22, జూన్ 2012, శుక్రవారం

"25 బాలగేయాలు!" చిన్ననాటి మధురస్మృతులు! -ఓక్కసారి మీ బాల్యాన్ని పలకరిస్తారా!


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసః ఫణి అని సామెత.సంగీతానికి అందరు అంతలా దాసులవుతారు.పాలు తాగని బుజ్జాయి అమ్మజొలపాటతో కమ్మగా బొజ్జనిండుగా పాలుతాగి కిలకిల నవ్వుతాడు.హాయిగా ఆడుకుంటాడు.ఇలా శిశువుకు తల్లికి మధ్య స్తన్యం జీవమయితే, పాట నాదం శృతి రూపకముగా వుండే ఓక అనిర్వచనీయ మధురమయిన రసానుభూతులకు నిలయమయిన చక్కని, కమ్మనైన బంధం. ఇలా జోలపాటకు అమ్మ మాటకు, అమ్మతో ఆటకు అలవాటు పడ్డ శిశువుకు తల్లి, ప్రాయము వస్తున్న కోద్ది చిన్న చిన్న పదాలతో ప్రకృతిని,మంచిని,చెడును,అలవాటులను నేర్పుతూ,బిడ్డడిలో ఉత్సాహాన్ని, ఉత్సుకతను, అలోచనను రేకెత్తిస్తూ సహజముగా శిశువుల్లో వున్న కొత్త విషయాలు తెలుసుకోవాలనే తృష్ణను తల్లి పాటరూపముగా బాలగేయాలుగా శిశువును ఙ్ఞానము తో పరిపుష్టము చేసేవి బాలగీతాలు.

 ఇప్పుడు మధ్య వయస్సులో వున్న తరాలకు ఇవి అనుభవమే. అనాటి పిల్లలు అమ్మా అదేమిటి అన్నారు! తరువాత పిల్లలు వాట్ ఈజ్ దట్ డాడ్ అన్నారు! నేటి పిడుగులు ఇట్ ఈజ్ దట్ గ్రాండ్ పా అని అంటున్నారు.కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతున్న కోద్ది పిల్లల మీద  ఆశలు ఎక్కువై, తల్లి తండ్రుల్లో పిల్లలో వత్తిడి ఎక్కువై సహజసిద్ధముగా  ప్రకృతి సిద్ధముగా వుండే బంధములో ఎదో ఒక అసహజత్వము గోచరిస్తుంది.అమ్మ అనే కమ్మదనము, నాన్న అనే గౌరవాలు మమ్మి,డాడ్ ల మోజులో కరిగి అవిరయిపొతున్నాయి. ఇంకా తడి ఆరని మనస్సులకోసము,మీ బాల్యాన్ని మీరు ఒక్కసారి గుర్తుచేసుకోని మీ అమ్మను మీతో ఆడుకున్న సొదర,సోదరిమణులను,స్నేహితులను ఙ్ఞాపకము చేసుకుంటారని భావిస్తున్నాను.  

  ఏడవకు ఏడవకు వెఱ్ఱి పాపాయి    (1)
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళు!

దాగుడు మూత దండాకోర్           (2)
పిల్లి వచ్చే ఎలుకా చోర్
ఎక్కడి దొంగలు అక్కడనే
గప్ చిప్ సాంబార్ బుడ్డి!

బొమ్మరిల్లు కట్టుదాం                (3)
బొమ్మలాట లాడుదాం
బొమ్మలతో చుట్టు చేరి
భలే బాగ పాడుదాం

వంకర టింకర ఓ                    (4)
వాని తమ్ముడు సో
నల్లగుడ్ల మి
నాలుగు కాళ్ళ బే

వానా వానా వల్లప్ప            (5)
చేతులు చాచే చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగలేను నరసప్ప

ఏనుగు ఏనుగు నల్లన         (6)
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు.

బోసి నవ్వుల పాపాయి       (7)
చిలుక పలుకుల బుజ్జాయి
తప్పటడుగుల పాపాయి
బులి బులి నడుకల బుజ్జాయి
అల్లరి ఇంక అపొయి

ఒకటి రెండు ఒప్పుల కుప్ప       (8)
మూడు నాలుగు ముద్దుల గుమ్మ
ఐదు ఆరు అందాల భరిణ
ఏడు ఎనిమిది వయ్యారి భామ
తొమ్మిది పది బంగారు బొమ్మ

చందమామ రావె - జాబిల్లి రావె     (9)
కొండెక్కి రావె - కోటి పూలు తేవె
బండెక్కి రావె - బంతి పూలు తేవె
అన్నింటిని తెచ్చి - మా బుజ్జాయి కియ్యవె

పిల్లీ పిల్లీ ఎక్కడికే                       (10)
ఎలుకల వేటకు వెళుతున్నా
బల్లీ బల్లీ ఎక్కడికే
ఈగల వేటకు పోతున్నా
అన్నం ముద్ద ఎక్కడికే
మీ బుజ్జాయి నోట్లోకి పొతున్నా!


ఉయ్యా లోయి                       (11)
జంపాలోయి
కోత్త కుండోయి
కామెర్లోయి
వెన్నెల్లోయి
మల్లెలోయి
చల్లంగా వూగే
అమ్మాయిలోయి!

