సర్వజనరక్షకుడని. తను తల్లికాబట్టి సహజమయిన మాతృత్వ మమకారానికి లోనై భయాందోళనకు గురి అవుతుంది.
ఓకనాడు గోకులం లోని స్త్రీలందరు యశోద వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి గురించి రచ్చచేస్తారు. దీనితో యశోద కృష్ణుని ప్రక్కనే వున్న రోటికి ఒక త్రాడుతో కట్ట నిశ్చయించి త్రాడుతో కట్టటం ప్రారంభించినది కాని స్వామీ వారి లీలలు వల్లన ఆత్రాడు చాలదు ఇంకో త్రాడు తెచ్చిన అది కూడాఅలానే, ఎన్ని తెచ్చికలిపి కట్టినా కొద్దిగా తక్కువ దీనితో యశోద కన్నా నా వల్ల కాదు అని బాధ పడుతుంది దీనితో స్వామి తన మాయ ఉపసంహరణ. ఇక త్రాడు సరిపోయి స్వామీ రోలుకు బంధించ బడ్డాడు. యశోద కన్నయ్యకు బుద్ధిగా వుండు ఇది నీకు శిక్ష అని తెలిపి గృహ కార్యనిమిత్తము వెళ్ళుతుంది. అమే అలా వెళ్ళగానే బాలకృష్ణుడు త్రాడుని రోటితో సహ లాగుకుంటూ ప్రాకుతూ పెరటిలోనికి వస్తాడు అక్కడ ఏనాటినుంచో రెండు సాలవృక్షాలు (మద్దిచెట్లు) వున్నాయి ఇవి ఆకాశమంత ఎత్తు,నలుగురుమనుషులు తమ చేతులు బార్లాచాపి చెట్టుమ్రాను కౌగిలించుకున్నా సరిపోని కైవారము చుట్టుకోలతగావున్నది.ఇవి రెండు ప్రక్కప్రక్కనే వున్నాయి . బాలకృష్ణుడు ఈ రెండు సాలవృక్షాల మధ్యకు రోటితో సహ వెళ్ళాడు. రోలు రాలేదు అంతే బాలుడు ఒక్కసారిగా రొలుతో ఆవృక్షాలను తాటించగా ఆ వృక్షరాజములు రెండు ఫెళఫెళమని నేల కొరిగినవి.అందునుండి ఇరువురు దివ్య పురుషులు వచ్చి స్వామికి నమస్కరించి.తమను నలకుబేరుడు,మణీగ్రీవుడుగా పరిచయము చేసుకోని శాప వృత్తంతము తెలిపి, స్వామిని ప్రార్ధించి ఆకాశమార్గాన వెడలిపొయినారు. ఈ వృక్షముల శబ్దమునకు లోపల వున్న యశోద ఓక్క పరుగున వచ్చి తన కన్నయ్యను తీసుకొని పెద్ద ఆపద తప్పినదని ముద్దులాడసాగినది.  
ఇంతవరకు భాగవతములొ ఈ ఘట్టము వున్నది.

అంతరార్ధము : స్థిరముగా వుండే సాలవృక్షాలు మనిషిలో స్థిరముగా వుండే నేను,నాది అనే లక్షణాలు అహంకారానికి చిహ్నం.అందుకే నిట్టనిలువుగా పెరిగే సాలవృక్షాలనే వ్యాసులవారు ఎంచుకొన్నారు.అలాగే మీకు తెలిసినదే వృక్షము ఎంత ఎత్తుకు పెరిగితే దాని వ్రేళ్ళు భూమిలో అంత  బలముగా వ్యాపించి వుంటాయి అన్న సంగతి  .అనగా మనము నేను నాది అనే అహoకారము ఎంత ఎక్కువగా చూపుతామో అంత ఎక్కువగా జన్మజన్మల ప్రారబ్దకర్మఫలము వృక్షములా స్థిరముగా వుండి జీవుడు ఇక్కదే వుండి మోక్షమార్గము పట్టడు.
  ఈ అహంకారం సాధారణముగా ఎప్పుడు కలుగుతుంది. వీపరీత ధనం, అంతకుమించి ప్రాపంచిక విషయానురక్తుల వలన కలుగుతుంది. దీనికి సూచనగా దివ్య పురుషులు  కుబేరుని పుత్రులగాను, వ్యసనపరులుగాను వుంటారు.వాళ్ళ పేర్ల లోనే వాళ్ళ బుద్ధులు కూడా సూచించారు.

నల అనగా సంస్కృతమున వాసన,గంధము అనే అర్ధాలు వున్నాయి. అనగా నలకుబేరుడు. మరి చూడండి కుబేరుడి కోడుకు కాబట్టి ధనమధాంధుడని అర్ధము. రెండొవ వాని పేరు మణిగ్రీవుడు దీని అర్ధము చూడండి మణి అంటే భూమినుంచి తీసిన ఒకరాయి అని అర్ధము.(సాధరణముగా మణి అంటే విలువైనదిగా భావిస్తారు కాని భూమినుంచి తీసిన రాయికి సానపెట్టి అది రత్నమా,నీలమా అని విలువ కడతారు. ముడిగా వుంటే మణిగానే పిలుస్తారు.ఇది నాకు తెలియదు చాటుపద్య మణిమంజరి పిఠికలో ఆరుద్రగారు తెలిపారు)గ్రీవము అంటే కోమ్ము.రాయి లాంటి ఆహంకారానికి కొమ్ములు కూడా వచ్చాయి అని అర్ధము.మరి వారి ప్రవర్తన కూడ నారదుల వారితో అందుకు తగ్గట్లుగా వున్నది. కాబట్టి శాపము పొందారు అనుభవించారు. చూసారా వ్యాసులవారు వీళ్ళ పేర్లతో బుద్ధులు,ప్రవృత్తులు  తెలుపుచున్నాడో.      


మరి జీవునికి కింకర్తవ్యం! మరి అందుకే కృష్ణుడు బహు చక్కని మార్గము సూచించాడు.
కృష్ణుడు,నారాయణ రూపుడని,నారాయణుడు పరామాత్మ స్వరూపమని మీకు తెలుసు. అలాగే బాలకృష్ణుడు మన మనస్సుని సూచిస్తాడు.రోలు నిశ్చల భక్తికి సంకేతం.మనస్సుకి నిశ్చల భక్తిని ముడివేసి అహంకార, మమకారాలను కూల్చండి. అప్పుడే మీలోని దివ్యత్వము బయటకు వస్తుంది. అదే శాప విమోచనము.
ఇదే భగవతత్వము.    


    

4 కామెంట్‌లు:

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.