చిట్టి చిలకమ్మ                  (12)
అమ్మ కొట్టిందా
తోట కెళ్ళావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కు మింగావా

పాపా పాపా రావమ్మా        (13)
పలక బలపం తేవమ్మా
అ ఆ ఇ ఈ రాసిస్తా
చక్కగా నీవు దిద్దుమ్మా
చల్లగా నీవు ఎదుగమ్మా

తారంగం తారంగం           (14)
తాండవ కృష్ణా తారంగం
వేణునాధ తారంగం
వెన్నల దొంగ తారంగం
మువ్వల చెన్నా తారంగం
గువ్వల కన్నా తారంగం


గుడు గుడు గుంజం - గుళ్ళో రాగం     (15)
పాముల పట్నం - పడిగే రాగం
పెద్దన్న గుర్రం - పెళ్ళికి పొతే
చిన్నన్న గుర్రం - పట్నం పొతే
మామా గుర్రం - అడవికి పొతే
మా నాన్న గుర్రం - మా ఇంటికి వచ్చె!


గుమ్మాడమ్మా గుమ్మాడి               (16)
ఆకులు వేసింది గుమ్మాడి
పూవులు పూసింది గుమ్మాడి
పండుల్లు పండింది గుమ్మాడి
చూడ చక్కాని గుమ్మాడి
మా చిన్ని కన్నా గుమ్మాడి!


కాళ్ళా గజ్జ - కంకాళమ్మా             (17)
వేగుల చుక్కా - వెలగ మొగ్గ
మొగ్గ కాదు - మొదుగ నీరు
నీరు కాదు - నిమ్మల బావి
బావి కాదు - బచ్చల కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండూ కాదు - పాపాయి కాలు
కాలు తీసి - కడగా పెట్టు!


అట్ల తద్దోయి - ఆరట్లోయి               (18)
ముద్ద పప్పొయి - మూడట్లోయి
పడకల కింద - పిడికెడు బియ్యం
పిల్లల్లారా - జల్లల్లారా
రారరండోయి రారరండోయి
పీటల కింద - పిడికెడు బియ్యం
పిల్లల్లారా - జల్లల్లారా
రారరండోయి రారరండోయి


చుక్ చుక్ రైలు వస్తొంది             (19)
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
నాన్న రైల్లొ వస్తారు
చాక్లెట్ నీకు తెస్తారు

 బుఱ్ఱు పిట్ట -  బుఱ్ఱు పిట్ట         (20)
     తుఱ్ఱుమన్నది
పటమటింటి కాపురమ్ము
    చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర 
  కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ 
   ముడవనన్నది
మగని చేత మొట్టికాయ
    తింటానన్నది.!

చెమ్మ చెక్క - చారడేసి మొగ్గ              (21)  
అట్లు పొయంగ - ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క - ముగ్గులేయంగ
రత్నాల చెమ్మ చెక్క - రంగు లేయంగ
పగడాల చెమ్మ చెక్క - పంది రేయంగ
సుబ్బారాయిడి పెళ్ళి - చూచి వద్దాం రండి
మా ఇంట్లో పెళ్ళి  - మీరంతా రండి !


కాకి కాకి కడవల కాకీ               (22)
కాకీ నోట్లో పండు పెడితే
పండు తీసుకెళ్ళి దిబ్బకిస్తే
దిబ్బ నాకు గడ్ది ఇస్తే
గడ్డి తీసుకేళ్ళి ఆవుకేస్తే
ఆవు నాకు పాలు ఇస్తే
పాలు తీసుకెళ్ళి అయ్యోరికి ఇస్తే
అయ్యోరు నాకు పాఠం చెబితే
మామ ముందు పాఠం చదివితే
మామా నాకు పిల్లనిస్తే
పిల్ల పేరు మల్లెమొగ్గ
నా పేరు జమిందారు.


వానల్లు కురవాలి  - వానదేవుడా       (23)
వరిచేలు పండాలి  - వానదేవుడా
నల్లా నల్లని మేఘాలు - వానదేవుడా
జల్లుగా కురవాలి -  వానదేవుడా
చేలన్ని పండాలి - వానదేవుడా
చెఱువులన్నీ నిండాలి - వానదేవుడా
కరువంతా పోవాలి - వానదేవుడా
గాదెలన్ని నిండాలి - వానదేవుడా
మా అక్క పెళ్ళి  -    వానదేవుడా
గోప్పగ చేయాలి -వానదేవుడా !


ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు       (24)
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు
మేఘాన జాబిల్లి ఊరంతా వెలుగు
చక్కన్ని చదువు బ్రతుకంతా వెలుగు
మా చిన్ని బుజ్జాయి మా కళ్ళ వెలుగు!.


కొండాపల్లి కొయ్య బొమ్మలు          (25)
నీకొ బొమ్మా నాకో బొమ్మా
నక్కాపల్లీ లక్క పిడతలు
నీకొ పిడత నాకో పిడత
చెన్నాపట్నం పూసల గాజులు
నీకొ జత నాకొ జత
నూజీవీడు మామిడి పండ్లు
నీకొ పండు నాకో పండు
ఇస్తానుండు తెచ్చే దాక
చూస్తూ వుండు ఇచ్చేదాక.


ఇంకా చాలా వున్నాయి మరొక్కసారి ఇంకో సదర్భములో తెలుపుతాను అప్పటిదాక.

మీకు నచ్చిన మీ చిన్ననాటి అనుభవాలతో ఓ చిట్టి కామేంట్!
నచ్చలేదా ఎమిటో వీడి పిచ్చి అని నవ్వండే!











4 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు. చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు ఆ పద్యాలతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాల్యం ఎప్పుడు మధురమే! మరలా ఇంకొకసారి జ్ఞాపకపం చేసుకుంటారని పోస్ట్ ప్రచురించినాను. నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.